జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పల్లె సంగ్రామానికి తెర లేచింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీల సమరానికి సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మంగళవారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే గ్రామాల్లో ఉన్న ఎన్నికల హడావుడి ఇంకా తీవ్రం కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా మంగళవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చేసినట్లయింది. జిల్లాలో మొత్తం 721 గ్రామపంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
10.. 7.. 8
జిల్లాలోని 25 మండలాలకు గాను 721 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తొలి విడత కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండ మండలాల్లోని 249 పంచాయతీల్లో ఈనెల 21న, రెండో విడతగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీల్లో ఈనెల 25న ఎన్నికలు జరుగుతాయి. ఇక చివరిదైన మూడో విడతగా అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దూర్, కోస్గి మండలాల్లోని 227 పంచాయతీల్లో 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
పోలింగ్, లెక్కింపు ఒకే రోజు
నిర్ణీత తేదీల్లో పోలింగ్‌ను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లు.. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కిస్తారు. అంటే ప్రతీ ఓటరు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇక వార్డుసభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యాకఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తిచేస్తారు.
721 పంచాయతీల్లో ఎన్నికలు
జిల్లాలోని మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 721 పంచాయతీల్లో 307 జనరల్‌కు కేటాయించారు. ఇక బీసీలకు 170 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ప్రభుత్వం ఇటీవల పలు తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. దీంతో జిల్లాలోని 107 తండా పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నా యి. ఈ పంచాయతీలుగా పూర్తిగా గిరిజనులకే కేటాయించారు. దీంతో మైదాన ప్రాంతాల్లో 30 స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. ఎస్సీలకు 107 స్థానాలు రిజర్వ్ చేయగా.. ప్రతీ కేటగిరీలో 50 శాతం స్థానాలకు మహిళలకు దక్కనున్నాయి. కాగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే 11,876 మంది ఉద్యోగులను గుర్తించడంతో పా టు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు వంటి పనులను అధికారులు పూర్తిచేశారు.
265 కొత్త పంచాయతీల్లో ఎన్నికలు
‘మా ప్రాంతం.. మా పాలన’ నినాదంతో ప్రజలు ఎదురుచూస్తుండగా రాష్ట్రప్రభుత్వం కొద్దినెలల క్రితం కొత్త గ్రామపంచాయతీలను గేర్పాటుచేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 265 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఈ పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనుండగా ఆశావహులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
గులాబీ, తెలుగు రంగు బ్యాలెట్లు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులకు ఓటర్లు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ను ముద్రించారు. ఇక సర్పంచ్ బ్యాలెట్‌లో ముద్రించేందుకు 30 గుర్తులను కేటాయించారు. అలాగే, వార్డు సభ్యుల బ్యాలెట్ కోసం 20 గుర్తులు ఉండగా.. ప్రతీ బ్యాలెట్‌లో ఈసారి తొలిసారిగా ‘నోటా’ గుర్తు ముద్రించనున్నారు. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసే అవకాశం ఉంది.
సర్పంచ్‌కు ఫీజు, ఖర్చు
సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు(జనరల్) రూ.2 వేల నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజర్వ్‌డ స్థానాల్లోనైతే రూ.వెయ్యిగా నిర్ధారించారు. ఇక జనరల్ స్థానం నుంచి పోటీ చేసే వార్డు సభ్యులు రూ.500, రిజర్వ్‌డ్ స్థానాల కోసం రూ.250 మాత్రం చెల్లించాలి. కాగా, సర్పంచ్‌గా పోటీ చేసే(జనరల్) అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని రూ.2 లక్షలుగా, రిజర్వ్‌డ్ స్థానాల అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుల ఖర్చులు వరుసగా రూ.50 వేలు, రూ.30వేలకు మించొద్దు.
అమల్లోకి ఎన్నికల కోడ్
రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఫలితంగా బుధవారం నుంచి ఎలాంటి పనులకు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడానికి వీలుండదు. అయితే, ఇప్పటికే ప్రారంభించిన పనులను కొనసాగించవచ్చు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.
పల్లె సంగ్రామం
Published Wed, Jan 2 2019 9:20 AM | Last Updated on Wed, Jan 2 2019 9:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment