సాక్షి, చైన్నె: జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదికలో తన పేరు నమోదు విషయంగా మాజీ మంత్రి విజయ భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధురై ధర్మాసనం స్పందించింది. ఆరోపణలలో ఆయన పేరును తొలగించే విధంగా సోమవారం ఆదేశాలను న్యాయమూర్తి జారీ చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో గత ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ కమిషన్ కొన్ని సంవత్సరాల పాటూ విచారించి 2022లో డీఎంకే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో విజయ భాస్కర్‌పై ఆరోపణలు చేస్తూ కమిషన్ కొన్ని అంశాలను పొందు పరిచినట్టు సమాచారాలు వెలువడ్డాయి. తనను సాక్షిగా విచారించిన కమిషన్, ఆరోపణలలో తనపేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మఽద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని విజయ భాస్కర్ ఆశ్రయించారు. 2013 నుంచి 2021 వరకు ప్రజల చేత శాసన సభకు ఎన్నోకో బడిన తాను ఎనిమిదేళ్లుగా ఆరోగ్య మంత్రిగా పనిచేసినట్లు వివరించారు. అయితే ఆర్ముగ స్వామికమిషన్ జయలలిత మరణం విచారణలో తనను ఓ సాక్షిగా పిలిచి విచారించినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆరోపణల వ్యవహారంలో తన పేరు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయన్నారు.
తనకు ప్రజల్లో మంచి పేరు ఉందని, ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు మచ్చగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణ వ్యవహరంలో తన పేరును ఆరోపణలలో పేర్కొనడాన్ని అంగీకరించ లేకున్నానని, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా చార్జ్ షీట్‌లో వివరాలను పొందు పరిచే పనిలో ఉన్నారని వివరించారు. ఈ దృష్ట్యా, తన పేరును ఆ నివేదిక నుంచి తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈపిటిషన్‌ను న్యాయమూర్తి ఇలం దిరయన్ విచారించారు. వాదనల అనంతరం కమిటీ నివేదికలో ఉన్న విజయ భాస్కర్ పేరును తొలగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.
ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
తిరువొత్తియూరు: విద్యార్థినులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థునులకు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అయ్యప్పన్ (52) లైంగిక వేధింపులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు జియాపురం పోలీస్ విచారణ చేపట్టారు. ఇందులో విద్యార్థునులకు అయ్యప్పన్ లైంగికంగా వేధింపులు ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడు అయ్యప్పన్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.
ఐసీఎఫ్‌ను సందర్శించిన సంజయ్‌కుమార్ పంకజ్
కొరుక్కుపేట: ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ను రైల్వే బోర్డు (ప్రొడెక్షన్ యూనిట్) అడిషన ల్ మెంబర్ సంజయ్‌కుమార్ పంకజ్ సోమవారం సందర్శించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు, ఇతర అధికారులతో కలసి ఐసీఎఫ్ వద్ద జరుగుతున్న వివిధ పనులు, ప్రాజెక్టుల గురించి, అమృత్ భారత్ కోచ్‌లు, విస్టాడోమ్ డైనింగ్ కార్, హైడ్రోజన్ రైలు, ఉత్పత్తిలో ఉన్న వివిధ ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అడ్వాన్సుడ్ వెల్డింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment