బుద్ధిహీనతతో చేజారిన సువర్ణావకాశం | Doctor TA Prabhu Kiran Jesus Christ Suvartha in sakshi | Sakshi
Sakshi News home page

బుద్ధిహీనతతో చేజారిన సువర్ణావకాశం

Published Thu, Nov 26 2020 6:40 AM | Last Updated on Thu, Nov 26 2020 7:59 AM

Doctor TA Prabhu Kiran Jesus Christ Suvartha in sakshi - Sakshi

అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ తన ఆర్ధిక సలహాదారుడు జె.కె.గాల్‌ బ్రెత్‌ ఇంటికి ఫోన్‌ చేశాడు. ఆయన పడుకున్నాడని పనిమనిషి ఎమిలీ జవాబిచ్చింది. ‘నేనెవరో తెలుసా? ఆయన్ను లేపు’ అన్నాడా అమెరికా అధ్యక్షుడు. ‘నేను గాల్‌ బ్రెత్‌ గారికి  పనిచేస్తున్నాను, అమెరికా అధ్యక్షునికి కాదు’ అని జవాబిచ్చి ఆమె ఫోన్‌ పెట్టేసింది. ఆగ్రహించాల్సింది పోయి, లిండన్‌ జాన్సన్‌ ఆమె పనితీరును మెచ్చి ఎమిలీని వైట్‌ హౌస్‌లో నియమించాడు. యజమాని మనసెరిగి, మెలిగి, ఆయన్ను మెప్పించడం అనే అంశంపైన యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు (మత్తయి 25:14–30).

ఒక భూస్వామి తన ముగ్గురు దాసులను పిలిచి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకరికి ఐదు తలాంతులు, ఇంకొకరికి రెండు తలాంతులు, మూడవవాడికి ఒక తలాంతు ఇచ్చి మరో దేశానికి వెళ్ళిపోయాడు. ఒక తలాంతు వెయ్యిడాలర్ల విలువచేసే వెండితో సమానం. భూస్వామి చాలా కాలానికి తిరిగొచ్చి లెఖ్ఖ అడిగితే మొదటివాడు తన ఐదు తలాంతులు వాడి మరో ఐదుతలాంతులు సంపాదించానని చెప్పగా ఆయన ఎంతో సంతోషించి వాటిని కూడా అతనికే ఇచ్చేశాడు. రెండవ వాడు కూడా మరో రెండు తలాంతులు సంపాదించానని చెబితే అతనికి కూడా అదే చేశాడు. మూడవ దాసుడు మాత్రం ఆయనిచ్చిన ఒక తలాంతునూ భద్రంగా తెచ్చిచ్చి, ‘నీవు చాలా కఠినుడివి. దీన్ని పోగొడితే శిక్షిస్తావని భయపడి, గుంత తవ్వి దాన్ని భద్రంగా దాచాను. నీది నీవు తీసుకో’ అన్నాడు. యజమాని అందుకు ఆగ్రహోదగ్రుడై, అతనివన్నీ మిగిలిన ఇద్దరికిచ్చి, చీకటి గదిలో అతన్ని బంధించాడు.

అసలేం జరిగింది? ఈ ముగ్గురూ నిజానికి బానిసలు. బానిసలకు స్వాతంత్య్రం ఉండదు, హక్కులుండవు. వాళ్ళ పూర్తి జీవితం, సమయం, సామర్ధ్యం పైన యజమానికే పూర్తి హక్కులుంటాయి. అలాంటిది, యజమాని వారిని నమ్మి వాళ్లకు తలాంతులిచ్చి, ఆ బానిసలను కాస్తా తన ఆస్తిలో భాగస్వాములను చేశాడు. ఆ తలాంతులతో ఏదైనా చెయ్యగలిగిన స్వాతంత్య్రాన్ని వారికిచ్చాడు. వారి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తనతో సమానమైన స్థాయినిచ్చాడు. చాలా కాలం తర్వాత తిరిగొచ్చాడంటే, వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రయోజకులయ్యేందుకు వారికి బోలెడు సమయమిచ్చాడు. అయితే మూడవ వాడు మూర్ఖుడై, అతితెలివి తేటలకు పోయి యజమాని ఉగ్రత పాలయ్యాడు. యజమాని మళ్ళీ వచ్చేదాకా దొరికిన సమయాన్నంతా సోమరితనంతో, నిష్ప్రయోజకంగా గడిపాడు. వెయ్యి డాలర్ల విలువ చేసే వెండినైతే జాగ్రత్తగా కాపాడాడు కాని, డబ్బుతో వెలకట్టలేని ఆయనిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాన్ని, గుర్తింపును, ముఖ్యంగా సమయాన్ని మాత్రం దుబారా చేశాడు.

తాళం వేసి గొళ్ళెం మర్చిపోవడమంటే ఇదే. చాలా మంది విశ్వాసులు, దేవుడిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాల్ని, సమయాన్ని దుబారా చేస్తూ, డబ్బును ఆస్తులను మాత్రం ‘జాగ్రత్తగా’ కాపాడుకోవడమే తెలివైన విధానమనుకొని, బాధ్యతారహితంగా బతుకుతారు. అలాంటి సోమరులు, పిసినారులకు జీవితంలో సుఖముండదు, సమాజంలో పరువుండదు, జీవన సాఫల్యం అసలే ఉండదు. భూస్వామి అసలు బాధ, కోపమేమిటంటే, తాను అంతటి సువర్ణావకాశమిచ్చినా, ఆ మూడవ వాడు మారలేదు, ఆత్మీయంగా ఎదగలేదు, ప్రయోజకుడు కాలేదు.

పైగా యజమాని ఔదార్యాన్ని, ప్రేమను, కృపను అర్థం చేసుకోకుండా, తన దౌర్భాగ్యాన్ని తెలుసుకోకుండా, ‘నీవు విత్తని చోట కోసేవాడవంటూ’ ఆయనపైనే అభియోగం మోపాడు. రేపు పరలోకంలో మన ‘ప్రోగ్రెస్‌ రోపోర్టుల్లో’ ఇవే వ్యాఖ్యలుంటాయేమో జాగ్రత్త!! దేవుని మనసు, ప్రణాళికల మేరకు, పదిమందికీ ప్రయోజనం కలిగిస్తూ ఆయన్ను ఎంత మెప్పించామన్నదే మన ప్రతిభకు, విలువకు గీటురాయి. కరెన్సీ కట్టలెన్ని కూడబెట్టినా దేవుని దృష్టిలో అవి కేవలం చెత్త కాగితాల గుట్టలే!! కాబట్టే, ఆ రోజున దేవాలయంలో పెద్దమొత్తాలిచ్చిన ధనికులంతా డాంబికంతో తమ ఫలాన్ని పోగొట్టుకొని పరలోకంలో పరమ నిరుపేదలుగా మిగిలిపోతే, ఒక పేద విధవరాలు మాత్రం కేవలం రెండు కాసులిచ్చి దేవుని మనసు గెలుచుకొని పరలోకంలో అందరికన్నా ధనికురాలు, ధన్యురాలైంది.  
–రెవ.టి.ఏ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement