మరో చాన్స్‌! | Another Chance To Voters Registration Mahabubnagar | Sakshi
Sakshi News home page

మరో చాన్స్‌!

Published Fri, Dec 21 2018 9:28 AM | Last Updated on Fri, Dec 21 2018 9:28 AM

Another Chance To Voters Registration Mahabubnagar - Sakshi

అచ్చంపేట: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ప్రజల ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఓటు హక్కు లేని ప్రజలు జిల్లాలోని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోవడంతో చాలా మంది ఓటు వేయకుండానే పోలింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 26 నుంచి జాబితాలో ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఓటు వేయలేకపోయారు. చాలా చోట్ల ఓటర్లు రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోవడంతో చాలా మంది ఓటు వేయకుండానే పోలింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. భారీగా ఓట్లు గల్లంతు కావడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ క్షమాపణలు సైతం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతన ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది.1 జనవరి 2018 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది.అంతేకాకుండా ముసాయిదా ప్రకటించి సవరణలు సైతం చేసింది. నూతన ఓటర్ల నమోదుకు స్పెషల్‌డ్రైవ్‌ కూడా చేపట్టారు. అయినా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పేర్లు గల్లంతయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమో లేదా ప్రజల అవగాహన రాహిత్యమో భారీగా ఓటర్ల పేర్లు కనిపించలేదు. చాలామంది తమకు ఓటరు గుర్తింపు కార్డులుండడంతో తమ పేరు జాబితాలో ఉందనే భరోసాతో ఉన్నారు. దీంతో ఎన్నికల తేదీ సమీపించిన జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోలేదు. మరికొందరు తమ పేర్లు లేకపోవడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. అయినా వాటిని అన్‌లైన్‌ నమోదులో జరిగిన లోపాలతో వారి పేర్లు జాబితాలో రాలేదు. దీంతో చాలామంది ఓటు హక్కును కోల్పోయారు.

2018లో పెరిగిన ఓటర్ల సంఖ్య  
2014 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 2018 ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014లో జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,99,386 ఉండగా, 2018 నాటికి 6,25,414వరకుచేరింది. అంటే 26,044 ఓటర్లు పెరిగారు. అయితే చాలామంది ఓటర్ల పేర్లు ఈసారి గల్లంతయ్యాయి. గతంలో తాము ఓటు హక్కును వినియోగించుకున్నామనే ధీమాతో చాలామంది 2018 ముపాయిదా జాబితాలో పేరు సరిచూసుకోలేదు. దీంతో వారు తమ ఓటు హక్కును కోల్పోయారు. అంతేకాకుండా మరికొందరు తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీరిలో చాలా మంది పేర్లు నూతన జాబితాలో సైతం రాలేదు.

26న ఓటర్ల జాబితా ప్రదర్శన..
ప్రస్తుత ఓటర్ల జాబితాను ఈ నెల 26న ఎన్నికల అధికారులు ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో పేర్లు లేనివారు మరోసారి దర ఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 26 నుంచి జనవరి 26, 2019  వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. అలాగే ఫిబ్రవరి 11లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 18లోగా కొత్త జాబితాను ప్రకటించనున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22న విడుదల చేమనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.

జాబితాలో మీపేరు సరిచూసుకోండి..
రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పించింది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు షెడ్యూల్‌ ప్రకటించింది. జనవరి1, 2019 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలాగే ఇప్పటివరకు ఓటరుగా నమోదుకాని వారు, పేరు తొలగింపునకు గురైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement