మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా 16ఏళ్ల అతిసాధారణ యువతి
తన సహజ సౌందర్యంతో విపరీతమైన క్రేజ్
దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల నిండా ఆమె ఫొటోలే
ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యాత్రికులు పోటాపోటీ
రుద్రాక్షలు, పూసలు అమ్ముకునేందుకు ఇండోర్ నుంచి రాక
ఒక్క ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సొంతం
సామాజిక మాధ్యమాల్లో కేక పుట్టిస్తున్న ముద్దుగుమ్మ అందం
ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ..
ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు.
ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.
రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది.
కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే అకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు.
ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్..
ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.
ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్..
వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్మకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది.
ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైక్‌లు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు.
అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ‘మోనాలిసా’తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు.
(ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి)
Comments
Please login to add a commentAdd a comment