Votes Registration
-
మరో చాన్స్!
అచ్చంపేట: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ప్రజల ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఓటు హక్కు లేని ప్రజలు జిల్లాలోని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోవడంతో చాలా మంది ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 26 నుంచి జాబితాలో ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఓటు వేయలేకపోయారు. చాలా చోట్ల ఓటర్లు రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోవడంతో చాలా మంది ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. భారీగా ఓట్లు గల్లంతు కావడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ క్షమాపణలు సైతం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతన ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది.1 జనవరి 2018 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది.అంతేకాకుండా ముసాయిదా ప్రకటించి సవరణలు సైతం చేసింది. నూతన ఓటర్ల నమోదుకు స్పెషల్‌డ్రైవ్ కూడా చేపట్టారు. అయినా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పేర్లు గల్లంతయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమో లేదా ప్రజల అవగాహన రాహిత్యమో భారీగా ఓటర్ల పేర్లు కనిపించలేదు. చాలామంది తమకు ఓటరు గుర్తింపు కార్డులుండడంతో తమ పేరు జాబితాలో ఉందనే భరోసాతో ఉన్నారు. దీంతో ఎన్నికల తేదీ సమీపించిన జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోలేదు. మరికొందరు తమ పేర్లు లేకపోవడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. అయినా వాటిని అన్లైన్ నమోదులో జరిగిన లోపాలతో వారి పేర్లు జాబితాలో రాలేదు. దీంతో చాలామంది ఓటు హక్కును కోల్పోయారు. 2018లో పెరిగిన ఓటర్ల సంఖ్య 2014 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 2018 ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014లో జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,99,386 ఉండగా, 2018 నాటికి 6,25,414వరకుచేరింది. అంటే 26,044 ఓటర్లు పెరిగారు. అయితే చాలామంది ఓటర్ల పేర్లు ఈసారి గల్లంతయ్యాయి. గతంలో తాము ఓటు హక్కును వినియోగించుకున్నామనే ధీమాతో చాలామంది 2018 ముపాయిదా జాబితాలో పేరు సరిచూసుకోలేదు. దీంతో వారు తమ ఓటు హక్కును కోల్పోయారు. అంతేకాకుండా మరికొందరు తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీరిలో చాలా మంది పేర్లు నూతన జాబితాలో సైతం రాలేదు. 26న ఓటర్ల జాబితా ప్రదర్శన.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ఈ నెల 26న ఎన్నికల అధికారులు ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో పేర్లు లేనివారు మరోసారి దర ఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 26 నుంచి జనవరి 26, 2019 వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. అలాగే ఫిబ్రవరి 11లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 18లోగా కొత్త జాబితాను ప్రకటించనున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22న విడుదల చేమనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. జాబితాలో మీపేరు సరిచూసుకోండి.. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పించింది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు షెడ్యూల్ ప్రకటించింది. జనవరి1, 2019 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలాగే ఇప్పటివరకు ఓటరుగా నమోదుకాని వారు, పేరు తొలగింపునకు గురైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్లో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. -
ఊరూపేరూలేని ఓటర్లు 3.90 లక్షల మంది
సాక్షి, అమరావతి: ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా... ఉంది రాష్ట్రంలోని ఓటర్ల నమోదు ప్రక్రియ. రాష్ట్రంలోనే నివాసముంటున్నట్లు ఎలాంటి అడ్రసులు లేకుండానే లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇలాంటి ఓటరు సోమలింగాలు దాదాపు 3.95 లక్షలకు పైగా ఉన్నారు. అసలు ఆ వ్యక్తులున్నారో లేరో తెలియకుండానే ఓటర్లుగా అనుమతించడం ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. ఒకే ఇంటి నెంబర్‌తో వందల్లో పేర్లు నమోదుచేయడం ఒక ఎత్తయితే కొన్నిటికి నెంబర్లేమీ వేయకుండానే ‘సేమ్’ ‘ఓల్డ్’ అంటూ రాసి ఓట్లు నమోదు చేశారు. కొన్ని చోట్ల ఇంటినెంబర్ స్థానంలో ‘డాష్’ (––) పెట్టి లెక్కకు మించి ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ, బోగస్ ఓట్ల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఓటర్ అనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) నకిలీ ఓట్లపై అధ్యయనం చేసి నివేదికలు కూడా రూపొందించింది. ఆయా అంశాలపై ‘సాక్షి’లో వరుసగా విశ్లేషణాత్మక కథనాలూ వచ్చాయి. కనీసం అప్పటి వరకు ఉండి చనిపోయిన వారి పేరిట ఓట్లు కొనసాగుతున్నాయన్నా... లేదా ఒకరికే ఒకటికి మించి అయిదు వరకు ఓట్లు నమోదు అయ్యాయన్నా ఆ తప్పులను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఆ వ్యక్తులున్నారో లేదో కూడా తెలియని పేర్లతో లక్షల కొద్దీ ఓట్లు నమోదు అవ్వడం విస్తుగొల్పుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని ప్రలోభపెట్టో, బెదిరించో.. అధికారపార్టీ నేతలు తమకు అనుకూలంగా ఈ ఊరూ పేరు లేని ఓట్లను నమోదు చేయించి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్’ అధ్యయనంలో ఇప్పటికే తేలిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి పేరుతో రెండేసి ఓట్లు 36,404 ఉండగా ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, లింగం సమానంగా ఉన్న డూప్లికేట్ ఓట్లు 82,788 ఉన్నాయి. మిగతా వివరాలు ఒకేగా ఉండి వయసు మార్చి నమోదు చేసినవి 24,928 కాగా జెండర్ మార్పుతో ఉన్నవి 1006 ఓట్లు. ఇక తండ్రి/భర్త పేరు మార్పుచేసి నమోదు అయినవి 92,198 ఉన్నాయని వాస్ట్ పరిశీలనలో తేలింది. ఇక ఏకంగా ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేసినవి 2,60,634 ఉన్నాయి. ఓటరు పేరు, తండ్రి/భర్త పేరులను అదే విధంగా ఉంచి మిగతా స్వల్పమార్పులతో నమోదైన నకిలీ ఓట్లు 25,17,164. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఓటు ఉన్నవారు 18,50,511 మంది ప్రజాస్వామ్యవాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే కోవలో అసలు ఊరూపేరూ లేకుండానే ఏకంగా 3,95,125కు పైగా నకిలీ ఓట్లు నమోదైనట్లు వాస్ట్ పరిశీలనలో తేలింది. ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని వేల ఓట్లు ఇలాంటివి బయటపడతాయని ఆ అధ్యయన సంస్థ హెడ్ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ ఆధ్వర్యంలోనేనా ఇదంతా... ఓ ప్రణాళిక ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీ ఇలా తమకు అనుకూలంగా ఓట్లు నకిలీ ఓట్లు ఓట్లు నమోదు చేయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా కొనసాగించినట్లు చెబుతున్నారు. సర్వే పేరుతో ఈ టీములు వెళ్లి వైఎస్సార్సీపీ అభిమానులను గుర్తించి వారి ఓట్లను తొలగించడం కూడా చేశాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ టీములు పట్టుబడడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. వారికి ఆధునిక సాంకేతిక పరికరాలను అందించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద చంద్రబాబునాయుడి ఫొటోతో ఉన్న టీడీపీ గుర్తింపుకార్డులు కూడా పట్టుబడ్డాయి. పట్టుబడిన ఈ టీములపై ఎన్నికలసంఘం నియమావళి ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉన్నా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు మౌనం దాల్చుతున్నారు. విశాఖ వెస్ట్‌లో ఒకే ఇంటి నెంబర్‌తో 3,128 ఓట్లు ఇంటి చిరునామాలు ఏమీ లేకుండా పైన ఓటరు ఇంటి నెంబరుతో సేమ్ అని పేర్కొంటూ పలు పేర్లు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో 3,128 ఓట్లు ఇలా తేలాయి. ఈ నియోజకవర్గంలోని బూత్‌నెంబర్ 154 పరిధిలో ఇంటినెంబర్ స్థానంలో సేమ్ అంటూ 394 (సీరియల్ నెంబర్ 340 నుంచి 733 వరకు) ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే బూత్‌నెంబర్ 155లో 688 (సీరియల్ నెంబర్ 321 నుంచి 1036 వరకు), బూత్ నెంబర్ 161లో 118, బూత్‌నెంబర్ 181లో 555 ఓట్లు ఇలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ‘ఎక్స్‌బీ01574863’ ఐడీనెంబర్‌తో చిరునామా ఏమీ లేకుండా ఇంటినెంబర్ ‘1ఏ’ అని ఓటు నమోదైంది. ఇలా 1ఏతో పలు ఓట్లున్నాయి. ఒకే ఇంటి నెంబర్‌తో ఇన్ని పేర్లుండడానికి వీల్లేదని, ఊరూ పేరు లేని పేర్లకు సేమ్ అని పెట్టి నమోదు చేయించినట్లుగా ఉందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇంటి నెంబర్ వద్ద ఏమీ రాయకుండా రెండు గీతలు పెట్టి (డాష్) వేలాది ఓట్లు జాబితాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కడప జిల్లా రాజంపేట, గుంటూరుజిల్లా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఇంటి నెంబర్‌కు బదులు ‘ఓల్డ్’ అంటూ పేర్కొని నమోదు చేసిన ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. -
ఒకటే ముఖం.. ఓట్లు బహుముఖం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల నమోదు అనేది నిజాయతీగా, నూరు శాతం సక్రమంగా జరగాల్సిన క్రతువు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై స్వార్థం కోసం దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఓట్ల నమోదులో లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో కొత్త పేర్లను ఇష్టారాజ్యంగా చేరుస్తున్నారు. ఒక్కొక్కరికి రెండుకు మించి ఓట్లు ఉంటున్నాయి. సరైన సమాచారం లేకున్నా ఆయా వ్యక్తుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల నమోదులో అవకతవకలపై ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్(వాస్ట్) అనే సంస్థ అధ్యయనం చేసింది. తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించి ఓట్లు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా దర్శనమిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒకటి రద్దు చేయాలి. కానీ, ఏకంగా నాలుగైదు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు ఐడీ కార్డులతో ఓటు హక్కు ఉన్నవారు ఎంతోమంది కనిపిస్తున్నారు. వేలాదిగా డబుల్ ఎంట్రీలు శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19,95,185 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులపై విచారణ సాగుతోంది. ఓటు హక్కు కోసం దాదాపు 47,411 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చాయి. మరో 30,000 దరఖాస్తులు నేరుగా బీఎల్వోల ద్వారా అందాయి. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో 9,802 ఓట్లు డబుల్ ఎంట్రీలుగా ఉన్నట్టు తేలింది. అంటే ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఒకే పేరు, తండ్రి పేరు, వయస్సులు ఉన్నవి ఉన్నాయి. ఒక్క శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే దాదాపు 1,200 ఓట్లు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఓటు హక్కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ డబుల్ ఎంట్రీలు 40 వేలకు పైగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక నియోజకవర్గంలోని ఓటర్లు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఓటరుగా నమోదై ఉండడం గమనార్హం. పేరు, పోలింగ్ బూత్ మార్పుతో ఒక్కరికే వేర్వేరుగా ఓట్లున్నాయి. ఓటర్ ఒక్కరే.... రెండుచోట్ల పేర్లు తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని పలువురు ఓటర్ల పేరిట పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల ఓట్లు నమోదయ్యాయి. కాకినాడలోని ఓటరు జాబితాలోని సమాచారం ప్రకారం పరిశీలన చేస్తే సదరు అడ్రస్ దొరకలేదు. కాకినాడ నరసన్ననగర్ మెయిన్ రోడ్ శుభా ఎన్‌క్లేవ్‌లో డోర్ నెంబర్ 65–1–8/సి3లో ఉయ్యూరి శత్రుఘ్నుడు (బూత్‌నెంబర్–1, ఎల్5 సి.నెం.134), ఉయ్యూరి రామలక్ష్మి పేరుతో ఓట్లు నమోదయ్యాయి. ఇవే పేర్లతో నిడదవోలులో కూడా ఓట్లున్నాయి. దీంతో శుభా ఎన్‌క్లేవ్‌కు వెళ్లి విచారించగా సదరు డోర్ నెంబర్లో ఓ బ్యాంక్ మేనేజర్ అద్దెకు ఉంటున్నట్టుగా తేలింది. శత్రుఘ్నుడు అనే పేరుగలవారు అక్కడ అద్దెకు ఉండడం కానీ, ప్లాట్ యజమానిగా కానీ ఎవరూ లేరని స్థానికులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని పినపళ్లకు చెందిన పి.రామకృష్ణకు కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉంది. పెద్దాపురం పట్టణానికి చెందిన మహిళకు డివిజన్లో రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒకే పేరుతో పట్టణంలోని పోలింగ్ బూత్ నాలుగులో, ప్రత్తిపాడు 34వ బూత్లోనూ జాహ్నవి అడ్డగర్ల పేరుతో ఓటు నమోదైంది. ⇔ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఓటర్ల జాబితాలో శ్రీరామారెడ్డి చింతా అనే పేరు, 2–210 ఇంటి నెంబరుతో 29 సంవత్సరాల వయసుతో ఆర్ఈఎన్ 1285436 నెంబరు ఐడీ కార్డుతో ఓటు ఉండగా, అదే పేరుతో రావులపాలెం మండలం ఊబలంక జాబితాలో కూడా ఓటు ఉంది. ఇంటి నెంబరు 1–301, వయసు 30, ఆర్ఈఎన్ 0163956 ఐడీ నెంబరుతో ఈ ఓటు ఉంది. ఈ వ్యక్తి ఊబలంక గ్రామానికి చెందిన టీడీపీ నేత కుమారుడు. ⇔ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామ ఓటరు జాబితాలో వెంకటేష్ పుల్లేటికుర్తి అనే పేరు, 1–358 ఇంటి నెంబరు, 28 సంవత్సరాల వయసు, ఆర్ఈఎన్ 0926255 ఐడీ నెంబరుతో ఓటు ఉంది. ఇతడు ఉద్యోగ రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటుండగా అక్కడ కూడా ఓటు ఉంది. ఇంటి నెంబరులో మార్పు తప్ప మిగితా వివరాలు ఊబలంక జాబితా మాదిరిగానే ఉన్నాయి. ఒక్కరికే ఐదు ఓటర్ ఐడీ కార్డులు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులు ఒకే పేరుతో పలు చోట్ల ఓట్లు నమోదు చేయించారు. పట్టణ పరిధిలో మంత్రి పుల్లారావు నివాసం ఉండే పండరీపురం వీధిలోనే (పీఎస్ నంబర్–151) పలు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. ఓటరు కార్డు నెంబరు ఎస్జీఈ029814. సీరియల్ నెంబరు 795... ఈమె పేరు ఐదు చోట్ల ఉంది. ఒకే పేరున ఐదు చోట్ల ఓట్లు నమోదై ఉండడం గమనార్హం. ఓటర్ ఐడీ కార్డు నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయి. వయసులో స్వల్ప వ్యత్యాసాలతో ఓటర్ ఐడీ కార్డులు తీసుకున్నారు. చిలకలూరిపేటలో వెంకట శ్రీసుమ గంజి పేరిట మూడు ఓట్లు, మహాలక్ష్మి అఖిల జాలాది పేరిట రెండు ఓట్లు, అంజనాదేవి కందిమళ్ల పేరిట రెండు ఓట్లు, వాసంతి జంజనం పేరున ఐదు ఓట్లు నమోదై ఉన్నాయి. వేమూరు మండలంలోని జంపని గ్రామానికి చెందిన మత్తి సరస్వతికి జంపనిలో, తెనాలి నాజర్‌పేటలో ఓట్లు ఉన్నాయి. వివాహం చేసుకుని వెళ్లిపోయినా.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు నార్తుపాలెంకు చెందిన పేరకం లేఖ్య రాజ్యలక్ష్మి అనే మహిళ ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె అవివాహితగా ఉన్నప్పుడు నార్తుపాలెంలో ఓటు నమోదైంది. ఆమె తండ్రి పేరు పేరకం బాలాంజనేయులు. చీరాలలో ఓటు నమోదు చేసుకోగా, అక్కడా ఇదే పేరుతో ఓటు హక్కు వచ్చింది. చంద్రశేఖరపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ల్యాబ్ అటెండర్‌గా పనిచేసే జెల్లి సుధాకర్ స్వగ్రామం కావలి. అక్కడున్న సమయంలో ఓటు నమోదు చేసుకొన్నారు. చంద్రశేఖరపురంలో క్వార్టర్ కేటాయించగా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి మకాం మార్చారు. సుధాకర్‌తో సహా నలుగురు కుటుంబ సభ్యుల పేరిట ఓట్లు కావలి ఉండడంతోపాటు చంద్రశేఖరపురంలోనూ నమోదయ్యాయి. వీటిపైనే ఇప్పటి దాకా అధికారులు దృష్టి సారించలేదు. చిత్తూరులోనూ అదే తీరు చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీకి చెందిన బి.శ్యామలకు ఒకే ఐడీ నంబర్‌తో(ఎఫ్డీజెడ్ 2837268) భాకరాపేట, తిరుపతి ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది. చిన్నగొట్టిగల్లు మండలం లెక్కలవారిపల్లెలో నివాసముంటున్న ఎర్రయ్యనాయుడుకు లెక్కలవారిపల్లె, తిమ్మసముద్రంలో ఒకే ఐడీ నంబర్‌తో (ఐఎఎక్స్ 1500744) ఓటు హక్కు ఉంది. రంగన్నగారిగడ్డ పంచాయతీకి చెందిన నారాయణకు ఒకే ఐడీ నంబర్‌తో (ఎఐఎక్స్ 0919423) తన గ్రామంతోపాటు మదనపల్లెలోనూ ఓటు హక్కు ఉంది. ఒకే బూత్‌లో రెండు ఓట్లు కర్నూలులోని 115వ పోలింగ్ బూత్‌లో దేశపోగు మాధవికి జెడ్‌జీఎఫ్2748168 ఐడీ నంబరుతో సీరియల్ నంబర్ 995లో ఓటరు జాబితాలో పేరు ఉంది. ఇదే మహిళకు ఇదే పోలింగ్ కేంద్రంలో జెడ్‌జీఎఫ్2739944 ఐడీతో, సీరియల్ నంబర్ 997లో ఓటు హక్కు కల్పించారు. ఇలాంటి ఈ పోలింగ్ కేంద్రంలో 10 వరకు ఉన్నాయి. కర్నూలు నగరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఒకే వ్యక్తి ఫొటోతో వేర్వేరు పేర్లు, వివరాలతో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు ఉన్నాయి. 115వ పోలింగ్ కేంద్రంలో ఆదిశేషన్న అనే వ్యక్తి జెడ్‌జీఎఫ్2249432 ఐడీ నంబర్‌తో, సీరియల్ నంబర్ 666లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇదే వ్యక్తి 116వ పోలింగ్ కేంద్రంలో జెడ్‌జీఎఫ్2249028 ఐడీ నంబర్‌తో, సీరియల్ నంబర్ 320లో ఓటరుగా ఉండటం గమనార్హం. ఇతర జిల్లాల్లో స్థిరపడినా... విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట 76వ పోలింగ్ బూత్‌లో 189 సీరియల్ నెంబర్లో ఓటర్ ఐడీ నంబర్ ఎక్స్‌ఎక్స్‌యూ0489691తో ఓటు ఉన్న ప్రశాంతి అనే మహిళకు వివాహం అనంతరం శ్రీకాకుళం టౌన్లో పోలింగ్ బూత్ 199లో 215 సీరియల్ నంబర్లో ఎక్స్‌ఎక్స్‌యూ0489691 అనే ఓటరు ఐడీతో పేరు నమోదైంది. పలువురు ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర జిల్లాల్లో స్థిరపడగా వారికి రెండుచోట్లా ఓట్లు కొనసాగుతున్నాయి. ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు వైఎస్సార్ జిల్లా కడప అసెంబ్లీ నియోజకవర్గ పరి«ధిలోని కడప నగరం చిన్నచౌక్ పోలింగ్ బూత్ నంబర్.183 (శ్రీవాణి విద్యాలయం)లో సిరిగిరి సుబ్బరాయుడు(42), తండ్రి సిరిగిరి శంకరయ్య పేరుతో నాలుగు ఓట్లు నమోదయ్యాయి. ఇతడి ఓటర్ ఐడీ నంబర్లు జెడ్‌యూపీ 2464444, జెడ్‌యూపీ 2464501, జెడ్‌యూపీ 2464535, జెడ్‌యూపీ 2464584. డోర్ నెంబరు ఇ–21–501. ఒకే డోర్ నెంబరుతో నాలుగు ఓట్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాల్టీ పరిధిలోని 132వ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నంబర్ 268లో నమోదైన ఓటరు పేరు చాటకొండు వాసవి హర్షిత. ఇంటి నంబర్ 13/106లో ఈమె నివాసం ఉంటున్నట్లు ఐడీ కార్డులో ఉంది. పక్కనే సీరియల్ నంబర్ 269లో కూడా ఈమెను ఓటరుగా చేర్చారు. అందులో వాసవి హర్షిత.సి అని ఉంది. ఓటర్ల జాబితాలో పక్కపక్కనే రెండు ఈమె ఫొటోలే ఉన్నాయి. ఐడీ కార్డు నంబర్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని 132వ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నంబర్ 118లో వల్లంకొండు ప్రవల్లిక ఓటరుగా నమోదైంది. సీరియల్ నంబర్ 119లో కూడా అధికారులు ఈమె పేరు, ఫొటోను ప్రచురించారు. రెండు చోట్ల ఇంటి నంబర్ 13/36–ఎ అని ఉంది. ఓటర్ ఐడీ కార్డు నంబర్ మినహా చిరునామా ఒకే విధంగా ఉంది. ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్నారు ‘‘పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో 3వ వార్డు నర్సిపురం గ్రామంలో ఒక వ్యక్తికి మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే వాటిని తొలగిస్తామన్నారు. చాలామందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఫోటోలు రెండు రకాలుగా ఉన్నప్పటికీ ఒకే వ్యక్తి పేరిట ఐడీ కార్డులు దర్శనమిస్తున్నాయి’’ – డబ్బీరు భవానీశంకర్, పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ, శ్రీకాకుళం జిల్లా -
గల్లంతైన ఓట్లు 2,05,174
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్లకోసారి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2014 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓటర్ల కన్నా 2018 సెప్టెంబర్ నాటికి ఓటర్ల సంఖ్య ఏకంగా 2.05 లక్షలకు తగ్గింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 19,59,661 మంది ఓటర్లు ఉండగా, 2018 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 17,54,486 మందికి తగ్గింది. నాలుగేళ్లలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే గతంలో కన్నా 12,679 మంది ఓటర్లు పెరిగారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,67,165గా తేలింది. ఓటుహక్కుపై అవగాహన పెంచేందుకు ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు నాలుగేళ్లలో ఎంతమేర సఫలీకృతమయ్యాయో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పరిస్థితిని చూస్తే తేటతెల్లం అవుతోంది. ఒక్క మంచిర్యాలలోనే 92,337 ఓట్లు గల్లంతు రాష్ట్రంలో బహుశా ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో 2014 ఎన్నికల నుంచి ఇప్పటికి ఏకంగా 92,337 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో 2,38,423 ఓటర్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1,46,086కు తగ్గింది. మంచిర్యాల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని జాబితాను పరిశీలిస్తే అర్థమవుతోంది. మంచిర్యాల తరువాత అత్యధికంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 49,224 మంది ఓటర్లు తగ్గగా. ఆ తరువాత నిర్మల్‌లో 23,582 ఓట్లు తగ్గాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టణ ఓటర్లను గణనీయంగా ఏరివేసినట్లు స్పష్టమవుతోంది. ముథోల్‌లో 15,074, సిర్పూర్లో 11,430 , ఖానాపూర్‌లో 7,720, బెల్లంపల్లిలో 5,807 ఓట్లు తగ్గడం గమనార్హం. ఆసిఫాబాద్‌లో 10,271 ఓట్లు నాలుగేళ్లలో ఎక్కువయ్యాయి. తరువాత చెన్నూర్‌లో 1897, బోథ్‌లో 511 మాత్రమే గత ఎన్నికల కన్నా పెరిగిన ఓటర్లు. తొలగింపుల వెనుక ప్రజాప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలను ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగుసార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇష్టానుసారంగా ఓటర్లను ఏరివేయడంతోనే ఓటర్ల సంఖ్య తగ్గిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో చనిపోయిన ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల సంఖ్యను తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వార్డు సభ్యులుగా పోటీ చేసినవారు, స్థానిక ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి ఓట్లు కూడా ఓటర్ల సవరణల్లో గల్లంతైనట్లు సమాచారం. ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహించినప్పుడు అభ్యంతరాలు వచ్చిన ఓట్లను తొలగించి, కొత్తగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఓటర్ల జాబితా సవరణను ప్రభావితం చేస్తుండడంతో అర్హులైన వారి పేర్లు కూడా చాలావరకు గల్లంతవుతున్నాయి. వీఆర్వో, గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే గ్రామ సర్పంచి గానీ, ఎంపీటీసీ గానీ ఈ ఓటర్ల జాబితాలపై పెత్తనం చలాయించడం సర్వసాధారణమైంది. గ్రామాల్లో తమకు వ్యతిరేక వర్గంగా భావించే వారి ఓట్లను మూకుమ్మడిగా తొలగించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇచ్చిన గడువులోగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయకపోవడంతో ప్రతీ సవరణ సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా గల్లంతైన ఓట్ల వివరాలు మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు సంబంధిత వ్యక్తులకు తెలియని పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యమే.... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు లభిస్తుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఓటర్ల సవరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన వారు గానీ, ఓటు హక్కు లేని ఎవరైనా ఫారం–6ని పూర్తి చేసి కొత్తగా ఓటర్లుగా నమోదు కావచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వీఆర్వో ద్వారా విచారణ జరిపి, ధ్రువీకరణ పత్రాలను సరిచూసి కొత్త ఓటర్లుగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ కూడా గ్రామీణ స్థాయిలో సక్రమంగా జరగకపోవడం వల్ల కూడా కొత్త ఓటర్ల సంఖ్య తగ్గిపోతుంది. అదే సమయంలో ఉన్న ఓటర్లు తొలగించబడుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అంతర్గత బదిలీలపై వెళ్లిన వారు కూడా ఫారం–6 ద్వారా మార్పులు చేసుకోవచ్చు. కానీ నాలుగేళ్లలో మూడు నియోజకవర్గాలలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తాజా ఓటర్ల జాబితా ద్వారా తెలుస్తోంది. 25 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు గానీ, నియోజకవర్గాల నుంచి ఈనెల 25వ తేదీ వరకు తిరిగి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పించారు. 2018 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందుకు అర్హులే. ఆన్లైన్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. -
30 వరకు ఇంటింటా ఓటర్ల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా ఓటర్ల గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. 2019 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జూన్ 30 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సవరణ పక్కాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. -
గ్రేటర్లో ఓట్ల గల్లంతుపై సీఈసీ విచారణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల నమోదు, ఓటర్ల ఏరివేత ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భారీగా ఓట్లు గల్లంతైనట్లుగా వరుసగా ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఢిల్లీ నుంచి ముగ్గురు అధికారుల బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పాటు ఈ బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలసి వాస్తవాలు తెలుసుకోనుంది. ఈ నెల 31న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇటీవల ఓటర్ల సవరణలో భాగంగా గ్రేటర్ పరిధిలో దాదాపు 25.30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 6.30 లక్షల ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. చనిపోయినవారు, డబుల్ పేర్లున్నవారు, చిరునామాలో లేకుండాపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇటీవలే ప్రకటించారు. మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. కానీ.. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించారని, ఓటర్లు అదే చిరునామాలో ఉన్నప్పటికీ డోర్ లాక్, వలస వెళ్లారని రాసుకోవడం గందరగోళానికి తెర లేపింది. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే 1.08 లక్షల మంది ఓటర్లను జాబితాలో నుంచి తొలగించారు. శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్ పరిధిలో మరో 1.10 లక్షల ఓట్లను తీసేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు కొందరు అధికారులు ఏజెంట్‌గా మారారని, ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతా ల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించారని ఆయా పార్టీల నుంచి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ విచారణకు ఆదేశించింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 83.77 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో దాదాపు 20 లక్షల మందికిపైగా నోటీసులు జారీ చేయడంపై నగర ప్రజలు సైతం అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.