Jesus is Lord
-
‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’
శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10). ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా? మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా. అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం. ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మనిషి స్వార్థంతో మసకబారిన దేవుని ప్రేమ!!
పస్కా పండుగనాచరించడానికి యూదులంతా యెరూషలేము పట్టణానికి రావాలన్నది ధర్మశాస్త్ర నిబంధన (నిర్గమ 23:7). అందువల్ల యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే పస్కాపండుగ కోసం యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము ప్రజలను, పండగనాచరించడానికి అక్కడికి వచ్చిన యూదులనుఉద్దేశించి ‘నేను ఆకలితో ఉన్నపుడు నాకు మీరు భోజనం పెట్టారు, నాకు దాహమైనపుడు నీళ్లిచ్చారు, పరదేశిగా ఉన్నపుడు ఆశ్రయమిచ్చారు, వస్త్రాలు లేనపుడు వస్త్రాలిచ్చారు, రోగినై వుంటే, చెరసాలలో ఖైదీగా ఉంటే నన్ను మీరు పరామర్శించారంటూ యేసు చేసిన బోధ యెరూషలేములో పెద్ద సంచలనమే రేపింది (మత్తయి 25;35,36), ఈ బోధ విన్న వాళ్లంతా, ‘ప్రభువా, మీకోసం మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము?’ అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘నాకు ప్రత్యక్షంగా చెయ్యలేదేమో, కానీ మీ చుట్టూ ఉన్న పేదలు, నిరాశ్రయులైన వారికి మీరు చేసిన ప్రతి మేలూ, సహాయమూ నాకు చేసినట్టే’’ అని వివరించి, ఇలా పేదలను ఆదుకున్న ‘మీరంతా నా పరలోకపు తండ్రిచేత ఆశీర్వదించబడినవారు’ అని ప్రకటించాడు. దేవుని దర్శనం కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన నాటి యూదులందరికీ, ‘దేవుని చూసేందుకు ఇంత దూరం రానఖ్ఖర్లేదు, మీరుండే ప్రాంతాల్లోనే మీ చుట్టూ ఆపదల్లో, అవసరతల్లో ఉన్న పేదలు, బలహీనులకు అండగా నిలిస్తే చాలు, దేవుని చూసినట్టే, ఆయన్ను సేవించినట్టే’ అంటూ యేసు చేసిన నాటి బోధతో పండుగ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లిన యూదు ప్రజలు, ప్రభావితులై వచ్చే ఏడాది యెరూషలేముకు రాకపోతే, వారి కానుకలు లేక ఆలయ ఖజానా వెల వెలబోతే, యాజకులు, ఆలయ నిర్వాహకులైన లేవీయులు బతికేదెలా? ఆలయ ప్రాంగణంలో అనుబంధంగా సాగుతున్న వ్యాపారాలు మూతపడితే ఎంత నష్టం? వెంటనే యాజకులు, యూదు ప్రముఖులు సమావేశమై ‘ఇక యేసును చంపాల్సిందే. కాకపోతే పండుగలో చంపితే ప్రజలు తిరుగబడతారు గనుక నిదానంగా ఆ పని చేద్దాం’ అని తీర్మానించుకున్నారు (మత్త 26:3,4). దేవుని మానవరూపమూ, తానే దేవుడైన యేసును చంపేందుకు, ఆయనకు ఆరాధనలు నిర్వహించే వారే కుట్ర చెయ్యడం కన్నా మరో విషాదం ఉంటుందా? దేవాలయ యాజక వ్యవస్థ స్వార్ధపూరితమైన ప్రతిసారీ, చరిత్రలో ఇలాంటి అనర్థాలే జరిగాయి. దేవుని ఉదాత్తమైన సంకల్పాలను మరుగు పర్చగల ‘నాశనకరమైన శక్తి’ మనిషి స్వార్థానిదని మరోసారి రుజువైంది. దీనికన్నా విషాదకరమైన పరిణామం మరోటి జరిగింది. పస్కా పండుగ మరునాడే అంటే అర్ధరాత్రి దాటగానే, ప్రజలంతా గాఢనిద్రలో ఉండగానే యేసును తాను అప్పగిస్తానని, ఆయన్ను అర్ధరాత్రే బంధించి, ప్రజలు నిద్ర లేచేలోగా విచారణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని యేసు శిష్యుల్లోనే ఒకడైన యూదా ఇస్కరియోతు ఆలయ యాజకులకు సూచించి అందుకు ముప్పై వెండినాణేలకు వారితో ఒప్పందం చేసుకున్నాడు. చివరికి అదే జరిగి మరునాడే యేసును సిలువ వేశారు. యేసు బోధల్ని ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి చేరవేయవలసిన చర్చి, పరిచారకుల వ్యవస్థ తమ స్వార్థం కోసం వాటిని కలుషితం చేస్తున్నందువల్లే, దేవుని రాజ్య నిర్మాణం ఆగిపోయింది, ఎంతోశక్తితో సమాజాన్ని ప్రభావితం చేసి లోక కల్యాణానికి కారణం కావలసిన క్రైస్తవం’ పేలవమైంది. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
శాంతి సమాధానం సాఫల్యం దేవుడు ఇచ్చే సంపదలు!
‘పస్కా’ అనే పులియని రొట్టెల పండుగను యెరూషలేములో ఎంతో ఘనంగా ప్రతి ఏడాదీ జరుపుతారు. ప్రపంచంలోని యూదులంతా ఇప్పటికీ ఈ పండుగ చేసుకోవడానికి యెరూషలేముకొచ్చి అక్కడి మహా దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు. యేసు ఆయన శిష్యులు కూడా పస్కా పండుగ కోసమే ఒకసారి యెరూషలేము కొచ్చారు. ఐగుప్తు దాస్య విముక్తికి సూచనగా కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇశ్రాయేలీయులు ఆ పండుగను దేవుని ఆదేశాల మేరకు వాగ్దానదేశానికి వెళ్తున్న అరణ్యంలో తొలిసారిగా ఆచరించారు. అప్పటి నుండీ దేవుని ప్రజలు కొన్ని వందల ఏళ్లుగా పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. ఈసారి పస్కా పండుగ లో యేసే సిలువలో తనను తాను పస్కా పశువుగా బలియాగం చెయ్యబోతున్నాడు. యేసు ఆ విషయాన్ని తన శిష్యులకు ఎంతగా బోధించినా వారికర్థం కావడం లేదు. ప్రభువు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతైతే, ఏకంగా యేసును అమ్మి డబ్బు సంపాదించుకునేందుకు అదొక మంచి అవకాశమని నమ్మాడు. యెరూషలేములో ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను కలుసుకొని, యేసు చుట్టూ ఎప్పుడు చూసినా వేలాది మంది ప్రజలుంటారు. కాబట్టి ఎవరూ లేని చోట ఆయన్ని అప్పగిస్తానని ఒప్పందపడి అందుకు ప్రతిఫలంగా ముప్పై వెండి నాణేలు యూదా తీసుకున్నాడు.యూదా లోకి దేవుని శత్రువైన సాతాను ప్రవేశించాడని, తమతో చేతులు కలిపిన యూదాను చూసి యేసు శత్రువులైన యాజకులు, అధిపతులు ఎంతో సంతోషించారని బైబిల్ చెబుతోంది( లూకా 22:3–6).యేసుప్రభువును సంతోషపెట్టాల్సిన యూదా ఆయన శత్రువులను సంతోషపెట్టడం ఆశ్చర్యంగా ఉంది కదూ?? దేవుని రాజ్యం డబ్బుకు, ఈ లోకప్రలోభాలకు సంబంధించినది కాదని, అది పూర్తిగా పరలోక సంబంధమైన విలువలకు, అత్యున్నతమైన సాక్ష్యపు ప్రమాణాలకు సంబంధించిన అంశమని యేసు ప్రభువు పదే పదే తన శిష్యులకు, ప్రజలకు కూడా తన బోధల్లో స్పష్టం చేశాడు. డబ్బుకు విలువ లేదని, దాని విలువ ప్రభువుకు తెలియదనీ కాదు. యేసు, ఆయన శిష్యులు కూడా తమ ఆహారం తదితర అవసరాల కోసం తప్పకుండా డబ్బు వెచ్చించారు. ఎప్పటికప్పుడు యేసు అభిమానులే ఆ డబ్బు సమకూర్చారు, ప్రభువు ఆ డబ్బు సంచిని యూదా వద్దనే పెట్టాడు కూడా. అయితే డబ్బే సర్వం కాదని యేసు నమ్మాడు, అలాగే జీవించాడు, తన శిష్యులకు అదే బోధించాడు కూడా. లోకం డబ్బుతోనే నడుస్తుంది. కాని డబ్బు కోసమే లోకం నడవకూడ దని ప్రభువు బోధించాడు, తన జీవనశైలితో అదే అంశాన్ని యేసు చాటాడు కూడా. డబ్బుతో కొనలేని, వెలకట్టలేని కుటుంబ ప్రేమలు, స్నేహబంధాలు, శాంతి, సమాధానం, తృప్తి, జీవన సాఫల్యం, ప్రేమ, క్షమాపణ, ప్రజల ఆదరాభిమానాలు, ఇవన్నీ ప్రభువు మాత్రమే ఇవ్వగలిగిన దేవుని రాజ్యసంబంధమైన మూలధనాలు, అమూల్య సిరులు. ఇల్లు, తిండి, డబ్బు లేనోళ్ళు పేదోళ్ళని లోకం నిర్వచిస్తుంది. అన్నమున్నా అది తినేందుకు ఆకలి, అవకాశం లేని వాళ్ళు, మెత్తటి పాన్పు, గొప్ప బంగాళా ఉన్నా హాయిగా నిద్రపోయి, అందులో ఆనందించే వీలు లేని వాళ్ళు. దేవుని కోసం, దేవుని ప్రేమను పొరుగువాడికి చాటేందుకు కాక, ధనార్జనే ధ్యేయంగా జీవితమంతా స్వార్థం కోసం బతికే వాళ్ళే నిరుపేదలని, దారిద్య్రరేఖకు దిగువన జీవించేవాళ్ళని యేసుప్రభువు బోధలు, ఆయన జీవితమూ నిర్వచించాయి. ఈ ‘బాలశిక్ష’ స్థాయిలోనే యూదా ఇస్కరియోతు ఫెయిల్ అయ్యాడు. ‘కామాతురత’ కన్నా భయంకరమైనది ‘ధనప్రలోభం’!! దైవిక రాజ్య విస్తరణలో తనకు సాయం చేసేందుకు దేవుడు పిలిస్తే, మధ్యలో దారి తప్పి ధనప్రలోభానికి గురై, పరిచర్యల్లో నిర్వీర్యులై, భ్రష్టులైన మహామహులెంతో మంది ఉన్నారు. వాస్తవమేమిటంటే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే అతి ప్రాముఖ్యమైన పని కోసం దేవుడు లోకంలోని అత్యుత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులనెన్నుకొని వారిని తనకు పరిచారకులుగా నియమించుకున్నాడు. పోతే, ధనార్జన లాంటి చిన్నపనుల కోసం దేవుడు లోకంలోని కుబేరులనెన్నుకున్నాడు. ఈ తేడా తెలియకనే, యూదా ఇస్కరియోతు దేవుడు తనకిచ్చిన వెలలేని భాగ్యానికి ముప్పై వెండి నాణేల విలువ కట్టి, చరిత్రహీనుడయ్యాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసి హృదయ సింహాసనం దేవునిదే!!
‘నన్ను వెంబడించాలనుకునేవాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దాన్ని పోగొట్టుకొంటాడు, నా కోసం ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు’ అంటూ యేసుప్రభువు శిష్యులకు తన కొత్తనిబంధన విశ్వాస మార్గాన్ని ఒకరోజు ఉపదేశించాడు. స్వార్థం, స్వాభిమానం, స్వనీతి, స్వలాభం, ’నేను’, ‘నా’ అనే ‘స్వీయత’నంతా వదిలేసుకోవడం విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగమైతే, ఇవన్నీ పోగా మిగిలిన తన సిలువను విశ్వాసి తానే మోస్తూ ప్రభువును వెంబడించడం మరో ముఖ్యమైన భాగం!! విశ్వాసి ఇలా ప్రభువు కోసం పాటుపడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడని, అలా కాకుండా తనను తానే నమ్ముకొని, తన సిలువను తాను మోయనివాడు లోక ప్రలోభాల్లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకొంటాడని ప్రభువు అన్నాడు. క్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు న్నాయి, దేవుడిచ్చే శాంతిసమాధానాలున్నాయి. కాని లోకమిచ్చే ఆనందం, వినోదానికి అవి పూర్తిగా అతీతమైనవి. తనను యెరూషలేములో సిలువ వేయబోతున్నారంటూ మూడున్నరేళ్ల తర్వాత ప్రభువు ప్రకటించినపుడే తామెన్నుకు న్నది విలక్షణమార్గమని, పోగొట్టుకోవడమే ఈ మార్గ రహస్యమని శిష్యులకు బోధపడింది. ఇక ఇస్కరియోతు అనే శిష్యుడైతే, ఇదంతా విని యే సుతో విభేదించి, ముప్పై వెండినాణేల ప్రలోభానికి యూదులకు యేసును అమ్మేసి, తనది లాభసాటి బేరమనుకున్నాడు. కాని ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని యేసు మాటలు సత్యమైనవని రుజువు చేశాడు. ఆనాడు ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు కూడా పోగొట్టుకోవడం, పొందడం అనే అనుభవాల నేపథ్యం అర్థం కాలేదు. దేవుడు వారిద్దరినీ సృష్టించడానికి మునుపే మంచి విషయాలతో లోకాన్ని నింపి సృష్టించి వారికిచ్చాడు. అయితే వారి హృదయాంతర్యంలోని సింహాసనాన్ని మాత్రం తనకే ప్రత్యేకించాలని ప్రభువు కోరుకుంటే, ఆదాము, హవ్వ లోకాన్నంతా తమ హృదయంలోకి చేర్చుకొని, ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి పాల్పడి దేవుణ్ణి ఆ సింహాసనం నుండి దించి బయటికి పంపేశారు. అదీ అక్కడ జరిగిన నిజమైన విషాదం. అయితే ఆదాము, హవ్వ ఎక్కడ విఫలమయ్యారో అక్కడే, కొన్నేళ్ల తర్వాత వారి వారసుడు, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము దైవాజ్ఞ పాలనే శిరోధార్యమని భావించి గెలుపొందాడు. అబ్రాహాము జీవితమంతా దేవుని ఆజ్ఞల ప్రకారమే, అంటే అన్నీ పోగొట్టుకొంటూ సాగింది. నీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపే కొత్త ప్రాంతానికి వెళ్ళమంటే, తనకు ప్రాణప్రదమైనవన్నీ వదిలేసి ప్రభువే సర్వస్వమనుకొని ఆయన వెళ్ళాడు. చివరికి కడువృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తనకు బలివ్వమని దేవుడు ఆదేశిస్తే, అందుకు కూడా అతను ఆనందంగా సిద్ధమయ్యాడు. విశ్వాస పరీక్షలో అబ్రాహాము నెగ్గినట్టు ప్రకటించాడు దేవుడు. ఇదీ ప్రభువానాడు బోధించిన విశ్వాస మార్గం. –రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
విధేయులైన పామరులతోనే మహాద్భుతాలు
గమలీయేలు పౌలు వంటి ఎంతో మంది ఉన్నత విద్యాధికుల్ని తయారు చేసిన గొప్ప మేధావి, మహోపాధ్యాయుడు, నాటి యూదుల సన్ హెడ్రిన్ చట్టసభలో ముఖ్యుడుగా,. యేసుప్రభువును సిలువ వేయాలన్న తీర్మానం అతని కనుసన్నల్లోనే జరిగింది. అయితే, పిరికివాడు, పామరుడైన పేతురు, యేసుప్రభువు పునరుత్థానం తర్వాత ఎంతో ధైర్యంగా సువార్త బోధిస్తుంటే, యూదయ, యెరూషలేము ప్రాంతాల సామాన్య ప్రజలంతా క్రైస్తవంలోకి వేల సంఖ్యలో చేరుతున్న రోజులవి. సామాన్యులందరికీ అదంతా పండుగలా ఉంటే, యేసును చంపిన యూదుమతపెద్దలకేమో చాలా అవమానకరంగా ఉంది. ప్రభువు పునరుత్థాన శక్తిని పొందిన పేతురు తదితరుల ప్రసంగాలు, పరిచర్యతో క్రైస్తవం ఇలా ఉపిరి పోసుకొని విస్తరిస్తోంది. ‘మీరంతా కలిసి యేసును చంపారు, కాని దేవుడాయనను తిరిగి సజీవుని చేశాడు, దానికి మేమంతా సాక్షులం’ అంటూ యూదుపెద్దలను దుయ్యబట్టుతూ పేతురు సువార్త ప్రకటించాడు (అపో.కా.3:15). అది విని తట్టుకోలేక ఇక వాళ్ళందరినీ చంపాల్సిందేనంటూ యూదుమత పెద్దలు నిర్ణయించారు. అయితే ‘పేతురు పరిచర్య దేవుని వల్ల కలిగినదైతే మీరు అడ్డుకోలేరు, అలా కాకపోతే, గతంలో ఇలా వచ్చి అలా మాయమైన చాలామంది కోవలోకి వాళ్ళు కూడా చేరుతారు. కాబట్టి మీరు కంగారుపడొద్దు’ అంటూ గమలీయేలు ఇచ్చిన సలహాతో, వాళ్ళు పేతురును ఇతరులను చంపకుండా, కేవలం దెబ్బలు కొట్టి వదిలేశారు(అపో.కా.5:33–40).. పేతురు ప్రసంగాలు విని యేసుప్రభువును అంగీకరించిన వాళ్ళు, పేతురు ప్రసంగాలతో రెచ్చిపోయి అతన్ని చంపాలనుకున్నవాళ్ళు ఆనాడు వేలల్లో ఉన్నారు. కాని కర్రవిరక్కుండా పాము చావాలనుకునే గమలీయేలు లాంటి మూడవ తెగ వాళ్ళు కూడా కొందరున్నారు. మేధావి వర్గం అంటే ఇదే!! ‘నువ్వు జోక్యం చేసుకోకు, దేవుడే చూసుకుంటాడు’ అన్నది వీళ్ళ ఊతపదం!! సువార్తకన్నా, సిద్ధాంతాల మీద వీళ్లకు శ్రద్ధ, పట్టు ఎక్కువ. చర్చిల్లో, పరిచర్యల్లో కళ్లెదుటే అపవిత్రత, అనైతికత కనిపిస్తున్నా అందుకు వ్యతిరేకంగా ఉద్యమించరు, కాని వాటిని ‘విశ్లేషిస్తూ’, ఉద్యమించేవారికి ఉచిత సలహాలిస్తూ ‘బ్రేకులేసే’ పరిచర్య వాళ్ళది. గమలీయేలు నాటి యూదులందరికీ పితామహునిలాంటి వాడు.పాత నిబంధననంతా అధ్యయనం చేసి, అందులోని యేసుప్రభువు ఆగమన ప్రవచనాలు, ఆనవాళ్ళన్నీ ఎరిగిన మేధావిగా గమలీయేలు, ‘యేసుప్రభువే మనమంతా ఎదురుచూసే మెస్సీయా’ అని ఆనాడు ధైర్యంగా ప్రకటించి ప్రభువు పక్షంగా నిలబడి ఉంటే ఎంత బావుండేది. చాందస యూదులంతా పశ్చాత్తా్తపం పొంది క్రైస్తవులై ఉండేవారు కదా!! గమలీయేలు అలా పరలోకానికి వెళ్లి ఉండేవాడు, దేవుడు ఉజ్వలంగా వాడుకున్న సువార్తికుడుగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కాని గమలీయేలు, ఉచితాసలహాలిచ్చే పాత్రతో సరిపెట్టుకున్నాడు. అతని వద్దే విద్యనభ్యసించిన పౌలు మాత్రం గొప్ప సువార్తోద్యమకారుడై గురువును మించిన శిష్యుడయ్యాడు.. పేతురులాంటి పామరులు లోకాన్నంతా దేవుని కోసం జయించే పనిలో ఉంటే, గమలీయేలు లాంటి వారు పూలదండలు, సన్మానాలు, తాము పెట్టుకున్న దుకాణాలే తమకు చాలనుకున్నారు. అలా జీవితకాలపు ఒక మహత్తరమైన అవకాశాన్ని గమలీయేలు చేజార్చుకున్నాడు. అర్థం కాని శాస్త్రాలెన్నో చదివిన మేధావుల వల్ల క్రీస్తుకు, క్రైస్తవ ఉద్యమానికి ఒరిగేదేమీ లేదు. దేవుని ఆదేశాలకు విధేయులైన పామరుల వల్లే దేవుని రాజ్యం అద్భుతంగా నిర్మితమవుతుందన్నది చారిత్రక సత్యం. దేవుని రాజ్య స్థాపనకు కావలసిందల్లా దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన విధేయతే తప్ప, సకలశాస్త్ర పాండిత్యం, మేధోసంపత్తి కానేకాదు !! రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం మాసపత్రిక ఈమెయిల్: prabhukirant@gmail.com -
ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...
మేము నీ లాగా అద్భుతాలు చెయ్యలేక పోతున్నామెందుకు? నీవు ఉపమానాల ద్వారా ఎందుకు బోధిస్తున్నావు? అంత్యకాలపు సూచనలెలా ఉంటాయి? .. యేసుప్రభువుకు శిష్యులు కనీసం 17 సందర్భాల్లో ప్రశ్నలు వేసినట్టు నాలుగు సువార్తల్లోనూ గమనించొచ్చు. అయితే శిష్యుల ప్రశ్నలేవీ వాళ్ళ ఆత్మీయజీవితానికి ఉపయోగకరమైనవి కావని తెలిసి కూడా, చాలాసార్లు వారికి ఓపిగ్గా జవాబిచ్చాడు. నిజానికి అవతలి వ్యక్తితో మన సహవాసం అభివృద్ధి చెందే కొద్దీ మనకున్న ప్రశ్నలు తగ్గిపోవాలి. కానీ ప్రభువు సహవాసంలో వాళ్ళ ప్రశ్నలు అంతకంతకూ ఎక్కువవడాన్ని మనం సువార్తల్లో గమనించగలం. కాసేపట్లో ఆయన ఇక పరలోకానికి ఆరోహణం కానున్న సమయంలో కూడా శిష్యులు ‘ప్రభువా, ఈ కాలంలో ఇశ్రాయేలుకు మళ్ళీ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా?’ అంటూ ప్రశ్నించారు. అవన్నీ తెలుసుకోవడం మీ పని కాదంటూ ఆయన ఈసారి వారి నోరు మూశాడు (అపో.కా.1:7). శిష్యులే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ప్రభువును ప్రశ్నించేవారు. నీవు ఏ అధికారంతో బోధిస్తున్నావని పరిసయ్యులొకసారి ఆయన్ను ప్రశ్నించారు. ఇంతకీ, యోహాను బాప్తీస్మం పరలోక సంబంధమైనదా, ఈ లోక సంబంధమైనదా? అని ప్రభువు వారిని ఎదురు ప్రశ్నిస్తే, వాళ్ళు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎందుకంటే, పరలోక సంబంధమైన దంటే, మరి అతన్ని నమ్మకుండా మీరెందుకు చంపారని అడుగుతాడు, ఈ లోకసంబంధమైనదంటే, అక్కడున్న వాళ్ళే వాళ్ళను రాళ్లతో చావగొడతారు. అన్నీ తెలిసి కూడా ఇరుకున పెట్టాలని ప్రశ్నించే వారికి సమాధానమివ్వడం కన్నా, వాళ్ళ నోరు మూయించడమే మంచిదన్నది ప్రభువుకు తెలుసు. ఏ ప్రశ్నకైనా మూలం సందేహమే!! కాని వెలుగున్నచోట చీకటికి తావు లేనట్టే, విశ్వాసమే పునాదిగా నిర్మితమయ్యే దైవ మానవ సంబంధంలో సందేహాలకు, అందువల్ల ప్రశ్నలకు తావే లేదు. అయినా సరే, దేవుని పట్ల మనవి అంతులేని ప్రశ్నలే. వివాహమైన తొలిదినాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో ప్రశ్నలు తలెత్తుతాయేమో కాని, ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళిద్దరి మధ్యా ఇంకా ప్రశ్నలుంటే మాత్రం అది తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే కదా!! అయితే తనపట్ల మానవులకు ఎన్నో ప్రశ్నలుంటాయన్న విషయం దేవునికి అర్ధమైనంతగా మరెవరికీ అర్ధం కాదు. అందువల్ల మన ప్రతి ప్రశ్నకూ జవాబుగా దేవుడు ఎప్పటికప్పుడు తన మూలస్వభావాన్ని మాత్రం బైబిల్ ద్వారా, ఆయా సంఘటనల ద్వారా ఇంకా ఎన్నెన్నో విధాలుగా విశ్వాసికి అర్ధమయ్యేలా చేస్తుంటాడు. ‘దేవుడు ప్రేమాస్వరూపి’ అన్న ఆయన మూలస్వభావమే విశ్వాసికి, దేవునికి మధ్య గల అనుబంధానికి పునాది రాయి(1యోహాను 4:8,16). ప్రేమాస్వరూపియైన దేవుడు, నా పట్ల ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడని విశ్వాసి అర్థం చేసుకున్న రోజున జీవితంలో ప్రశ్నలకు, అశాంతికి అసలు తావు లేదు.దేవుని క్రమశిక్షణ, కొన్ని ప్రార్థనలకు ఆయన సానుకూలత చూపించకపోవడం, దేవుని నేతృత్వంలో సాగే జీవితంలో అన్నీ మనమనుకున్నట్టే జరగక పోవడం లాంటి అనుభవాల వెనుక దేవుని నిరుపమానమైన ప్రేమ ఉన్నదన్న పరిణతిలోకి విశ్వాసి ఎదిగితే, ప్రశ్నలు, సందేహాల కారు మేఘాలు తొలగి, శాంతి, సంతృప్తితో కూడిన ‘నవోదయం’ ప్రాప్తిస్తుంది. ఆ స్థాయికెదగడానికి విశ్వాసి ఎంతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం email:prabhukirant@gmail.com -
సర్వమానవ సార్వత్రిక దార్శనికుడు ఫిలిప్పు...
ఆదిమ చర్చిలో సామాజిక పరిచర్య కోసం ఎంపిక చేయబడి అభిషేకం పొందిన ఏడుగురిలో ఫిలిప్పు ఒక పరిచారకుడు. అయితే యెరూషలేములోని ఆదిమ చర్చి ఎంతో వేగంగా, బలంగా విస్తరించడం చూసిన యూదు మత ఛాందసులు అసూయచెంది నూతనంగా చర్చిలో చేరుతున్న క్రైస్తవ విశ్వాసులను హింసించడం ఆరంభించడంతో యెరూషలేములోని విశ్వాసులంతా యూదా దేశం వదిలి పలు ప్రాంతాలకు చెదిరిపోయారు. అక్కడి ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడై దేవుని ప్రేమను ప్రకటించడంతో చెదిరిపోయిన వారి ద్వారా సువార్త కొత్త ప్రాంతాలకు వ్యాపించి చర్చిలు, విశ్వాసుల సంఖ్య మరింత విస్తరించింది. అంటే చర్చిని, విశ్వాసులను కట్టడి చేయడానికుద్దేశించిన యూదుల చిత్రహింసల వ్యూహం ఎంతగా విఫలమైందంటే, అది చర్చిని అణిచివెయ్యలేకపోయింది సరికదా, చర్చి మరింత ఉధృతంగా విస్తరించడానికే ఇలా దోహదపడింది.ఆ కాలంలో ఫిలిప్పు మాత్రం యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వెళ్లి అక్కడి అసంఖ్యాకులైన సమరయులకు సువార్త ప్రకటిస్తే వాళ్లంతా ఇనుమడించిన ఉత్సాహంతో క్రైస్తవ విశ్వాసులయ్యారు. ఇది నిజంగా విప్లవాత్మకమైన పరిణామం. ఎందుకంటే సమరయులు యూదులకు అస్పృశ్యులు, ఆ కారణంగా వాళ్లంటే చిన్న చూపు. యూదా సామ్రాజ్యాన్ని అషూరులు పాలిస్తున్నప్పుడు, కొందరు యూదులు అషూరు స్త్రీలను వివాహమాడిన కారణంగా పుట్టినవారే సమరయులు. అలా వాళ్ళు మిశ్రమ జాతికి చెందినవారన్న నెపంతో వారికి యెరూషలేము దేవాలయ ప్రవేశాన్ని కూడా చాందస యూదులు నిషిద్ధించారు. అయినా సమరయులు మాత్రం యూదు మతవిధులే పాటిస్తూ, ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ మెస్సీయా ఆగమనాన్ని కాంక్షించేవారు. అలా వారిని దూరం పెట్టిన యూదులే ఇపుడు క్రైస్తవ విశ్వాసులై ఫిలిప్పు నాయకత్వంలో తమవద్దకొచ్చి యేసు సువార్త చెబుతుంటే అత్యుత్సాహంతో వాళ్లంతా కొత్త విశ్వాసంలో చేరారు. యూదులకు, సమరయులకు మధ్య 800 ఏళ్లుగా నెలకొన్న వైషమ్యాన్ని, అగాథాన్ని ఇలా క్రైస్తవం దూరం చేసి సమరయులను విశ్వాసులను చేసి వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది, వారిలో అత్యానందాన్ని నింపింది.ఫిలిప్పుతో దేవుడొకసారి దర్శన రీతిన మాట్లాడి దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలో ఒక వ్యక్తిని కలుసుకొమ్మని ఆదేశించాడు. ఇథియోపియా రాణి గారి ఖజానాదారుడు, ఇథియోపియా దేశపు ఉన్నతాధికారియైన ఒక నపుంసకుడు అక్కడ ఫిలిప్పుకు తారసపడ్డాడు. అతను యెరూషలేముకొచ్చి దేవుని ఆరాధించి రథంలో తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదవడం ఫిలిప్పు కనుగొన్నాడు. యేసుప్రభువు సిలువ ఉదంతాన్నంతా యెషయా తన గ్రంథంలో పరోక్షంగా చెప్పిన 53వ అధ్యాయాన్ని అతడు చదువుతుండగా ఫిలిప్పు ఆ భాగాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువు సువార్తను అతనికి ప్రకటిస్తే, అతను అక్కడికక్కడే మారు మనసు పొంది విశ్వాసియై ఇథియోపియా వెళ్ళాడు. అంటే యెరూషలేములో శత్రువులు విశ్వాసులు హింసిస్తే సువార్త సమరయకు, అక్కడినుండి ఈ విశ్వాసి ద్వారా ఇథియోపియా దేశానికి అంటే మొదటిసారిగా ఆఫ్రికా ఉపఖండానికి కూడా వ్యాపించిందన్న మాట. అస్పృశ్యులైన జాతివిహీనులు, నపుంసకులు అనే తారతమ్యం లేకుండా సర్వమానవ సార్వత్రిక దర్శనంతో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని నిర్మించాడు. విశ్వాసి ఆత్మపూర్ణుడైతే ఎంత బలంగా అతన్ని దేవుడు వాడుకొంటాడన్నదానికి ఫిలిప్పు నిదర్శనం. విశ్వాసులు ఫిలిప్పు లాగా ఆత్మపూర్ణులైతే సువార్త వ్యాప్తికి సరిహద్దులు లేవు, దాన్ని అడ్డుకోగల అవరోధాలు కూడా లేవు.యెరూషలేములో అతనెప్పుడూ ప్రసంగాలు చెయ్యలేదు. ఎందుకంటే అతని పరిచర్యలో ఇతరులకు సహాయం చెయ్యడమే తప్ప ప్రసంగాలుండవు. కానీ సమరయలో అతను సువార్త ప్రకటించే మహా వక్త అయ్యాడు, వేలాది మందికి దేవుని ప్రేమను ప్రకటించి వారికి ఆత్మీయ తండ్రి అయ్యాడు. సమరయ, ఇథియోపియా దేశాలకు తొలిసారిగా సువార్త చేరవేసిన ఆద్యుడయ్యాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మనిషిలోని దైవత్వాన్ని లోకం చూడాలి
‘నేను చేసే క్రియలకన్నా గొప్ప క్రియలు మీరు చేస్తారు’ అన్నాడు ఒకసారి యేసుప్రభువు (యోహాను 14:12). ‘నీవు పాపివి’ అంటూ వేలెత్తి చూపించిన యేసుప్రభువే మనిషిని ఇంతగా హెచ్చించడం ఒకింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ చెబుతోంది. అంటే మనిషి స్వరూపం, స్వభావం, సౌందర్యం, అతనిలోని స్వతంత్ర భావన, సాధికారత, సదాశయాలు, సద్భావనాలన్నీ దేవుని లక్షణాలే. అందువల్ల గొప్పపనులు చెయ్యగలిగిన శక్తిసామర్థ్యాలను దేవుడు మనిషిలో ముందే నిక్షిప్తం చేశాడు. కాకపోతే మనిషిలోని స్వతంత్ర భావనలతోనే చిక్కు ఏర్పడింది. మనిషిని తన చెప్పుచేతల్లో నడిచే ఒక మరయంత్రంగా కాకుండా స్వతంత్ర చలనం, జీవనమున్న ఒక ‘సామాజిక శక్తి’ గా దేవుడు ప్రేమతో, కనికరంతో తయారు చేశాడు. లోకాన్ని పగలంతా వెలుగుతో నింపే సూర్యుణ్ణి దేవుడు సృష్టిస్తే, రాత్రిళ్ళు కూడా ఎంతో వెలుగు నిచ్చే విద్యుచ్ఛక్తిని దానితో వెలిగే బల్బును థామస్ అల్వా ఎడిసన్ అనే మానవుడే కనుగొన్నాడు. అదే విద్యుచ్ఛక్తితో మరెన్నో పనులను మనిషి సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు. నడిస్తే గంటకు మహా అయితే నాల్గు కిలోమీటర్లు మాత్రమే నడిచే మనిషి అదే గంటకు 120 కిలోమీటర్లు నడవగల్గిన వాహనాలను, రైళ్లను, గంటకు 800 కిలోమీటర్లు దూరం ఎగిరి ప్రయాణించగల్గిన విమానాలను ఆవిష్కరించి వాటితో తన జీవితాన్ని సులభ సాధ్యం చేసుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇవన్నీ గొప్ప క్రియలే, సంతోషించదగిన విజయాలే. అయితే మనిషి తన సామాజిక బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా అంతే సమున్నతంగా వ్యవహరించి గొప్ప క్రియలు చేయాలన్నది దేవుని ఆకాంక్ష. అయితే బైబిల్ గ్రంథం మూడవ అధ్యాయంలోనే మానవ చరిత్రను, ఆధ్యాత్మికతను సమూలంగా మరో మలుపు తిప్పిన పరిణామం ఏర్పడింది. తొలిమానవులైన ఆదాము, హవ్వ దైవాజ్ఞను ఉల్లంఘించి పాపం చేశారు. నాల్గవ అధ్యాయంలో రెండవతరం వాడైన కయీను అసూయతో, పట్టరాని కోపంతో తన తమ్ముడైన హేబెలును హత్యచేసి మానవజాతిని మరింత పతనం వైపునకు మళ్ళించాడు.. అప్పటికి ప్రపంచ జనాభా నలుగురే!! పైగా వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. అయినా దుర్మార్గం అంతగా ప్రబలింది. సమస్య ఎక్కడుంది? దేవుడు తనకు సహవాసంగా ఉండేందుకుగాను ఏర్పర్చుకున్న మనిషి ఇంతగా దేవునికి ఎందుకు దూరమయ్యాడు? అతని స్వతంత్ర భావనలే దానిక్కారణం. ఆ స్వతంత్ర భావనలే స్వార్థానికి, గర్వానికి, దౌర్జన్యానికి ఇలాంటి మరెన్నో దైవవ్యతిరేక దుర్లక్షణాలకు బీజాలు వేశాయి. ఆ కారణంగానే మనిషి ఒక అడుగు పురోగమనం వైపునకు మరో అడుగు తిరోగమనం వైపునకు అన్నవిధంగా ఈనాటి తన జీవనశైలిని నిర్మించుకున్నాడు. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా వెనకబడ్డాడు. ఇప్పటి టర్కీ దేశంలో ఉన్న లుస్త్ర అనే ప్రాచీన పట్టణంలో పౌలు, బర్నబా పరిచర్య చేస్తున్నపుడు, అవిటివాడైన ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు. వాళ్లిద్దరూ చెప్పిన సువార్తకన్నా ఈ అద్భుతకార్యం అక్కడి ప్రజలను గొప్పగా ఆకర్షించింది. అక్కడి వాళ్లంతా తమ మధ్యకు దేవుళ్ళు దిగి వచ్చారంటూ సంబరపడి వాళ్ళిద్దరికీ తమ దేవుళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్లకు సన్మానం చేసి జంతువులను వారికి బలివ్వడానికి కూడా ప్రయత్నిస్తే పౌలు, బర్నబా వారిని తీవ్రంగా మందలించారు. ‘మేము దేవుళ్ళం కానే కాదు, జీవము గల్గిన దేవుని వైపునకు మిమ్మల్ని తిప్పడానికి గాను యేసు సువార్త చెప్పడానికి వచ్చామంతే!!’ అంటూ వారిని శాంతింప జేశారు. ఈ రోజుల్లో కూడా సువార్తకన్నా, అద్భుతాలకే ప్రజల ప్రాధాన్యం. సువార్తికులకన్నా, అద్భుతాలు చేసే వారికే ఎక్కువ ఫాలోయింగ్!! ఇలా మనిషిలో దేవుళ్లను చూసేందుకు లోకం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మనిషిలోని ప్రేమ, క్షమాపణ, నమ్రతతో కూడిన తన దైవికస్వరూపాన్నే లోకం చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పాలరాతి శిథిలాలు కాకూడదు మన చర్చిలు
నీ క్రియలన్నీ, నీ కష్టాన్నంతా, నీ సహనాన్నంతా నేను యెరుగుదునంటూ ప్రకటన గ్రంథంలోని ఎఫెసు చర్చికి కితాబునిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువు కోసం పరిచర్య చెయ్యడంలో ఆ చర్చి ఎన్నడూ వెనకంజ వెయ్యలేదు. ఆ చర్చిలో తప్పుడు పనులున్నాయి, విచ్చలవిడిగా లైంగిక స్వేచ్ఛను ప్రోత్సహించే నీకొలాయితులనే వారి దుర్బోధలున్నాయి. అయితే వారి విషయం నాకెందుకులే అని ఊరుకోకుండా, ప్రభువు ద్వేషించే అలాంటి జుగుప్సాకరమైన విషయాలు, బోధలను ఎఫెసీ చర్చి కూడా వ్యతిరేకించి తన ప్రత్యకతను చాటుకుంది. ఒకప్పుడు యెరూషలేము చర్చికి చెందిన భక్తిపరులైన ఏడుగురు పెద్దలను అపొస్తలులు ఏర్పర్చి, ప్రార్థించి వారిని పరిచర్య కోసం ప్రతిష్టించారు (అపో.కా 6:5.6). వారిలో స్తెఫను ఆదిమ హతసాక్షి అయ్యాడు. కానీ నికోలాసు అనే మరో పెద్ద అభిషేకం పొంది కూడా లైంగిక విశృంఖలత్వాన్ని బోధిస్తూ విశ్వాసభ్రష్టుడయ్యాడు, చర్చిలో చాలామందిని ఆ బోధ దారి మళ్లిస్తుంటే ఎఫెసు చర్చి ఆ చాలా ఖచ్చితమైన వైఖరితో వారిని ఖండించి పారదోలింది.అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది (ప్రక 2:1–7). దేవుని నిర్మలమైన ప్రేమను ప్రకటించే చర్చిలోనే అవినీతి నిండితే, అరాచకాలు, అపవిత్రత, ఆశ్రిత పక్షపాతానికి అది నిలయమైతే, ఆ చర్చి లోకానికి వెలుగునేలా చూపిస్తుంది. ఒకప్పుడెంతో గొప్పపేరున్న ఓ చర్చిలో ఇప్పుడు అక్కడి బోధకులు ‘రూతు–బోయజు’ ఉదంతాన్ని ప్రసంగాంశంగా తీసుకొని వారికి సంబంధించి చేసిన అనుచితమైన వర్ణనలు, వ్యాఖ్యలు, వివరణలు వింటూ చర్చిలో ఆడాళ్ళంతా తల దించుకున్నారు, చాలా మంది లేచి వెళ్లి పోయారట. అంటే ఇది మీ చర్చి, మీ ప్రసంగాలు మీరు చేసుకోండంటూ చర్చిని వదిలేసి, వారిని ప్రోత్సహించేందుకు కొన్ని కానుకలేసి మరీ వెళ్లిపోయారట. ఇదీ ఆ సభ్యుల ఆత్మీయ అపరిపక్వత, నిర్వాకం, భ్రష్టత్వం, చేతకాని తనం. ఆ పాస్టర్ ఎలాగు శాపగ్రస్థుడే అన్నది అతని జీవితాన్ని, కుటుంబాన్ని చూస్తేనే తెలుస్తుంది. కానీ చర్చి సభ్యులు అతన్ని నిలదీయొద్దా? అంటే పాస్టర్ కన్నా భ్రష్టులు ఆ చర్చి పెద్దలు, సభ్యులని దేవుడే తేల్చి వారిని పక్కన బెట్టాడన్న మాట. ఎఫెసీ చర్చిలో మాత్రం అలాంటి పప్పులుడకవు. అందుకే ఆయన అంతగా ఆ చర్చిని శ్లాఘించాడు. అయితే నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఎక్కడి నుండి ఆరంభించి ఎక్కడపడ్డావో గుర్తు చేసుకోమ్మన్నాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. పెళ్లయిన మొదటి రోజున వధూవరుల మధ్య కనిపించే ప్రేమానుభూతులు జీవితమంతా కొనసాగితే అదెంత భాగ్యం కదూ!! కానీ కొన్నిసార్లు ఆ మొదటి ప్రేమ క్రమంగా చల్లారిపోతుంది. ఇద్దరూ విడిపోరు, కలిసే ఉంటారు. ఇంట్లో కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతుంటాయి. కాకపోతే ఆ కార్యాలు ప్రేమతో కాక ఒక తంతులాగా సాగుతాయి... అప్పటికి పిల్లలు పుడతారు, బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాళ్ళిద్దరినీ ఒకటిగా పట్టి ఉంచేది వారి మధ్య ఒకప్పుడుండిన ప్రేమ కాదు, పిల్లల పట్ల బాధ్యతలే వారిని కలిపి నడుపుతుంటాయి. యేసును ఆరాధించే చర్చి యేసును ప్రేమించకుంటే ఎలా? యేసును ప్రేమించకుండానే చర్చిని నడుపుతామంటే ప్రేమ కరువైన ఆ దంపతుల కుటుంబం లాగే చర్చి నడుస్తుందేమో కానీ దేవుడందులో ఉండడు. నీ కొలాయితులను చర్చీ నుండి తరిమేయ్యడం ఎంత కష్టమో, పాత ప్రేమల్ని పునరుద్ధరించుకోవడం అంతకన్నా కష్టం. ఈ రెండూ జరగకుంటే ‘నీ దీపస్తంభాన్ని దాని చోటి నుండి తొలగించేస్తానని’ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన శిక్ష. దీపం ఆరిపోయిన చర్చి అంటే వైభవం, ప్రభావం కోల్పోయి విశ్వాసులైన జనం లేక శిథిలాలుగా మారడమన్న మాట. ఇప్పుడంతటా అవే కనిపిస్తున్నాయి. ఆరంభంలో పౌలు ఎఫెసు చర్చిలో మూడేళ్లు పరిచర్య చేశాడు. అయితే అది కనుమరుగయ్యింది. టర్కీ దేశంలో ఒకప్పుడా చర్చి ఉన్న ప్రదేశంలో ఇపుడు శిథిలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా చోట్ల అవి చర్చిలన్న బోర్డులు కనిపిస్తాయి, కానీ వాస్తవానికవి శిథిలాలే!! ఆ చర్చి ఎంత అందమైన పాలరాతి భవనమైనా, అందులో అపవిత్రత ఉంటే అది యేసు లేని పాలరాతి శిథిలమే!! – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
కొంచెం శక్తితోనే కొండంత ఫలితం....
‘నీకున్న శక్తి కొంచెమే అయినా నా వాక్యాన్ని అనుసరించావు, పైగా నన్ను ఎరుగనని అనలేదు’ అన్నది ప్రకటన గ్రంథంలోని ఫిలడెల్ఫియా చర్చికి పరిశుద్ధాత్ముడిచ్చిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’!! అందుకు బహుమానంగా, ఎవరూ మూయలేని ఒక తెరిచిన ద్వారాన్ని ఆ చర్చికి దేవుడు అనుగ్రహించాడు (ప్రక3:7–13). ప్రకటన గ్రంథంలోని ఏడు చర్చిల్లో ఫిలడెల్ఫియా చాలా చిన్నది. ఇప్పటి టర్కీ దేశంలో, రోమ్ నుండి ఆసియా కు వెళ్లే రహదారులన్నీ కలిసే ఒక ప్రాముఖ్యమైన కూడలి ప్రాంతమైన ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న చర్చి అది. ఎన్నో ప్రతికూలతలు, లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెల లేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చర్చి దేవుని ప్రసన్నుని చేసి ఆయన ప్రేమను సంపాదించుకొంది. ప్రతికూలతలను, శత్రువులను ఎలా ఎదుర్కొంటుందన్నదే ఏ చర్చి విశ్వాసానికి, విజయానికైనా గీటురాయి. అయితే ఆసుపత్రిలో రోగులున్నట్టే చర్చిలో పాపులు, ఆత్మీయంగా బలహీనులు, దీనులు తప్పక ఉంటారు. కాకపోతే తాము ఒక రోజున రోగవిముక్తులం కావాలన్న బలమైన ఆశ ఉన్న ఆసుపత్రి రోగుల్లాగే, తాము తప్పక పాపవిముక్తులం కావాలన్న ప్రార్థ్ధన, పట్టుదల, ప్రయాస కలిగిన పాపులున్న చర్చి దేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది. ‘పాపులముగానే చేరాము, పాపులముగానే చనిపోతాము’ అన్న మార్పులేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వల్ల చర్చికి, దేవునికి కూడా ప్రయోజనం లేదు. లోకంలో అంతా పాపులే, కాకపోతే క్షమించబడిన పాపులు కొందరు, ఇంకా క్షమించబడని పాపులు మరి కొందరు. పాపక్షమాపణానుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అలా జరుగక పోతే, చేరిన తర్వాతైనా పాపక్షమాపణను పొందితే ఆనందం. కాకపోతే చర్చిలో అంతా పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతిపరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమడలేరు. యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్లంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఫిలడెల్ఫియా చర్చికి ప్రభువు వెల్లడించాడు. అబ్రాహాము విశ్వాసవారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధంగా ఆయన వంశానికి చెందిన వారమని చెప్పుకొనే పరిసయ్యులను ఆనాడు యేసుప్రభువు ‘మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులు, అతని క్రియలు చేయగోరేవారు’ అంటూ ఘాటుగా విమర్శించాడు( యోహాను 8:44). నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా, తమ తాతలు తండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనని చెప్పుకొనే నామకార్ధపు తరతరాల క్రైస్తవులతో ఈరోజుల్లోనూ చర్చికి సమస్యలున్నాయి. అయితే వారిని విమర్శించడం, పరిహసించడం, వెళ్లగొట్టడం, సూటిపోటి మాటలనడం అందుకు పరిష్కారం కానే కాదు. యేసుప్రభువు అనుచరులమని చెప్పుకునే వాళ్లంతా యేసు ప్రేమకు, ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు!! మన ప్రేమ, క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపునకు తీసుకెళ్ళాలి. బైబిల్ కన్నా, దేవునికి సంబంధించి మనకున్న అనుభవ జ్ఞానం, దాని మూలంగా ఏర్పడిన విశ్వాసం, క్షమ, ప్రేమాపూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపర్చి ప్రభువు వద్దకు నడిపిస్తుంది. అందుకు ఎంతో జ్ఞానం, మరెంతో శక్తి అవసరం లేదు. సాత్వికత్వంతో తలవంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగల మన ‘కొంచెం శక్తి’ చాలు, ఫిలడెల్ఫియా చర్చిలాగా గొప్ప దేవునికోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసులమనిపించుకోవడానికి. సూపర్ మార్కెట్లో ఉండే వందలాది కొవ్వొత్తులకు చీకటి ఏ మాత్రం భయపడదు. కానీ పూరిగుడిసెలో మూలన వెలిగే ఒక చిన్నకొవ్వొత్తికి కారు చీకటి కూడా వణికి పారిపోతుంది. క్రైస్తవుడు కూడా సూపర్ మార్కెట్లో కొవ్వొత్తి కాదు, అతను వెలిగే కొవ్వొత్తి... అందుకే మరి, క్రైస్తవులెప్పుడూ మైనారిటీలే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడికి చేతకానివి వేషధారణ,నటన
గలిలయ సముద్రం ఆవలనున్న గెరాసేనుల ప్రాంతానికి యేసుప్రభువు ఒకసారి వెళ్లాడు. దారిలో యేసు, ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోనె గాలివానలో చిక్కి మునిగే ప్రమాదం ఏర్పడితే యేసు గాలిని, నీటి పొంగును కూడా గద్దించి నిమ్మళపర్చాడు. అలా గెరాసేనుల దేశానికి వెళ్తే అనేక దయ్యాల పీడితులై భయంకరమైన విధ్వంసక శక్తిని కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు. నీ పేరేమిటని ప్రభువడిగితే తనలో చాలా దయ్యాలున్నాయని సూచిస్తూ ‘సేన’ అని జవాబిచ్చాడు. ప్రభువు ఆజ్ఞతో ఆ దయ్యాలన్నీ అతన్ని వదిలి అక్కడి ఒక పందుల మందలో దూరగా, వాటి ధాటికి తట్టుకోలేక అవి సముద్రంలోకి దూకి చనిపోయాయి. కాని అంతకాలంగా అంతటి విధ్వంసక శక్తిని భరించిన ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై, అత్యంత సాత్వికుడిగా మారాడు. ఆ ప్రాంతాన్నంతా దేవుని సువార్తను అతను ప్రకటించాడని చరిత్ర చెబుతోంది (లూకా 8:26–39). దయ్యాల సంగతి పక్కనబెడితే, ప్రతి వ్యక్తిలోనూ దేవుడు అనూహ్యమైన శక్తిని నిక్షిప్తం చేశాడు. అది విధ్వంసకశక్తి కావచ్చు, ప్రగతికారక శక్తి కావచ్చు. నిరంతర దైవవాక్యధ్యానం, దేవునితో ఎడతెగని సహవాసం, సద్వర్తనుల సాంగత్యంలో విశ్వాసిలోని శక్తి ప్రగతిశీలకమవుతుంది. మనిషి ఆంతర్యం పల్లపు ప్రదేశం వంటిది. దాంట్లోకి మురుగునీరు చేరితే అది మురికి కూపమవుతుంది. స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే పదిమంది అవసరాలు తీర్చే మంచి నీటి సరస్సు అవుతుంది. మనం జీవితాంతం కలిసి బతకవలసిన వ్యక్తి ‘మనమే’ గనుక మనల్ని మనం సద్వర్తనులుగా సంస్కరించుకోగలిగితే విశ్వాసిగా అదే మన ఘనవిజయం. లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కతీరు. కొందర్ని కలిస్తే పన్నీటితో తడిసినట్లుంటుంది. మరికొందరిని కదిపితే డ్రైనేజీలో మునిగామా అనిపిస్తుంది. వందలాది దయ్యాల నుండి విముక్తినిచ్చి అతన్ని స్వస్థచిత్తుని చేసిన గాలిని, పొంగే నీటిని గద్దించగలిగిన దేవుని శక్తి ఈ లోకంలోని ఏ వ్యక్తినైనా మార్చగలుగుతుంది. అయితే నేను మారాలి అన్న బలమైన పరివర్తన అరుదుగా కనిపిస్తుంటుంది. అలా నిజపరివర్తన చెందిన విశ్వాసులే సమాజంలో ఆత్మీయ విప్లవాలకు సారథ్యం వహిస్తారు. దేవుడు ఎన్నడూ చేయనిది, మనిషి మాత్రం ఎప్పుడూ చేయడానికి ఇష్టపడేది ఒకటుంది. అది ‘నటన’! సమాజంలో ఆమోదం, గౌరవం కోసం కొందరు మారినట్టుగా నటిస్తారు. కాని కొద్దిసేపట్లోనే దొరికిపోతారు. దూరం నుండి మంచి నీటికుంటలాగా కనిపించే వేషధారుల విషయం జాగ్రత్త! వ్యసనాలన్నింటిలోకి అత్యంత భయంకరమైనది ‘వేషధారణ’ లేక నటన! ఈనాడు సమాజాన్ని ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఇది. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్