శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10).
ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా?
మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా.
అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం.
ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment