మళ్లీ పరీక్ష తప్పదా!
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టేతో విద్యార్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2017 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిం చిన ‘నీట్’ ఫలితాల వెల్లడిపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్న పత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీం తో నీట్ ఫలితాలపై నీలినీడలు అలుముకున్నాయి. గతేడాది కూడా ఎంసెట్ సహా నీట్‌ను రెండు సార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ పరీక్ష తప్పదేమోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనూ సమస్య..
రాష్ట్రంలో ఇటీవల జరిగిన నీట్ పరీక్షను హైదరాబాద్‌లోని 59 పరీక్షా కేంద్రాల్లో 48,999 మంది, వరంగల్‌లోని 16 పరీక్షా కేంద్రాల్లో 7,805 మంది కలిపి మొత్తంగా.. 56,804 మంది పరీక్ష రాశారు. అయితే రాష్ట్రంలోనూ తెలుగు మాధ్యమానికి బదులు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇచ్చారంటూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పాఠశాల కేంద్రంలో సుమారు 600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 100 మందికిపైగా తెలుగు మీడియంలో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్న పత్రం ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు.
చివరికి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయాలని తేల్చడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు వారి కోసం మరోసారి తెలుగు ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాక సిలబస్‌లో లేని ప్రశ్నలు కూడా ఇచ్చారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. జువాలజీకి సంబంధించి సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇచ్చారు. ఫ్రాగ్ అనే చాప్టర్ నీట్ సిలబస్‌లో లేదు. కానీ అందులోంచి రెండు ప్రశ్నలు ఇచ్చారు.
మరో రెండు ప్రశ్నలూ సిలబస్‌లో లేనివే ఇచ్చారు. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి రెండు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరైనదో అర్థంకాని పరిస్థితి ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితి విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. ఇలా నీట్ ప్రవేశ పరీక్ష విమర్శలకు తావి చ్చింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఒక్క అధికారిని కూడా నియమించలేదు. కనీసం సమాచారం తెలుసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.