‘రాజీపడటం’ అనే మాటే బైబిల్‌లో ఎక్కడా కనిపించదు. కానీ క్రైస్తవంలో, చర్చిల్లో మాత్రం ఇపుడు ఎక్కడ చూసినా రాజీపడటమే కనిపిస్తోంది. ఇశ్రాయేలీయుల నాయకులైన మోషే, అహరోను, దేవుని ఆరాధించేందుకు అరణ్యంలోకి మూడు దినాల ప్రయాణమంత దూరం వెళ్ళడానికి తన ప్రజలను అనుమతించమని దేవుడు ఆదేశిస్తున్నాడని ఐగుప్తు రాజు ఫరోకు తెలిపారు. నన్ను ఆదేశించడానికి ఆ దేవుడెవరు (ఐగుప్తీయులకు ఫరోయె దేవుడు మరి)? మిమ్మల్ని పోనిచ్చేదిలేదన్నాడు ఫరో. ఆ దశలో దేవుడు ఐగుప్తు మీదికి తెగుళ్లు పంపడం మొదలుపెట్టగా, మూడు దినాల ప్రయాణమంత దూరం కాదు కానీ, కొద్ది దూరం వెళ్లి దేవుణ్ణి ఆరాధించి వెనక్కి రండంటూ ఫరో కొంత వెనక్కి తగ్గాడు.
దేవుని ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందులో రాజీపడబోమని తాము కోరినట్టుగా తమను పంపమని మోషే పట్టుబట్టగా, దేవుడు మరికొన్ని తెగుళ్లు పంపాడు. పోనీ, పురుషులు మాత్రమే వెళ్లిరండంటూ ఫరో మరి కొంత తగ్గాడు. అలా కనీసం తమ కుటుంబాల కోసమైనా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారని ఫరో ఆలోచన. అది కూడా కుదరదని, దేవుని ఆదేశాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని మోషే బదులిచ్చాడు. మళ్ళీ తెగుళ్లు సోకగా, పశువులన్నీ ఇక్కడే వదిలేసి కుటుంబాలతో వెళ్ళవచ్చని ఫరో మరింత తగ్గినా, మోషే అందుకు ఒప్పుకోలేదు.
ఇక ఈ సారి దేవుడు ఐగుప్తీయుల ప్రతి ఇంట్లోనూ వాళ్ళ జేష్ఠ కుమారుడు చనిపోయే భయంకరమైన విపత్తును సృష్టించాడు. దాంతో, ఫరో పూర్తిగా దిగివచ్చి, అప్పటికప్పుడు ఐగుప్తు వదిలి వెళ్లేందుకు ఇశ్రాయేలీయులను ఆదేశించాడు (నిర్గమ 8:28, 10:11, 24). అయితే దేవుడు కావాలనే, దగ్గరి దారిలో కాకుండా, ఎఱ<సముద్రపు చుట్టుదారిలో వారిని నడిపించాడు. సముద్రం మధ్యలో దేవుడు ఏర్పర్చిన దారిలో నడుస్తూ ఇశ్రాయేలీయులు అవతలి ఒడ్డుకు చేరగా, వారిని తరుముతూ వచ్చిన ఫరో, అతని సైన్యం ఇంకా సముద్రపు దారి మధ్యలో ఉండగానే నీళ్లు తిరిగి కలిసిపోయి, వాళ్లంతా నీటమునిగి చనిపోయారు. దేవుని ఆదేశాలతో, ఆయన కట్టడలతో రాజీపడటం, దేవుని ధిక్కరించడమే అంటుంది బైబిల్!!
దేవుని పట్ల 99.9 శాతం విధేయత కూడా పూర్తిగా అవిధేయత కిందే లెఖ్ఖ. ఏదైనా ఒకటి ‘99.9 శాతం సక్సెస్’ అనగానే ’ఫరవాలేదే’ అనిపిస్తుంది కానీ మీకు తెలుసా, అందులో చాలా ప్రమాదముంది. ఈ ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా ఎగిరిన లక్షకుపైగా విమానాల్లో 99.9 శాతం సురక్షితంగా గమ్యానికి చేరాయంటే, వంద విమానాలు కూలి లక్ష మంది దాకా చనిపోయారని అర్ధం!! గిన్నెడు పాయసంలో పడ్డ ఒక చిన్న చుక్కంత విషంలాంటిదే, అంతటి ప్రమాదకరమైనదే ఆ 0.1 శాతం అవిధేయత!!
విధేయత అంటేనే రాజీకి ఏ మాత్రం తావు లేని సంపూర్ణత్వం. మన జీవితంలో లేదా కుటుంబాల్లో దేవుని వాగ్దానాలు నెరవేరడం లేదంటే, లోపం మన విధేయతలోనే ఉందని ముందు గ్రహించాలి. ఎందుకంటే, బైబిల్ పేర్కొనే దేవుని వాగ్దానాలన్నీ నూటికి నూరుపాళ్ళు దీనులు, దేవునికి విధేయులైన వారికే వర్తిస్తాయి. మన దీనత్వం, విధేయతే దేవునితో నిరంతర సహవాసానికి తలుపులు తెరుస్తాయి. మనలోని ఆత్మవరాలను, ఆంతర్యశక్తిని, అర్హతలను ఆ దైవసహవాసం నిద్రలేపి క్రియాత్మకం చేస్తుంది. సత్యాన్ని సత్యంగా, మోసాన్ని మోసంగా, వేషధారణను వేషధారణగా మనకు ఆ శక్తి ఉపకరిస్తుంది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనత్వం, విధేయత కూడా రెండు పార్శా్వలున్న నాణేలు!!
వాటి ఒక పార్శ్వం దేవునికి తల వంచడమైతే, మరొక పార్శ్వం లోక సంబంధమైన అరాచకాలకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడటం అని తెలుసుకోవాలి. దేవునికి నిజంగా విధేయుడైన విశ్వాసి, దైవవ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఎదిరించి పోరాడుతాడు. కళ్లెదుటే చర్చిలో, సమాజంలో అన్యాయం, మోసం, ఆత్మీయ భ్రష్టత్వం, దైవవ్యతిరేకత, డబ్బు, ఆస్తుల దుర్వినియోగం కనిపిస్తున్నా, ‘దేవుడు చూసుకుంటాడులే’ అని తప్పించుకు తిరిగే పిరికివాళ్ళే, నిత్యనరకంలో మొదటి వరుసలో ఉంటారు. క్రైస్తవం మూలాలు ఇశ్రాయేలులో ఉన్నాయి. ఇశ్రాయేలు అనే హెబ్రీ పదంలో ‘పోరాడేవాడు’ అనే అర్థం ఇమిడి ఉంది. అందువల్ల దేవుని ఎదుట తలవంచి, నిరంకుశత్వాన్ని, అన్యాయాన్ని తలెత్తి ఎదిరించి పోరాడటమే క్రైస్తవానికి నిజమైన నిర్వచనం.
–రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment