బాల్టిక్ సముద్రతీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి, సముద్రానికి మధ్యన ఓ మట్టి పర్వతం ఉంది. అది 1872వ సంవత్సరం. ఇద్దరు స్నేహితులు సాయం సమయాన, సముద్రతీరానికి వ్యాహ్యాళికి వెళ్లారు. వారిలో ఒకరు ఆస్తికుడు. మరొకరు నాస్తికుడు. నాస్తికుడు ఆస్తికుడితో వాదిస్తున్నాడు. ‘‘దేవుడు లేడు. మత గ్రంథాలన్నీ కల్పితం. ఉదాహరణకు బైబిలు గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన మాట. ‘మీరు విశ్వాసము కలిగి సందేహింపక ఈ కొండను చూసి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన యెడల ఆలాగున జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను’ (మత్తయి 21:21) అనేది పూర్తిగా అబద్ధం, అసాధ్యం’’ అన్నాడు నాస్తికుడు.
‘‘దేవుని మాటలను, శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు’’ అన్నాడు ఆస్తికుడు. అందుకు నాస్తికుడు, ‘‘నీకు విశ్వాసం ఉంటే మరి ప్రార్థించు. ఈ సముద్ర తీరాన ఉన్న కొండ.. సముద్రంలో పడవేయబడాలని. తద్వారా మనం రోజూ వ్యాహ్యాళికి సముద్ర తీరానికి రావాలంటే ఈ కొండను ఎక్కి దిగాల్సిన కష్టం ఉండదు’’ అన్నాడు. అతడి మాటల్లో హేళన ధ్వనించింది. ఆస్తికుడు విశ్వాసముతో అక్కడే మోకరిల్లి దేవుడిని ప్రార్థించసాగాడు. ప్రార్థన పూర్తవుతుండగానే వాతావరణంలో పెను మార్పు చోటు చేసుకుంది! అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతం అయింది. గాలులు బలంగా వీస్తున్నాయి.
వర్షం మొదలైంది.
ఇద్దరు మిత్రులూ వర్షంలో తడిసిపోతామని, వెంటనే అక్కడి నుంచి బయల్దేరారు. వీలైనంత వేగంగా కొండను ఎక్కి, వడివడిగా కిందికి దిగి తమ గృహాలను చేరుకున్నారు. రాత్రంతా పెద్ద తుపాను చెలరేగింది. ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. ఏదో విధంగా బిక్కబిక్కుమంటూ ఆ రాత్రిని వెళ్లబుచ్చారు ఇద్దరు మిత్రులు. తెల్లవారేసరికి వర్షం తెరిపినివ్వడంతో మొదట నాస్తికుడు తన గృహం నుండి బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా, బురదలోనే మోకరిల్లి రోదిస్తూ దేవుడిని ప్రార్థించాడు! ‘దేవా నీవున్నావు. నా అజ్ఞాన గృహాన్ని కూలగొట్టుకున్నాను. నన్ను క్షమించు యేసు ప్రభూ’’అని వేడుకున్నాడు. గ్రామానికి, సముద్రానికి మధ్య ఉన్న కొండ ఆ రాత్రి వచ్చిన తుపానుకు కరికి, కొట్టుకుపోయి, సముద్రంలో కలిసిపోవడమే అందుకు కారణం. ఆస్తికుడు బయటికి వచ్చి చూసి, ఇంకా మోకరిల్లినట్లుగానే పడివున్న నాస్తికుడికి చెయ్యి అందించి పైకి లేపాడు. అతడిని తన హృదయానికి హత్తుకున్నాడు. విశ్వాసమే దేవుడు. క్రిస్మస్ శుభాకాంక్షలు.
– యస్. విజయ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment