ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం... | Special Story on Jesus | Sakshi
Sakshi News home page

ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...

Published Sun, Sep 29 2019 5:09 AM | Last Updated on Sun, Sep 29 2019 5:09 AM

Special Story on Jesus - Sakshi

మేము నీ లాగా అద్భుతాలు చెయ్యలేక పోతున్నామెందుకు? నీవు ఉపమానాల ద్వారా ఎందుకు బోధిస్తున్నావు? అంత్యకాలపు సూచనలెలా ఉంటాయి? .. యేసుప్రభువుకు శిష్యులు కనీసం 17 సందర్భాల్లో ప్రశ్నలు వేసినట్టు నాలుగు సువార్తల్లోనూ గమనించొచ్చు. అయితే శిష్యుల ప్రశ్నలేవీ  వాళ్ళ ఆత్మీయజీవితానికి ఉపయోగకరమైనవి కావని తెలిసి కూడా, చాలాసార్లు వారికి ఓపిగ్గా జవాబిచ్చాడు. నిజానికి అవతలి వ్యక్తితో మన సహవాసం అభివృద్ధి చెందే కొద్దీ మనకున్న ప్రశ్నలు తగ్గిపోవాలి. కానీ ప్రభువు సహవాసంలో వాళ్ళ ప్రశ్నలు అంతకంతకూ ఎక్కువవడాన్ని మనం సువార్తల్లో గమనించగలం. కాసేపట్లో ఆయన ఇక పరలోకానికి ఆరోహణం కానున్న సమయంలో కూడా శిష్యులు ‘ప్రభువా, ఈ కాలంలో ఇశ్రాయేలుకు మళ్ళీ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా?’ అంటూ ప్రశ్నించారు. అవన్నీ తెలుసుకోవడం మీ పని కాదంటూ ఆయన ఈసారి వారి నోరు మూశాడు (అపో.కా.1:7). శిష్యులే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ప్రభువును ప్రశ్నించేవారు.

నీవు ఏ అధికారంతో బోధిస్తున్నావని పరిసయ్యులొకసారి ఆయన్ను ప్రశ్నించారు. ఇంతకీ, యోహాను బాప్తీస్మం పరలోక సంబంధమైనదా, ఈ లోక సంబంధమైనదా? అని ప్రభువు వారిని ఎదురు ప్రశ్నిస్తే, వాళ్ళు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎందుకంటే, పరలోక సంబంధమైన దంటే, మరి అతన్ని నమ్మకుండా మీరెందుకు చంపారని అడుగుతాడు, ఈ లోకసంబంధమైనదంటే, అక్కడున్న వాళ్ళే వాళ్ళను రాళ్లతో చావగొడతారు. అన్నీ తెలిసి కూడా ఇరుకున పెట్టాలని ప్రశ్నించే వారికి సమాధానమివ్వడం కన్నా, వాళ్ళ నోరు మూయించడమే మంచిదన్నది ప్రభువుకు తెలుసు. ఏ ప్రశ్నకైనా మూలం సందేహమే!! కాని వెలుగున్నచోట చీకటికి తావు లేనట్టే, విశ్వాసమే పునాదిగా నిర్మితమయ్యే దైవ మానవ సంబంధంలో సందేహాలకు, అందువల్ల ప్రశ్నలకు తావే లేదు. అయినా సరే, దేవుని పట్ల మనవి అంతులేని ప్రశ్నలే. వివాహమైన తొలిదినాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో ప్రశ్నలు తలెత్తుతాయేమో కాని, ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళిద్దరి మధ్యా ఇంకా ప్రశ్నలుంటే మాత్రం అది తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే కదా!! అయితే తనపట్ల మానవులకు ఎన్నో ప్రశ్నలుంటాయన్న విషయం దేవునికి అర్ధమైనంతగా మరెవరికీ అర్ధం కాదు.

అందువల్ల మన ప్రతి ప్రశ్నకూ జవాబుగా దేవుడు ఎప్పటికప్పుడు తన మూలస్వభావాన్ని మాత్రం బైబిల్‌ ద్వారా, ఆయా సంఘటనల ద్వారా ఇంకా ఎన్నెన్నో విధాలుగా విశ్వాసికి అర్ధమయ్యేలా చేస్తుంటాడు. ‘దేవుడు ప్రేమాస్వరూపి’ అన్న ఆయన మూలస్వభావమే  విశ్వాసికి, దేవునికి మధ్య గల అనుబంధానికి పునాది రాయి(1యోహాను 4:8,16). ప్రేమాస్వరూపియైన దేవుడు, నా పట్ల ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడని విశ్వాసి అర్థం చేసుకున్న రోజున జీవితంలో ప్రశ్నలకు, అశాంతికి అసలు తావు లేదు.దేవుని క్రమశిక్షణ, కొన్ని ప్రార్థనలకు ఆయన సానుకూలత చూపించకపోవడం, దేవుని నేతృత్వంలో సాగే జీవితంలో అన్నీ మనమనుకున్నట్టే జరగక పోవడం లాంటి అనుభవాల వెనుక దేవుని నిరుపమానమైన ప్రేమ ఉన్నదన్న పరిణతిలోకి విశ్వాసి ఎదిగితే, ప్రశ్నలు, సందేహాల కారు మేఘాలు తొలగి, శాంతి, సంతృప్తితో కూడిన ‘నవోదయం’ ప్రాప్తిస్తుంది. ఆ స్థాయికెదగడానికి విశ్వాసి ఎంతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది.
రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
సంపాదకులు, ఆకాశధాన్యం
email:prabhukirant@gmail.com  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement