Prabhu Kiran
-
సీనియర్ పాత్రికేయుడు ప్రభుకిరణ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సువార్తికులు రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ (63) ఆదివారం కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో కన్నుమూశారు. పదిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రభుకిరణ్, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెంబర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత జనగామ జిల్లా పెంబర్తికి చెందిన ప్రభుకిరణ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం క్రైస్తవ మత ప్రవచకులుగా ఉంటూనే ‘సాక్షి’ఫ్యామిలీ సన్నిధి పేజీలో పన్నెండు సంవత్సరాలకు పైగా ఆయన రాసిన సువార్త వ్యాసాలు ఎంతో పాఠకాదరణ పొందాయి. ఆయన మృతి పట్ల సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళి సంతాపం ప్రకటించారు. ప్రభుకిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చదవండి: నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త! -
అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య
సిరియా మహా సైన్యాధిపతి, ధీరుడు, యోధుడు, ధనికుడైన నయమానుకు కుష్టురోగం సోకింది. ఆ రోజుల్లో కుష్టువ్యాధి సోకితే ఎంతటివారైనా సమాజ బహిష్కరణకు గురై జీవచ్ఛవాలవాల్సిందే!! అయితే నయమాను ఇంట్లోనే విశ్వాసి అయిన ఒక యూదుబాలిక బానిసగా ఉంది. ఆమె నయమానుకు ఎడారిలో సెలయేటి వంటి చల్లటి కబురు చెప్పింది. తన ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా ప్రవక్త ఎంతటి కుష్టువ్యాధినైనా దేవుని పేరిట బాగుచేస్తాడని ఆమె చెబితే, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్టు అక్కడి యొర్దాను నదిలో ఏడుసార్లు మునిగి ఆమె చెప్పినట్టే నయమాను క్షణాల్లో బాగయ్యాడు. నయమాను అత్యానందపడి బోలెడు కానుకలివ్వబోతే ‘నేను నీ వద్ద ఏమీ తీసుకోను’ అని ఎలీషా అతనికి కరాఖండిగా చెప్పి వెనక్కి పంపేశాడు. సిరియా దేశంలో ఎన్నో గొప్ప నదులుంటే, నేను యొర్దాను లాంటి చిన్న నదిలో మునగాలా? అంటూ ఆరంభంలో నయమాను మొండికేస్తే, ఆ బాలికే అతనికి నచ్చజెప్పి యొర్దానులో మునిగేలా చేసింది. కుష్ఠునే కాదు, అంతకన్నా భయంకరమైన అహంకారమనే అతని మరో రోగాన్ని కూడా అలా ఎలీషా అతని కానుకలు నిరాకరించి బాగుచేశాడు. దేవుడు ప్రలోభాలకు లొంగడని, ఆయన తన కృపను, ఈవులను మానవాళికి ఉచితంగా ప్రసాదించే ‘మహాదాత’ అని, తాను కేవలం దేవుని కృపతోనే బాగయ్యానని గ్రహించి, నయమాను వినమ్రుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు (2రాజులు 5: 1–27). ఎన్నేళ్లు బతికి, ఎంత సేవ చేశామని కాదు, చేసిన కొంచెమైనా ఎంత అద్భుతంగా చేశామన్నదే ప్రాముఖ్యం. అందుకే దేవుని సంకల్పాలు నెరవేర్చే వెయ్యేళ్ళ జీవితం కూడా చాలా చిన్నదిగా కనిపించాలన్నాడు ఒక మహాభక్తుడు. అద్భుతమైన ఈ నయమాను ఉదంతంలో ముఖ్యపాత్ర అనామకురాలైన యూదుబానిస యువతిదే!! నేనొక బానిసను, ఇది నా పని కాదు, పైగా నాకేం లాభం? అని ఆమె అనుకుంటే అసలీ అద్భుతమే లేదు. ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు, అతని దాహం తీర్చే నీళ్లెక్కడున్నాయో ఆమెకు తెలుసు. పైగా అది దేవుని శక్తిని రుజువుచేసే అపూర్వమైన అవకాశం. వెంటనే ఆమె తనవంతు పరిచర్య చేసి పక్కకు తప్పుకుంది, అజ్ఞాతంగానే ఉండిపోయింది. వేల మైళ్ళ పొడవుండే హైవే తో పోల్చితే ఒక చిన్న మైలురాయి ఎంత? కానీ దాని ప్రత్యేకత దానిదే!! ఇందులో నాకెంత లాభం? అని ఆలోచించకుండా మైలు రాయి తనపని తాను చేసుకొంటుంది. దాహంతో అలమటించే బాటసారికి, ప్రతిఫలాపేక్షలేకుండా నీళ్లిచ్చే పనే నిజమైన సువార్త పని. యేసుప్రభువు తన శిష్యులకు, పరిచారకులకు తన పేరిట అద్భుతాలు చేయమని ఆదేశించాడు. కానీ మీరు అదంతా ‘ఉచితంగా మాత్రమే చెయ్యండి’ అని కూడా అదే వచనంలో ఆదేశించాడు (మత్తయి 10:8). మరి మేమెలా బతకాలి? అంటారా, బతకడానికే అయితే కూలిపని చెయ్యొచ్చు, కలెక్టర్ పనైనా చెయ్యొచ్చు. ‘నేను మీకు అదనంగా సంచిని, జాలెను, చెప్పుల్ని ఇవ్వకుండా పరిచర్య కు పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా?’ అని యేసు ఒకసారి తన శిష్యుల్ని అడిగితే, లేదని వాళ్ళు జవాబిచ్చారు(లూకా 22:35). అంటే, ఏమీ తక్కువకాని జీవితాన్ని దేవుడిస్తాడు. కాని అన్నీ ఎక్కువగా ఉండే జీవితం కావాలనుకునే పరిచారకులే గేహాజీ లాగా (ఈ ఉదంతంలో మరో పాత్ర) ప్రలోభాలకు గురై భ్రష్టులవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ఔదార్యంతో నడిచే పరలోకరాజ్యం!!
విశ్వాసిలో స్వనీతి వల్ల అసంతృప్తి తలెత్తడం, పక్కవాడు లాభపడితే అసూయ చెలరేగటం చాలా అనర్థదాయకం. దేవుని ‘సమ న్యాయవ్యవస్థ’పై అవగాహన లోపించినపుడు ఇలా జరుగుతుంది. అందుకే దేవుని అనంతమైన ప్రేమను, అపారమైన సమన్యాయభావనను ఆవిష్కరించే ఒక చక్కని ఉపమానాన్ని యేసుప్రభువు వివరించాడు (మత్తయి 20:1–16). ఒక భూ యజమాని తన ద్రాక్షతోటలో పనికి తెల్లవారుజామునే కొందరు కూలీలను ఒక దేనారానికి (దాదాపు 220 రూపాయలు) కుదుర్చుకున్నాడు. ఆలస్యంగా 9, 12, 3 గంటలకు ముఖ్యంగా సాయంకాలం 5 గంటలకొచ్చిన కూలీల్ని కూడా ‘మీకేది న్యాయమో అదిస్తాను’ అని చెప్పి ఆయన తన తోటలో పనికి పంపాడు. పని చివర కూలీలందరికీ యజమాని సమానంగా ఒక దేనారాన్నిచ్చాడు. అయితే ఎక్కువ సేపు, ఎక్కువ పని చేసినందుకు తమకు ఎక్కువ దొరుకుతుందని ఆశించి, భంగపడిన మొదటి కూలీలు తనపై సణుగుతుంటే, ‘మీకిస్తానన్న కూలి మీకిచ్చానుకదా? అందరికీ సమానంగా ‘పూర్తికూలీ’ నేనివ్వాలనుకొంటే మీకెందుకు బాధ? ఇది నా డబ్బు, నా ఔదార్యం!!’ అన్నాడా యజమాని. అవును మరి, దేవుని ఔదార్యం ముందు ప్రపంచంలోని మానవ నిర్మిత న్యాయవ్యవస్థలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. న్యాయవ్యవస్థలకు నేరస్థుని శిక్షించడమే తెలుసు. చాలా సమాజాలకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే తెలుసు. కాని కరడుగట్టిన నేరస్థుని కూడా ప్రేమించి, క్షమించి, సంస్కరించి, తన ప్రేమతో నింపి, అతన్ని సమాజానికి ఆశీర్వాదంగా మార్చే దేవునిది ఉహలకందని ఔదార్యం అన్నది బైబిల్ బోధించే అపూర్వ సత్యం, అద్భుతమైన పాఠం. దేవుని ‘ఔదార్యమే’ పరలోకరాజ్యాన్ని నడిపే రాజ్యాంగం!! మనం దేవుని పని ఎంత కష్టపడి పనిచేస్తున్నామన్నది కాక, ఎంత ‘ఇష్టపడి’ ఆనందంగా పనిచేస్తున్నామన్నది పరలోకపు యజమాని, న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తాడు, తన ఔదార్యంతో దానికి ప్రతిఫలాన్నిస్తాడు. రాగానే తమకు పని దొరికిందని ఉదయాన్నే వచ్చిన కూలీలు మొదట ఆనందించారు, కాని ఆలస్యంగా వచ్చి, తక్కువ పని చేస్తున్న కూలీలకన్నా తమకు ఎక్కువ దొరుకుతుందన్న దురాశ తో తమ ఆనందాన్నంతా ఆవిరిచేసుకొని అసంతృప్తితో ఇళ్లకెళ్లారు. కాని చివరలో, ఒక గంట కోసమే వచ్చిన కూలీలు, ఎంతో కొంత కూలీ దొరికినా చాలు, ఆ రోజుకు తమ కుటుంబానికి అన్నం పెట్టుకోవచ్చుననుకొంటుంటే, అనూహ్యంగా ఒక పూర్తి దేనారం దొరకడంతో, యజమాని ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బై పట్టరాని ఆనందం తో ఇళ్లకు వెళ్లారు. అలా, మొదటి కూలీల ఆనందాన్ని ‘దురాశ’ అసంతృప్తి గా మార్చగా. చివరి కూలీల ‘కృతజ్ఞత’ వాళ్ళ దుఃఖాన్ని, లేమిని కూడా అవధుల్లేని ఆనందంగా మార్చిందన్న ‘విశ్వాస నిత్యసత్యాన్ని’ యేసు బోధించాడు. మనకు చెందనిదాన్ని ఆశించడం దురాశేనని, విగ్రహారాధనలాగే దేవునికది హేయమైనదని బైబిల్ చెబుతోంది (కొల 3:5). ఆకాశమంత ఎత్తయిన, మహాసముద్రాలంత లోతైన దేవుని ఔదార్యాన్ని కొలవడం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, మహామేధావులకు కూడా అసాధ్యమే. కాని దేవుని ప్రేమస్పర్శ తో పరివర్తన చెందిన ఒక పాపి, నిరక్షరాస్యుడైనా సరే, దేవుని ఔదార్యాన్ని అనర్గళం గా వివరించగలడు. దేవునిపట్ల కృతజ్ఞత విశ్వాసి ఆంతర్యంలో అనంతమైన ఆనందపు ఊటల్ని సృష్టిస్తుంది. కాని అసంతృప్తి విశ్వాసి జీవితాన్ని ఆర్పి బూడిదగా మార్చుతుంది. విశ్వాసుల జీవితాల్లో నిత్యశాంతి, కుటుంబశాంతి కరువైందంటే తప్పకుండా వాళ్లలోనే ఏదో లోపమున్నట్టే. కొళాయి విప్పి దాని కింద బిందెను తలకిందులుగా పెడితే అది నిండుతుందా? దేవుని రాజ్య మౌలిక విలువలు, దేవుని రాజ్యాంగ నిర్దేశనలు, దేవుని ఔదార్యానికి అనువుగా ఎప్పటికప్పుడు జీవితాలను ‘సరిచేసుకునే’ విశ్వాసుల్లో అందుకే ఆనందం, సంతృప్తి, జీవన సాఫల్యం సమృద్ధిగా పొర్లిపారుతుంది. ‘నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు’ అన్నాడు ప్రభువు (యోహాను 15:5). దేవుని తోటలో పని దొరికితే, కేవలం ‘అదనపు డబ్బుకు’ ప్రలోభపడి దేవునికి దూరమైన ఈ ఏశావు బాపతు వాళ్ళనేమనాలి? అయితే, తాము పూర్తి కూలి పొందే అర్హత లేనివాళ్లమని గ్రహించి ఎంతో తగ్గింపుతో, కృతజ్ఞత తో దేవుని హత్తుకున్న చివరి కూలీలతోనే దేవుడు తన రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించుకొంటున్నాడు. మనమంతా ఆ వర్గం విశ్వాసులలోనే ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే దేవుని రాజ్యం, మన అర్హతలతో కాదు, దేవుని ఔదార్యంతో నిర్మించబడుతుంది, నడుస్తుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని మురిపించేది పరిమాణం కాదు... నాణ్యత మాత్రమే!
మనకు విజయాన్నిచ్చిన గొప్ప నిర్ణయాలను పదిమందికీ చాటి సంబర పడతాం. కానీ మన నిర్లక్ష్యాలు కొన్నింటికి ఎంతటి మూల్యాన్ని చెల్లించామో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతాం. నిర్ణయాలు, వాటి విజయాలు మనవైతే, నిర్లక్ష్యాలు, వాటి దుష్పరిణామాలు కూడా మనవే కదా? ప్రతినిత్యం వెలుగుతో, ప్రభువు సాన్నిధ్యంతో, ఆనందసంతోషాల వాతావరణంతో అలరారే పరలోకం ఎంతటి నిజమో, తీరనిబాధలు, ఆరని అగ్ని, కటిక చీకటితో కూడిన భయానకమైన నరకం కూడా అంతే నిజం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసుక్రీస్తు వారి కొండమీది ప్రసంగంలో భాగంగా ఆయన చేసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన బోధ పరలోకానికి, నరకానికి సంబంధించినది. నాశనానికి, నరకానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, విశాలంగా ఉంటుందని, అందువల్ల అనేకులు ఆ దారినే ఎన్నుకొంటారని, నిత్యజీవానికి దారితీసే ఇరుకు ద్వారాన్ని, సంకుచిత మార్గాన్ని చాలా కొద్దిమందే ఎన్నుకుంటారని ప్రభువు పేర్కొన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఆయన చేసిన కొండమీది ప్రసంగమేనని చాలామందికి తెలియదు. మత్తయి 5,6,7 అధ్యాయాల్లోని 111 వచనాల్లో విస్తరించి ఉన్న ప్రభువు వారి కొండమీది ప్రసంగ మూలాంశం కూడా ఇదే!! తన దారిని ఎన్నుకోవడమంటే, అత్యంత కఠినమైన దారిని ఎన్నుకోవడమే అన్న తిరుగులేని సత్యాన్ని క్రీస్తు ప్రభువే తన బోధల్లో, తన జీవితం లో కూడా స్పష్టం చేశాడు. అయినా సరే, కృపగల దేవుడు తన బిడ్డలకు ఇరుకు ద్వారాన్ని, సంకుచితమైన దారినెందుకిస్తాడు? విశాలమైన ద్వారం, సాఫీగా సాగిపోయే రహదారి లాంటి విశాలమైన దారి ప్రభువుదని భావించి, ఆ మార్గాన్ని ఎన్నుకునే వారే అత్యధికులన్నది రోజూ మనం చూసే ఒక సత్యం. ప్రపంచంలో 95 శాతానికి పైగా ప్రజలు ఎన్నుకునే సువిశాలమైన మార్గం నిత్యనరకానికి ఎలా దారితీస్తుంది? అంటూ ‘మెజారిటీ’ సంఖ్యతో తీసుకునే నిర్ణయాలే సరైనవని నమ్మే ‘ప్రజాస్వామ్యవాదం’ ఇక్కడ పనిచెయ్యదన్నది చాలామంది క్రైస్తవులకు మింగుడు పడని ఒక చేదువాస్తవం. ’మీరు ఇరుకు ద్వారాన, దాని ముందున్న ఇరుకు మార్గాన నడవండి’ అని మనకు చెప్పి ప్రభువు తన మార్గాన తాను నడవలేదు. ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్లపాటు ఎన్నో ముళ్ళు, గోతులు, అవరోధాలున్న కఠిన మార్గంలో నడిచి, సిలువలో ఘోరమైన శ్రమలనుభవించి, చనిపోవడం ద్వారా తన తిరుగులేని విధేయతతో పరమ తండ్రికి కుడిపక్కన ఉన్న స్థానాన్ని సంపాదించుకున్నాడు. సామాన్య ప్రజలమైన మనకు ఏది ఆయన బోధించాడో, అదే ఆయన తన జీవితం లో ఆచరించి మరీ చూపించాడు. ఆదిమ అపొస్తలులు, క్రైస్తవులు కూడా అదే దారిలో నడిచి పరలోకాన్ని తమ ‘జీవనసాక్ష్యం’ ద్వారా సంపాదించుకున్నారు. ఎలాగైనా సరే ఎక్కువ మందిని క్రై స్తవులను చేస్తే దేవుడు శభాష్ అంటాడన్న దుర్బుద్ధితో, నేటి కొందరు సెలెబ్రిటీ బోధకులు దేవుడు నిర్దేశించిన అత్యున్నతమైన విలువల్ని పలచన చేసి, దేవుని వాక్యాన్ని వక్రీకరించి, సంపదలు, స్వస్థతల వంటి ఈ లోకవిషయాల సాధనకు సువార్తను ముడిపెట్టి, ప్రజల్ని నరకానికి దారితీసే విశాలమైన మార్గంలో తాము ముందుండి మరీ నడిపిస్తున్నారు. ఏదడిగితే అదిచ్చేందుకు, చేతిలో అద్భుత దీపమున్న అల్లావుద్దీన్ కాదాయన. ఆయన సార్వభౌముడైన, పవిత్రతకు మరోపేరైన దేవుడు. మనం వెళ్ళాల్సింది పరలోకానికా, నరకానికా అన్న నిర్ణయాన్ని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అది పూర్తిగా మన నిర్ణయమే. అందులో దేవుని బలవంతమేమీ ఉండదు. పెద్ద చర్చి, గొప్ప ప్రసంగం, శక్తిమంతమైన ప్రార్థన వంటి మాటలు మనుషుల్ని మురిపిస్తాయేమో కానీ, దేవుని దష్టిలో ఆ మాటలకు విలువ లేదు. ఎందుకంటే, ఆయన కొలబద్ద పరిమాణాత్మకం కాదు, మనలో అత్యున్నతమైన జీవన విలువల్ని ఆశించే నాణ్యతా దృక్కోణం దేవునిది. అందుకే నాడు కోటీశ్వరులు వేసే కానుకల్ని తృణీకరించి, ప్రభువు ఒక పేద విధవరాలు వేసిన మనః పూర్వకమైన కేవలం రెండు కాసుల కానుకను అత్యున్నతమైనదిగా శ్లాఘించాడు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయన మారని దేవుడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అరణ్యంలో మారు మోగిన సువార్త స్వరం
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల అవిధేయత, విచ్చలవిడితనం పరాకాష్టకు చేరుకున్న రోజులవి. ధర్మశాస్త్రబద్ధమైన యూదుమతం పూర్తిగా మృతమై, దేవునికి ప్రజలకు మధ్య వంతెనల్లాగా, రాయబారులుగా ఉండాల్సిన ప్రవక్తలు లేకుండా పోగా, ప్రజలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించి, యథేచ్ఛగా జీవిస్తున్నారు. యెరూషలేము ఆలయంలో బలులు, ఆరాధనలు యధావిధిగానే జరుగుతున్నా, వాటిని నిర్వహించే యాజకవ్యవస్థ కూడా ఉన్నా, యూదా మతమంతా పూర్తిగా ఒక నామమాత్రపు తంతుగా మారిన అధ్వాన్నపు పరిస్థితులవి. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలనుకున్న కాలం సంపూర్ణమైన రోజులు కూడా అవే. యెషయా ప్రవక్త యేసుప్రభువు ఆవిర్భావాన్నే కాదు, ఆయన రాకను, త్రోవను సరాళము చేసే యోహాను పరిచర్యను కూడా 700 ఏళ్ళ క్రితమే ప్రవచించాడు. యోహాను పరిచర్యను మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తూ, ‘ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన తోవలు సరాళము చెయ్యండి, అంటూ అరణ్యంలో కేక వేసే ఒకని స్వరం’ అన్న యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు (యెషయా 40:1–5,9). యోహాను తల్లి ఎలీసబెతు, యేసు తల్లి మరియకు బంధువు. అతని తండ్రి జఖర్యా యాజక వంశానికి చెందినవాడు. తన పరిచర్య కోసం ప్రత్యేకించి ‘నాజీరు’ గా పెంచమని దేవుడే స్వయంగా అతని తండ్రి జకార్యాను ఆదేశించి, గొడ్రాలైన ఆయన భార్య ఎలీసబెతుకు యోహానును కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు తన 400 ఏళ్ళ మౌనాన్ని అలా తానే బద్దలు కొట్టి యేసుక్రీస్తు పరిచర్యకు ఉపోద్ఘాతంగా, యేసు త్రోవల్ని సరాళము చేసే ఆంతరంగిక సేవకుడిగా యోహానును పంపించే వార్తను జఖర్యాకు ప్రకటించాడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహానును మించిన వారు లేరని యేసుక్రీస్తే ఒకసారి ఆయన్ను శ్లాఘించాడు (లూకా 7:28). యోహాను తన పరిచర్య, ప్రసంగాలకు నిర్జన యూదాఅరణ్యాన్ని వేదికగా, ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాడు. అంటే, వేషధారణకు మారుపేరుగా మారిన పరిసయ్యులు, శాస్త్రులనే యూదుమతాధిపతులుండే యెరూషలేము పట్టణాన్ని వదిలేసి, వారికి దూరంగా యోహాను నిర్జనారణ్యంలోకి వెళ్తే, అతని ప్రసంగాలు విని, మారుమనస్సు పొంది. బాప్తిస్మము పొందేందుకు వందలాదిమంది పట్టణాలు వదిలి అతన్ని చేరేందుకు అడవిబాట పట్టారు. దేవుని అభిషేకం లేని పరిసయ్యుల ప్రసంగాలు యెరూషలేములో మారుమోగినా అవి విని ఎవరూ మారలేదు కానీ, యోహాను ప్రసంగాలు దైవస్వరంగా అరణ్యం లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, అశేష ప్రజానీకం ఆయన కోసం అరణ్యానికి తరలి వెళ్లి అవి విని పరివర్తన చెందారు. అలా నిర్భయుడైన ప్రవక్తగా, దేవుడే పంపిన ప్రవక్తగా యోహానును ప్రజలు గుర్తించారు. తన సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్రమ కాపురం చేస్తున్న హేరోదు రాజు ‘అనైతిక జీవితాన్ని’ యోహాను చీల్చి చెండాడి, చెరసాల పాలయ్యాడు, చివరికి శిరచ్ఛేదనానికి కూడా గురయ్యాడు (మత్తయి 14:10). కానీ పరిచర్యలో యోహాను ఏ మాత్రం రాజీపడలేదు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలంటే, ముందుగా తాను కాలుష్యానికి దూరంగా ఉండాలన్నదే అరణ్యంలోకి వెళ్లడంలో యోహాను ఉద్దేశ్యం. అలా డబ్బు, పేరు, అధికారం, వేషధారణ, విలాసాలకు దూరంగా అరణ్యంలో అజ్ఞాతంగా బతుకుతూనే వేలాదిమంది జీవితాల్ని అక్కడికే ఆకర్షించి, వారిని మార్చి, రక్షకుడైన యేసుక్రీస్తు త్రోవల్ని నిబద్ధతతో సరాళం చేసి, యేసు చెప్పులను కూడా విప్పడానికి తాను యోగ్యుడను కానంటూ వినమ్రంగా ప్రకటించి, ఆ యేసుకే బాప్తీస్మాన్నిచ్చి, తద్వారా పరిచర్యలోకి ప్రభువును ఆహ్వానించిన అసాధారణ, విలక్షణ దైవజనుడు యోహాను. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
అది చిరస్మరణీయమైన క్రిస్మస్!!
అమెరికాలోని విస్కాన్సిన్ లో ఒక షాపింగ్ మాల్ చిరుద్యోగి, ఏడాదంతా కూడబెట్టిన తన డబ్బుతో బహుమానాలు కొని క్రిస్మస్ సమయంలో సాంటాక్లాజ్ గా వాటిని పిల్లలకు పంచుతాడు. అంతా అతన్ని సాంటా అనే పిలుస్తారు. ఒక క్రిస్మస్ సమయంలో చిన్న పిల్లవాడు, వృద్ధురాలైన అతని తాతమ్మ, చేతిలో ఒక పదేళ్ల పాప ఫోటోతో వచ్చి ఆయన్ను కలిశారు. ఎవరీమె? అనడిగాడు సాంటా. ‘నా సోదరి శారా’ అన్నాడా పిల్లాడు. అతన్ని దగ్గరికి తీసుకొని ‘ఇదిగో ఈ బహుమానాల్లో నీకు, నీ సోదరికి కూడా ఏమి కావాలో తీసుకో’ అన్నాడు సాంటా. అపుడతని తాతమ్మ, ‘శారా రక్తకణాల కాన్సర్‌తో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ క్రిస్మస్ దాకా ఆమె బతకదేమో అంటున్నారు డాక్టర్లు. కాని శారా ఈ క్రిస్మస్ కు సాంటాను చూడాలనుకొంటోంది. వీలైతే ఒకసారి ఆసుపత్రికి రాగలరా? అని ఆమె సాంటాను కన్నీళ్లతో ప్రాధేయపడింది. శారా కథ విన్న సాంటా బాగా కలత చెంది, సరేనన్నాడు. ఆ సాయంత్రమే తన సాంటాడ్రెస్లో అతను ఆసుపత్రికి వెళ్ళాడు. గదిలో శారా అస్థిపంజరంలాగా మంచం పైన ఉంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు, తాతమ్మ, మరొక ఆంటీ చుట్టూ ఉన్నారు. కృశించిన ఆమె వంటి నిండా మచ్చలున్నాయి. కీమోథెరపీతో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. గదినిండా మృత్యువు వాతావరణం. సాంటా మనస్సు చివుక్కుమంది. అయినా తమాయించుకొని, సాంటా పద్ధతిలో ఒహ్హో.... అంటూ పెద్దగా ఆనంద శబ్దాలు చేస్తూ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆనందం పట్టలేక ‘సాంటా ...’ అంటూ శారా గట్టిగా అరిచి మంచం మీది నుండి లేవబోయింది. సాంటా పరిగెత్తుకెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఆమె పక్కనే కూర్చున్నాడు. శారా ఆనందంతో సాంటాకు ఏవేవో ఊసులు చెబుతోంది. కన్నీళ్లు ఆపుకొంటూనే సాంటా అవన్నీ వింటూ తాను కూడా చెబుతున్నాడు. శారాలో అంత ఆనందాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి కూడా అంతు లేకుండా పోయింది. దానికి కారకుడైన సాంటాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలో నర్స్ వచ్చి, ఇక వెళ్లిపోవాలంటూ సైగచేసింది. ‘శారా, ఒక దేవదూతను నీకోసం ప్రత్యేకంగా నియమించమని దేవుని ప్రార్ధిస్తాను’ అన్నాడాయన. అంతా కళ్ళు మూసుకోగా, సాంటా ఆమె మంచం వద్ద మోకరిల్లి, శారా తల మీద చేయి పెట్టి,‘దేవా ఈ చిన్న బిడ్డను ముట్టండి, శారా వ్యాధిని బాగుచెయ్యండి’ అంటూ ప్రార్ధించాడు. అంతా ‘ఆమెన్’ అన్న వెంటనే, ‘సైలెంట్ నైట్...’ అనే సాంప్రదాయక క్రిస్మస్ కీర్తనను సాంటా శ్రావ్యంగా అందుకోగా, చెమ్మగిల్లిన నేత్రాలతో సారాతో సహా అంతా కలిసి అద్భుతంగా పాడారు. ‘శారా, నేను చనిపోతున్నాను అనికాక, నేను బాగవుతాను అన్న భావన ఇక నుండి నీలో బలపడాలి. ఈ వేసవిలో నువ్వు నీ స్నేహితులతో తనివి తీరా ఆడుకోబోతున్నావు. వచ్చే ఏడాది క్రిస్మస్ సమయంలో నా మాల్ కు వచ్చి నన్ను కలుసుకోబోతున్నావు’ అని సాంటా శారాకు ధైర్యం చెప్పాడు. మెరిసే కళ్ళతో శారా ‘సరే సాంటా’ అంది . సాంటా శారాకు ఆటవస్తువులివ్వలేదు, ఆ క్రిస్మస్కు జీవితంపై ‘ఆశ’ అనే గొప్ప బహుమతినిచ్చాడు. అంతా ఆయన్ను హత్తుకొని సాగనంపారు. శాంటా రాకతో అక్కడి శ్మశానవాతావరణం కాస్తా పండుగ వాతావరణమైంది. ఏడాది తరువాత మాల్‌కు ఒకమ్మాయి వచ్చి సాంటాను కలిసి ‘నేను గుర్తున్నానా సాంటా?’ అనడిగింది. పిల్లలందరితో అన్నట్టే ‘ఎందుకు గుర్తులేవు? ఉన్నావు’ అన్నాడు సాంటా. ‘పోయిన ఏడాది నన్ను చూసేందుకు మీరు ఆసుపత్రికి వచ్చారు’ అని ఆమె అంటూండగానే సాంటాకు గుర్తొచ్చి ‘నీవు శారావు కదూ’ అన్నాడు అత్యాశ్చర్యంగా. అద్భుతం!! జుట్టు బాగా పెరిగి, ఎంతో బొద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది శారా. ఆనందబాష్పాలతో శారాను సాంటా హత్తుకున్నాడు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈసారి ఆమె బొమ్మల కోసం రాలేదు. తనలాంటి పిల్లలకు పంచమంటూ బోలెడు ఆటబొమ్మలు, వస్తువులు తెచ్చిచ్చి వెళ్ళింది. ‘ఇది నేను ఎన్నటికీ మర్చిపోలేని క్రిస్మస్’ అంటూ, శారాకిచ్చిన ‘కొత్త జీవితం’ అనే బహుమానానికి ఆకాశం వైపు చూస్తూ సాంటా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. నిరుపేదలు, ముఖ్యంగా నల్లజాతీయుల జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని నింపేందుకు కొందరు క్రై స్తవ పెద్దలు అమెరికాలో 1773 లో నెలకొల్పిన సంప్రదాయమే సాంటా క్లాజ్ గా ప్రసిద్ధి చెందింది. ఇవ్వడంలోని ఆనందాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా ఇచ్చిన ‘క్రిస్మస్’ ద్వారా దేవుడు మానవాళికి నేర్పించాడు. అది అర్ధం కాక, జీవితంలో ఆనందించడం తెలియని, ఇతరులు ఆనందిస్తే ఓర్వలేని, ‘డబ్బు దండగ’ అని అన్నింటినీ కొట్టి పారేసే కొందరు ‘క్రై స్తవ పరిసయ్యులు’, అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా? సాంటా క్లాజ్ సంప్రదాయం బైబిల్లో ఉందా? అంటూ కోడిగుడ్డుపై ఈకలు లాగుతుంటారు. సెల్ ఫోన్లు, ఫేస్బుక్ బైబిల్లో ఉన్నాయా? మరి వాటినెందుకు వాడుతున్నారు? మరి కొందరైతే, క్రిస్మస్, తోటివారు, పేదల పట్ల మన ప్రేమను చూపే పండుగైతే, ఎన్ని ప్రసంగాలు చేస్తే లేదా ఎన్ని వింటే అది అంత గొప్ప క్రిస్మస్ అని భావించే స్థాయికి దిగజారారు. మనది అనుదినం దేవుని ప్రేమను ప్రకటించే జీవితమైతే, ఏడాదికి 365 క్రిస్మస్ పండుగలు చేసుకొంటున్నట్టే. లేకపోతే, యేడాదికి కనీసం ఒకటైనా అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోవద్దా?? (అమెరికాలో మార్క్ లియొనార్డ్, ఆయన భార్య సుసాన్ లియొనార్డ్ అనే జంట సాంటా క్లాజ్ లుగా ఎన్నో ఏళ్ళ పాటు పేద పిల్లల జీవితాల్లో ఆనందాన్ని నింపి, తమ అనుభవాలను ఒక పుస్తకంగా రాశారు. అందులోని ఒక వాస్తవ గాథ ఇది). – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్
ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు. తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను. తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్ ఇచ్చే నిరంతర సందేశం!! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
కోవిడ్ లోనూ క్రిస్మస్ ఆనందం!!
లోకపరమైన అభ్యున్నతిని ఆశీర్వాదంగా భావించవద్దు. అవసరాలకు మించిన డబ్బు, సంపదలు, గిడ్డంగుల నిండా ఆహారముండటమే గొప్ప జీవితమైతే, అత్యంత హేయమైన సంస్కృతులకు నిలయంగా ఉన్న బబులోను సామ్రాజ్యంలో కూడా అవన్నీ ఉన్నాయని, దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకునేది ధర్మశాస్త్రబద్ధమైన నీతి, నియమాలు, మౌలిక విలువలు, దైవభయంతో కూడిన పరిశుద్ధజీవితమని యెషయాప్రవక్త హెచ్చరించాడు (యెషయా 1:2–31). మితిమీరిన సంపదలు, అహంకారంతో, అంధత్వంలో కూరుకుపోయిన ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. అనూహ్యంగా, బబులోను సైన్యాలు చేసిన దాడిలో ఒక్క రోజులోనే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి. తాము పరలోకపు రాజధానిగా భావించిన యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు ధ్వంసం చేసి పాడుదిబ్బగా మార్చారు, సుందరమైన ఆలయాన్ని కొల్లగొట్టి, దానిలోని బంగారాన్నంతా దోచుకుపోయారు. తాము తిరుగులేని శూరులము, మేధావులమనుకున్న చాలామందిని బబులోనుకు బానిసలుగా చెరపట్టుకొని వెళ్లారు. వాళ్ళ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రకాశవంతమైన వాళ్ళ దేశం కాస్తా చీకటికూపంగా మారింది. అయితే దేవుడు వాళ్ళను 70 ఏళ్ళ చెర తర్వాత మళ్ళీ వెనక్కు తెచ్చినా, పూర్వవైభవం మాత్రం వాళ్లకు మళ్ళీ దక్కలేదు. ఈ సారి రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన వారిని యెరూషలేములోనే మరింత అణిచివేసింది. అంధకారంలో ఉన్నవాళ్లు వెలుగు కోసం, ఆపదలో కూరుకుపోయినవాళ్లు సహాయకుని కోసం, బానిసత్వం లో మగ్గిన ప్రజలు స్వాతంత్య్రం, ఆత్మగౌరవాన్ని ప్రసాదించే విమోచకుని కోసం ఎదురు చూస్తారు. అందుకే బాధిత ప్రజల ఆక్రందనలకు జవాబుగా మానవచరిత్రనంతటినీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుశకం అనే రెండు భాగాలుగా విడదీస్తూ, రెండువేల ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగును, కృపామయుడైన సహాయకుణ్ణి, మహా విమోచకుణ్ణి, ‘దేవుని రాజ్యం’ అనే ఒక నవలోకనిర్మాతను లోకం కనుగొంది. దేవుని అద్వితీయ కుమారుడైన దైవలోకనిత్యపాలకుడే, ‘యేసుక్రీస్తు’ నామధారిగా, అతిసామాన్యమైన మానవరూపిగా, బేత్లెహేమనే కుగ్రామంలో, ఒక పశువుల శాలలో శిశువుగా ఈ భూగ్రహంపైన పాదం మోపాడు. మెస్సీయాగా దైవకుమారుడు ఈ లోకానికి వస్తాడని బైబిల్ చెబితే, మేధావులు, సంపన్నులు, పాలకుల భవంతుల్లో ఆయన జననం, ఆగమనం కోసం ఎదురుచూసిన ఆత్మీయ అజ్ఞానులైన యూదులు, ఒక నిరుపేదగా, సాదాసీదాగా జన్మించిన రక్షకుని గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు పోగొట్టుకున్నదే, సర్వలోకానికి మహా భాగ్యమైంది. ఈసారి ప్రభువు యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి వరప్రదాత, సార్వజనిక విమోచకుడయ్యాడు. కటిక చీకట్లో కూడా తప్పక ఒక కాంతిరేఖ ఉద్భవిస్తుందన్న ‘ఆశల్ని’ రేకెత్తిస్తూ, విమోచకుని రాకను మరోసారి గుర్తు చేస్తూ ఈ కోవిడ్–19 విపత్తులో ‘క్రిస్మస్’ మళ్ళీ రానే వచ్చింది. దీన్ని డబ్బు దండగ చేసుకునే పండుగలా కాదు, ఆడంబరాల కోసం కాదు, దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసే ఒక శుభప్రదమైన ఘడియగా గుర్తించి పదిమందికీ సాయం చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం, ఆత్మీయానందాన్ని పొందుదాం, దేవుని ప్రేమతత్వాన్ని మనసారా అనుభవిద్దాం. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవునికి తలవంచాలి, అన్యాయాన్ని ఎదిరించాలి..
‘రాజీపడటం’ అనే మాటే బైబిల్లో ఎక్కడా కనిపించదు. కానీ క్రైస్తవంలో, చర్చిల్లో మాత్రం ఇపుడు ఎక్కడ చూసినా రాజీపడటమే కనిపిస్తోంది. ఇశ్రాయేలీయుల నాయకులైన మోషే, అహరోను, దేవుని ఆరాధించేందుకు అరణ్యంలోకి మూడు దినాల ప్రయాణమంత దూరం వెళ్ళడానికి తన ప్రజలను అనుమతించమని దేవుడు ఆదేశిస్తున్నాడని ఐగుప్తు రాజు ఫరోకు తెలిపారు. నన్ను ఆదేశించడానికి ఆ దేవుడెవరు (ఐగుప్తీయులకు ఫరోయె దేవుడు మరి)? మిమ్మల్ని పోనిచ్చేదిలేదన్నాడు ఫరో. ఆ దశలో దేవుడు ఐగుప్తు మీదికి తెగుళ్లు పంపడం మొదలుపెట్టగా, మూడు దినాల ప్రయాణమంత దూరం కాదు కానీ, కొద్ది దూరం వెళ్లి దేవుణ్ణి ఆరాధించి వెనక్కి రండంటూ ఫరో కొంత వెనక్కి తగ్గాడు. దేవుని ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందులో రాజీపడబోమని తాము కోరినట్టుగా తమను పంపమని మోషే పట్టుబట్టగా, దేవుడు మరికొన్ని తెగుళ్లు పంపాడు. పోనీ, పురుషులు మాత్రమే వెళ్లిరండంటూ ఫరో మరి కొంత తగ్గాడు. అలా కనీసం తమ కుటుంబాల కోసమైనా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారని ఫరో ఆలోచన. అది కూడా కుదరదని, దేవుని ఆదేశాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని మోషే బదులిచ్చాడు. మళ్ళీ తెగుళ్లు సోకగా, పశువులన్నీ ఇక్కడే వదిలేసి కుటుంబాలతో వెళ్ళవచ్చని ఫరో మరింత తగ్గినా, మోషే అందుకు ఒప్పుకోలేదు. ఇక ఈ సారి దేవుడు ఐగుప్తీయుల ప్రతి ఇంట్లోనూ వాళ్ళ జేష్ఠ కుమారుడు చనిపోయే భయంకరమైన విపత్తును సృష్టించాడు. దాంతో, ఫరో పూర్తిగా దిగివచ్చి, అప్పటికప్పుడు ఐగుప్తు వదిలి వెళ్లేందుకు ఇశ్రాయేలీయులను ఆదేశించాడు (నిర్గమ 8:28, 10:11, 24). అయితే దేవుడు కావాలనే, దగ్గరి దారిలో కాకుండా, ఎఱ -
బుద్ధిహీనతతో చేజారిన సువర్ణావకాశం
అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ తన ఆర్ధిక సలహాదారుడు జె.కె.గాల్ బ్రెత్ ఇంటికి ఫోన్ చేశాడు. ఆయన పడుకున్నాడని పనిమనిషి ఎమిలీ జవాబిచ్చింది. ‘నేనెవరో తెలుసా? ఆయన్ను లేపు’ అన్నాడా అమెరికా అధ్యక్షుడు. ‘నేను గాల్ బ్రెత్ గారికి పనిచేస్తున్నాను, అమెరికా అధ్యక్షునికి కాదు’ అని జవాబిచ్చి ఆమె ఫోన్ పెట్టేసింది. ఆగ్రహించాల్సింది పోయి, లిండన్ జాన్సన్ ఆమె పనితీరును మెచ్చి ఎమిలీని వైట్ హౌస్‌లో నియమించాడు. యజమాని మనసెరిగి, మెలిగి, ఆయన్ను మెప్పించడం అనే అంశంపైన యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు (మత్తయి 25:14–30). ఒక భూస్వామి తన ముగ్గురు దాసులను పిలిచి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకరికి ఐదు తలాంతులు, ఇంకొకరికి రెండు తలాంతులు, మూడవవాడికి ఒక తలాంతు ఇచ్చి మరో దేశానికి వెళ్ళిపోయాడు. ఒక తలాంతు వెయ్యిడాలర్ల విలువచేసే వెండితో సమానం. భూస్వామి చాలా కాలానికి తిరిగొచ్చి లెఖ్ఖ అడిగితే మొదటివాడు తన ఐదు తలాంతులు వాడి మరో ఐదుతలాంతులు సంపాదించానని చెప్పగా ఆయన ఎంతో సంతోషించి వాటిని కూడా అతనికే ఇచ్చేశాడు. రెండవ వాడు కూడా మరో రెండు తలాంతులు సంపాదించానని చెబితే అతనికి కూడా అదే చేశాడు. మూడవ దాసుడు మాత్రం ఆయనిచ్చిన ఒక తలాంతునూ భద్రంగా తెచ్చిచ్చి, ‘నీవు చాలా కఠినుడివి. దీన్ని పోగొడితే శిక్షిస్తావని భయపడి, గుంత తవ్వి దాన్ని భద్రంగా దాచాను. నీది నీవు తీసుకో’ అన్నాడు. యజమాని అందుకు ఆగ్రహోదగ్రుడై, అతనివన్నీ మిగిలిన ఇద్దరికిచ్చి, చీకటి గదిలో అతన్ని బంధించాడు. అసలేం జరిగింది? ఈ ముగ్గురూ నిజానికి బానిసలు. బానిసలకు స్వాతంత్య్రం ఉండదు, హక్కులుండవు. వాళ్ళ పూర్తి జీవితం, సమయం, సామర్ధ్యం పైన యజమానికే పూర్తి హక్కులుంటాయి. అలాంటిది, యజమాని వారిని నమ్మి వాళ్లకు తలాంతులిచ్చి, ఆ బానిసలను కాస్తా తన ఆస్తిలో భాగస్వాములను చేశాడు. ఆ తలాంతులతో ఏదైనా చెయ్యగలిగిన స్వాతంత్య్రాన్ని వారికిచ్చాడు. వారి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తనతో సమానమైన స్థాయినిచ్చాడు. చాలా కాలం తర్వాత తిరిగొచ్చాడంటే, వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రయోజకులయ్యేందుకు వారికి బోలెడు సమయమిచ్చాడు. అయితే మూడవ వాడు మూర్ఖుడై, అతితెలివి తేటలకు పోయి యజమాని ఉగ్రత పాలయ్యాడు. యజమాని మళ్ళీ వచ్చేదాకా దొరికిన సమయాన్నంతా సోమరితనంతో, నిష్ప్రయోజకంగా గడిపాడు. వెయ్యి డాలర్ల విలువ చేసే వెండినైతే జాగ్రత్తగా కాపాడాడు కాని, డబ్బుతో వెలకట్టలేని ఆయనిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాన్ని, గుర్తింపును, ముఖ్యంగా సమయాన్ని మాత్రం దుబారా చేశాడు. తాళం వేసి గొళ్ళెం మర్చిపోవడమంటే ఇదే. చాలా మంది విశ్వాసులు, దేవుడిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాల్ని, సమయాన్ని దుబారా చేస్తూ, డబ్బును ఆస్తులను మాత్రం ‘జాగ్రత్తగా’ కాపాడుకోవడమే తెలివైన విధానమనుకొని, బాధ్యతారహితంగా బతుకుతారు. అలాంటి సోమరులు, పిసినారులకు జీవితంలో సుఖముండదు, సమాజంలో పరువుండదు, జీవన సాఫల్యం అసలే ఉండదు. భూస్వామి అసలు బాధ, కోపమేమిటంటే, తాను అంతటి సువర్ణావకాశమిచ్చినా, ఆ మూడవ వాడు మారలేదు, ఆత్మీయంగా ఎదగలేదు, ప్రయోజకుడు కాలేదు. పైగా యజమాని ఔదార్యాన్ని, ప్రేమను, కృపను అర్థం చేసుకోకుండా, తన దౌర్భాగ్యాన్ని తెలుసుకోకుండా, ‘నీవు విత్తని చోట కోసేవాడవంటూ’ ఆయనపైనే అభియోగం మోపాడు. రేపు పరలోకంలో మన ‘ప్రోగ్రెస్ రోపోర్టుల్లో’ ఇవే వ్యాఖ్యలుంటాయేమో జాగ్రత్త!! దేవుని మనసు, ప్రణాళికల మేరకు, పదిమందికీ ప్రయోజనం కలిగిస్తూ ఆయన్ను ఎంత మెప్పించామన్నదే మన ప్రతిభకు, విలువకు గీటురాయి. కరెన్సీ కట్టలెన్ని కూడబెట్టినా దేవుని దృష్టిలో అవి కేవలం చెత్త కాగితాల గుట్టలే!! కాబట్టే, ఆ రోజున దేవాలయంలో పెద్దమొత్తాలిచ్చిన ధనికులంతా డాంబికంతో తమ ఫలాన్ని పోగొట్టుకొని పరలోకంలో పరమ నిరుపేదలుగా మిగిలిపోతే, ఒక పేద విధవరాలు మాత్రం కేవలం రెండు కాసులిచ్చి దేవుని మనసు గెలుచుకొని పరలోకంలో అందరికన్నా ధనికురాలు, ధన్యురాలైంది. –రెవ.టి.ఏ.ప్రభుకిరణ్ -
‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’
శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10). ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా? మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా. అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం. ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ప్రణాళికలను నెరవేర్చడమే ఆశీర్వాదం
సూర్యుని చూడలేకపోయినా, సూర్యుని ‘నీడ’ లో సేదదీరగలం. అలాగే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకున్నా, దేవుని నీడను, కృపను, ముఖ్యంగా ఆయన అదృశ్యహస్తపు మహాశక్తిని ఎస్తేరు తన జీవితంలో అడుగడుగునా అనుభవించింది. ఎస్తేరు ఒక సాధారణ యువతి, బబులోనులో యూదుబానిస, తనవాళ్లంటూ లేక మొర్దేకై అనే బంధువు వద్ద ఆశ్రయం పొందిన అనాథ. కాకపోతే ఎస్తేరు పుష్కలంగా దైవభయమున్న అసమానమైన సౌందర్యవతి. బబులోను మహారాణి వష్తి పదవీచ్యుతురాలైనపుడు, వందలాదిమంది లో అనామకురాలైన ఎస్తేరు ఆ పదవికి ఎంపికై, బబులోను సామ్రాజ్యానికి మహారాణి కావడం వెనుక దేవుని అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. తాను మహారాణినయ్యానంటూ ఆమె ఎప్పుడూ విర్రవీగలేదు. కాని, బైబిల్ భాషలో చెప్పాలంటే, తగిన సమయంలో దేవుడు తనను హెచ్చిస్తాడన్న విశ్వాసంతో బలిష్టమైన ఆయన చేతికింద దీనమనసుతో, దైవభయంతో ఆమె జీవించింది(1పేతురు 4:6). అయితే తల్లిగర్భంలో ఆకృతిని కూడా పొందక మునుపే ఎస్తేరు పట్ల సంసిద్ధమైన దేవుని అనాది సంకల్పం అమలయ్యే రోజొకటి రానే వచ్చింది. యూదులకు బద్ధశత్రువులైన అమాలేకీయుల అగగు అనే రాజు సంతతికి చెందిన హామాను(1సమూ 15:8) తాను ప్రధానమంత్రి కాగానే, బబులోను సామ్రాజ్యంలోని యూదులందరి ఊచకోతకు ముహూర్తం కూడా నిర్ణయించాడు. ఎస్తేరు పెంపుడు తండ్రి మొర్దేకై ఆ సమాచారాన్ని ఎస్తేరుకు చేరవేసి, చక్రవర్తిని కలిసి ఆ తాకీదును రద్దుచేయించమన్నాడు. ఎస్తేరు యూదురాలన్న విషయం అత్యంత రహస్యం. అందువల్ల ఇపుడా విషయం తెలిస్తే చక్రవర్తి అహేష్వేరోషు ఆమెకు మరణదండన విధించవచ్చు. పైగా ఆహ్వానం లేకుండా చక్రవర్తి సన్నిధికి వెళ్లిన వారికి, ఆయన ప్రసన్నుడైతే తప్ప, విధిగా మరణ దండన విధించాలన్న చట్టం ఉంది. సమస్య ఒక మహాపర్వతం లాగా ఎదురైతే, ఎంత భక్తి ఉన్నా ప్రాణభయానిదే పై చెయ్యి అవుతుంది. ఎస్తేరు ప్రాణభయాన్ని వ్యక్తం చేయగా, మొర్దేకై ‘నీవు మౌనం వహిస్తే, దేవుని తన ప్రజలకు మరో విధంగా సహాయం చేస్తాడు. కాని ఈ సమయం కోసమే నిన్నింతగా హెచ్చించిన దేవుని సంకల్పాన్ని నీవు నిర్వీర్యం చేస్తున్నావేమో చూసుకో!!’ అంటూ సరైన సమయంలో, సరైన హెచ్చరిక చేశాడు. ఆ వెంటనే నేను నశిస్తే నశిస్తాను, కాని దేవుని ప్రజల్ని కాపాడుతానని ఎస్తేరు తీర్మానించుకొని, తన కోసం ప్రార్ధించమంటూ మొర్దేకైని, తన యూదుప్రజలను వేడుకొంది. వాళ్ళ ప్రార్ధనా బలంతో, కొండంత విశ్వాసంతో ఎస్తేరు చక్రవర్తి సన్నిధికి వెళ్లగా, ఆయన ప్రసన్నుడై ఆమె కోరినట్టే తాకీదును రద్దు చేసి, యూదుల్ని సంహరించాలనుకున్న హామానును, అతని కుటుంబాన్నంతటినీ నాశనం చేశాడు. అలా ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి, తన వాళ్ళైన వేలాది మంది ప్రాణాలు కాపాడింది. దీనంతటిలో ఎస్తేరుది ప్రత్యక్షపాత్ర కాగా, మొర్దేకైది పరోక్షమైనదైనా అత్యంత ప్రధానమైన పాత్ర. ఒకానొక కీలకమైన దశలో, ఎస్తేరును దేవుని ఆలోచనతో అనుసంధానం చేసి, ఆమెను కార్యోన్ముఖురాలిని చేశాడతను. ఈ మొర్దేకై పాత్రను విశ్వాసుల కుటుంబాల్లో తల్లిదండ్రులు, చర్చిల్లో పాస్టర్లు నిర్వహించాలి. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్లు. ఇపుడు తల్లిదండ్రులే పిల్లలకు భయపడే ఆధునిక విష సంస్కృతి వ్యాపిస్తోంది. పిల్లలకు ‘ఇది తప్పు’ అని తల్లిదండ్రులు చెప్పడమే తప్పైపోయిన ‘భ్రష్ట యుగం’ మనది. ఇప్పటి పాస్టర్లు బైబిల్లో మర్మాలు, కొత్త కొత్త విషయాలు గొప్పగా చెబుతారు. కాని ‘తప్పును తప్పు’ అని ధైర్యంగా చెప్పే పరిస్థితే లేదు.‘కరెక్షన్’ అంటే ‘దిద్దుబాటు’ లేని కుటుంబాలు, చర్చీలే సమాజాన్ని ఛిద్రం చేస్తాయి. పూర్వం నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ కుటుంబాల్ని ఎంతో గొప్పగా నిర్మించుకొని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే, ఎంతో చదువున్న నేటి తరం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యలేక గాలికొదిలేస్తున్నారు. ‘నేనొక పల్లెటూరివాణ్ణి, నాది నిరక్షరాస్య నేపథ్యం’ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు, ఈ నాటి ఉన్నతస్థితిలో దేవునికి, నీ వాళ్లకు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబుందా? ఇళ్లలో, చర్చిల్లో ఎస్తేరులు, మొర్దేకైలు లేక విశ్వాసులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరకపోతే, అదొక మహా సంక్షోభం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!
దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితనాన్ని నైలు నదిలో, ఒక జమ్ముపెట్టెలో ఒంటరిగా గడిపాడు. ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచినా, అక్కడా తనవాళ్లెవరూ లేని ఒంటరితనమే నలభై ఏళ్ళ పాటు మోషేను వెంటాడింది. తన వాళ్ళనుకొని హెబ్రీయుల వద్దకు వెళ్తే వాళ్ళతణ్ణి ఈసడించి మరింత ఒంటరి వాణ్ణి చేశారు. ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి, అక్కడ తనకు పిల్లనిచ్చిన మామతో మందలు మేపుతూ, తన జీవితానికంటూ ఒక గమ్యం, లక్ష్యం, అర్ధం కనబడని పరిస్థితుల్లో మోషే మరో నలభై ఏళ్ళు గడిపాడు. అలా ఎనభై ఏళ్ళు నిండిన పండు వృద్ధుడై జీవితాంతంలో తానిక ప్రజలకు కాని, తన దేవునికి కాని చేయగలిగిందేమీ లేదనుకొని తీవ్ర నిస్పృహకు, తీరని ఒంటరి భావనకు లోనైన దశలో మోషే రాసిన 90వ కీర్తన, బైబిల్లోని 150 కీర్తనల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ఎంతో ప్రతిభ కలిగి, దేవునిలో అత్యున్నతంగా ఎదిగి కూడా, దేవుడు తన ద్వారా ఏం చెయ్యాలనుకొంటున్నాడో తెలియని పరిస్థితుల్లో, అదిక తన జీవిత చరమాంకమనుకొని ‘మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు, అధికబలముంటే ఎనభై సంవత్సరాలు’ అని ఆ కీర్తనలో మోషే పాడుకున్నాడు (కీర్తన 90:10). అయితే దేవుడతని ఆలోచనలు తారుమారు చేస్తూ, హోరేబు కొండమీద ఒక మండే పొద ద్వారా ప్రత్యక్షమై ‘ఇది నీ జీవితానికి అంతం కాదు, ఆరంభం’ అన్నట్టుగా తన దర్శనాన్నిచ్చాడు. తన ప్రజల్ని దాస్య విముక్తులను చేసి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచర్యను మోషేకు అప్పగించాడు. ఆ నలభై ఏళ్ల పరిచర్యతో మోషే జీవితానికి సాఫల్యత, సార్థకత లభించి, తాననుకున్నట్టుగా 80 ఏళ్లకు కాక, 120 ఏళ్లకు విజయవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడు. దేవునికున్న అత్యంత విశేషమైన లక్షణాల్లో ఒకటి ‘ఆయన ఆశ్చర్యకరుడు’ అన్నది (యెషయా 9:6). మానవాళిని, లోకాన్ని ఆశ్చర్యపర్చడంలో దేవుని మించిన వారు లేరు. కరోనావైరస్ లోకాంతానికి సూచన అంటూ హడావుడి చేస్తున్నారు. చర్చిల్లో, విశ్వాసుల్లో నాణ్యత, పరిపక్వత, నిబద్ధత తగ్గి, మాలిన్యం, రాజకీయాలు, ప్రచారాలు, ధనమొహం, వేషధారణ, ఆడంబరాలు, అహంకారం పెచ్చరిల్లి, దేవుని స్థానాన్ని అవి ఆక్రమించిన పరిస్థితుల్లో, కరోనావైరస్ ఒక ప్రమాద ఘంటిక!! కరోనావైరస్ ఈ అవలక్షణాలన్నింటినీ అంతం చెయ్యాలి, అంతం చేస్తోంది కూడా. పది నెలలుగా చర్చిలు నడవడం లేదు, మొన్నటిదాకా దేవుని స్థానాన్ని చర్చి తీసేసుకుంటే, కరోనావైరస్ విశ్వాసుల్ని ఇపుడు మళ్ళీ దేవుని పాదాల వద్దకు తెచ్చింది. మనిషి ఆలోచనల్ని తారుమారు చేసి, ఆయన తన పద్ధతిలో తన ప్రణాళికల్ని అమలు చేసి ఆశ్చర్యపరిచే దేవుడని మరోసారి రుజువైంది. తాను మహా అయితే 80 ఏళ్ళు బతుకుతానేమో అని మోషే అనుకుంటే, దేవుడతనికి 120 ఏళ్ళ ఆయుష్షునివ్వడమేకాక, జీవితంలోని అతని చివరి దశను అద్భుతమైన పరిచర్యతో నింపి దేవుడతణ్ణి ఆశ్చర్యపరిచాడు. తననాశ్రయించిన ఎవరి జీవితాన్నైనా అనూహ్యమైన ఆశీర్వాదాలతో నింపి, అంతాన్ని ఆరంభంగా, ఆనంద సముద్రంగా మార్చగల సమర్థుడు దేవుడు. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు దుర్భరమైన ఏకాంత కారాగారావాసాన్ని గడిపినా, అతని దీక్ష, దర్శనం మసకబారలేదు. మనసుని పిండి పిప్పి చేసే ఏకాంతంలోనూ దేవుడే తనతోపాటు ఉండి జైల్లో తాను బలహీనపడకుండా కాపాడాడని తనకు అత్యంత సన్నిహితుడైన మెథడిస్ట్ బిషప్ పుంవలానాకు జైలు నుండి రాసిన ఒక లేఖలో మండేలా పేర్కొన్నాడు. అయితే తన క్రైస్తవ సాక్ష్యాన్ని బహిరంగం చేసి ప్రజల్లో రాజకీయవిభేదాలకు కారణం కావడం కన్నా, ఆ విశ్వాసాన్ని తనకు, తన దేవునికి మధ్య గల అత్యంత అపురూపమైన బంధంగా దాచుకోవడమే తనకిష్టమని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సంకుచితత్వానికి మారుపేరైన డాంబిక క్రైస్తవులకు ఈ మార్మికత అర్థం కాదు. దుర్భరమైన జైలుజీవితం నేపథ్యంలో కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఆయన అందించినసేవల్లో అణువణువునా క్రైస్తవ క్షమ, ప్రేమా సౌరభమే గుబాళిస్తుంది. తనను ఆశ్రయించిన వారికెవరికైనా జీవనసార్థకతను, సాఫల్యాన్నివ్వడానికి దేవుడు ఏ దశలోనైనా సిద్ధమే. – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
ఎంతో బలమున్నా నిర్వీర్యుడైన సమ్సోను
శత్రువు ఆయుధాలతో మన ఎదురుగా ఉంటే మనం గెలవొచ్చు. కాని ఆ శత్రువే విషంగా మారి మన రక్తంలో కలిస్తే, చనిపోవడమొక్కటే మనకున్న మార్గం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులనే శత్రువులు అలాంటి వారే. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఎదుర్కోవలసిన ఏడు శత్రుజనాంగాల జాబితాలో నిజానికి ఫిలిష్తీయులు లేరు (యెహోషువా 3:11). కాని న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన 300 ఏళ్లలో ఫిలిష్తీయులు గ్రీసు దేశం నుండి ఐగుప్తుకు, అక్కడినుండి వెళ్లగొట్టితే వచ్చి ఇశ్రాయేలీయులుంటున్న కనాను దేశపు దక్షిణప్రాంతాల్లో శరణార్థులుగా నివసించారు. ఎందుకంటే ఇనుప పనిముట్లను, ఆయుధాలను, ఇనుప రథాలను చెయ్యడంలో ఫిలిష్తీయులది అందె వేసిన చెయ్యి. అందువల్ల ఫిలిష్తీయులను తమ మధ్య నివసించడానికి అనుమతించడంలో ఇశ్రాయేలీయులకు ప్రయోజనం కనిపించింది. కనానులోని శత్రువులను సంహరించి, ఓడించిన దేవుని ప్రజలు ఇలా కొత్త శత్రువులొచ్చి తమ మధ్య దూరకుండా అడ్డుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ఫిలిష్తీయులను తమ పొరుగువారుగా, ఇనుప పనిముట్లు చేసిపెట్టే పనివారుగానే పరిగణించారు. పైగా ఫిలిష్తీయుల పురుషులు బలవంతులైతే, వాళ్ళ స్త్రీలు చాలా అందమైనవారు కావడంతో, ఇశ్రాయేలు యువకులు అక్కడి నుండి స్త్రీలను తెచ్చుకొని పెళ్లిచేసుకోవడం కూడా మామూలయింది. కనానుదేశంలో అన్యజనాంగాలతో సాంగత్యం చేయవద్దంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇశ్రాయేలీయులు చేసిన ఈ దుష్కార్యానికి పర్యవసానంగా ఫిలిష్తీయులే ఒక దశలో ఇశ్రాయేలీయులను ఏలడం ఆరంభించి 70 ఏళ్లపాటు వారిని కఠినంగా పాలించారు. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు దేవుడు సమ్సోను అనే న్యాయాధిపతిని అపుడు ఎన్నుకున్నాడు. అంతదాకా పిల్లలు లేని మనోహా అనే ఇశ్రాయేలీయుని భార్యతో దేవుడు మాట్లాడి, ఆమెకు తానొక కొడుకునివ్వబోతున్నానని, అతడు చాలా బలవంతుడవుతాడని, అయితే అతన్ని దేవునికి ‘ప్రతిష్ఠితుడుగా’ ప్రత్యేకించి పెంచాలని, ఇశ్రాయేలీయులను అతను ఫిలిష్తీయుల నుండి రక్షిస్తాడని ఆమెను తెలిపాడు. అలా మొదలయ్యింది ఎంతో బలవంతుడుగా పేరొందిన సమ్సోను కథ. అప్పటికే ఇశ్రాయేలీయుల జీవనశైలిలో ఫిలిష్తీయుల సంప్రదాయాలు చాలా కలిసిపోయాయి. ఫిలిష్తీయుల నుండి దేవుని ప్రజల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తమకు పుట్టిన బాలునికి అతని తల్లిదండ్రులు ‘సమ్సోను’ అనే ఫిలిష్తీయుల పేరు పెట్టడమే దానికి రుజువు. సమ్సోనును ఎంతో బలవంతుడుగా దేవుడు పుట్టిస్తే స్త్రీలను మోహించి తన బలాన్నంతా వారికే ధారపోసే దుర్బలుడయ్యాడు సమ్సోను. పైగా తల్లిదండ్రుల నియంత్రణ కూడా అతని మీద లేదు. చివరికి దెలీలా అనే ఫిలిష్తీ స్త్రీని మోహించి ఆమెతో సహవసించి, అలా ఫిలిష్తీయులకు బందీగా చిక్కి, వాళ్ళు అతని కళ్ళు కూడా పెరికివేసేంత బలహీనుడయ్యాడు. కాకపోతే అంధుడై కూడా దేవుని సహాయంతో ఒక గుడి స్తంభాలు పడగొట్టడం ద్వారా వారి దేవాలయాన్ని కూల్చి వేలాదిమంది ఫిలిష్తీయులను ఒక్కసారిగా హతమార్చి సమ్సోను తన పగ తీర్చుకున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్నో గొప్పకార్యాలు చేయడానికి పుట్టిన సమ్సోను అలా కేవలం తన పగ మాత్రం తీర్చుకొని చనిపోయాడు. దేవుడిచ్చిన బలం తన సొంతమని అతను నమ్మడం, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని సరిగ్గా నడిపించలేక పోవడమే అతని సమస్య అయ్యింది. శత్రువును గెలిచేవాడు బలవంతుడైతే, స్వీయనిగ్రహంతో తనను తాను గెలిచేవాడు మహా యోధుడని సమ్సోను తెలుసుకోలేకపోయాడు. అత్యున్నతంగా కనిపించే పర్వతాల అసమానశక్తి రహస్యం, అదృశ్యంగా భూమి లోపల ఉండే వాటి పునాదుల్లో ఉంటుందన్న రహస్యం తమను తాము నిగ్రహించుకునేవారికి, తగ్గించుకునేవారికే తెలుస్తుంది. ఎంతో బలమున్న సమ్సోను నిర్వీర్యం కావడానికి అతని హృదయంలోని అపరిశుద్ధతే కారణమైంది. – రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసికి దేవుడే విలువైన ఆస్తి
డబ్బు, ఆస్తులు మనకు గుదిబండలు కాకూడదు, అవి ఆకాశంలో స్వేచ్ఛగా, ఆనందంగా ఎగిరేందుకు తోడ్పడే రెక్కలు కావాలి. అబ్రాహాముది యూఫ్రటీసు మహానదికి అవతలి వైపున్న మెసొపొటేమియా దేశం. అది ఎంతో అందమైన భవనాలు, సంపన్నులు, యోధులుండే ప్రాంతం. ఒకప్పుడు ఎంతో ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టేందుకు పూనుకున్నది అబ్రాహాము పూర్వీకులే. అలాంటి భవనాలను, సంపన్నతను, శూరులైన తన స్వజనులను వదిలేసి, నాకు దేవుడు మాత్రమే చాలనుకుని, దేవుని ఆజ్ఞతో 1200 మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చి కనాను దేశంలో గుడారాల్లో వినమ్రంగా, నిరాడంబరంగా నివసించిన గొప్ప విశ్వాసి అబ్రాహాము. ఆయన తనకున్న కొద్దిమంది సేవకులతోనే కనానులో ఒకసారి నలుగురు రాజులను ఓడించిన మహా యోధుడు కూడా (ఆది 14:5–7). కనానులో దేవుడాయనకు గొప్ప ఆస్తినిచ్చినా అతిశయపడకుండా దేవుడే తన విలువైన ఆస్తి అని భావించిన నిగర్వి. అబ్రాహాము ఒకసారి దేవునితో, నాకు వంశోద్ధారకుడు లేకపోతే, ఆస్తినంతా నా వద్ద బానిసగా ఉన్న ఏలీయాజరుకే ఇచ్చేస్తానన్నాడు (ఆది 15:20). నిజానికి తన సోదరుని కుమారుడైన లోతును అబ్రాహాము తన వెంట తెచ్చుకొని పెంచి పెద్దవాణ్ణి చేశాడు. అలాంటి తన రక్తసంబంధియైన లోతుకు తన ఆస్తి ఇవ్వాలనుకోవడం అందరూ చేసే లోకపరమైన ఆలోచనే. కాని తన రక్తసంబంధికి కాక తన బానిసకు ఆస్తినంతా ఇచ్చేయాలనుకోవడం అబ్రాహాములో పరిమళించిన క్రైస్తవం!! ‘క్రీస్తు యేసుది అయిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి’ అంటుంది బైబిల్ (ఫిలి 2:5). యేసు తన ఈ ‘గొప్ప మనసునే’ వెలలేని ఆస్తిగా మనకిస్తాడు. అదే మన జీవితాన్ని, కుటుంబాన్ని పరలోకానందంతో నింపుతుంది. మన నాణ్యతను తేల్చుకోవడానికి పెద్ద పరీక్షలు అఖ్ఖర్లేదు. ఇంట్లో మన పనివాళ్లను మనం చూసే పద్ధతిలోనే అది తేలిపోతుంది. పనివాళ్లను రాచిరంపాన పెట్టే యజమానులు పైకి ఎంత ప్రార్ధనాపరులు, పండితులు, విశ్వాసులైనా ఆంతర్యంలో వాళ్ళు దేవునికి విరోధులే!!. మన పనమ్మాయి, మన కార్ డ్రైవర్, మనమూ పరలోకంలో అంతా సమానులమై పక్కపక్కనే కూర్చుంటామన్న సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవితాలు మారిపోతాయి. గుడారంలో ఉంటూ కూడా అబ్రాహాము పరలోకానందంతో నివసించాడు. దేవుని మనసును అనుకరిస్తూ, అలవర్చుకొంటూ సమృద్ధియైన క్రైస్తవంతో జీవిస్తూ, ఆయన తన గుండెలోనే ఒక గొప్ప గుడి కట్టి తన ప్రభువును అందులో ప్రతిష్టించుకున్నాడు. ఈ గుడిలో ఆరాధనలు ఆగవు, ఈ గుడికి ‘లాక్ డౌన్’లో కూడా తాళాలు పడవు. విశ్వాసి గుండెగుడిలో నుండి పారే నిరంతర ‘ఆరాధనామృతధార’ జీవితాన్ని, లోకాన్ని ప్రేమతో, పవిత్రతతో, ఆనందంతో ముంచెత్తుతుంది. – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ -
చర్చి వెలిగే లైట్ హౌస్‌లాగా ఉండాలి
దేవుని అద్భుత సత్యాలతో కూడిన బైబిల్ ఇంట్లో ఉన్నా రోజుల తరబడి దాని జోలికి వెళ్లకుండా విశ్వాసి ఉంటున్నాడంటే, దేవుడంటే ‘ఆకలి’ మందగించిందని, ఆకలి లేక పౌష్టికాహార లోపం ఏర్పడి అతని జీవితం అన్ని రకాల అనర్థాలకూ కారణమైందని అర్థం. తాను స్థాపించిన కొరింథీ చర్చిలో అసూయలు, కలహాలు, విభేదాలు, విభజనలకు ‘ఆత్మీయపౌష్టికాహార సమస్యే’ కారణమని. ఆ చర్చికి రాసిన మొదటి లేఖలో పౌలు వాపోయాడు. ‘అప్పట్లో మీరు బలహీనులు కాబట్టి నేను మిమ్మల్ని పాలతో పోషించాను. కాని ఇంతగా ఎదిగిన తర్వాత కూడా మీరింకా పాలే తాగే స్థితిలోనే ఉన్నందువల్ల మరింత బలహీనులై, ‘నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా(పేతురు) వాడను, నేను క్రీస్తు వాడను’ అంటూ నాలుగు వర్గాలుగా చీలిపోయి శరీరసంబంధుల స్థాయికి దిగజారారు’ అని పౌలు బాధపడ్డాడు( 1:12, 3:1–9). అది కుటుంబమైనా, చర్చి అయినా, దేశమైనా ఆత్మీయ జ్ఞానం కొరవడితే ’అనైక్యత’ ప్రబలి, మానసిక శాంతి కరువై అన్ని అనర్ధాలకూ రాచబాట వేస్తుంది. పరలోకానందంతో వెలిగిపోవలసిన జీవితాలు,కుటుంబాలు, సమాజం, చర్చిల్లో అశాంతి నిండిన నరకపు చీకట్లు కమ్మడానికి దేవుడంటే ‘ఆకలి’మందగించి ఏర్పడిన ‘ఆత్మీయ పౌష్టికాహార లోపమే’ ప్రధాన కారణం. కొరింథీ పట్టణం గ్రీసులో ఏడు లక్షల మంది జనాభా కలిగిన గొప్ప వర్తకపు పట్టణం. కాని బోలెడు డబ్బున్న కొరింథీలో ప్రజలు మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకొని భ్రష్టులవుతున్నారు. అలాంటి కొరింథీలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మొదట బాగా వ్యతిరేకత ఎదురైంది. అయితే దేవుడు ’ఇక్కడ నాకు చాలా జనముంది, ధైర్యంగా మాట్లాడు’ అంటూ పౌలును బలపర్చగా, ప్రయాసపడి ఈ చర్చిని స్థాపించాడు (అపో.కా.18:5–11). ’ఈ పట్టణంలో నాకు చాలా జనముంది’ అని ఆరోజు ప్రభువంటే అక్కడొక గొప్పచర్చి అవుతుందనుకున్నాడు కాని, ’కొరింథీ పట్టణంలో భ్రష్టులైన చాలా మందికి నా అవసరం అంటే దేవుని అవసరం ఉంది, ‘కొరింథీ చర్చి’ నా ప్రతినిధులుగా వారిని సరిదిద్ది పరలోకపు ఆనందంతో నింపాలన్నదే నాటి దేవుని మాటల అంతరార్థమని పౌలుకు ఇప్పుడర్థమవుతోంది. భ్రష్టులైన వారికి వారికి వెలుగు చూపించి సరిదిద్దే లైట్ హౌస్ గా దేవుడు కొరింథీ చర్చిని నియమిస్తే, అసలు లైట్ హౌస్ లోనే చీకటి కమ్ముకున్న విషాదం కొరింథీ చర్చిది, ఈ నాటి మనందరిదీ కూడా!! గొప్ప దైవసేవకుడు, ‘సాల్వేషన్ ఆర్మీ’ సంస్థాపకుడు విలియం బూత్ ఒకసారి తన ఏడేళ్ల కొడుకు ఎడ్వర్డ్ బూత్ ను లండన్ లో ఒక బార్ కు తీసుకు వెళ్ళాడు. ‘జూదం, మద్యపానంతో నిండిన ఈ బార్ కు నన్నెందుకు తెచ్చావు నాన్నా?’ అని ఎడ్వర్డ్ అడిగితే ‘వీళ్లంతా దేవుని పిల్లలే. కాని దారి తప్పారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దే గొప్ప సేవ నీవు చెయ్యాలని చెప్పడానికే ఇక్కడికి తెచ్చాను’ అన్నాడు విలియం బూత్. తండ్రిని మించిన తనయుడుగా ఎడ్వర్డ్ బూత్ ఆ తర్వాత చేసిన అద్భుతమైన సేవ ఫలితంగా లండన్‌లోని బార్లు, జూదం జరిగే కేంద్రాలు మూతపడ్డాయి. లోకానికి వెలుగు చూపించాల్సిన బాధ్యత చర్చిది. కాని చర్చిలోనే చీకటి నిండితే అది వెలగని లైట్ హౌస్ లాంటిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని సమన్యాయ పాలనా వ్యవస్థ!!
అంతా తప్పుచేసి పట్టుబడి శిక్షకు లోనవుతారు. కాని దానియేలు ప్రార్థన చేసి పట్టుబడ్డాడు, శిక్షగా ‘సింహాలగుహ’ లో వేయబడ్డాడు. దానియేలు, అతని ముగ్గురు యూదుస్నేహితులు, బబులోను సామ్రాజ్యంలోని యూదుబానిసల కుటుంబాలకు చెందిన వారు. కొన్ని వందల మంది అలాంటివాళ్ళున్నా, తాము యూదులమన్న ప్రత్యేకతను మర్చిపోకుండా ఆ నలుగురూ జీవించారు. బబులోను రాజైన నెబుకద్నెజరు సంస్థానంలో 15 –17 ఏళ్ళ వయసులోనే ఉన్నతసేవల కోసం ప్రతిభను బట్టి వాళ్ళు ఎంపికై శిక్షణ పొందారు. అలా తమ ప్రత్యేకతను కాపాడుకొంటూ అంచెలంచెలుగా ఎదగడానికి దేవుడు వారికి సాయం చేశాడు. ధర్మశాస్త్రానుసారం వాళ్ళు తమ దేవునికే ప్రార్థన చేసేవారు. దానియేలయితే, రాజులు కని మర్చిపోయిన కలల్ని కూడా గుర్తుచేసి మరీ వాటిని విడమర్చి చెప్పేంత ప్రతిభావంతుడయ్యాడు. అలా బబులోను, పర్షియా, ఆ తర్వాత మాదీయుల సంస్థానాల్లో దానియేలు తన ప్రతిభ, సమగ్రత, నమ్మకత్వంతో గవర్నర్ స్థాయికి ఎదిగాడు. కాని దానియేలుకు శత్రువులు కూడా అసంఖ్యాకం అయ్యారు. దానియేలు ప్రతిరోజు యూదు పద్ధతిలో మూడు సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడన్న విషయం తెలిసి, అతని శత్రువులు ముప్పైరోజులపాటు దేశంలో రాజైన దర్యావేషుకు తప్ప మరెవరికీ ప్రార్థన చేయకూడదన్న ఒక ఆజ్ఞను రాజుగారి ద్వారా తయారు చేయించారు. అయినా రాజాజ్ఞను ఉల్లంఘించి, తన ఇంటి కిటికీ తలుపు తెరిచి అందరికీ తెలిసేలా అతను ప్రార్థన చేశాడు. ఫలితంగా ఇష్టం లేకున్నా రాజుగారు దానియేలును సింహాల గుహలో వేశాడు. విచిత్రమేమిటంటే, ఆకలితో ఉన్న సింహాల మధ్య కూడా దానియేలు హాయిగా నిద్రపోగా, రాజభవనంలో పరుపుల పైన పడుకున్న రాజుగారికి, అతన్ని పట్టించిన శత్రువులకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రే అయ్యింది. మరునాడే, రాజు దానియేలును విడిపించి అతని శత్రువులందరినీ అదే గుహలో వేసి సంహరించాడు. విశ్వాసి ఎక్కడుంటే ఆ ప్రదేశాన్నే దేవుడు తన సన్నిధితో పరలోకంగా మార్చుతాడు. అపాయాలు, సమస్యలు, చిక్కుముడుల మధ్య కూడా విశ్వాసి హృదయంలోనే దేవుడు పరలోకానందపు ఊటలు నింపుతాడు. తాను సంతకం చేసిన ఆజ్ఞకు తానే బందీగా మారేంత బలహీనుడయ్యాడు ఆ రాజు. కాని రాజాజ్ఞలు, లోకాదేశాలకు అతీతమైన దేవుని సమన్యాయ, సమధర్మ పాలనావ్యవస్థలో దేవుడు పరలోకానందాన్ని రాజులకు, బానిసలకు కూడా న్యాయంగా, సమానంగా పంచుతాడు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమం ముగిసి అక్కడ సమన్యాయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న 1989లో, అక్కడి జులు తెగకు చెందిన రాజు దానికి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. ఎవరు చెప్పినా అతను వినని పరిస్థితుల్లో, బ్రిటిష్ ప్రభుత్వం బిషప్ టాటూ గారిని ఆయన వద్దకు పంపింది. బిషప్ గారు అతని ముందు నిలబడి, ‘నేను బిషప్‌ను, మీరు రాజు గారు. అయితే మిమ్మల్ని, నన్ను కూడా పాలించే అత్యున్నతమైన దేవుని ప్రార్థిద్దాం, మనిద్దరం మోకరిద్దాం, అనగానే, ఆ రాజు సింహాసనం దిగి, మోకరించాడు. బిషప్ గారి ప్రతిపాదనకు అంగీకారం కూడా తెలిపాడు. లోకమా? దేవుడా? అన్న మీమాంస ఎదురైతే, దేవుని ఆశ్రయించడమే క్షేమం, వివేకం. – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
మరణాన్ని మట్టికరిపించిన మహోదయం!!
శుభశుక్రవారపు మరుసటి ఆదివారం ఇంకా తెల్లారక ముందే. జెరూసలేం డేట్ లైన్ తో మగ్దలేనే మరియ అనే శిష్యురాలు యేసుక్రీస్తు సజీవుడయ్యాడంటూ ఆయన పునరుత్థాన శుభవార్తను ప్రపంచానికి ‘అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్’ గా ప్రకటించింది. ఈ శుభవార్త ప్రబలి, యేసు మరణంతో విషాదంలో ఉన్న ఆయన అనుచరుల్లో పుట్టెడు ఆనందాన్ని నింపింది. కానీ యేసును చంపి తామేదో గొప్ప విజయం సాధించామని విర్రవీగుతున్న ఆయన శత్రువుల గుండెల్లో మాత్రం అది రైళ్లు పరుగెత్తించి ‘నష్టనివారణ’ చర్యలకు వారిని పురికొల్పింది. యేసు సిలువలో అసలు చనిపోనే లేదని, కేవలం మూర్ఛపోయిన యేసు స్పృహలోకొచ్చి నడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడని కొందరు, అసలు యేసు అనే వ్యక్తే చరిత్రలోనే లేడని, ఆయన బోధలు, జీవితం, మరణం, పునరుత్థానం ఇదంతా కట్టుకథ అని మరికొందరు అబద్ధాలు ప్రచారం చేసినా, యేసు పునరుత్థానుడయ్యాడన్న ‘సత్యం’ వెయ్యింతల బలంతో అచిరకాలంలోనే ప్రబలి, ఆయన పునరుత్థానమే పునాదిగా ‘క్రైస్తవం’ భూదిగంతాలకు వ్యాపించింది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం మనుషులకు కొత్త, ఒక వింత కావచ్చు కానీ, జనన మరణాలకు అతీతుడైన దేవునికి కాదు కదా? మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, విశ్వానికంతటికీ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా, రక్షకుడుగా ’పుట్టి’, ’మరణించి’, ‘పునరుత్థానుడై’ ఉండకపోతే దేవుని సరిగ్గా, పూర్తిగా అర్థం చేసుకోవడం మనిషికి అసాధ్యమే. దేవుడేమిటో అర్థమయితేనే, ఆయన దృష్టిలో ఒక నలుసంత కూడా లేని మానవుణ్ణి దేవుడు ప్రేమించడమెంత గొప్ప విషయమో అర్ధమవుతుంది. ఊరికే దేవుడూ, దేవుడూ అంటాం కానీ ఆ దేవుణ్ణి తెలుసుకునే స్థాయి మనిషిది కాదు. అందుకే మనిషిలో ఇంత మిడిసిపాటు, డాంబికం!! తన ప్రేమ మనిషికర్థమయ్యే రూపంలో, యేసుక్రీస్తుగా దేవుడు ఈ భూగ్రహాన్ని దర్శించేందుకు పుట్టి, చనిపోయి, పునరుత్థానుడై మానవాళిని తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించి వారికి తనదైన శాశ్వతత్వాన్నిచ్చేందుకు ఈ విశ్వంతో సంబంధమే లేని ఒక పరలోకరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. దేవుడు విశ్వాన్నంతా సృష్టించి, మనిషిని మాత్రం తన అద్భుతమైన స్వరూపంలో చేసి, అతన్ని ఈ విశ్వాన్ని ఏలే రాజుగా నియమించాడని బైబిల్ చెబుతోంది(ఆది 1:28). అలా ప్రేమ, క్షమాపణ వంటి దైవిక స్వభావ లక్షణాలతో వర్ధిల్లి విశ్వాన్ని మనిషి తన గుప్పిట్లో పెట్టుకోవాలని దేవుడాశిస్తే, దారితప్పి స్వార్థపరుడైన మనిషి ఈ విశ్వానికి సమాంతరంగా ఒక ‘డబ్బు ప్రపంచాన్ని’ నిర్మించుకొని క్రమంగా దానికి దాసుడయ్యాడు. ఒక రాజుగా విశ్వాన్ని ఏలాల్సిన మనిషి చివరికి కంటికి కనిపించని వైరస్ క్రిములకు కూడా గడగడలాడే ఇప్పటి దీనస్థితిని కొని తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా ఎంతో కల్లోల భరితంగా ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, మానవాళి పట్ల దేవుని శాశ్వతమైన ప్రేమను, ఔన్నత్యాన్ని, ప్రణాళికలను గుర్తు చేసేదే యేసుపునరుత్థాన పర్వదినం... హేపీ ఈస్టర్... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అసత్యాల్నిచీల్చి చెండాడిన సత్యం!
యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది. ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు. విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది. వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అస్పృశ్యతపై ఒక సమరయుని సమరం!
ఒకసారి ఎంతో భావగర్భితమైన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తరాన యేసుప్రభువు నివసించిన నజరేతు గ్రామమున్న గలిలయ ప్రాంతానికి, దక్షిణంలోని యెరూషలేము పట్టణానికి మధ్య రాకపోకలకు రెండు మార్గాలున్నాయి. ఒకటేమో సమరయ గ్రామాల గుండా వెళ్లే దగ్గరి మార్గం. కానీ సమరయులు అంటరానివారు గనుక సనాతన యూదులు ఆ మార్గంలో వెళ్లేవారు కాదు. రెండవది దూరమార్గం కానీ సనాతన యూదులుండే యెరికో లాంటి పట్టణాల గుండా వెళ్లే మార్గం. అయితే దొంగల బెడద కూడా బాగా ఉన్న మార్గమది. ఒకసారి ఆ మార్గంలోనే సనాతన యూదుడొకతను ప్రయాణమై వెళ్తూ దొంగల బారినపడ్డాడు. దొంగలతన్ని బట్టలతో సహా పూర్తిగా దోచుకొని విపరీతంగా కొట్టి కొనప్రాణాలతో దారిపక్కన పడేశారు. అపుడు అతనిలాగే సవర్ణులు, సనాతనులైన ఒక యాజకుడు, లేవీయుడు అటువైపు వచ్చికూడా అతన్ని పరామర్శించకుండా వెళ్లిపోగా, ఒక సమరయుడు అటుగా వెళ్తూ అతన్ని చూసి, పరామర్శించి, అతని గాయాలు కట్టి, ఆ మార్గంలోనే ఉన్న ఉన్న ఒక పూటకూళ్లవాని ఇంట్లో అతన్నిచేర్చి, అతనికయ్యే ఖర్చంతా భరించాడు. మనవాళ్లే కదా అనుకున్న యాజకుడు, లేవీయుడు స్వార్ధపరులై అతన్ని ముట్టుకోవడం కాదు కదా కనీసం చూడకుండా మొహం చాటేసి వెళ్ళిపోగా, ఏ అంటరాని వాళ్లకయితే దూరంగా ఉండాలనుకొని యెరికో దారినెన్నుకొని ఆపదల్లో పడ్డాడో, ఆ అంటరానివాడే ఆప్తుడై అన్ని సపర్యలూ చేసి క్షతగాత్రుని బతికించాడు. మతపరంగా ప్రముఖులు, జ్ఞానులైన ఆ యాజకుడు, లేవీయుడి కన్నా. అంటరానివాడైన ఆ సమరయుడే నిజమైన పొరుగువాడు, అసలైన విశ్వాసి అని యేసుప్రభువు తేల్చి, విశ్వాసానికి నిజమైన ప్రామాణికతనిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న నియమం కన్నా అతున్నతమైనది మరొకటి లేదని బోధించాడు. అలా క్రైస్తవానికి ఈ బోధే మూలరాయి అయ్యింది. అయితే యేసుక్రీస్తు జీవితంలో నుండి పెల్లుబికిన ఇలాంటి విశిష్టమైన బోధలతో ఆవిర్భవించిన ‘క్రైస్తవం’,ఒక ‘మతం’ స్థాయికి దిగజారడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. నిజమైన ప్రేమ, సోదరభావం, సౌభ్రాతృత్వానికే కాదు, స్వార్ధం, పగ, ద్వేషం, వివక్షకు కూడా కుల, మత, ప్రాంతీయాది విభేదాల్లేవు, సరిహద్దులు అసలే లేవన్నదే ఇందులోని తాత్పర్యం!! ఈ సూక్ష్మం అర్ధమైతే, క్రైస్తవంలోనే కాదు ప్రపంచంలోనే అసలు సమస్యలు లేవు. ’అయ్యో! మన మనవాడే కదా!’’ అన్న జాత్యాభిమానంతోనైనా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోని ’పచ్చి స్వార్థపరులు’ ఆ యాజకుడు, లేవీయుడైతే,‘నన్ను అంటరాని వాణ్ని చేసిన దుర్మార్గుడితను’ అని ఈసడించుకోకుండా, అతన్ని కాపాడిన ‘మహోన్నతమైన ప్రేమ, మానవత్వం’ ఆ సమరయుడిది. మనం తరచుగా వాడే ‘మనవాడు’, ‘పగవాడు’ అన్న పదాలు ఎంత అర్ధరహితమైనవో తెలిపే బోధ ఇది. మనల్ని ఆపదలో ఆదుకున్నవాడే మనవాడు, పొరుగువాడనీ, మొహం చాటేసే ‘మనవాళ్ళు’ పగవారికన్నా తక్కువైనవారేమీ కాదని తెలుపుతూ, మానవత్వాన్నే పునర్నిర్వచించిన పునాదిరాయి ఈ బోధ! పెద్దలు సౌకర్యార్థమై కొన్ని శాఖల్ని మనలో ఏర్పాటుచేసినా, ఒక డినామినేషన్ కాకి మరో డినామినేషన్ మీద వాలనంత వైషమ్యం, ప్రేమకు, ఐక్యతకు మారుపేరైన క్రైస్తవంలో మనకెందుకుందో లోకానికి, దేవునికి కూడా ఒకరోజున మనం సంజాయిషీ చెప్పాలి. ప్రాణం మీది తీపితో ఒక సర్జరీ చేయించుకునేటపుడు ‘డాక్టర్’ మనవాడా?’ అని ఆలోచించని వారికి, పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు ‘మనవాళ్ళా’? అని అడగని వారికి, కొన్ని సందర్భాల్లోనే ‘మనవాళ్ళా?’ అనడిగే సంకుచితత్వమా? పుట్టుకతోనే ఎవరూ విశ్వాసులు కాదు. అలాగని ఎన్నేళ్లైనా క్రీస్తు సారూప్యం ఏర్పడకుంటే, అసలు క్రైస్తవులమే కాదు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
దాతృత్వం.. ప్రార్థన.. ఉపవాసం..
రహస్యంగా సాగాలి!పాత నిబంధన కాలంలో దేవుడు తన న్యాయసంవిధాన సూత్రావళిగా మోషేకిచ్చిన పదాజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రానికి పొడిగింపుగా, కొత్తనిబంధన కాలపు విశ్వాసులకు కరదీపికగా, యేసుప్రభువే స్వయంగా ఆ ధర్మశాస్త్రానికిచ్చిన వినూత్నమైన భాష్యం ఆనాడు యేసుప్రభువు కొండమీది చేసిన ప్రసంగం!! ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అమలుపర్చడమే దేవుని ప్రసన్నుని చేసుకోగలిగిన ఏకైక మార్గమైతే, అది మానవమాత్రులకెంత అసాధ్యమో ధర్మశాస్త్రమే రుజువు చేస్తుంది. అత్యున్నతమైన ధర్మశాస్త్రపు పవిత్రతా స్థాయిని ప్రామాణికం చేసుకుంటే, ఈ లోకంలో అందరూ పాపులే అని నిర్వచిస్తుంది బైబిల్ (రోమా 3:23). అందువల్ల కొత్తనిబంధన కాలపు విశ్వాస జీవితానికి యేసు ప్రభువు వారి కొండమీది ప్రసంగం పునాది లాంటిది. దేవుని మహిమ కోసం విశ్వాసి బాహాటంగా చెయ్యవలసిన అనేక విషయాలతోపాటు, దేవుని మహిమ కోసం, తన మేలుకోసం విశ్వాసి పరమ రహస్యంగా చేయవలసిన మూడు ప్రధానమైన అంశాలను కూడా యేసుప్రభువు తన కొండమీది ప్రసంగంలోనే ప్రకటించాడు. విశ్వాసి మొదటిగా తన ‘దాన ధర్మాలను’, రెండవదిగా’ ప్రార్థనను’, మూడవదిగా తన ‘ఉపవాస దీక్ష’ను చాలా గుప్తంగా, రహస్యంగా చెయ్యాలని యేసుప్రభువు ఆదేశించాడు. ఇవి సలహాలు కాదు, ప్రభువిచ్చిన చాలా స్పష్టమైన ఆదేశాలు. అది తెలియకే, గోప్యత లోపించిన మన ప్రార్ధనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరుప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం మనకు, మన కుటుంబాలకూ రావడం లేదు. విశ్వాసి ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని ప్రభువు ఆదేశించాడు. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయి. చర్చికి కానుకగా బెంచీలిచ్చి, వాటి వెనక తమ పేర్లు రాయించుకుంటే, ఆ పేర్లు ఈ లోకంలోనే ఉండిపోతాయి కానీ పరలోకంలో దేవుని జీవగ్రంథంలో మాత్రం రాయబడవన్నది తెలుసుకోవాలి. పేదలకు చేసే ధర్మం గురించి యేసు ఇలా చెప్పాడు కానీ దేవునికిచ్చే కానుకల గురించి కాదంటూ కొందరు పాస్టర్లు తమ స్వార్థం కోసం దీనికి వక్రభాష్యం చెబుతారు. ఒక పేద విధవరాలు గుప్తంగా ఇచ్చిన చిరుకానుకను ప్రభువెందుకు శ్లాఘించాడో అర్థమైతే, ఈ వాస్తవమేమిటో బోధపడుతుంది. ఇక ప్రార్థనయితే, గది తలుపు లేసుకొని మరీ రహస్యంగా చేయాలన్నది ప్రభువాదేశం. కానీ ఆనాటి పరిసయ్యుల్లాగే, జీవితం లో ఎన్నడూ రహస్య ప్రార్థన చెయ్యని వారు కూడా మైకుల్లో సుదీర్ఘంగా ప్రార్థన చేసేందుకు ఉబలాట పడుతుంటారు. దేవుని సంబోధిస్తూ, దేవునికే చేసే మన ప్రార్థన అసలు ఇతరులెందుకు వినాలి? చర్చిల్లో ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అతీతమైనది, ఆశీర్వాదకరమైనది విశ్వాసి తన ప్రభువుతో ఏకాంతంగా చేసే రహస్య ప్రార్ధన. ఇదే బలమైన ప్రార్థనాజీవితమంటే!! పోతే అందరికీ తెలిసేలా ఉపవాస దీక్షలు చెయ్యడానికి కూడా తాను వ్యతిరేకమని, అదంతా వృథా ప్రయాస అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. ఈ మూడూ ఎంత రహస్యంగా చేస్తే అవి మనకంత ఆశీర్వాదకరమవుతాయి. అవెంత బహిరంగంగా చేస్తే, మనమంతటి వేషధారులమవుతాము. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా... అలా కాకుండా మాకు తోచినట్టే చేస్తాం అంటే, ఎండమావుల్లో నీళ్లు వెదకడమే కాదా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆశకు మరో పేరు క్రిస్మస్
గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! ఇటలీకి చెందిన మహా నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ అప్పటి స్పెయిన్ రాజుగారి ఆజ్ఞ మేరకు సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఇండియాను చేరేందుకు పశ్చిమ దిక్కు నుంచి ఒక కొత్త దారి కనుక్కోవడానికి 15వ శతాబ్దంలో నౌకాయానం చెయ్యడానికి పూర్వం ప్రపంచమంతా బల్లపరుపుగా ఉందని, అందువల్ల నౌక సముద్ర ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ప్రపంచం చివరి అంచు నుంచి లోతుల్లేని అగాథంలోకి పడిపోతుందని అంతా నమ్మేవారు, భయపడేవారు కూడా. అయితే కొలంబస్ నౌకాయానం విజయవంతం కావడం వల్ల రెండు విషయాలు తెలిశాయి. యూరోప్ తదితర ప్రాంతాలకు అంతవరకు తెలియని అమెరికా అనే ఒక ఖండమున్నదని కొలంబస్ అక్కడికి చేరడం వల్ల లోకానికి తెలిసింది. పైగా ప్రపంచం బల్లపరుపుగా లేదని, ఒక అంచు నుంచి అగాథం లోకి పడిపోవడం కాదు, గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను కొలంబస్ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్ కన్నా ‘ఆశ’ ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్’!! లోకాన్నితన ప్రేమ, క్షమతో నింపి తద్వారా సరికొత్త దైవిక రాజ్యాన్ని నిర్మించాలన్న దేవుని అనాది సంకల్పంతో, దృఢమైన అభిమతంతో రెండు వేల ఏళ్ళ క్రితమే తొలి క్రిస్మస్ వెలిసింది, మరొక మతాన్ని ఆరంభించేందుకు కాదు, మనిషి తన కోసం తాను కాకుండా, తనను తాను ప్రేమించుకున్నంతగా తన పొరుగువాణ్ణి కూడా ప్రేమించడంలోనే అతనికి జీవన సాఫల్యమున్నదని తెలిపే ఒక విలక్షణమైన, విశిష్టమైన జీవన విధానాన్ని ఆవిష్కరించిన రక్షకుడుగా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఆవిర్భవించాడు. అంతే తప్ప ఒక కొత్త మతాన్ని ఆరంభించే ఉద్దేశం యేసుకు లేదు. ఆ కారణంగా, కత్తుల నడుమ నిర్మలమైన కలువపూవై, నెత్తుటి మరకలతో ఎర్రబారిన ఆకాశంలో ఎగిరే శ్వేత శాంతికపోతమై, ఒంటరితనంతో నిరాశాజీవిగా బతుకుతున్న మనిషితో, నీకు నేనున్నానంటూ అభయాన్నిచ్చిన ఒక ప్రియనేస్తమై యేసుక్రీస్తు రక్షకుడుగా క్రిస్మస్ ద్వారా లోకంలోకి అడుగుపెట్టాడు...ఆయన ఆకాశాన్ని తన సింహాసనంగా, భూమిని తన పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన ప్రభువని బైబిల్ వర్ణిస్తుంది (యెషయా 66:1–4). అయితే ఆనాడు విశ్వమంతటికీ సృష్టికర్త, పాలకుడు, యజమాని అయిన దైవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనాన్ని సూచించే ఆర్భాటం లేదు, కోలాహలం కూడా లేదు. స్వాగతోత్సవాలు, సన్మాన సభలు, విందులు, వినోదాల సందడే లేదు. రక్షకుని ఆగమన సూచనగా దేవుడు ఆకాశంలోనే ఒక అసాధారణమైన తారను పుట్టిస్తే, అది చూపే దారిలో తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని చూసేందుకు యెరూషలేముకొస్తే, అక్కడి యూదుల రాజైన హేరోదు పిలిపిస్తే యూదు పండితులు వచ్చి, యూదయ దేశపు చిన్న గ్రామమైన బేత్లెహేములో రక్షకుడు అంటే మెస్సియా పుడతాడని బైబిల్ చెబుతోందంటూ వివరించారు (మత్తయి 2:5). యెరుషలేములాంటి గొప్ప పట్టణముండగా, అక్కడికి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలోని బేత్లెహేము అనే అనామకమైన ఒక పేద గ్రామంలో రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తియైన దైవకుమారుడు పుట్టడమేమిటో ఆ జ్ఞానులకు అర్థం కాలేదు, హేరోదు చక్రవర్తికీ అదేంటో అర్థం కాలేదు, ఆ బైబిల్ వచనాన్ని చదివి వినిపించిన యూదు పండితులకైతే ఆ వచనం పట్ల అసలు విశ్వాసమే లేదు. వాస్తవమేమిటంటే ఆ వచనాన్ని ఆనాడు ఎవ్వరూ నమ్మలేదు. ఒకవేళ నమ్మి ఉంటే, హేరోదు పురమాయింపుతో అతని సైనికులు లేదా బైబిల్ ప్రవచనాన్ని విశ్వసించే ఎవరైనా యూదు పెద్దలు పక్కనే ఉన్న బేత్లెహేముకు ఆ జ్ఞానులతో పాటే ఆ రోజే వెళ్లే వాళ్లు. అప్పుడు ప్రపంచానికంతటికీ రక్షకుని జన్మశుభవార్త ‘బ్రేకింగ్ న్యూస్’గా ఆరోజే తెలిసి ఉండేది. కాని దేవుడు తన మహా కార్యాలు, అనాది సంకల్పాల నెరవేర్పు కోసం, ధనవంతులు, పండితులు, అధికారమున్న గొప్పవాళ్లను కాక, పామరులను, నిరుపేదలను, బలహీనులను ఏర్పరచుకొని వారిని వాడుకొంటాడని బైబిల్ చెబుతోంది (మత్తయి 11:25). యేసుక్రీస్తు నూటికి నూరు పాళ్లూ పేదల పక్షపాతి, దీనబాంధవుడని చెప్పడానికి బైబిల్ నిండా, ముఖ్యంగా కొత్తనిబంధన నిండా వచనాలున్నాయి.మెస్సీయాగా యేసు రాజభవనాల్లో, చక్రవర్తులు, కుబేరుల ఇళ్లలో పుట్టబోడని దేవుడు స్పష్టం చేశాడు. పుడమినేలే రారాజు పశువుల పాకలో పుడతాడని చెప్పే ప్రవచనాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన భక్తిపరురాలైన ఒక కన్యక పరిశుద్ధాత్మ శక్తితో యేసును గర్భం దాల్చుతుందని, యోసేపు అనే భక్తిపరుడు, నీతిమంతుడైన మరో పేద యువకుడు యేసుప్రభువుకు ఇహలోకంలో సంరక్షక తండ్రిగా ఉంటాడని, ఆయన జననం బేత్లెహేములో జరుగుతుందని దేవుడు ముందే వెల్లడించాడు. అలా, కోటానుకోట్ల నక్షత్ర మండలాల సముదాయమైన మహా విశ్వానికంతటికీ సృష్టికర్త, పాలకుడూ అయిన దైవకుమారుడు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, చడీ చప్పుడు చెయ్యకుండా, ఒక నలుసంత పరిమాణానికి తనను తాను తగ్గించుకొని, కన్య గర్భంలోకి ప్రవేశించి, తొమ్మిది నెలల పాటు మరియ గర్భంలో పిండస్థ శిశువుగా ఎదిగి, బేత్లెహేములోని సత్రంలో కూడా మరియ, యోసేపులకు తలదాచుకునే చోటు దొరక్కపోగా, వాళ్ళున్న పశువుల పాకలోనే యేసు జన్మించాడు. ప్రపంచంలో మానవాళి దృష్టికొచ్చిన అద్భుతాల్లోకెల్లా, అత్యంత అద్భుతమైన సంఘటన, చరిత్రను తిరగ రాసిన పరిణామమిది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాల్లోనూ యుద్ధాలు, మరణాలు, రక్తపు మరకల హింసాత్మక ఘటనలుండగా, కొత్త నిబంధనగా పిలిచే చివరి 27 పుస్తకాలూ యేసుప్రభువు వారి శాంతి సందేశంతో నిండి ఉన్నాయి. యుద్ధాలు, హింసాకాండ నేపథ్యంలో శాంతిదూతగా యేసు జననాన్ని ఎలా సమర్థిస్తారు? ఒక మార్గాన్ని వేస్తున్నప్పుడు, నేలను తవ్వి గుల్ల చేయాల్సివస్తుంది, అడ్డుగా ఉన్న కొండల్ని పేల్చి, లేదా తొలచి చదును చేయాల్సి వస్తుంది. అలా బలప్రయోగంతో సరళం చెయ్యబడిన పర్యవసానంగా రక్షణ మార్గం ఏర్పడగా, అందుకోసమే అనివార్యమైన హింసాత్మకత పాత నిబంధనలో చెలరేగింది. అయినా యేసుప్రభువు రక్షకుడుగా దిగివచ్చిన తర్వాత కూడా క్రై స్తవం పేరుతో ఈ రెండువేల ఏళ్లలో చాలాసార్లు చరిత్ర రక్తసిక్తమయ్యింది. కారణం? యేసుప్రభువు ఈ లోకానికి సంపూర్ణంగా అర్థం కాకపోవడం ఒక కారణమైతే,.దేవుని కుమారుడుగా శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రబోధాల ప్రత్యేకతను, విశిష్టతను అర్థం చేసుకోలేని మధ్య యుగాల చర్చిల్లో పేరుకు మాత్రమే క్రై స్తవులైన వాళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా, ఆచరణలో నియంతృత్వపు పోకడలతో క్రై స్తవాన్ని ‘విస్తరించడానికి’ పూనుకున్న యూరోప్ దేశాల చక్రవర్తులు మరొక కారణం. యేసుప్రభువు శాంతి సందేశాన్ని, ప్రేమ, క్షమాపణే పునాదిగా కలిగిన విలక్షణమైన, విశిష్టమైన ఆయన రక్షణ సువార్త మార్గాన్ని, వాళ్లంతా ఒక ‘మతం’ స్థాయికి దిగజార్చారు. దైవిక మార్గం ఏదైనా సరే అది మతం స్థాయికి దిగజారిన ప్రతిసారీ మానవాళి తీవ్రంగా నష్టపోయి, దిగజారిన విలువల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. దేవుని కన్నా యాజకులు, పరిచారకులు, పూజారులుండే చర్చిలు, దేవాలయాల వ్యవస్థ ప్రాబల్యం నానాటికీ ఎక్కువ కావడమే ఒక మతం స్థాయికి దైవికత దిగజారిందనడానికి స్పష్టమైన సూచన. ముఖ్యంగా మధ్య యుగాల్లో ఈ కారణం వల్లనే చర్చి దేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకొని విశ్వాసుల మీద కనీ వినీ ఎరుగని దమనకాండను, దౌర్జన్యాన్ని సాగించింది. అయితే చరిత్రలో ఇలా హింసకు పాల్పడిన ఘటనలున్నా, మరోవైపు క్రై స్తవానిదైన ప్రత్యేక ప్రేమ, క్షమా సౌరభం లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, తమ జీవితాలనే ప్రేమపూర్వక క్రీస్తు సందేశంగా మలచుకున్న మదర్ థెరిసాలాంటి ఎంతోమంది నిస్వార్ధపరులైన పరిచారకులు, గొప్ప అపొస్తలులు, దైవ జనులు ఒక మతం స్థాయికి దిగజారకుండా క్రై స్తవాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఉద్యోగాలు, అడ్మిషన్ల దరఖాస్తుల్లో ‘మతం’ అనే కాలమ్ ఉంటే, దాన్ని క్రై స్తవులు వాడుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే, క్రై స్తవం ఒక మతం కాదు. అది యేసు జీవించి, తన అనుచరులు కూడా అలాగే జీవించాలని ఆశించి, ఆదేశించిన ఒక విలక్షణమైన జీవన శైలి. క్రీస్తులాగా జీవించడం, తాను ఒకవైపు కరుగుతూ మరోవైపు లోకానికి ప్రేమ అనే వెలుగును పంచే కొవ్వొత్తి లాంటి జీవితం క్రై స్తవం!! క్రైస్తవం అంటే కొన్ని ఆచారాలు, నియమాలు,ఆరాధనా విధానాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కాదు. ముందు క్రీస్తు అనుచరుని జీవితం మారాలి. అలా అతనిలో వచ్చిన మార్పు వల్ల ప్రభావితమైన లోకంలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. అదే నిజ క్రై స్తవానికున్న శక్తి. విశ్వాసులు, పరిచారకులు ముందు తమకున్న మతం ముసుగు తీసేసి, నిజాలు చెప్పడం ఆరంభించాలి. సొంత డబ్బా వాయించుకునే ప్రచారార్భాటాలు మానెయ్యాలి. ‘నా సభకు లక్షమంది వచ్చారు’ అని ప్రకటించుకోవడం ‘అర్ధసత్యమే’ అని తెలుసుకోవాలి. ఎవరికి వారు గొప్పగా చాటింపు వేసుకోవడం మతపరమైన డాంబికం. అలా కాక ‘నా సభలో వాక్యం విన్న వారిలో వంద మంది తమ జీవితాన్ని మార్చుకున్నారు’ అని చెబితే అది పూర్తి సత్యం. అర్ధసత్యాలమీద, పరిచారకుల అతిశయాస్పద ప్రకటనల మీద, అసత్యాల మీద ఆధారపడేది మతం!! పరిచారకుల జీవితమే నిత్య సందేశంగా, నిస్వార్థం, పారదర్శకత, ప్రేమ, క్షమాపణే సూత్రంగా పరిఢవిల్లేది యేసు బోధించి, ఆచరించిన నిజ క్రై స్తవం. అదే బేత్లెహేములో నాటి తొలి క్రిస్మస్లో పరిమళించిన నిరాడంబరమైన, నిస్వార్థమైన, అనంతమైన దేవుని స్వచ్ఛమైన ప్రేమ!!! రక్తంకన్నా చిక్కనిది దేవుని ప్రేమ... ‘క్రిస్మస్’ను ఇపుడు మనమంతా ఆనందోత్సాహాలు, వేడుకలకు ప్రతీకగా జరుపుకొంటున్నాము కాని చరిత్రలో రెండువేల ఏళ్ల క్రితం తొలి క్రిస్మస్ జరిగిన బేత్లెహేములో పట్టపగలే చీకట్లు కమ్మి, అక్కడి వీధుల్లో రక్తపుటేరులు ప్రవహించాయన్నది వాస్తవం. యూదులరాజుగా యేసు జన్మించాడంటూ తూర్పు దేశపు జ్ఞానులు తెచ్చిన వార్త నాటి యూదులదైన యూదా రాజ్యానికి రాజుగా ఉన్న హేరోదులో కలవరాన్ని సృష్టించింది. తన సింహాసనానికి అడ్డొస్తారేమోనన్న అనుమానంతో తన సొంత కొడుకులిద్దరినే చంపిన నియంత, అత్యంత క్రూరుడు హేరోదు రాజు. ఇపుడు యూదుల రాజుగా పుట్టిన యేసును వదిలేస్తాడా? బేత్లెహేములో పుట్టినట్టుగా లేఖనాలు చెబుతున్న యేసును పూజించి తిరిగొచ్చి, ఆ వివరాలను తనకు తెలిపితే తాను కూడా వెళ్లి పూజిస్తానంటూ హేరోదు జ్ఞానులకు మాయ మాటలు చెప్పి పంపగా, దేవుడు దర్శనంలో కనిపించి వారికి హేరోదు కుట్రను బట్టబయలు చేశాడు. జ్ఞానులు యేసును దర్శించుకొని, కానుకలు సమర్పించి, పూజించి, దైవాజ్ఞ మేరకు హేరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా, మరో మార్గంలో తమ దేశాలకు వెళ్ళిపోయి నిజంగానే జ్ఞానులనిపించుకున్నారు. తాను మోసపోయానని గ్రహించిన హేరోదు రాజు, శిశువైన యేసును హతమార్చే కుట్రలో భాగంగా, యూదయలోని రెండేళ్ల లోపు మగ శిశువులందరినీ చంపించగా, దేశమంతటా హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. కాని దేవుడప్పటికే యోసేపు, మరియ, బాలుడైన యేసును బేత్లెహేము నుండి ఐగుప్తుకు దాటించి హేరోదు కుట్రను భగ్నం చేశాడు. నీళ్లకన్నా రక్తం చిక్కనిదైతే కావచ్చు, కాని దేవుని ప్రేమ రక్తం కన్నా చిక్కనిది. శాంతి ప్రదాతయైన యేసు ఆగమన శుభవేళ, బేత్లెహేము ఆ పరిసర ప్రాంతాలన్నీ తమ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లాయి, అక్కడి వీధులు రక్తసిక్తమయ్యాయి. కాని దైవకుమారుడైన యేసు స్థాపించబూనిన ప్రేమ, శాంతి, క్షమాపణా సామ్రాజ్యాన్ని బలవంతులు,పాలకులు తమ స్వార్ధం,ఈర‡్ష్య,ఆగ్రహం, అభద్రతాభావం, నియంతృత్వం, క్రూరత్వం, దౌర్జన్యంతో ఆదిలోనే మట్టుపెట్టేందుకు చరిత్రలో చేసిన తొలి ప్రయత్నం విఫలమయింది. ఈ పిలాతు దుర్మరణం తర్వాత, ఇతని స్థానంలో యూదయ రాజుగా నియమింపబడిన పొంతి పిలాతు పిరికివాడు, అందరితో రాజీపడటమే తన సింహాసనాన్ని పదిలపరచుకునే మార్గమని నమ్మినవాడు. అందుకే యూదులతో మంచివాడిననిపించుకునేందుకు యేసును సిలువవేసి ఆయన చరిత్రకు ముగింపు పలకాలన్న అతని కుట్ర కూడా యేసు పునరుత్థానంతో, ఆ తర్వాత క్రై స్తవచర్చి ఆవిర్భావంతో భగ్నమైంది. అమాయకుల కన్నీళ్లతో తడిసిన ఈ తొలి క్రిస్మసే ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి తొలి వేదిక అయ్యింది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, హింస, హత్యల నేపథ్యంలోనే యేసు ప్రభువు వారి క్షమా, కృపా, రక్షణా కేతనం ఉవ్వెత్తున రెప రెపలాడింది. విశేషమేమిటంటే ఒకప్పుడు లోకాన్నంతా గడగడలాడించిన రోమా సామ్రాజ్యం కాలగర్భంలో కలిసి ఆనవాళ్లే లేకుండా పోయింది. కాని శుభవార్త ఏమిటంటే యేసుప్రభువు ఆవిష్కరించిన ప్రేమ సామ్రాజ్యం మాత్రం పరలోక ప్రాభవంతో ఇన్నివేల ఏళ్లుగా అణువణువునా విస్తరిస్తూనే ఉంది. చెడుపైన శాశ్వత విజయం ఎప్పుడూ శాంతిదే అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది చరిత్ర చెప్పే సత్యమన్నదే క్రిస్మస్ ప్రకటించే నిత్య సందేశం. క్రిస్మస్ను ప్రత్యేకం చేసుకోండి... ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్‌గా మీ జీవితంలో మిగిలిపోవాలనుకుంటే ఆ నాటి తొలి క్రిస్మస్ స్ఫూర్తితో కొన్ని పనులు చేయవచ్చు. బహుశా ఎంతోకాలంగా మాటలు నిలిచిపోయిన మిత్రులు, బంధువులకు ఈరోజు సెల్ఫోన్లో హలో చెప్పండి! ఏవో చిన్న చిన్న గొడవలు (పెద్దవైనా ఫర్వాలేదు), మాటపట్టింపులు ఉన్న కారణంగా రాకపోకలు ఆగిపోయిన మీ బంధువులు, మిత్రుల ఇంటికి ఒక చిన్న ‘క్రిస్మస్ కేక్’తో వెళ్లి వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తండి. మీరన్న ఒక మాట లేదా మీ పొరపాటు కారణంగా మనసు నొచ్చుకుని మీతో ముభావంగా ఉన్నవారిని ఒకసారి ప్రేమతో పలకరించి వారికి క్షమాపణ చెప్పండి. మీ సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతోకొంత సాయం అందచేయండి. ఆప్తులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని, ఆసుపత్రులలో పడక మీద ఉన్న మీకు తెలిసిన వారిని వారి బంధువులను పరామర్శించి మీ ప్రేమను తెలుపండి. మీరు మీకోసం తయారు చేసుకున్న కేక్‌లు ఎంత తీయగా ఉంటాయో అప్పుడు తెలుసుకోండి. మీ ఇంట్లో ఈ క్రిస్మస్కు అలంకరించిన దీపాలు ఎంతగా మిరుమిట్లు గొలుపుతాయో అప్పుడు మీరే గ్రహిస్తారు. ఒక్కసారిగా మీ హృదయం, జీవితం కూడా ఎంత తేలికవుతుందో మీరే గ్రహిస్తారు. అన్నీ ఈ ఒక్కరోజే చేయాల్సిన అవసరం లేదు. ఈ వారమంతా క్రిస్మస్ వారమే! ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పనులకు పూనుకోండి. ఇవి పుట్టెడు ఆనందాన్నిచ్చే చిట్టిచిట్టి పనులు. ఇదే ఏసుప్రభువు బోధించిన ప్రేమమార్గం. ఈ మార్గంలో ఎవరికీ ఓటమి లేదు. అంతా విజేతలే! సారీ చెప్పినవారు, చెప్పించుకున్న వారు అంతా సమానులే! ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఇది ఎన్నటికీ విఫలంకాని విజయసూత్రమని ప్రభువే రుజువు చేసి చూపించాడు. ఇదే మనమంతా అనుసరించాల్సిన మార్గమనీ ఉద్బోధించాడు. అంతా యేసుప్రభువులు కానక్కరలేదు. ఎందుకంటే కాలేరు కూడా! అయితే ఆయన బోధించిన ఈ మార్గంలో మనమంతా ఒకటి రెండు అడుగులు వేసినా ఈ లోకం అనూహ్యంగా ఆనందమయమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంతా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. -
కొండపైన దర్శనం...లోయల్లో సేవా సాఫల్యం...
యేసుప్రభువు గలిలయ సముద్ర తీరంలోని ఒక కొండ పైన చేసిన ప్రసంగంలో మానవాళికి ‘పరలోక ధన్యత’ను ప్రకటించాడు. పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘తన కొండ మీది ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు. అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది. అయితే యేసుప్రభువు, మోషే, ఏలీయాలు పాల్గొన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశానికి దేవుడు పేతురు, యాకోబు, యోహానులనే అల్ప మానవులను కూడా పిలవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. యేసు దేవస్వరూపుడు, మోషే ధర్మశాస్త్ర యుగానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి కాగా, మరి పేతురు, యాకోబు, యోహాను ఎవరికి ప్రతినిధులు? యేసుప్రభువు తన సిలువ యాగం ద్వారా ఆవిష్కరించబోతున్న సరికొత్త దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరబోతున్న విశ్వాసులందరికీ ఆనాడు వాళ్ళు ప్రతినిధులు. ఆ శిఖరాగ్ర సమావేశంలో ‘ఇక్కడే ఉండిపోవడానికి పర్ణశాలలు కడతానంటూ’ పేతురు చేసిన వ్యాఖ్యను, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి’ అంటూ ఈ సమావేశాన్ని నిర్వహించిన పరిశుద్ధాత్ముడు వారినుద్దేశించి ఇచ్చిన ఆజ్ఞను సువార్త భాగాలు ప్రస్తావించాయి. లోక మలినానికి దూరంగా ఉన్నహిమాలయాలతో సహా మహా పర్వతాల్ని ఆధ్యాత్మిక స్థావరాలుగా అన్ని మతాల్లాగే యూదు మతం కూడా పరిగణించేది. గొప్ప ఆధ్యాత్మిక దర్శనాలను దేవుడు తన ప్రజలకు కొండ పైన ఇస్తాడు. కానీ ఆ దర్శనాల నెరవేర్పు కోసం‘సేవా క్షేత్రాలను’ మాత్రం కొండ కింది లోయల్లోని సామాన్య ప్రజల సమక్షంలో చూపిస్తాడు. ’కొండ మీదే ఉండిపోదాం’ అని ఎవరికి, మాత్రం ఉండదు? పేతురుకు కూడా అలాగే అనిపించింది, కానీ ‘దర్శన సాఫల్యం’ మాత్రం లోయల్లోని పాపులు, కరడు గట్టిన నేరగాళ్లు, దుర్మార్గులకు దేవుని ప్రేమను ప్రకటించడంలో ఉందని, అందుకు యేసు మాట వినండని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పక్షంగా మాట్లాడటం అంటే ప్రసంగించడం అందరికీ ఇష్టమే, కానీ దేవుని మాటలు వినడమే చాలా కష్టం. కానీ యేసు తన తండ్రి మాటలు విని, లోబడి లోయల్లోకి దిగి వెళ్లి వారిని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను కూడా భూదిగంతాలకు వెళ్లి దేవుని ప్రేమను ప్రకటించి హత సాక్షులై తమ దర్శనసాఫల్యం పొందారు. అలా లోయల్లోని గొంగళిపురుగులను తమ అద్భుతమైన పరిచర్యతో విశ్వాస పరివర్తన చెందిన సీతాకోక చిలుకలుగా మార్చడానికి ఆనాటి రూపాంతర పర్వత శిఖరాగ్ర సమావేశం దిశానిర్దేశం చేసింది. కేవలం యూదులకే అంతవరకూ పరిమితమైన విశ్వాస జీవితం, నాటి రూపాంతరానుభవపు సార్వత్రిక దర్శనంతో, సర్వలోకానికి వర్తించే అపూర్వ ప్రేమమార్గమైంది. స్వనీతి, తామే జ్ఞానులం, తామే అధికులమన్న అహంకారానికి ప్రతీకగా మారిన యూదులు అనే గొంగళిపురుగు నుండే, సాత్వికత్వం, ప్రేమ, క్షమా అనే ఆత్మీయ సౌందర్యానికి ప్రతీకగా ‘క్రైస్తవం’ ఆవిర్భవించింది. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం ఇ–మెయిల్: prabhukirant.@gmail.com -
దేవుని అండతోనే మహా విజయాలు!!
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్పజీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకరయుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళా డు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే వచ్చి తనతో తలపడమంటూ సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతును మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు గొప్పవిజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు. దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’లోకి వారు ఎదగలేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల బలం, మారణాయుధాలు, వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మకవిశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్ని రోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతి కుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి వృక్షంగా ఎదుగుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో వృక్షరూపం దాల్చినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన మన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. మారణాయుధాలతో, కండబలంతో కాక, దేవుని పట్ల గల అచంచల విశ్వాసమనే మహాయుధంతోనే వాటిపై విజయం సాధించగలమన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెల లేని ఆత్మీయ పాఠం. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్