దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల అవిధేయత, విచ్చలవిడితనం పరాకాష్టకు చేరుకున్న రోజులవి. ధర్మశాస్త్రబద్ధమైన యూదుమతం పూర్తిగా మృతమై, దేవునికి ప్రజలకు మధ్య వంతెనల్లాగా, రాయబారులుగా ఉండాల్సిన ప్రవక్తలు లేకుండా పోగా, ప్రజలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించి, యథేచ్ఛగా జీవిస్తున్నారు. యెరూషలేము ఆలయంలో బలులు, ఆరాధనలు యధావిధిగానే జరుగుతున్నా, వాటిని నిర్వహించే యాజకవ్యవస్థ కూడా ఉన్నా, యూదా మతమంతా పూర్తిగా ఒక నామమాత్రపు తంతుగా మారిన అధ్వాన్నపు పరిస్థితులవి. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలనుకున్న కాలం సంపూర్ణమైన రోజులు కూడా అవే. యెషయా ప్రవక్త యేసుప్రభువు ఆవిర్భావాన్నే కాదు, ఆయన రాకను, త్రోవను సరాళము చేసే యోహాను పరిచర్యను కూడా 700 ఏళ్ళ క్రితమే ప్రవచించాడు. యోహాను పరిచర్యను మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తూ, ‘ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన తోవలు సరాళము చెయ్యండి, అంటూ అరణ్యంలో కేక వేసే ఒకని స్వరం’ అన్న యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు (యెషయా 40:1–5,9).
యోహాను తల్లి ఎలీసబెతు, యేసు తల్లి మరియకు బంధువు. అతని తండ్రి జఖర్యా యాజక వంశానికి చెందినవాడు. తన పరిచర్య కోసం ప్రత్యేకించి ‘నాజీరు’ గా పెంచమని దేవుడే స్వయంగా అతని తండ్రి జకార్యాను ఆదేశించి, గొడ్రాలైన ఆయన భార్య ఎలీసబెతుకు యోహానును కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు తన 400 ఏళ్ళ మౌనాన్ని అలా తానే బద్దలు కొట్టి యేసుక్రీస్తు పరిచర్యకు ఉపోద్ఘాతంగా, యేసు త్రోవల్ని సరాళము చేసే ఆంతరంగిక సేవకుడిగా యోహానును పంపించే వార్తను జఖర్యాకు ప్రకటించాడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహానును మించిన వారు లేరని యేసుక్రీస్తే ఒకసారి ఆయన్ను శ్లాఘించాడు (లూకా 7:28). యోహాను తన పరిచర్య, ప్రసంగాలకు నిర్జన యూదాఅరణ్యాన్ని వేదికగా, ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాడు. అంటే, వేషధారణకు మారుపేరుగా మారిన పరిసయ్యులు, శాస్త్రులనే యూదుమతాధిపతులుండే యెరూషలేము పట్టణాన్ని వదిలేసి, వారికి దూరంగా యోహాను నిర్జనారణ్యంలోకి వెళ్తే, అతని ప్రసంగాలు విని, మారుమనస్సు పొంది.
బాప్తిస్మము పొందేందుకు వందలాదిమంది పట్టణాలు వదిలి అతన్ని చేరేందుకు అడవిబాట పట్టారు. దేవుని అభిషేకం లేని పరిసయ్యుల ప్రసంగాలు యెరూషలేములో మారుమోగినా అవి విని ఎవరూ మారలేదు కానీ, యోహాను ప్రసంగాలు దైవస్వరంగా అరణ్యం లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, అశేష ప్రజానీకం ఆయన కోసం అరణ్యానికి తరలి వెళ్లి అవి విని పరివర్తన చెందారు. అలా నిర్భయుడైన ప్రవక్తగా, దేవుడే పంపిన ప్రవక్తగా యోహానును ప్రజలు గుర్తించారు. తన సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్రమ కాపురం చేస్తున్న హేరోదు రాజు ‘అనైతిక జీవితాన్ని’ యోహాను చీల్చి చెండాడి, చెరసాల పాలయ్యాడు, చివరికి శిరచ్ఛేదనానికి కూడా గురయ్యాడు (మత్తయి 14:10). కానీ పరిచర్యలో యోహాను ఏ మాత్రం రాజీపడలేదు.
కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలంటే, ముందుగా తాను కాలుష్యానికి దూరంగా ఉండాలన్నదే అరణ్యంలోకి వెళ్లడంలో యోహాను ఉద్దేశ్యం. అలా డబ్బు, పేరు, అధికారం, వేషధారణ, విలాసాలకు దూరంగా అరణ్యంలో అజ్ఞాతంగా బతుకుతూనే వేలాదిమంది జీవితాల్ని అక్కడికే ఆకర్షించి, వారిని మార్చి, రక్షకుడైన యేసుక్రీస్తు త్రోవల్ని నిబద్ధతతో సరాళం చేసి, యేసు చెప్పులను కూడా విప్పడానికి తాను యోగ్యుడను కానంటూ వినమ్రంగా ప్రకటించి, ఆ యేసుకే బాప్తీస్మాన్నిచ్చి, తద్వారా పరిచర్యలోకి ప్రభువును ఆహ్వానించిన అసాధారణ, విలక్షణ దైవజనుడు యోహాను.
– రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment