
సువార్త
గిబియోనీయులంటే అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు. వాగ్దాన దేశమైన కనానులో యెహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యెరికో, హాయి పట్టణాలు అప్పటికే నేలకూలగా ఆ వార్త విని, తాము కూడా వారిలాగా త్వరలోనే సంహారం కానున్నామని గ్రహించి గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో శాంతియుత సంధి చేసుకోవడానికి నిర్ణయించుకొని, తాము ఎక్కడో దూరదేశానికి చెందిన వారమంటూ కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువ, ఇతర ఇశ్రాయేలీయుల పెద్దలు గిబియోనీయుల జోలికి రాబోమంటూ వారికి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు.
సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోద ముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయా న్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులు అంటే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది.
చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడేప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని బైబిల్లో నెహెమ్యా రాశాడు. ఝెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించిన వారిలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. మామూలుగా అయితే కాలగర్భంలో కలిసి΄ోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇంతటి మహా చరిత్రనిచ్చాడు. ఇశ్రాయేలీయులతో తలపడి కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులనే కనాను ప్రజలు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాములకున్న వివేకం, పావురాలకున్న నిష్కపటత్వం విశ్వాసి కుండాలన్న యేసుప్రభువు వారి బోధనలకు గిబియోనీయలే ఉదాహరణ.
తలుపు చిన్నదైతే, లోనికి వెళ్లేందుకు తలవంచడమొక్కటే మార్గం. నేను తల వంచడమా? అనుకుంటే, తల బొప్పికట్టడం ఖాయం. అపకార దృష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపటనాటకమాడారని దేవునికి ముందే తెలుసు. ఆయన వారి పై వేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని చూశాడు. పైకి మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తూ గొప్పగా జీవించేవారి ఆంతర్యంలోని దుష్టత్వాన్ని, పైకి నాటకాలాడినా ఆంతర్యంలో వారి ఆత్మీయతను చూసి మరీ దేవుడు ప్రతిస్పందిస్తాడు. లేకపోతే వారితో సంధి చేసుకోవద్దని దేవుడు ఏదో విధంగా యెహోషువాకు తెలియజేసేవాడే లేదా వారితో సంధి చేసుకున్నావెందుకని ఆ తర్వాతైనా యెహోషువాను మందలించేవాడే. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు.
పై వేషాలు, పదవులు, నాటకాలను బట్టి కాక ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టి దేవుడు ప్రతిఫలాన్నిస్తాడు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా... అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి ఆత్మీయ దుర్గంధమా? ఇన్ని మురికి కాలువలా? ఇంతటి భ్రష్టత్వమా... అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. దేవుడు విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, కోట్లాదిమందికి విశ్వాసిని ఆశీర్వాదంగా మార్చుతాడు.
– సందేశ్ అలెగ్జాండర్
Comments
Please login to add a commentAdd a comment