అమెరికాలోని విస్కాన్సిన్ లో ఒక షాపింగ్ మాల్ చిరుద్యోగి, ఏడాదంతా కూడబెట్టిన తన డబ్బుతో బహుమానాలు కొని క్రిస్మస్ సమయంలో సాంటాక్లాజ్ గా వాటిని పిల్లలకు పంచుతాడు. అంతా అతన్ని సాంటా అనే పిలుస్తారు. ఒక క్రిస్మస్ సమయంలో చిన్న పిల్లవాడు, వృద్ధురాలైన అతని తాతమ్మ, చేతిలో ఒక పదేళ్ల పాప ఫోటోతో వచ్చి ఆయన్ను కలిశారు. ఎవరీమె? అనడిగాడు సాంటా. ‘నా సోదరి శారా’ అన్నాడా పిల్లాడు. అతన్ని దగ్గరికి తీసుకొని ‘ఇదిగో ఈ బహుమానాల్లో నీకు, నీ సోదరికి కూడా ఏమి కావాలో తీసుకో’ అన్నాడు సాంటా. అపుడతని తాతమ్మ, ‘శారా రక్తకణాల కాన్సర్‌తో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ క్రిస్మస్ దాకా ఆమె బతకదేమో అంటున్నారు డాక్టర్లు. కాని శారా ఈ క్రిస్మస్ కు సాంటాను చూడాలనుకొంటోంది.
వీలైతే ఒకసారి ఆసుపత్రికి రాగలరా? అని ఆమె సాంటాను కన్నీళ్లతో ప్రాధేయపడింది. శారా కథ విన్న సాంటా బాగా కలత చెంది, సరేనన్నాడు. ఆ సాయంత్రమే తన సాంటాడ్రెస్‌లో అతను ఆసుపత్రికి వెళ్ళాడు. గదిలో శారా అస్థిపంజరంలాగా మంచం పైన ఉంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు, తాతమ్మ, మరొక ఆంటీ చుట్టూ ఉన్నారు. కృశించిన ఆమె వంటి నిండా మచ్చలున్నాయి. కీమోథెరపీతో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. గదినిండా మృత్యువు వాతావరణం. సాంటా మనస్సు చివుక్కుమంది.
అయినా తమాయించుకొని, సాంటా పద్ధతిలో ఒహ్హో.... అంటూ పెద్దగా ఆనంద శబ్దాలు చేస్తూ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూసి ఆనందం పట్టలేక ‘సాంటా ...’ అంటూ శారా గట్టిగా అరిచి మంచం మీది నుండి లేవబోయింది. సాంటా పరిగెత్తుకెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఆమె పక్కనే కూర్చున్నాడు. శారా ఆనందంతో సాంటాకు ఏవేవో ఊసులు చెబుతోంది. కన్నీళ్లు ఆపుకొంటూనే సాంటా అవన్నీ వింటూ తాను కూడా చెబుతున్నాడు. శారాలో అంత ఆనందాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి కూడా అంతు లేకుండా పోయింది. దానికి కారకుడైన సాంటాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలో నర్స్ వచ్చి, ఇక వెళ్లిపోవాలంటూ సైగచేసింది. ‘శారా, ఒక దేవదూతను నీకోసం ప్రత్యేకంగా నియమించమని దేవుని ప్రార్ధిస్తాను’ అన్నాడాయన.
అంతా కళ్ళు మూసుకోగా, సాంటా ఆమె మంచం వద్ద మోకరిల్లి, శారా తల మీద చేయి పెట్టి,‘దేవా ఈ చిన్న బిడ్డను ముట్టండి, శారా వ్యాధిని బాగుచెయ్యండి’ అంటూ ప్రార్ధించాడు. అంతా ‘ఆమెన్’ అన్న వెంటనే, ‘సైలెంట్ నైట్...’ అనే సాంప్రదాయక క్రిస్మస్ కీర్తనను సాంటా శ్రావ్యంగా అందుకోగా, చెమ్మగిల్లిన నేత్రాలతో సారాతో సహా అంతా కలిసి అద్భుతంగా పాడారు. ‘శారా, నేను చనిపోతున్నాను అనికాక, నేను బాగవుతాను అన్న భావన ఇక నుండి నీలో బలపడాలి. ఈ వేసవిలో నువ్వు నీ స్నేహితులతో తనివి తీరా ఆడుకోబోతున్నావు. వచ్చే ఏడాది క్రిస్మస్ సమయంలో నా మాల్ కు వచ్చి నన్ను కలుసుకోబోతున్నావు’ అని సాంటా శారాకు ధైర్యం చెప్పాడు. మెరిసే కళ్ళతో శారా ‘సరే సాంటా’ అంది . సాంటా శారాకు ఆటవస్తువులివ్వలేదు, ఆ క్రిస్మస్‌కు జీవితంపై ‘ఆశ’ అనే గొప్ప బహుమతినిచ్చాడు. అంతా ఆయన్ను హత్తుకొని సాగనంపారు. శాంటా రాకతో అక్కడి శ్మశానవాతావరణం కాస్తా పండుగ వాతావరణమైంది.
ఏడాది తరువాత మాల్‌కు ఒకమ్మాయి వచ్చి సాంటాను కలిసి ‘నేను గుర్తున్నానా సాంటా?’ అనడిగింది. పిల్లలందరితో అన్నట్టే ‘ఎందుకు గుర్తులేవు? ఉన్నావు’ అన్నాడు సాంటా. ‘పోయిన ఏడాది నన్ను చూసేందుకు మీరు ఆసుపత్రికి వచ్చారు’ అని ఆమె అంటూండగానే సాంటాకు గుర్తొచ్చి ‘నీవు శారావు కదూ’ అన్నాడు అత్యాశ్చర్యంగా. అద్భుతం!! జుట్టు బాగా పెరిగి, ఎంతో బొద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది శారా. ఆనందబాష్పాలతో శారాను సాంటా హత్తుకున్నాడు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈసారి ఆమె బొమ్మల కోసం రాలేదు. తనలాంటి పిల్లలకు పంచమంటూ బోలెడు ఆటబొమ్మలు, వస్తువులు తెచ్చిచ్చి వెళ్ళింది. ‘ఇది నేను ఎన్నటికీ మర్చిపోలేని క్రిస్మస్’ అంటూ, శారాకిచ్చిన ‘కొత్త జీవితం’ అనే బహుమానానికి ఆకాశం వైపు చూస్తూ సాంటా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
నిరుపేదలు, ముఖ్యంగా నల్లజాతీయుల జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని నింపేందుకు కొందరు క్రై స్తవ పెద్దలు అమెరికాలో 1773 లో నెలకొల్పిన సంప్రదాయమే సాంటా క్లాజ్ గా ప్రసిద్ధి చెందింది. ఇవ్వడంలోని ఆనందాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా ఇచ్చిన ‘క్రిస్మస్’ ద్వారా దేవుడు మానవాళికి నేర్పించాడు. అది అర్ధం కాక, జీవితంలో ఆనందించడం తెలియని, ఇతరులు ఆనందిస్తే ఓర్వలేని, ‘డబ్బు దండగ’ అని అన్నింటినీ కొట్టి పారేసే కొందరు ‘క్రై స్తవ పరిసయ్యులు’, అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా? సాంటా క్లాజ్ సంప్రదాయం బైబిల్‌లో ఉందా? అంటూ కోడిగుడ్డుపై ఈకలు లాగుతుంటారు.
సెల్ ఫోన్లు, ఫేస్‌బుక్ బైబిల్‌లో ఉన్నాయా? మరి వాటినెందుకు వాడుతున్నారు? మరి కొందరైతే, క్రిస్మస్, తోటివారు, పేదల పట్ల మన ప్రేమను చూపే పండుగైతే, ఎన్ని ప్రసంగాలు చేస్తే లేదా ఎన్ని వింటే అది అంత గొప్ప క్రిస్మస్ అని భావించే స్థాయికి దిగజారారు. మనది అనుదినం దేవుని ప్రేమను ప్రకటించే జీవితమైతే, ఏడాదికి 365 క్రిస్మస్ పండుగలు చేసుకొంటున్నట్టే. లేకపోతే, యేడాదికి కనీసం ఒకటైనా అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోవద్దా??
(అమెరికాలో మార్క్ లియొనార్డ్, ఆయన భార్య సుసాన్ లియొనార్డ్ అనే జంట సాంటా క్లాజ్ లుగా ఎన్నో ఏళ్ళ పాటు పేద పిల్లల జీవితాల్లో ఆనందాన్ని నింపి, తమ అనుభవాలను ఒక పుస్తకంగా రాశారు. అందులోని ఒక వాస్తవ గాథ ఇది).
– రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment