Madurai Bench
-
గంగూలీ, కోహ్లికి మధురై బెంచ్ చురకలు!
చెన్నై: ఆన్లైన్ గేమ్‌లను నిషేదిస్తూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆన్లైన్లో నగదు లావాదేవీలతో బెట్టింగులను ప్రోత్సహించే గేమ్స్ నిర్వహించేవారికి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ తదితర గేమ్‌లు ఆడుతూ దొరికిని వారికి రూ.5 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. ఆన్లైన్ గేమ్ సెంటర్లను నిర్వహిస్తూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. కరోనా కట్టడికి గత మార్చి నెలలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆన్లైన్ గేమ్స్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తమిళనాడులో ఆన్లైన్లో పేకాట ఆడుతూ డబ్బులు కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఈ అంశంపై అక్కడి హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌లో పిల్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆన్లైన్ ఆటలపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరణ కోరుతూ పలు ప్రశ్నలను సంధించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్‌డమ్‌ను ఇందుకేనా వాడేది ఇర ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన మదురై బెంచ్ తాజా, మాజీ టీమిండియా ఆటగాళ్లపైనా విమర్శలు చేసింది. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఆటగాళ్లు ఆన్లైన్ గేమ్స్‌ని ప్రోత్సహిస్తూ అడ్వర్టయిజ్మెంట్లలో పాల్గొనడమేంటని ప్రశ్నించింది. వారిపై అభిమానంతో అమాయక జనం ‘ప్రమాదకర’ ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మరికొంత మంది అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే యాడ్స్‌లో పాల్గొనేటప్పుడు ఆలోచించుకోవాలని చురకలు వేసింది. ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, డ్రీమ్ 11, ఎంపీఎల్ ఆన్లైన్ గేమ్స్‌కి గంగూలీ, కోహ్లి ప్రమోటర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆన్లైన్ గేమ్స్ కట్టడికి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. -
ఔరా.. ఇంత నిర్లక్ష్యమా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దీపావళి తుపాకుల్లా అసలైన తుపాకీలను స్వేచ్ఛగా పట్టుకుని తిరిగే ఉత్తరాది రాష్ట్రాల సంప్రదాయం తమిళనాడులోనూ ప్రవేశించిందని మదురై హైకోర్టు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిటిషనర్ వాదనకు బదులివ్వడంలో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహించింది. వెంటనే బదులివ్వకుంటే సమన్లు జారీచేయక తప్పదని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. మదురై నాగనాకుళానికి చెందిన న్యాయవాది కార్మేగం మదురై హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ వేశారు. గత ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు చెన్నైకి వచ్చిన గుహవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఐదు నకిలీ తుపాకీలు, 20 తూటాలు, రూ.4లక్షల నకిలీనోట్లు దొరికాయి. ఈ కేసులో చెన్నై పెరంబూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా విచారించగా చెన్నై నమ్మాళ్వార్‌పేటకు చెందిన పరమేశ్వరన్ అనే పోలీసు అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా తుపాకీలను అమ్మే ముఠాతో వీరిద్దరికీ సంబంధాలు ఉన్నట్లు బైటపడింది. పెద్ద సంఖ్యలో నకిలీ తుపాకీలు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిచ్చిన సమాచారం మూలంగా చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు నకిలీ తుపాకులను విక్రయించినట్లు తేలింది. కొన్నేళ్లుగా నకిలీ తుపాకులు విక్రయాలతోపాటు నకిలీ కరెన్సీ చలామణి కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు పోలీసుల స్థాయిలో విచారణ జరిపితే నేరస్తులంతా పట్టుబడే అవకాశం లేదు. ఇది దేశ రక్షణకు సంబంధించింది. అంతేగాక దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంలో అనేకులకు సంబంధాలు ఉండవచ్చు. ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు అప్పగించాలని న్యాయవాది కార్మేగం తన పిటిషన్లో పేర్కొన్నాడు. తమిళనాడులో నకిలీ తుపాకుల వినియోగం పెరిగిపోయిందని, కిరాయి రౌడీలు స్వేచ్ఛగా వాడుతున్నారని పిటిషనర్ అంటున్నాడు. దేశభద్రత చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు కేంద్రం కొంత గడువు కోరింది. ఈ పిటిషన్ న్యాయమూర్తులు కృపాకరన్, ఎస్ఎస్ సుందర్‌ల ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. వారు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన నకిలీ తుపాకీల సంప్రదాయం దక్షిణాదిలోని తమిళనాడుకు కూడా పాకిందని, దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో నెలకొని ఉన్న శాంతికి ముప్పువాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. ఈ పిటిషన్ దాఖలై ఏడాదైంది. కేంద్రం ఇంతవరకు బదులు పిటిషన్ దాఖలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. చివరిసారిగా కేంద్రానికి మరోసారి అవకాశం ఇస్తున్నాం. ఈలోగా ఎన్ఐఏ, సీబీఐ, హోంశాఖల తరఫున కేంద్రం బదులు పిటిషన్ దాఖలు చేయాలి. లేకుంటే సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీచేసి కోర్టుకు స్వయంగా హాజరుపర్చాల్సి వస్తుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. కేసును ఈనెల 22వ తేదీకి వాయిదావేశారు. -
హీరో స్వయంవరం.. సెన్సార్‌బోర్డుకు నోటీసులు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ ఓ రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. నటుడు ఆర్య స్వయంవరం పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలను ఎంపిక చేసి ఇందులో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అయితే దీనిని నిలిపివేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. షో నిర్వాహకులతోపాటు సెన్సార్‌బోర్డుకు కోర్టు నోటీసులు దాఖలు చేసింది. ‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట ఆర్య తన స్వయంవరం షోను ప్రకటించాడు. కలర్స్ తమిళ్ ఛానెల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. నటి సంగీత ఈ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ షో మహిళల గౌరవానికి దెబ్బతీసేలా ఉంటోందని.. పైగా కంటెస్టెంట్లను కించపరిచేలా షోలో పనులు చేయిస్తున్నారంటూ జానకిఅమ్మల్ అనే ఉద్యమకారిణి ఆరోపణలకు దిగారు. ఈ మేరకు షోను నిలుపుదల చేయాలంటూ ఆమె సెన్సార్ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన మధురై బెంచ్.. షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శితోపాటు, ఈ షోకు అసలు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 18కు వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా షో నిర్వాహణను నిలుపుదల చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. -
కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్
పశువధ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం నాలుగు వారాల స్టే విధించింది. వధించడం కోసం పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేయడం, దానిపై కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు, పలు సంస్థలు మండిపడటం తెలిసిందే. దీనిపై ఎస్. సెల్వగోమతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు స్టే విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఒక మతం లేదా వర్గం ఆచారాల ప్రకారం జంతువులను చంపడం నేరం కాదని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (పీసీఏ) చట్టంలోని సెక్షన్ 28 చెబుతోందని మదురైకి చెందిన ప్రముఖ న్యాయవాది సెల్వగోమతి తన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాంతో కోర్టు ఈ విషయమై తదుపరి విచారణ జరిపేందుకు వీలుగా కేంద్రప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. -
హైకోర్టును ఆశ్రయించిన నటి
పెరంబూర్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ శుక్రవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు విదేశాలకు వెళుతున్నానని మదురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. తన ప్రయాణానికి అనుమతి తెలపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఏ దేశానికి వెళ్లుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించిండంతో ఆమె కోర్టు అనుమతి కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24 నుంచి మే నెల 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం వెలువరించనుంది. తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో కుష్బూపై ఆండిపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆమె పాస్‌పోర్టును రెన్యూవల్ చేయడానికి అధికారులు నిరాకరించారన్నారు. -
జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!
-
జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!
మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని, ఆమె ఆస్తుల నిర్వహణ కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గత ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన జయలలితకు చట్టబద్ధమైన వారసులు లేరని, తాను ప్రజల కోసం ప్రజల తరఫున పాటుపడుతున్నానని ఆమె తరచూ బహిరంగ సభలలో పేర్కొనేవారని, కాబట్టి ఆమె ఆస్తులను జాతీయం చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్ కోరింది. తమిళనాడు సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. పిల్‌తోపాటు జయలలిత ఆస్తులతో కూడిన అఫిడవిట్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించింది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. వాటిని ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించాలని కోరింది. జస్టిస్ ఏ సెల్వం, జస్టిస్ పీ కలైయరాసన్తో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. జయలలిత ఆస్తులివే.. 2015 జూన్ నెలలో ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు జయలలిత ప్రకటించారు. ఆ ఆస్తులలో పోయెస్ గార్డెన్‌లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల నివాస గృహం వేద విలాస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. రెండు టయోటా ప్రాడో ఎస్‌యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42.25 లక్షలు. 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి. ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉంది. ఇక, 2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు తనకు రూ.41.63 కోట్ల చరాస్తులు, రూ.72.09 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు జయలలిత ప్రకటించారు. -
అతని పేరు మీడియాలో రాయకండి
మీడియాకు హైకోర్టు సూచన పిటిషనర్‌కు అక్షింతలు విజయకాంత్‌కు ఊరట సాక్షి, చెన్నై: కొన్ని పబ్లిసిటీ పిటిషన్లకు ప్రాధాన్యం ఇవ్వవద్దు అని మీడియాకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. ఓ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతడి పేరు కూడా రాయ వద్దని పేర్కొంది. పిటిషనర్‌కు అక్షింతలు వేసిన బెంచ్, డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఊరట ఇస్తూ బెయిల్‌ను పొడిగించింది. ఇటీవల కాలంగా కోర్టుల్లో చిన్న చిన్న సమస్యలతోనూ పిటిషన్లు దాఖలు అవుతోండటం న్యాయమూర్తుల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఇటీవల మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ న్యాయవాదుల మీద తీవ్ర ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేశారు. చిన్న సమస్యలు, పబ్లిసిటీ పిటిషన్లను కోర్టుల్లో దాఖలు చేయవద్దని, అవసరం అయితే, స్థానిక ప్రజా ప్రతినిధుల్ని కలవాలని హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్‌పై ఏడాది పాటుగా నాన్ బెయిల్ వారెంట్‌తో గూండా చట్టం కింద కేసు నమోదుకు ఆదేశించాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మదురై ధర్మాసనానికి ఆగ్రహాన్ని తెప్పించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యలు, చేష్టలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉందని, ఇప్పటికే పలు కేసుల్ని ఎదుర్కొంటున్న విజయకాంత్ మీద గూండా చట్టం నమోదు చేయాలంటూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మదురై ధర్మాసనం న్యాయమూర్తులు రామసుబ్రమణియన్, కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇది పబ్లిసిటీ కోసం దాఖలు చేసినట్టుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా స్పష్టం అవుతోందని చురకలు అంటించారు. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయవద్దు అని, ఇలాంటి వారికి పబ్లిసిటీ ఇవ్వొదని మీడియాకు సూచించారు. పిటిషనర్‌కు అక్షింతలు వేశారు. పబ్లిసిటీ కోసం ప్రయత్నించిన ఈ పిటిషనర్ పేరును దయచేసి రాయొద్దని సూచించారు. ఆ పిటిషన్ విచారణను తిరస్కరిస్తూ పిటిషనర్‌కు అక్షింతలు వేశారు. తదుపరి విజయకాంత్ బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను పరిశీలించి, అందుకు తగ్గ ఆదేశాలు ఇచ్చారు.