సాక్షి ప్రతినిధి, చెన్నై: దీపావళి తుపాకుల్లా అసలైన తుపాకీలను స్వేచ్ఛగా పట్టుకుని తిరిగే ఉత్తరాది రాష్ట్రాల సంప్రదాయం తమిళనాడులోనూ ప్రవేశించిందని మదురై హైకోర్టు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిటిషనర్ వాదనకు బదులివ్వడంలో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహించింది. వెంటనే బదులివ్వకుంటే సమన్లు జారీచేయక తప్పదని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. మదురై నాగనాకుళానికి చెందిన న్యాయవాది కార్మేగం మదురై హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ వేశారు. గత ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు చెన్నైకి వచ్చిన గుహవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఐదు నకిలీ తుపాకీలు, 20 తూటాలు, రూ.4లక్షల నకిలీనోట్లు దొరికాయి. ఈ కేసులో చెన్నై పెరంబూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా విచారించగా చెన్నై నమ్మాళ్వార్‌పేటకు చెందిన పరమేశ్వరన్ అనే పోలీసు అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా తుపాకీలను అమ్మే ముఠాతో వీరిద్దరికీ సంబంధాలు ఉన్నట్లు బైటపడింది. పెద్ద సంఖ్యలో నకిలీ తుపాకీలు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిచ్చిన సమాచారం మూలంగా చెన్నై, కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు నకిలీ తుపాకులను విక్రయించినట్లు తేలింది. కొన్నేళ్లుగా నకిలీ తుపాకులు విక్రయాలతోపాటు నకిలీ కరెన్సీ చలామణి కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు పోలీసుల స్థాయిలో విచారణ జరిపితే నేరస్తులంతా పట్టుబడే అవకాశం లేదు. ఇది దేశ రక్షణకు సంబంధించింది.
అంతేగాక దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంలో అనేకులకు సంబంధాలు ఉండవచ్చు. ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు అప్పగించాలని న్యాయవాది కార్మేగం తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తమిళనాడులో నకిలీ తుపాకుల వినియోగం పెరిగిపోయిందని, కిరాయి రౌడీలు స్వేచ్ఛగా వాడుతున్నారని పిటిషనర్ అంటున్నాడు. దేశభద్రత చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు కేంద్రం కొంత గడువు కోరింది. ఈ పిటిషన్ న్యాయమూర్తులు కృపాకరన్, ఎస్‌ఎస్ సుందర్‌ల ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. వారు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన నకిలీ తుపాకీల సంప్రదాయం దక్షిణాదిలోని తమిళనాడుకు కూడా పాకిందని, దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.
దేశంలో నెలకొని ఉన్న శాంతికి ముప్పువాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. ఈ పిటిషన్ దాఖలై ఏడాదైంది. కేంద్రం ఇంతవరకు బదులు పిటిషన్ దాఖలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. చివరిసారిగా కేంద్రానికి మరోసారి అవకాశం ఇస్తున్నాం. ఈలోగా ఎన్‌ఐఏ, సీబీఐ, హోంశాఖల తరఫున కేంద్రం బదులు పిటిషన్ దాఖలు చేయాలి. లేకుంటే సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీచేసి కోర్టుకు స్వయంగా హాజరుపర్చాల్సి వస్తుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. కేసును ఈనెల 22వ తేదీకి వాయిదావేశారు.
Comments
Please login to add a commentAdd a comment