పాపులను నరకం నుంచి విముక్తిం కల్పించే దేవుడిబిడ్డ ఏసు ప్రభువు చేసిన సూక్తులు ఆచరణీయమని పలువురు పాస్టర్లు హితబోద చేశారు.
లోకవంద్యుడు క్రీస్తు. ఆయన త్యాగం తరతరాలకూ శాంతి సందేశం. ప్రజలకు రక్షకుడై తనకు తాను రక్తతర్పణం చేసుకున్న పునీతుడు. శిలువ వేసిన తర్వాత పునరుత్థానం చెంది భక్తులను పరవశింపజేసిన మహిమాన్వితుడు. సమాజగతులను మార్చిన ప్రవక్త. దేవుని కుమారునిగా ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి ప్రేమ తత్వాన్ని పంచిన దివ్య స్వరూపుడు. అందుకే క్రైస్తవులు ఆదివారం ఈస్టర్‌ను భక్తితో జరుపుకున్నారు. పనిలో పనిగా ఎన్నికల బరిలో ఉన్న నేతలూ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : పాపులను నరకం నుంచి విముక్తిం కల్పించే దేవుడిబిడ్డ ఏసు ప్రభువు చేసిన సూక్తులు ఆచరణీయమని పలువురు పాస్టర్లు హితబోద చేశారు. యేసు ప్రభువు సమాధిని జయించి తిరిగి లేచినదినం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు.
ఉదయం 5గంటలకే బోయపల్లి సమీపంలోని కల్వరికొండపై ఏర్పాటు చేసిన ఉదయకాల ఆరాధనకు క్రైస్తవులంతా తరలివెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ఎంబీసీ చర్చి చైర్మన్ రెవ.వరప్రసాద్ ఏసు బోదనలు, బైబిల్ సారాంశాన్ని వివరించారు. అలాగే రెమావర్షిప్ సెంటర్‌లో ఉదయం హౌసింగ్‌బోర్డుకాలనీ క్రైస్తవులు ఆరాధన స్తుతిగీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. రెవ.బీఎస్ పరంజ్యోతి, పాస్టర్లు శివకుమార్, రవిబాబులు క్రైస్తవులకు పలు సూచనలు చేశారు.
అదేవిధంగా ఎక్లేషియా ట్రూ మెన్నోనైట్ బ్రదరన్ చర్చిలో సంఘ కాపరి రెవ.డా.ఎంఆర్ సుందర్ పాల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కెనరాబ్యాంక్ రీజినల్ మేనేజర్ బ్రదర్ కెఎస్ ఐజక్ ప్రభువు జీవిత చరిత్రను తెలియజేశారు. క్రిస్టియన్‌కాలనీలోని ఐపీసీ చర్చిలో పాస్టర్ థామస్ అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఏసుక్రీస్తు పునరుత్థానం గురించి పాస్టర్లు వివరించారు. షాలోమ్ ఎంబి చర్చిలో రెవ.వినోద్, జీసస్ గ్రేస్ గాస్పల్ చర్చిలో పాస్టర్ రవిబాబు భక్తిసందేశమిచ్చి చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు చర్చిలకు చేరుకొని క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.