సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రానున్న ఎన్నికలకు సంబంధించి ఓ పక్క అధికారులు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.. మరోపక్క గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా జిల్లా అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ ప్రాంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారాలు, ఖర్చుల నమోదుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించకుండా చూసేందుకు నిశిత పరిశీలన చేస్తుండడం గమనార్హం.
ఖర్చులు దాటుతున్నాయ్...
గ్రామాలు, మండల కేంద్రాల్లో పోలిస్తే సహజంగానే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో పోటీకి దిగిన అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాయశక్తులా ప్రదర్శిస్తున్నారు. వాహనాల ద్వారా హోరాహోరీ ప్రచారం, రోడ్డుషోలు, పెద్దసైజులో ఎల్‌ఈడీ స్క్రీన్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు లేఖలు పంపిస్తూ ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. దీంతో మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఇక్కడ పోటీకి దిగిన వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఏమేం చేస్తున్నారు?
మహబూబ్‌నగర్ అభ్యర్థుల వ్యవహారంపై జిల్లా అధికారులే కాకుండా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేకంగా నియమితులైన అధికారులు సైతం ప్రత్కేక దృష్టి సారించారు. ఒక్కో అభ్యర్థి ప్రచారాన్ని పరిశీలిచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు సమాచారం. ఇటీవల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన సమావేశంలోనూ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రోస్ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల పనితీరులో మార్పు రావాలని, ఖర్చుల నమోదును పెద్దగా పట్టించుకోవడం లేనట్లు తెలుస్తోందని మందలించారు. అలాగే, అర్బన్ ప్రాంతంలో ఐదుగురు కాకుండా ర్యాలీలుగా వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇకనైనా 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఫ్లయింగ్ స్కాడ్ బృందం మహబూబ్‌నగర్‌లో ప్రచార శైలిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ మేరకు పరిశీలకులు, ఫ్లయింగ్ స్కాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలు నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారశైలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై దృష్టి కేంద్రీకరించారు. కాగా, నియోజకవర్గంలో హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్ మండలం, మహబూబ్‌నగర్ అర్బన్ మండలాలు ఉన్నాయి.
సమస్యాత్మకం 93...
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాలు 131 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 27 పోలింగ్ కేందాలు, హన్వాడ మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్క మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోనే 193 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మొత్తం నియోజకవర్గంలో93 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలపై పోలింగ్ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కాగా, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పట్టణ ఓటర్లే లక్ష్యం
మహబూబ్‌నగర్ రూరల్ మండలం, హన్వాడ మండలాల్లో ఓటర్ల కంటే మహబూబ్‌నగర్ పట్టణ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రూరల్ మండలంలో 23,038 మంది, హన్వాడ మండలంలో 36,331 మంది ఓటర్లు ఉండగా.. అర్బన్ మండలంలో ఈ సంఖ్య 1,53,482గా నమోదైంది.
దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు పట్టణ ఓటర్లపైనే దృష్టి సారించారు. ఏ వీధి చూసినా మైకుల మోతలు, ఇంటింటి ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఎలాగైనా పట్టణ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎవరికి వారు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో అటు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. ఇటు అధికారుల బృందాలు సైతం నిఘా తీవ్రం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment