
ఎంతో ఎల్తైన, దృఢమైన, అత్యంత దుర్భేద్యమైన యెరికో పట్టణ ప్రాకారాలు ఇప్పుడు యెహోషువాకు, ఆయన జనులైన ఇశ్రాయేలీయులకు ఎదురుగా ఉన్నాయి. వాగ్దాన దేశమంతా స్వతంత్రించుకోవడానికి యెరికోను స్వాధీనం చేసుకోవడం కీలకం, అత్యంత ఆవశ్యకం కూడా. ఏ విధంగా చూసినా యెరికోలో విజయం శక్తికి మించిన కార్యం! అందరి కళ్లూ నాయకుడైన యెహోషువాపైన ఉన్నాయి. కాని అతని కళ్లు మాత్రం దేవునివైపు చూస్తున్నాయి.
‘మీరంతా ప్రాకారాల చుట్టూ ఆరు రోజులపాటు రోజుకొకసారి తిరగండి, ఏడో రోజు ఏడు సార్లు తిరగండి. అప్పుడు అవి కూలిపోతాయి’ అన్నాడు దేవుడు (యెహోషువా 6:2–4). అంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారమా? అవి వాటంతట అవే కూలిపోతాయా? సణగడం, గొణగడం అలవాటే అయిన ఇశ్రాయేలీయులు బహుశా ఇలా ఆలోచిస్తున్నారేమో! దేవుని ఆదేశం విని ఎవరెలా ప్రతిస్పందించారో బైబిలులో రాయలేదు కాని ఆజ్ఞలు అందిన వెంటనే వారందరినీ నాయకుడైన యెహోషువ ప్రాకారాల చుట్టూ ప్రదక్షిణకు పురికొల్పి వారితోపాటు నడిచాడు.
నలభై ఏళ్ళ అరణ్యవాసంతో దేవుడు చేసిన అద్భుతాలన్నింటికీ ప్రత్యక్షసాక్షిగా దేవుని బాహుబలాన్ని అతను కించిత్తు కూడా సంశయించలేదు. దేవుడేదైనా అన్నాడంటే అది జరిగి తీరుతుందన్నది అతని విశ్వాసం. అందుకే దేవుని ఆదేశాలపాలనకు ‘విధేయత’తో ఉపక్రమించాడు. ఎర్రసముద్రాన్ని రెండు పాయలు చేయడం, క్రమం తప్పకుండా ఆకాశం నుండి మన్నా కురిపించడం, బండ నుండి పుష్కలంగా నీళ్ళు వెలికితీయడం వంటి కార్యాలు చేసిన దేవునికి యెరికో ప్రాకారాలు కూల్చడం ఎంత పని? అన్నది యెహోషువా విశ్వాసం. అందుకే అతనిలో అంత విధేయత!
దేవుని విశ్వసిస్తే దేవుని పట్ల విధేయత కూడా పుష్కలంగా ఉండాలి. విశ్వాసం, విధేయత పర్యాయ పదాలు. దేవుడు ‘చేసిన’ అద్భుతాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆయన చేయబోయే కార్యాలకు ‘విధేయత’ పునాది వేస్తుంది. మనం చాలాసార్లు ‘విశ్వాస పరీక్ష’లో నూటికి నూరుశాతం మార్కులతో పాసవుతాం కాని ‘విధేయతా పరీక్ష’లోనే ఫెయిల్ అవుతుంటాం. విశ్వాస విజయాలకు గండి పడేది మన విధేయత పలచబడినప్పుడే! ఏడు రోజుల తర్వాత కూలిపోయే గోడలచుట్టూ, ఏడు రోజులూ ఇశ్రాయేలీయులను ‘ప్రదక్షిణం’ చేయించిన విధేయత యెహోషువది.
ఆ సమయంలో అతని కళ్లు సమస్యౖయెన ప్రాకారాల మీద కాదు, వాటిని కూల్చేస్తానన్న దేవునిఇదివరకటి అద్భుతాలమీద ఉన్నాయి. నాకున్న యెరికో గోడలాంటి సమస్యను దేవుడు తీర్చడంలేదన్న వ్యసన భావంతో ఉన్నారా? దేవుడు ఇదివరకే చేసిన అద్భుతాలను మననం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్నీ మరువకుండా జ్ఞాపకం చేసుకోండి. అది విధేయతతోనే సాధ్యం. మీ విధేయతే మరో అద్భుతానికి దారి సరాళం చేస్తుంది. ఆరో రోజున వారి విధేయతకు బహుమానంగా దేవుడు యెరికో గోడలు కూల్చాడు. అక్కడి నుంచే ఇశ్రాయేలీలను గొప్ప జనాంగంగా కట్టడం ఆరంభించాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment