బేతనియ సోదరీమణులు, లాజరు అక్కలు మరియ, మార్త మంచి విశ్వాసులు. కాకపోతే ఇద్దరూ చెరో తెగకు చెందినవారు. వారింట్లో యేసు ఎన్నోసార్లు ఆతిథ్యం పొందాడు. యేసు వచ్చింది మొదలు వెళ్లేదాకా తనకు తోచిన సపర్యలు, మర్యాదలు చేస్తూ చెమటలు కక్కుతూ ఆయన మెప్పుకోసం మార్త తాపత్రయపడేది. మరియ ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆలకిస్తూ తన్మయురాలై జీవనసాఫల్యానికి దారి వెదుక్కునేది.
ప్రభువు కోసం పని చేసే హడావిడిలో ఆయన మెప్పు పొందడమే మార్త లక్ష్యం కాగా, యేసు మాటలు ఆలకిస్తూ ఆయన మనసు తెలుసుకొని ఆ మేరకు జీవించాలన్నది మరియ ఉద్దేశ్యం. వారిద్దరిలో ఎవరు గొప్ప? అన్న ప్రస్తావన ఒకసారి వస్తే, ‘మార్త నాకోసం బోలెడు పనులు చేయాలనుకొని తొందర పడుతోంది కాని మరియ మాత్రం అవసరమైనది, అత్యుత్తమమైనది, ఆమె నుండి ఎన్నడూ తీసివేయబడనిది ఎన్నుకున్నదని యేసు అన్నాడు (లూకా 10:38–42).
మరియ, మార్తలిద్దరూ విశ్వాసులే కాని మరియ ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసి అని యేసే స్వయంగా శ్లాఘించాడు. దేవుని కోసం తమకు తోచిందల్లా చేసే ‘క్రైస్తవం’లో హడావిడి కనిపిస్తుంది కాని దానివల్ల దేవుని రాజ్య నిర్మాణం జరగదు. ఆకులు, కొమ్మలూ విస్తారంగా ఉన్నా ఫలాలనివ్వని వృక్షాల్లాంటివి ఈ పరిచర్యలు. పరస్పర ప్రేమ, క్షమాపణ, త్యాగం, పవిత్రత, దైవికత పునాదిరాళ్లుగా కలిగిన లోకాన్ని ప్రభావితం చేసి పరివర్తన తెచ్చే దేవుని రాజ్యనిర్మాణం, దేవుని సంకల్పాలు, ఉద్దేశ్యాల మేరకు జరగాలి.
అందుకు ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన మాటల్ని శ్రద్ధగా ఆలకించ గలిగిన పరిచారకులు కావాలి. అలా దేవుని సంకల్పాలు తెలుసుకొని వాటికి విధేయులైన వారితోనే దేవుని రాజ్యనిర్మాణం సాధ్యమవుతుంది. కాని ఈనాడు మరియ, మార్తలే అత్యధికంగా కనిపిస్తున్నారు, వారే హడావుడి చేస్తున్నారు. దేవుని పేరుతోనే ఎజెండాలతో, ధనార్జనే, పేరు సంపాదించుకోవడమే ప్రధానోద్దేశ్యంగా కలిగిన పరిచారకుల హడావిడి అంతటా కనిపిస్తోంది. సాత్వికత్వం మచ్చుకైనా కనపడని ‘సొంత సామ్రాజ్యాల్లాంటి పరిచర్యలు, చర్చిలు వెలుస్తున్నాయి.
ఈ లోకాన్ని పరలోకంగా మార్చగల ‘దేవుని రాజ్యనిర్మాణం’ ఒక నినాదంగా మిగిలిపోయింది. భజనలు, ప్రార్థనలు, పాటలు, డప్పులు, ప్రసంగాల హోరులోఅసలు దేవుడున్నాడా లేదా అన్నది గమనించకపోవడం విచారం. తాను వెలుగుతూ, లోకాన్ని ప్రేమ, త్యాగం, క్షమతో నింపుతూ నింగికెగిరే రాకెట్ లాంటిదే క్రైస్తవం. అదే దేవుడు కోరుకునే అత్యుత్తమ విశ్వాసం.
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment