ఒకటే ముఖం.. ఓట్లు బహుముఖం | manipulations in voters registration process | Sakshi
Sakshi News home page

ఒకటే ముఖం.. ఓట్లు బహుముఖం

Published Fri, Nov 16 2018 3:56 AM | Last Updated on Fri, Nov 16 2018 3:56 AM

manipulations in voters registration process - Sakshi

జాబితాలో రెండు నంబర్లతో ఓటు హక్కు కలిగిన సతీష్‌ అనే వ్యక్తి

సాక్షి, అమరావతి:  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల నమోదు అనేది నిజాయతీగా, నూరు శాతం సక్రమంగా జరగాల్సిన క్రతువు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై స్వార్థం కోసం దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఓట్ల నమోదులో లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో కొత్త పేర్లను ఇష్టారాజ్యంగా చేరుస్తున్నారు. ఒక్కొక్కరికి రెండుకు మించి ఓట్లు ఉంటున్నాయి.

సరైన సమాచారం లేకున్నా ఆయా వ్యక్తుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల నమోదులో అవకతవకలపై ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌(వాస్ట్‌) అనే సంస్థ అధ్యయనం చేసింది. తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించి ఓట్లు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా దర్శనమిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒకటి రద్దు చేయాలి. కానీ, ఏకంగా నాలుగైదు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు ఐడీ కార్డులతో ఓటు హక్కు ఉన్నవారు ఎంతోమంది కనిపిస్తున్నారు.

వేలాదిగా డబుల్‌ ఎంట్రీలు  
శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19,95,185 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులపై విచారణ సాగుతోంది. ఓటు హక్కు కోసం దాదాపు 47,411 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చాయి. మరో 30,000 దరఖాస్తులు నేరుగా బీఎల్‌వోల ద్వారా అందాయి. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో 9,802 ఓట్లు డబుల్‌ ఎంట్రీలుగా ఉన్నట్టు తేలింది. అంటే ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఒకే పేరు, తండ్రి పేరు, వయస్సులు ఉన్నవి ఉన్నాయి. ఒక్క శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే దాదాపు 1,200 ఓట్లు డబుల్‌ ఎంట్రీలు ఉన్నాయి.

ఇతర జిల్లాల్లోనూ ఓటు హక్కు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్‌ డబుల్‌ ఎంట్రీలు 40 వేలకు పైగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక నియోజకవర్గంలోని ఓటర్లు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఓటరుగా నమోదై ఉండడం గమనార్హం. పేరు, పోలింగ్‌ బూత్‌ మార్పుతో ఒక్కరికే వేర్వేరుగా ఓట్లున్నాయి.  

ఓటర్‌ ఒక్కరే.... రెండుచోట్ల పేర్లు
తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని పలువురు ఓటర్ల పేరిట పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల ఓట్లు నమోదయ్యాయి. కాకినాడలోని ఓటరు జాబితాలోని సమాచారం ప్రకారం పరిశీలన చేస్తే సదరు అడ్రస్‌ దొరకలేదు. కాకినాడ నరసన్ననగర్‌ మెయిన్‌ రోడ్‌ శుభా ఎన్‌క్లేవ్‌లో డోర్‌ నెంబర్‌ 65–1–8/సి3లో ఉయ్యూరి శత్రుఘ్నుడు (బూత్‌నెంబర్‌–1, ఎల్‌5 సి.నెం.134), ఉయ్యూరి రామలక్ష్మి పేరుతో ఓట్లు నమోదయ్యాయి. ఇవే పేర్లతో నిడదవోలులో కూడా ఓట్లున్నాయి.

దీంతో శుభా ఎన్‌క్లేవ్‌కు వెళ్లి విచారించగా సదరు డోర్‌ నెంబర్‌లో ఓ బ్యాంక్‌ మేనేజర్‌ అద్దెకు ఉంటున్నట్టుగా తేలింది. శత్రుఘ్నుడు అనే పేరుగలవారు అక్కడ అద్దెకు ఉండడం కానీ, ప్లాట్‌ యజమానిగా కానీ ఎవరూ లేరని స్థానికులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని పినపళ్లకు చెందిన పి.రామకృష్ణకు కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉంది. పెద్దాపురం పట్టణానికి చెందిన మహిళకు డివిజన్‌లో రెండు ఓట్లు నమోదయ్యాయి. ఒకే పేరుతో పట్టణంలోని పోలింగ్‌ బూత్‌ నాలుగులో, ప్రత్తిపాడు 34వ బూత్‌లోనూ జాహ్నవి అడ్డగర్ల పేరుతో ఓటు నమోదైంది.

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఓటర్ల జాబితాలో శ్రీరామారెడ్డి చింతా అనే పేరు, 2–210 ఇంటి నెంబరుతో 29 సంవత్సరాల వయసుతో ఆర్‌ఈఎన్‌ 1285436 నెంబరు ఐడీ కార్డుతో ఓటు ఉండగా, అదే పేరుతో రావులపాలెం మండలం ఊబలంక జాబితాలో కూడా ఓటు ఉంది. ఇంటి నెంబరు 1–301, వయసు 30, ఆర్‌ఈఎన్‌ 0163956 ఐడీ నెంబరుతో ఈ ఓటు ఉంది. ఈ వ్యక్తి ఊబలంక గ్రామానికి చెందిన టీడీపీ నేత కుమారుడు.

  తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామ ఓటరు జాబితాలో వెంకటేష్‌ పుల్లేటికుర్తి అనే పేరు, 1–358 ఇంటి నెంబరు, 28 సంవత్సరాల వయసు, ఆర్‌ఈఎన్‌ 0926255 ఐడీ నెంబరుతో ఓటు ఉంది. ఇతడు ఉద్యోగ రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటుండగా అక్కడ కూడా ఓటు ఉంది. ఇంటి నెంబరులో మార్పు తప్ప మిగితా వివరాలు ఊబలంక జాబితా మాదిరిగానే ఉన్నాయి.

ఒక్కరికే ఐదు ఓటర్‌ ఐడీ కార్డులు
రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులు ఒకే పేరుతో పలు చోట్ల ఓట్లు నమోదు చేయించారు. పట్టణ పరిధిలో మంత్రి పుల్లారావు నివాసం ఉండే పండరీపురం వీధిలోనే (పీఎస్‌ నంబర్‌–151) పలు డబుల్‌ ఎంట్రీలు ఉన్నాయి. ఓటరు కార్డు నెంబరు ఎస్‌జీఈ029814. సీరియల్‌ నెంబరు 795... ఈమె పేరు ఐదు చోట్ల ఉంది. ఒకే పేరున ఐదు చోట్ల ఓట్లు నమోదై ఉండడం గమనార్హం.

ఓటర్‌ ఐడీ కార్డు నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయి. వయసులో స్వల్ప వ్యత్యాసాలతో ఓటర్‌ ఐడీ కార్డులు తీసుకున్నారు. చిలకలూరిపేటలో వెంకట శ్రీసుమ గంజి పేరిట మూడు ఓట్లు, మహాలక్ష్మి అఖిల జాలాది పేరిట రెండు ఓట్లు, అంజనాదేవి కందిమళ్ల పేరిట రెండు ఓట్లు, వాసంతి జంజనం పేరున ఐదు ఓట్లు నమోదై ఉన్నాయి. వేమూరు మండలంలోని జంపని గ్రామానికి చెందిన మత్తి సరస్వతికి జంపనిలో, తెనాలి నాజర్‌పేటలో ఓట్లు ఉన్నాయి.

వివాహం చేసుకుని వెళ్లిపోయినా..
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు నార్తుపాలెంకు చెందిన పేరకం లేఖ్య రాజ్యలక్ష్మి అనే మహిళ ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె అవివాహితగా ఉన్నప్పుడు నార్తుపాలెంలో ఓటు నమోదైంది. ఆమె తండ్రి పేరు పేరకం బాలాంజనేయులు. చీరాలలో ఓటు నమోదు చేసుకోగా, అక్కడా ఇదే పేరుతో ఓటు హక్కు వచ్చింది.

చంద్రశేఖరపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ల్యాబ్‌ అటెండర్‌గా పనిచేసే జెల్లి సుధాకర్‌ స్వగ్రామం కావలి. అక్కడున్న సమయంలో ఓటు నమోదు చేసుకొన్నారు. చంద్రశేఖరపురంలో క్వార్టర్‌ కేటాయించగా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి మకాం మార్చారు. సుధాకర్‌తో సహా నలుగురు కుటుంబ సభ్యుల పేరిట ఓట్లు కావలి ఉండడంతోపాటు చంద్రశేఖరపురంలోనూ నమోదయ్యాయి. వీటిపైనే ఇప్పటి దాకా అధికారులు దృష్టి సారించలేదు.

చిత్తూరులోనూ అదే తీరు
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీకి చెందిన బి.శ్యామలకు ఒకే ఐడీ నంబర్‌తో(ఎఫ్‌డీజెడ్‌ 2837268) భాకరాపేట, తిరుపతి ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది. చిన్నగొట్టిగల్లు మండలం లెక్కలవారిపల్లెలో నివాసముంటున్న ఎర్రయ్యనాయుడుకు లెక్కలవారిపల్లె, తిమ్మసముద్రంలో ఒకే ఐడీ నంబర్‌తో (ఐఎఎక్స్‌ 1500744) ఓటు హక్కు ఉంది. రంగన్నగారిగడ్డ పంచాయతీకి చెందిన నారాయణకు ఒకే ఐడీ నంబర్‌తో (ఎఐఎక్స్‌ 0919423) తన గ్రామంతోపాటు మదనపల్లెలోనూ ఓటు హక్కు ఉంది.

ఒకే బూత్‌లో రెండు ఓట్లు
కర్నూలులోని 115వ పోలింగ్‌ బూత్‌లో దేశపోగు మాధవికి జెడ్‌జీఎఫ్‌2748168 ఐడీ నంబరుతో సీరియల్‌ నంబర్‌ 995లో ఓటరు జాబితాలో పేరు ఉంది. ఇదే మహిళకు ఇదే పోలింగ్‌ కేంద్రంలో జెడ్‌జీఎఫ్‌2739944 ఐడీతో, సీరియల్‌ నంబర్‌ 997లో ఓటు హక్కు కల్పించారు.

ఇలాంటి ఈ పోలింగ్‌ కేంద్రంలో 10 వరకు ఉన్నాయి. కర్నూలు నగరంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఒకే వ్యక్తి ఫొటోతో వేర్వేరు పేర్లు, వివరాలతో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు ఉన్నాయి. 115వ పోలింగ్‌ కేంద్రంలో ఆదిశేషన్న అనే వ్యక్తి జెడ్‌జీఎఫ్‌2249432 ఐడీ నంబర్‌తో, సీరియల్‌ నంబర్‌ 666లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇదే వ్యక్తి 116వ పోలింగ్‌ కేంద్రంలో జెడ్‌జీఎఫ్‌2249028 ఐడీ నంబర్‌తో, సీరియల్‌ నంబర్‌ 320లో ఓటరుగా ఉండటం గమనార్హం.

ఇతర జిల్లాల్లో స్థిరపడినా...
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట 76వ పోలింగ్‌ బూత్‌లో 189 సీరియల్‌ నెంబర్‌లో ఓటర్‌ ఐడీ నంబర్‌ ఎక్స్‌ఎక్స్‌యూ0489691తో ఓటు ఉన్న ప్రశాంతి అనే మహిళకు వివాహం అనంతరం శ్రీకాకుళం టౌన్‌లో పోలింగ్‌ బూత్‌ 199లో 215 సీరియల్‌ నంబర్‌లో ఎక్స్‌ఎక్స్‌యూ0489691 అనే ఓటరు ఐడీతో పేరు నమోదైంది. పలువురు ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర జిల్లాల్లో స్థిరపడగా వారికి రెండుచోట్లా ఓట్లు కొనసాగుతున్నాయి.

ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు
వైఎస్సార్‌ జిల్లా కడప అసెంబ్లీ నియోజకవర్గ పరి«ధిలోని కడప నగరం చిన్నచౌక్‌ పోలింగ్‌ బూత్‌ నంబర్‌.183 (శ్రీవాణి విద్యాలయం)లో సిరిగిరి సుబ్బరాయుడు(42), తండ్రి సిరిగిరి శంకరయ్య పేరుతో నాలుగు ఓట్లు నమోదయ్యాయి. ఇతడి ఓటర్‌ ఐడీ నంబర్లు జెడ్‌యూపీ 2464444, జెడ్‌యూపీ 2464501, జెడ్‌యూపీ 2464535, జెడ్‌యూపీ 2464584. డోర్‌ నెంబరు ఇ–21–501. ఒకే డోర్‌ నెంబరుతో నాలుగు ఓట్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాల్టీ పరిధిలోని 132వ పోలింగ్‌ స్టేషన్‌లో సీరియల్‌ నంబర్‌ 268లో నమోదైన ఓటరు పేరు చాటకొండు వాసవి హర్షిత.

ఇంటి నంబర్‌ 13/106లో ఈమె నివాసం ఉంటున్నట్లు ఐడీ కార్డులో ఉంది. పక్కనే సీరియల్‌ నంబర్‌ 269లో కూడా ఈమెను ఓటరుగా చేర్చారు. అందులో వాసవి హర్షిత.సి అని ఉంది. ఓటర్ల జాబితాలో పక్కపక్కనే రెండు ఈమె ఫొటోలే ఉన్నాయి. ఐడీ కార్డు నంబర్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని 132వ పోలింగ్‌ స్టేషన్‌లో సీరియల్‌ నంబర్‌ 118లో వల్లంకొండు ప్రవల్లిక ఓటరుగా నమోదైంది. సీరియల్‌ నంబర్‌ 119లో కూడా అధికారులు ఈమె పేరు, ఫొటోను ప్రచురించారు. రెండు చోట్ల ఇంటి నంబర్‌ 13/36–ఎ అని ఉంది. ఓటర్‌ ఐడీ కార్డు నంబర్‌ మినహా చిరునామా ఒకే విధంగా ఉంది.  

ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్నారు
‘‘పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో 3వ వార్డు నర్సిపురం గ్రామంలో ఒక వ్యక్తికి మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే వాటిని తొలగిస్తామన్నారు. చాలామందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఫోటోలు రెండు రకాలుగా ఉన్నప్పటికీ ఒకే వ్యక్తి పేరిట ఐడీ కార్డులు దర్శనమిస్తున్నాయి’’      – డబ్బీరు భవానీశంకర్, పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ, శ్రీకాకుళం జిల్లా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement