‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువు వారి ఆహ్వానంలోని ఆంతర్యం, విశ్వాసులకు ఈ లోకసంబంధమైన ఐశ్వర్యాలు, అత్యున్నత హోదాలు, అధికారాలివ్వడమే అని నమ్మడం, ఆయన ఆవిష్కరించి, ప్రకటించిన పరలోకరాజ్య సంబంధమైన బోధనలు, విలువల తాలూకు లోతైన అవగాహన లేకపోవడమే !!. అదే నిజమైతే యేసుప్రభువు ఒక రిక్తుడిగా, దాసుడుగా, కటిక పేదవాడిగా ‘తలవాల్చుకోవడానికైనా స్థలంలేని’ ఒక నిరుపేదగా ఈలోకానికి విచ్చేసి జీవించవలసిన అవసరమే లేదు. సౌమ్యంగా, సాత్వికంగా, దీనంగా, తలవంచి బతకడంలోని శక్తిని, ఔన్నత్యాన్ని యేసుప్రభువు రుజువు చేసినంతగా మరెవరూ మానవ చరిత్రలో రుజువు చేయలేదు.
యేసుక్రీస్తే కాదు, ఆనాటి ఆయన ప్రియ శిష్యులు, అనుచరులంతా అలాగే నిరుపేదలుగా, అనామకులుగా, అధికారానికి దూరంగా జీవించారు, తమ ఆ అసమాన జీవన శైలితోనే సమాజాన్ని ప్రభావితం చేసి క్రైస్తవానికి పునాది రాళ్లు వేశారు. రోమా ప్రభుత్వ నిరంకుశత్వం అవధులు దాటి ప్రజల్ని అన్ని విధాలుగా పీడిస్తున్న చీకటి యుగంలో యేసు ఈ లోకంలో కాలు పెట్టి, చేసిన తన అసాధారణమైన బోధల్లో, ఒక్కటంటే ఒక్క విమర్శ, వ్యాఖ్య కూడా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేయకపోవడమే ఈ లోకాధికారాలకు, ప్రలోభాలకు, పోకడలకు అతీతమైనది క్రైస్తవమని స్పష్టంగా రుజువు చేస్తోంది.
యేసుప్రభువులాగే ఆదిమకాలపు ఆయన శిష్యులు కూడా ధైర్యంగా అన్ని చోట్లా పరలోకరాజ్య సువార్త ప్రకటించారు, ప్రతిఘటన, వ్యతిరేకత ఎదురైతే మౌనంగా వహించారు లేదా మరో చోటికి తరలి వెళ్లారు తప్ప వారు ఎదురు దాడులు చెయ్యలేదు, ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు సృష్టించ లేదు, మానవ హక్కుల ప్రదర్శనలు చెయ్యలేదు. ఈ అహింసా, ప్రతిఘటనా రహిత విధానంలోనే ఆనాటి అపొస్తలులు ఆసియాలో, ఐరోపా అంతటా క్రైస్తవాన్ని నెలకొల్పారు, పైగా వారు వేసిన క్రైస్తవం పునాదులు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కూడా ఐరోపాలో అత్యంత పటిష్టంగా ఉన్నాయి.
అంతియొకయ, ఈకొనియా, లుస్త్ర పట్టణాల్లో అపొస్తలుడైన పౌలు, ఆయన అనుచరుడైన బర్నబా అత్యంత ప్రభావ భరితంగా సువార్త పరిచర్య చేశారు. యేసుప్రభువు పునరుత్థానమైన 18 ఏళ్ళ తర్వాత, చర్చిలు బాగా వర్ధిల్లుతున్న కాలంలో, పౌలు తన మొదటి మిషనేరీ ప్రయాణం పూర్తి చేస్తున్నపుడు, ఈ ప్రాంతాల్లో వాళ్ళు విపరీతమైన శ్రమలు పొందారు. వారిమీద యూదులు రాళ్లు రువ్వితే ఆ ధాటికి ఒకదశలో పౌలు చనిపోయాడేమోనని కూడా భావించారు. అక్కడ పట్టణాల్లో బహిష్కరణకు కూడా వారు గురయ్యారు.
అయినా మౌనంగా మరో చోటికి వెళ్లిపోయారు తప్ప వారు ఎదురు తిరగలేదు (అపో.కా.14:1–28). పైగా కొన్నాళ్ళకు అక్కడి చర్చిలను బలపరచి, ప్రోత్సహించడానికి మళ్ళీ వచ్చినపుడు, అనేక శ్రమలను అనుభవించడం ద్వారానే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామంటూ, విశ్వాసంలో అలా స్థిరంగా ఉండాలంటూ విశ్వాసులకు బోధించారు(14:21.22). విశ్వాసంలో స్థిరంగా ఉండడమంటే శ్రమలనెదుర్కోవడమేనని వారి బోధల తాత్పర్యం. ప్రభువు అప్పగించిన పరిచర్యలో శ్రమలు అంతర్భాగం అన్నది బైబిల్ చెప్పే నిత్య సత్యం. శ్రమలొచ్చినపుడు, మనవల్ల ఏదో తప్పు జరిగిందనుకొంటూ సిగ్గుతో తలవంచడం కాదు, గర్వంగా తల ఎత్తుకోవాలి. ఎందుకంటె నిజమైన పరిచారకులెన్నుకున్న దారే శ్రమలతో కూడిన యేసుప్రభువు దారి.
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment