ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌సీ)ను ఆదేశించింది. ఈ మేరకు నీట్ 2018 ర్యాంకు లిస్టును రెండు వారాల్లోగా పునః పరిశీలించాలని పేర్కొంది.
నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్‌సీ తీరును తప్పు పట్టింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిరంకుశంగా వ్యవహరించారు..
తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లలేదని సీబీఎస్‌సీ ఏ ప్రాతిపదికన చెబుతుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. మెజారిటీ ప్రజలు సమర్థించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు కదా అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్ విచారణ కొనసాగుతుండగానే ర్యాంకు లిస్టు విడుదల చేయడం ద్వారా సీబీఎస్‌సీ నిరంకుశంగా వ్యవహరించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువాద తప్పిదాల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయారన్న వాదనను సీబీఎస్‌సీ తేలికగా తీసుకోవడం బాధ్యత రాహిత్యమేనని మండిపడింది. సైన్సు విభాగంలో ఆంగ్ల పదాలతో సరిపోయే తమిళ పదాలను రూపొందించడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించిందో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఎస్‌సీని ఆదేశించింది. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment