జయలలిత ఆస్తులు జాతీయం చేయాలి!
మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని, ఆమె ఆస్తుల నిర్వహణ కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గత ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన జయలలితకు చట్టబద్ధమైన వారసులు లేరని, తాను ప్రజల కోసం ప్రజల తరఫున పాటుపడుతున్నానని ఆమె తరచూ బహిరంగ సభలలో పేర్కొనేవారని, కాబట్టి ఆమె ఆస్తులను జాతీయం చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్ కోరింది.
తమిళనాడు సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. పిల్‌తోపాటు జయలలిత ఆస్తులతో కూడిన అఫిడవిట్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించింది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. వాటిని ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించాలని కోరింది. జస్టిస్ ఏ సెల్వం, జస్టిస్ పీ కలైయరాసన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
జయలలిత ఆస్తులివే..
2015 జూన్ నెలలో ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు జయలలిత ప్రకటించారు. ఆ ఆస్తులలో పోయెస్ గార్డెన్లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల నివాస గృహం వేద విలాస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు.
కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్లో ఉంది. రెండు టయోటా ప్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42.25 లక్షలు. 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి.
ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉంది. ఇక, 2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు తనకు రూ.41.63 కోట్ల చరాస్తులు, రూ.72.09 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు జయలలిత ప్రకటించారు.