అందరివాడు దేవుడు...
అడపాదడపా పూజలు చేసి ముడుపులిస్తే చాలు. దేవుడు ప్రసన్నుడవుతాడన్నది చాలామందికున్న ఒక చులకన భావం. ఆది మానవుడైన ఆదాము హవ్వల కుమారులు కయీను, హేబెలు ఒకసారి దేవునికి కానుకలర్పించారు. దేవుడు కయీనుని తిరస్కరించి మేబెలు కానుకలు స్వీకరించాడు. దాంతో అసూయపడిన కయీను పగబట్టి తమ్ముడైన హేబెలును హత్య చేశాడు. విశ్వాన్నే సృష్టించి పాలించే దేవునికి నా కానుక ఎంత? ఆయన కోరేది నా కానుకలా, నా సత్‌ప్రవర్తనా? అన్న ఇంగితం కోల్పోయిన కయీను అలా చరిత్రలో తొలి హంతకుడయ్యాడు. దేవునికి దూరమైతే, విశ్వాసం లోపిస్తే ఎదురయ్యేవి ఈ అనర్థాలే. ‘నిషిద్ధ ఫలాన్ని తింటే మీరు దేవునితో సమానమవుతారు’ అన్న అపవాది అబద్ధాన్ని నమ్మి ఆ ఫలం తిన్న ఆదాము, హవ్వలు, ‘దేవుడు తమను ఆయన పోలికలోనే సృష్టిస్తే మళ్లీ దేవుళ్లము కావడమేమిటి? అన్న కనీస జ్ఞానం లోపించి అవిధేయులయ్యారు.
అలా సాతాను సృష్టించిన ఒక అబద్ధం, అవిధేయతకు ఆ తరువాత తరంలో అసూయ, కోపం, పగకు తద్వారా హత్యకు మానవాళిని పురికొల్పింది. అలా తరాలు గడిచేకొద్దీ మనిషికి దేవునితో అంతరం పెరిగింది. ఆ దూరం కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని మనిషిలో ఏర్పర్చింది. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు అక్కడెక్కడో దూరంగా అందకుండా ఉంటాడని, నానా ప్రయత్నాలు చేస్తే తప్ప ఆయన ప్రసన్నుడు కాడని మనిషి అలా సిద్ధాంతీకరించుకున్నాడు. సూర్యుడెక్కడో కోట్లాది మైళ్ల దూరంలోనే ఉన్నా ఆయన కిరణాలు రోజూ భూమిని తాకకుండా ఉంటాయా? దేవుడూ అంతే! సూర్యుణ్ణి, ఆయన రశ్మిని విడదీయలేనట్టే దేవుణ్ణి, ఆయన స్వభావమైన ప్రేమనూ విడదీయలేము. ఆయనెక్కడున్నా ఆయన ప్రేమ, కృప మనిషికి నిత్యం అందుబాటులోనే ఉంటుంది. విశ్వాన్నే సృష్టించి పరిపాలించే దేవుడు గుప్పెడైనా లేని మనిషి గుండెలో నివాసం ఉండాలనుకోవడం ఎంతో ఆశ్చర్యకరం. తిరుగులేని ఆయన ప్రేమకు నిదర్శనం కూడా.
- రెవ. టి.ఎ.ప్రభుకిరణ్