lord jesus
-
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్‌చంద్రపాల్ -
ప్రలోభాలకు అతీతం ప్రభువు నేర్పిన విశ్వాసం
‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువు వారి ఆహ్వానంలోని ఆంతర్యం, విశ్వాసులకు ఈ లోకసంబంధమైన ఐశ్వర్యాలు, అత్యున్నత హోదాలు, అధికారాలివ్వడమే అని నమ్మడం, ఆయన ఆవిష్కరించి, ప్రకటించిన పరలోకరాజ్య సంబంధమైన బోధనలు, విలువల తాలూకు లోతైన అవగాహన లేకపోవడమే !!. అదే నిజమైతే యేసుప్రభువు ఒక రిక్తుడిగా, దాసుడుగా, కటిక పేదవాడిగా ‘తలవాల్చుకోవడానికైనా స్థలంలేని’ ఒక నిరుపేదగా ఈలోకానికి విచ్చేసి జీవించవలసిన అవసరమే లేదు. సౌమ్యంగా, సాత్వికంగా, దీనంగా, తలవంచి బతకడంలోని శక్తిని, ఔన్నత్యాన్ని యేసుప్రభువు రుజువు చేసినంతగా మరెవరూ మానవ చరిత్రలో రుజువు చేయలేదు. యేసుక్రీస్తే కాదు, ఆనాటి ఆయన ప్రియ శిష్యులు, అనుచరులంతా అలాగే నిరుపేదలుగా, అనామకులుగా, అధికారానికి దూరంగా జీవించారు, తమ ఆ అసమాన జీవన శైలితోనే సమాజాన్ని ప్రభావితం చేసి క్రైస్తవానికి పునాది రాళ్లు వేశారు. రోమా ప్రభుత్వ నిరంకుశత్వం అవధులు దాటి ప్రజల్ని అన్ని విధాలుగా పీడిస్తున్న చీకటి యుగంలో యేసు ఈ లోకంలో కాలు పెట్టి, చేసిన తన అసాధారణమైన బోధల్లో, ఒక్కటంటే ఒక్క విమర్శ, వ్యాఖ్య కూడా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేయకపోవడమే ఈ లోకాధికారాలకు, ప్రలోభాలకు, పోకడలకు అతీతమైనది క్రైస్తవమని స్పష్టంగా రుజువు చేస్తోంది. యేసుప్రభువులాగే ఆదిమకాలపు ఆయన శిష్యులు కూడా ధైర్యంగా అన్ని చోట్లా పరలోకరాజ్య సువార్త ప్రకటించారు, ప్రతిఘటన, వ్యతిరేకత ఎదురైతే మౌనంగా వహించారు లేదా మరో చోటికి తరలి వెళ్లారు తప్ప వారు ఎదురు దాడులు చెయ్యలేదు, ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు సృష్టించ లేదు, మానవ హక్కుల ప్రదర్శనలు చెయ్యలేదు. ఈ అహింసా, ప్రతిఘటనా రహిత విధానంలోనే ఆనాటి అపొస్తలులు ఆసియాలో, ఐరోపా అంతటా క్రైస్తవాన్ని నెలకొల్పారు, పైగా వారు వేసిన క్రైస్తవం పునాదులు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కూడా ఐరోపాలో అత్యంత పటిష్టంగా ఉన్నాయి. అంతియొకయ, ఈకొనియా, లుస్త్ర పట్టణాల్లో అపొస్తలుడైన పౌలు, ఆయన అనుచరుడైన బర్నబా అత్యంత ప్రభావ భరితంగా సువార్త పరిచర్య చేశారు. యేసుప్రభువు పునరుత్థానమైన 18 ఏళ్ళ తర్వాత, చర్చిలు బాగా వర్ధిల్లుతున్న కాలంలో, పౌలు తన మొదటి మిషనేరీ ప్రయాణం పూర్తి చేస్తున్నపుడు, ఈ ప్రాంతాల్లో వాళ్ళు విపరీతమైన శ్రమలు పొందారు. వారిమీద యూదులు రాళ్లు రువ్వితే ఆ ధాటికి ఒకదశలో పౌలు చనిపోయాడేమోనని కూడా భావించారు. అక్కడ పట్టణాల్లో బహిష్కరణకు కూడా వారు గురయ్యారు. అయినా మౌనంగా మరో చోటికి వెళ్లిపోయారు తప్ప వారు ఎదురు తిరగలేదు (అపో.కా.14:1–28). పైగా కొన్నాళ్ళకు అక్కడి చర్చిలను బలపరచి, ప్రోత్సహించడానికి మళ్ళీ వచ్చినపుడు, అనేక శ్రమలను అనుభవించడం ద్వారానే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామంటూ, విశ్వాసంలో అలా స్థిరంగా ఉండాలంటూ విశ్వాసులకు బోధించారు(14:21.22). విశ్వాసంలో స్థిరంగా ఉండడమంటే శ్రమలనెదుర్కోవడమేనని వారి బోధల తాత్పర్యం. ప్రభువు అప్పగించిన పరిచర్యలో శ్రమలు అంతర్భాగం అన్నది బైబిల్ చెప్పే నిత్య సత్యం. శ్రమలొచ్చినపుడు, మనవల్ల ఏదో తప్పు జరిగిందనుకొంటూ సిగ్గుతో తలవంచడం కాదు, గర్వంగా తల ఎత్తుకోవాలి. ఎందుకంటె నిజమైన పరిచారకులెన్నుకున్న దారే శ్రమలతో కూడిన యేసుప్రభువు దారి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు?
‘యేసు పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు’ అని బైబిల్లో ఉంటుంది (మార్కు 1:35). ప్రార్థన చేయడానికి యేసుప్రభువు తరచు అరణ్యప్రదేశానికి ఏకాంతంగా వెళ్లేవాడన్నది బైబిల్లోని నాలుగు సువార్తల్లోనూ తరచుగా చదివే ఒక ప్రధానాంశం. ప్రశాంత వాతావరణంలో, ఏకాంతంలో ఆయన ప్రార్థించేవాడన్నది సుస్పష్టం. దేవునితో ఏకాంతంగా ఆరాధనలో గడిపే అనుభవం ప్రతి విశ్వాసికీ అత్యంత విలువైనది. దేవునితో విశ్వాసి అత్యంత సన్నిహితంగా మనసు విప్పి మాట్లాడే అనుభవం, దేవుడు కూడా విశ్వాసితో ఎంతో ప్రియంగా, స్పష్టంగా, మృదువుగా మాట్లాడే అనుభవం అది. ఇలాంటి అనుభవంలోనే విశ్వాసి ఎంతో బలవంతుడవుతాడు, తనను బలపరిచే దేవుని శక్తితో దేనినైనా సాధించగలనన్న నమ్మకంలోకి ఎదుగుతాడు (ఫిలిప్పి 4:13). యేసు విశ్రాంతి దినం నాడు సమాజ మందిరానికి వెళ్లి అక్కడ ఇతరులతో కలిసి దేవుని ఆరాధించేవాడు. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం నాడు చర్చికెళ్తున్నాం. కానీ ప్రభువుతో ఏకాంతంగా ఆరాధనలో, ప్రార్థనలో గడిపే అత్యంత విలువైన వ్యక్తిగత అనుభవానికి మాత్రం మనలో చాలామంది ఎంతో దూరంగానే ఉన్నారు. దేవునితో లోతైన వ్యక్తిగత ప్రార్థనానుభవం లేని క్రైస్తవులు, శ్వాస తీసుకోకుండా బతకాలనుకునే జీవులే!! దేవుడు వారంలోని ఏడు రోజుల్లో ఒక రోజును విశ్వాసి తనను ఆరాధించడానికి నియమించాడు. ఆ దినాన్ని సంపూర్ణంగా తనతోనే గడపాలని దేవుడు నిర్దేశించారు. దాన్నే సబ్బాతు లేదా విశ్రాంతి దినం అని బైబిల్లో పేర్కొన్నారు. అపొస్తలులు కొత్త నిబంధన కాలంలో ప్రభువుదినమైన ఆరాధనా దినంగా ఆదివారాన్ని నిర్ణయించి పాటించారు. దాన్నే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు పాటిస్తున్నారు. కాదు ఆదినుండీ ఉన్నట్టుగానే విశ్రాంతి దినాన్ని శనివారంగానే కొంతమంది పరిగణిస్తున్నారు. గల్ఫ్ లాంటి దేశాల్లోని విశ్వాసులైతే అక్కడి పరిస్థితులను బట్టి శుక్రవారాన్ని ఆరాధన దినంగా పాటిస్తున్నారు. వారంలో అది ఏ దినం అన్నది ప్రాముఖ్యం కానే కాదు. ఆ రోజును ఎంత నాణ్యమైన ఆరాధనలో గడుపుతున్నామన్నది, ఆ ఆరాధన విశ్వాసిలో ఎంతటి మార్పు తెస్తోందన్నదే దేవుని దృష్టిలో అత్యంత విలువైన విషయం. దేవునితో ఏకాంత ఆరాధనానుభవంలో విశ్వాసిలో క్రమంగా సాత్వికత్వం, దేవుని పట్ల విధేయత, నమ్మకత్వం, పొరుగు విశ్వాసుల పట్ల ప్రేమ, సహోదరభావం పెంపొందుతాయి. ఆ ఆరాధనానుభవంలోనే దేవుడు విశ్వాసిని నలుగగొట్టి తన సారూప్యంలోకి మార్చుకుంటాడు. ఆరాధనానుభవం లేనివారే అహంకారులు, అతిశయపడే వారుగా మిగిలిపోతారు. వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. దేవుని సన్నిధిలో తలవంచే అనుభవం ద్వారానే, విశ్వాసికి లోకాన్ని తలెత్తి ఎదిరించే ధైర్యం, తెగింపూ వస్తుంది. అత్యాధునిక జీవన శైలిలో, దైనందిన జీవనోపాధి కోసం గడిపే సమయం పోగా మిగిలిన సమయాన్నంతా మనం సెల్‌ఫోన్, టివి, వాట్స్అప్, ఫేస్బుక్ లాంటి ప్రసార మాధ్యమాలకే మనం కుదువబెట్టేస్తున్న పరిస్థితుల్లో ఇక దేవునితో గడిపే సమయం మనకెక్కడిది? దేవునితోనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా బాగా తగ్గిపోయింది. అందుకే విశ్వాసులు, చర్చిలు, కుటుంబాలు తద్వారా సమాజం కూడా నానాటికీ బలహీనపడుతున్నాయి. ఇదంతా మనందరి ‘ప్రైవసీ’ మీద జరుగుతున్న సాంకేతిక దాడి!! సకాలంలో కళ్ళు తెరవకపోతే దేవునికే కాదు, మన జీవిత భాగస్వాములకు, పిల్లలకు, తోబుట్టువులకు కూడా పరాయివాళ్లమవుతాం. సెల్‌ఫోన్‌తోనే ఆరంభమై, దాంతోనే మీ రోజు ముగుస్తూ ఉంటే, మీరు ఆ ప్రమాదానికి దగ్గర్లోనే ఉన్నారు. అలాకాకుండా మీ దినం దేవునితో ఆరంభమై, దేవునితోనే ముగుస్తూ ఉంటే అపారమైన ఆశీర్వాదాలు మీవెంటే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
వెలిగేదీ... వెలిగించేదీ!!
బేతనియ సోదరీమణులు, లాజరు అక్కలు మరియ, మార్త మంచి విశ్వాసులు. కాకపోతే ఇద్దరూ చెరో తెగకు చెందినవారు. వారింట్లో యేసు ఎన్నోసార్లు ఆతిథ్యం పొందాడు. యేసు వచ్చింది మొదలు వెళ్లేదాకా తనకు తోచిన సపర్యలు, మర్యాదలు చేస్తూ చెమటలు కక్కుతూ ఆయన మెప్పుకోసం మార్త తాపత్రయపడేది. మరియ ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆలకిస్తూ తన్మయురాలై జీవనసాఫల్యానికి దారి వెదుక్కునేది. ప్రభువు కోసం పని చేసే హడావిడిలో ఆయన మెప్పు పొందడమే మార్త లక్ష్యం కాగా, యేసు మాటలు ఆలకిస్తూ ఆయన మనసు తెలుసుకొని ఆ మేరకు జీవించాలన్నది మరియ ఉద్దేశ్యం. వారిద్దరిలో ఎవరు గొప్ప? అన్న ప్రస్తావన ఒకసారి వస్తే, ‘మార్త నాకోసం బోలెడు పనులు చేయాలనుకొని తొందర పడుతోంది కాని మరియ మాత్రం అవసరమైనది, అత్యుత్తమమైనది, ఆమె నుండి ఎన్నడూ తీసివేయబడనిది ఎన్నుకున్నదని యేసు అన్నాడు (లూకా 10:38–42). మరియ, మార్తలిద్దరూ విశ్వాసులే కాని మరియ ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసి అని యేసే స్వయంగా శ్లాఘించాడు. దేవుని కోసం తమకు తోచిందల్లా చేసే ‘క్రైస్తవం’లో హడావిడి కనిపిస్తుంది కాని దానివల్ల దేవుని రాజ్య నిర్మాణం జరగదు. ఆకులు, కొమ్మలూ విస్తారంగా ఉన్నా ఫలాలనివ్వని వృక్షాల్లాంటివి ఈ పరిచర్యలు. పరస్పర ప్రేమ, క్షమాపణ, త్యాగం, పవిత్రత, దైవికత పునాదిరాళ్లుగా కలిగిన లోకాన్ని ప్రభావితం చేసి పరివర్తన తెచ్చే దేవుని రాజ్యనిర్మాణం, దేవుని సంకల్పాలు, ఉద్దేశ్యాల మేరకు జరగాలి. అందుకు ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన మాటల్ని శ్రద్ధగా ఆలకించ గలిగిన పరిచారకులు కావాలి. అలా దేవుని సంకల్పాలు తెలుసుకొని వాటికి విధేయులైన వారితోనే దేవుని రాజ్యనిర్మాణం సాధ్యమవుతుంది. కాని ఈనాడు మరియ, మార్తలే అత్యధికంగా కనిపిస్తున్నారు, వారే హడావుడి చేస్తున్నారు. దేవుని పేరుతోనే ఎజెండాలతో, ధనార్జనే, పేరు సంపాదించుకోవడమే ప్రధానోద్దేశ్యంగా కలిగిన పరిచారకుల హడావిడి అంతటా కనిపిస్తోంది. సాత్వికత్వం మచ్చుకైనా కనపడని ‘సొంత సామ్రాజ్యాల్లాంటి పరిచర్యలు, చర్చిలు వెలుస్తున్నాయి. ఈ లోకాన్ని పరలోకంగా మార్చగల ‘దేవుని రాజ్యనిర్మాణం’ ఒక నినాదంగా మిగిలిపోయింది. భజనలు, ప్రార్థనలు, పాటలు, డప్పులు, ప్రసంగాల హోరులోఅసలు దేవుడున్నాడా లేదా అన్నది గమనించకపోవడం విచారం. తాను వెలుగుతూ, లోకాన్ని ప్రేమ, త్యాగం, క్షమతో నింపుతూ నింగికెగిరే రాకెట్ లాంటిదే క్రైస్తవం. అదే దేవుడు కోరుకునే అత్యుత్తమ విశ్వాసం. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అవిశ్వాసం అడ్డు తొలగింది
బాల్టిక్ సముద్రతీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి, సముద్రానికి మధ్యన ఓ మట్టి పర్వతం ఉంది. అది 1872వ సంవత్సరం. ఇద్దరు స్నేహితులు సాయం సమయాన, సముద్రతీరానికి వ్యాహ్యాళికి వెళ్లారు. వారిలో ఒకరు ఆస్తికుడు. మరొకరు నాస్తికుడు. నాస్తికుడు ఆస్తికుడితో వాదిస్తున్నాడు. ‘‘దేవుడు లేడు. మత గ్రంథాలన్నీ కల్పితం. ఉదాహరణకు బైబిలు గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన మాట. ‘మీరు విశ్వాసము కలిగి సందేహింపక ఈ కొండను చూసి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన యెడల ఆలాగున జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను’ (మత్తయి 21:21) అనేది పూర్తిగా అబద్ధం, అసాధ్యం’’ అన్నాడు నాస్తికుడు. ‘‘దేవుని మాటలను, శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు’’ అన్నాడు ఆస్తికుడు. అందుకు నాస్తికుడు, ‘‘నీకు విశ్వాసం ఉంటే మరి ప్రార్థించు. ఈ సముద్ర తీరాన ఉన్న కొండ.. సముద్రంలో పడవేయబడాలని. తద్వారా మనం రోజూ వ్యాహ్యాళికి సముద్ర తీరానికి రావాలంటే ఈ కొండను ఎక్కి దిగాల్సిన కష్టం ఉండదు’’ అన్నాడు. అతడి మాటల్లో హేళన ధ్వనించింది. ఆస్తికుడు విశ్వాసముతో అక్కడే మోకరిల్లి దేవుడిని ప్రార్థించసాగాడు. ప్రార్థన పూర్తవుతుండగానే వాతావరణంలో పెను మార్పు చోటు చేసుకుంది! అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతం అయింది. గాలులు బలంగా వీస్తున్నాయి. వర్షం మొదలైంది. ఇద్దరు మిత్రులూ వర్షంలో తడిసిపోతామని, వెంటనే అక్కడి నుంచి బయల్దేరారు. వీలైనంత వేగంగా కొండను ఎక్కి, వడివడిగా కిందికి దిగి తమ గృహాలను చేరుకున్నారు. రాత్రంతా పెద్ద తుపాను చెలరేగింది. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. ఏదో విధంగా బిక్కబిక్కుమంటూ ఆ రాత్రిని వెళ్లబుచ్చారు ఇద్దరు మిత్రులు. తెల్లవారేసరికి వర్షం తెరిపినివ్వడంతో మొదట నాస్తికుడు తన గృహం నుండి బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా, బురదలోనే మోకరిల్లి రోదిస్తూ దేవుడిని ప్రార్థించాడు! ‘దేవా నీవున్నావు. నా అజ్ఞాన గృహాన్ని కూలగొట్టుకున్నాను. నన్ను క్షమించు యేసు ప్రభూ’’అని వేడుకున్నాడు. గ్రామానికి, సముద్రానికి మధ్య ఉన్న కొండ ఆ రాత్రి వచ్చిన తుపానుకు కరికి, కొట్టుకుపోయి, సముద్రంలో కలిసిపోవడమే అందుకు కారణం. ఆస్తికుడు బయటికి వచ్చి చూసి, ఇంకా మోకరిల్లినట్లుగానే పడివున్న నాస్తికుడికి చెయ్యి అందించి పైకి లేపాడు. అతడిని తన హృదయానికి హత్తుకున్నాడు. విశ్వాసమే దేవుడు. క్రిస్మస్ శుభాకాంక్షలు. – యస్. విజయ భాస్కర్ -
దీనులు ధన్యులు
ధన్యత యేసు ప్రభువు తాను భూలోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. దేవుని రాజ్య వారసులు ఎవరు? తన కొండమీద ప్రసంగంలో యేసు తన రాజ్య వారసుల లక్షణాలను వివరించాడు. మొదటి లక్షణం తాను చెప్పిన మొదటి ధన్యత ద్వారా మనకర్థమౌతుంది. మొదటి ధన్యత ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది’’ (మత్తయి 5:3). మన ఆత్మీయ దారిద్య్రతను అంగీకరించమని యేసు చెప్తున్నాడు. బైబిల్ ప్రకారం మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా ఇవి ఏవీ మన ఆత్మీయ జీవితానికి తోడ్పడవు. దేవుని దృష్టిలో మనమందరం ఆత్మీయ దరిద్రులమే. ‘‘జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా... యెహోవాను నేనే అని గ్రహించి, నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టే అతిశయింపవలెను’’ అని యెహోవా అంటున్నాడు (యిర్మీ 9:23-24) ఇద్దరు వ్యక్తులు దేవున్ని ఆరాధించడానికి మందిరంలోకి వెళ్లారట. వారిలో ఒకడు తన గొప్పతనమును గూర్చి, తన భక్తిని గురించీ పొగుడుకుంటూ ప్రార్థించాడట. ఇంకొకడు ‘దేవా, పాపినైన నన్ను క్షమించు’ అని ప్రార్థించాడు. ఈ రెండవ వాడు దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడని యేసు చెప్తున్నాడు. మనమందరం దేవుని ముందర పాపులమే. మన గొప్పతనాలు, మన భక్తి, మన మంచి క్రియలు ఏవీ దేవుని యెదుట మనలను యోగ్యులనుగా చేయవు. మన ఆత్మీయ దరిద్రతను అంగీకరించి మనలను మనం తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొన్నప్పుడే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతాము. ఇందుచేతనే మన పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు బలిగా మరణించి, తిరిగి లేచాడు. ఆయన ద్వారా దేవునితో సమాధానం పొంది దేవుని రాజ్యాన్ని ఈ జీవితంలోనే అనుభవించగలము. ఇది దేవుని రాజ్యవారసుల మొదటి లక్షణం. - ఇనాక్ ఎర్రా -
మహిమాన్వితుడే..మా ఏసు క్రీస్తు..!
లోకవంద్యుడు క్రీస్తు. ఆయన త్యాగం తరతరాలకూ శాంతి సందేశం. ప్రజలకు రక్షకుడై తనకు తాను రక్తతర్పణం చేసుకున్న పునీతుడు. శిలువ వేసిన తర్వాత పునరుత్థానం చెంది భక్తులను పరవశింపజేసిన మహిమాన్వితుడు. సమాజగతులను మార్చిన ప్రవక్త. దేవుని కుమారునిగా ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి ప్రేమ తత్వాన్ని పంచిన దివ్య స్వరూపుడు. అందుకే క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ను భక్తితో జరుపుకున్నారు. పనిలో పనిగా ఎన్నికల బరిలో ఉన్న నేతలూ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : పాపులను నరకం నుంచి విముక్తిం కల్పించే దేవుడిబిడ్డ ఏసు ప్రభువు చేసిన సూక్తులు ఆచరణీయమని పలువురు పాస్టర్లు హితబోద చేశారు. యేసు ప్రభువు సమాధిని జయించి తిరిగి లేచినదినం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 5గంటలకే బోయపల్లి సమీపంలోని కల్వరికొండపై ఏర్పాటు చేసిన ఉదయకాల ఆరాధనకు క్రైస్తవులంతా తరలివెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ఎంబీసీ చర్చి చైర్మన్ రెవ.వరప్రసాద్ ఏసు బోదనలు, బైబిల్ సారాంశాన్ని వివరించారు. అలాగే రెమావర్షిప్ సెంటర్లో ఉదయం హౌసింగ్‌బోర్డుకాలనీ క్రైస్తవులు ఆరాధన స్తుతిగీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. రెవ.బీఎస్ పరంజ్యోతి, పాస్టర్లు శివకుమార్, రవిబాబులు క్రైస్తవులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఎక్లేషియా ట్రూ మెన్నోనైట్ బ్రదరన్ చర్చిలో సంఘ కాపరి రెవ.డా.ఎంఆర్ సుందర్ పాల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కెనరాబ్యాంక్ రీజినల్ మేనేజర్ బ్రదర్ కెఎస్ ఐజక్ ప్రభువు జీవిత చరిత్రను తెలియజేశారు. క్రిస్టియన్కాలనీలోని ఐపీసీ చర్చిలో పాస్టర్ థామస్ అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఏసుక్రీస్తు పునరుత్థానం గురించి పాస్టర్లు వివరించారు. షాలోమ్ ఎంబి చర్చిలో రెవ.వినోద్, జీసస్ గ్రేస్ గాస్పల్ చర్చిలో పాస్టర్ రవిబాబు భక్తిసందేశమిచ్చి చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు చర్చిలకు చేరుకొని క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.