Disciples
-
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
సాక్షితో సిరివెన్నెల చివరి ఇంటర్వ్యూ: ‘ఆ సమయంలో క్రిష్ మీద అలిగాను’
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్త్రి, క్రిష్‌లను సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.. ఆ వివరాలు.. క్రిష్: ‘వీడు పెద్ద దర్శకుడు కాబోతున్నాడు’ అని నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే సిరివెన్నెలగారు చెప్పినప్పుడు అందరూ అతిశయోక్తి అనుకున్నారు. నేను ఎవరో తెలియనప్పుడు, నేను ‘గమ్యం’ కథ రాసుకుని వెళ్లినప్పుడు ఆయన విని, కొన్ని సలహాలు ఇచ్చారు.. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయనతో పని చేసిన ప్రతిరోజూ ఓ అందమైన జ్ఞాపకం. సిరివెన్నెల: ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అతని (క్రిష్) సంస్కారం. రెండో ముక్కలో చెప్పాలంటే మన సంప్రదాయంలో గురు శిష్యుల బంధం గురించి శాంతి మంత్రం ఉంది. గురుశిష్యుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నా సిద్ధాంతం ప్రకారం శిష్యుణ్ణి గురువు తయారు చేయడు.. గురువును శిష్యుడు తయారు చేస్తాడు. వయసును బట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది.. బాధ్యతను బట్టి గురుపీఠం ఉంటుంది. తల్లీతండ్రి, ఉపాధ్యాయులతో ఉండే అనుబంధం రుణబంధం. దాన్ని గుర్తుంచుకోవడం శిష్యుడి సంస్కారం. అలాంటి ప్రతి శిష్యుడు గురువు అవుతాడు. సిరివెన్నెల: క్రిష్ నా వద్దకు వచ్చి ‘గమ్యం’ కథ చెప్పినప్పుడు ‘ఈ సినిమాకి పాటలు రాసేంత అవకాశం.. వ్యవదానం నాకు కనిపించడం లేదబ్బాయ్’ అన్నాను. ‘ప్రవచనాలకు సినిమా అనేది వేదిక కాదు.. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తే నేను ఓ విషయం చెబుతాను అన్నాను. తను చెప్పమనగానే.. ఇంత లోతైనటువంటి ప్రవచనాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.. ఒక వినోదంతో కలిగిన సందేశం ఉంటే బాగుంటుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నావు.. మిత్ర సమేతం కూడా ఉంటే బాగుంటుంది. లాజిక్కులు అడక్కు.. నువ్వు చేస్తే చెయ్.. లేకుంటే లేదు’ అన్నాను. ‘మీరు ఒక్కరు కన్విన్స్ అయితే చాలు.. అందుకు నేను ఏం చేయాలో చెప్పండి’ అన్నారు క్రిష్. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుమన్నాను.. నేను పూర్తిగా కన్విన్స్ అవడానికి చాలా సమయం పడుతుంది.. అప్పటి వరకూ నువ్వు సినిమా వాయిదా వేయాలన్నాను. వేరే ఎవరైనా అయితే ఒప్పుకునేవారు కాదు. కానీ తను ఎనిమిది నెలలు నా కోసం సినిమా వాయిదా వేశాడు. క్రిష్: ‘కృష్ణం వందే జగద్గురమ్’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు. సిరివెన్నెల: సినిమా అనేది మహాద్భుతమైన వేదిక అని తెలుసుకుని, దానిని వాడుకుంటున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి తక్కువవారిలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు దర్శకులు కె. విశ్వనాథ్‌గారికి, క్రిష్‌కు, మరికొంతమందికి (పేర్లు చెప్పకూడదు) రెండో వెర్షన్ ఇవ్వలేదు... ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే వారి ఒప్పుదల, నా శ్రమ ఎక్కడైతే ఏకీభవిస్తాయో అక్కడ ఓకే అన్నమాట. క్రిష్: ‘సిరివెన్నెల’గారు నాకు మొదట గురువుగారే. ఆ తర్వాత తండ్రి అయ్యారు. సిరివెన్నెల: సినిమా నన్ను ఎంటర్టైన్ చేయాలి.. అదే సమయంలో నన్ను నిద్రపుచ్చకుండా కూడా చూడాలి. అలాంటి సినిమాలను తీసే పని క్రిష్ చేస్తాడు. క్రిష్ కథల్లో కొందరు కమర్షియాలిటీ లేదంటుంటారు. ఎక్కువమంది ఒప్పుకుంటే అది కమర్షియాలిటీ అవుతుంది. రామాయణ, మహాభారతాలను మించిన కమర్షియాలిటీ కథలు ఇంకేమీ ఉండవు. క్రిష్: ‘కంచె’ అప్పుడు చాలామంది అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి కథను ఎవరు చూస్తారు? అసలు హిట్లర్‌కు మనకూ సంబంధం ఏంటీ? అన్నది వారి అభిప్రాయం. కానీ మన తెలుగు సైనికులు గ్రామాల నుంచి వేల సంఖ్యలో యుద్ధాలకు వెళ్లిన కథలను ఎవరూ చెప్పలేదు. ‘వేదం’ సినిమాలో రాముల కథ కావొచ్చు.. సరోజ కథ కావొచ్చు. నాదైన శైలి కథలను ప్రేక్షకులకు చూపిస్తూ సంతృప్తి చెందుతాను. సిరివెన్నెల: మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్ పాయింట్. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్ సెట్టర్. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్. మా ఇద్దరికీ ప్రపంచమే గురువు. క్రిష్: జీవితంలో మనం పరిపక్వత చెందుతూ ఉంటాం. అలాంటి జీవితంలో ఇలాంటి ఓ గురువు చేయి పట్టుకుని ఉంటే... జీవితం నేర్పించబోయే క్లిష్టతరమైన పాఠాలకు సంసిద్ధులుగా ఉంటాం. -
పేతురును వరించిన ఆత్మీయ ఐశ్వర్యం!
నేను ఎవరినని ప్రజలు అనుకొంటున్నారని యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను అడిగాడు. కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహానువని, మరికొందరు నీవు ఏలీయా లేదా యిర్మీయా లేదా మరెవరైనా ప్రవక్తవని అనుకొంటున్నారని శిష్యులు జవాబిచ్చారు. ‘మరి మీరు నేనెవరినని అనుకొంటున్నారు?’అని ప్రభువు ప్రశ్నిస్తే వాళ్ళు కొంత సందిగ్ధంలో పడ్డారు. ‘ఇంతకీ ఈయన ఎవరు?’ అన్న ప్రశ్న వాళ్ళ మనస్సులో ఉందన్నది అర్థం చేసుకునే ప్రభువు ఈ ప్రశ్న వేశాడు. ‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువువారి ఒక్క మాటకు లోబడి, శిష్యులు తమ వృత్తులు, కుటుంబాలు, ఆస్తులన్నీ వదిలిపెట్టి ఆయన్ను వెంబడించారు. అది జరిగి అప్పటికి మూడేళ్లకు పైనే అయ్యింది. ఆయన ప్రసంగాలను వాళ్ళు వింటున్నారు, ఆయన కృపను, కరుణను దగ్గరి నుండి చూస్తూ అనుభవిస్తున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలకు వాళ్లంతా ప్రత్యక్షసాక్షులు. దేవునిరాజ్యం సమీపంగా ఉన్నదన్న మూలాంశంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు విని, ఆ రాజ్యానికి ఆయనే రాజు అని వారు నిర్ధారించుకున్నారు. అయితే ఇటీవలే అరణ్యంలో కేవలం ఐదురొట్టెలు, రెండు చేపల్ని ఆయన ఐదువేలమందికి పైగా ప్రజలకు పంచిపెట్టినపుడు, ప్రజలంతా ఎంతో సంబరపడి ఆయన్ను రాజును చెయ్యడానికి ప్రయత్నిస్తే వారి మధ్యనుండి ఆయన తప్పించుకొని వెళ్లిపోవడం వారి సందిగ్ధాన్ని మరెక్కువ చేసింది. ఆయన ఒక రాజు కాదు, ప్రవక్త కాదు, నాయకుడూ కాదు. మరి ఆయన ఎవరు? వెంటనే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని అన్నాడు.‘నరులు కాదు, దేవుడే నీకీ విషయాన్ని బయలుపర్చాడు. నీ ఈ విశ్వాసం మీదే నేను నా చర్చిని కడతాను’ అని యేసుప్రభువు వెల్లడించాడు. ‘క్రీస్తు’ అనేది యేసు పేరులో భాగం కాదు.‘అభిషిక్తుడు లేదా మెస్సీయా లేదా రక్షకుడు’ అన్నది దాని అంతరార్ధం. ధర్మశాస్త్రాన్నంతా ఎరిగిన పరిసయ్యులు, శాస్త్రులనే నాటి మేధావి వర్గానికి అర్ధం కాని ఈ మర్మాన్ని పామరుడు, వృత్తిరీత్యా జాలరి అయిన పేతురుకు బోధపడటం యేసు ప్రభువుకు ఆనందం కలిగించింది(మత్తయి 16:13–20). ఈ ఉదంతాన్నే యోహాను తన సువార్తలో రాస్తూ, యేసు ప్రభువు యూదులతో విశ్వాసులకు జనకుడైన అబ్రాహాముకన్నా ముందునుండే ‘నేను ఉన్నవాడను’ అంటే దేవుణ్ణి అని ప్రకటిస్తే, ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు (యోహాను 8:58). మనుషుల చంచల స్వభావానికి అద్దం పట్టే ఉదంతమిది. తాము దేవుళ్ళు కాకున్నా లేనిపోని హడావుడి, ఆర్భాటం, గారడీలు చేసే మాయల మరాఠీలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు కాని దేవుడే స్వయంగా తనను తాను తగ్గించుకొని, సాత్వికుడై పరలోకంనుండి దిగి వచ్చి సామాన్య ప్రజలతో మమేకమై వారి మధ్యే నివసించి తన మహిమల్ని, పరలోకాధికారాన్ని అంత స్పష్టంగా రుజువు చేసుకొంటున్నా ఆయన్ను దేవుడిగా విశ్వసించడానికి వెనకాడుతారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, ఎంతోమంది ప్రవక్తలు తమ ప్రవచనాల్లో పేర్కొన్న ‘మెస్సీయా’ఆయన అన్న పరలోక మర్మాన్ని పేతురు ఒడిసిపట్టుకున్నాడు. ఆ మెస్సీయా ప్రబోధాలు, జీవితం, పాపక్షమాపణా సూత్రమే పునాదిగా చర్చిని యేసుప్రభువే స్వయంగా నిర్మించడానికి దారి తీసిన ఉపోద్ఘాతమిది. ఈ లోకసంబంధమైన విజ్ఞానం భూమి నుండి రాకెట్లో చంద్రమండలానికెళ్లడానికి పనికొస్తుంది. కాని పరలోకం నుండి భూమిపైకి దిగి వచ్చిన మెస్సీయాగా యేసును అర్థం చేసుకోవడానికి ఈ లోకజ్ఞానం ఎంతున్నా సరిపోదు. అది పరలోకజ్ఞానంతోనే సాధ్యమవుతుంది కాబట్టే పామరుడైన పేతురుకు కూడా ఆ వాస్తవం అర్ధమయ్యింది. మనిషి పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా అంధుడని, అతనిలో ఆత్మీయనేత్రాలను దేవుడే తెరుస్తాడంటూ యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు. పామరులేమో ‘ప్రభువునెరుగుతుంటే, మహాపండితులు’ఆత్మీయంగా అంధులుగా’ మిగిలిపోవడం వెనుక ఉన్న రహస్యమిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మాతా శారదాదేవి
ప్రాచీన ఆదర్శాలు–ఆధునిక జీవన విధానాలను సమన్వయం చేసుకున్న సరస్వతి ఆమె. ఒకవైపు ఇంటి వ్యవహారాలు చూస్తూ, కుటుంబంలోని ఒడిదుడుకులనే తపస్సుగా స్వీకరించిన సాధారణ గృహిణి ఆమె. బడికి వెళ్ళి పాఠాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మిక జ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆవిడే శారదాదేవి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. వీరిద్దరిది భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దాని ప్రభావం తమ మీద పడకుండా చూసుకున్నారు వీరిరువురూ. రామకృష్ణులను తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించినవారంతా శారదాదేవిని మాతృమూర్తిగా ప్రేమించారు. జగమంత కుటుంబం సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యుకు తల్లిలా భాసించిన శారదాదేవి... మాతృమూర్తి అన్న మాటకు మరో నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు పిల్లలు లేరనే లోటు లేకుండా శిష్యులనే తన సంతానంగా భావించి వారి ఆలనాపాలన చూసుకునేది శారదాదేవి.. భౌతికంగా రామకృష్ణులు దూరమయ్యాక ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న శిష్యగణానికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు. రామకృష్ణుని శిష్యులందరికీ కొత్త ఆశగా చిగురించారు. ఎలాంటి అధ్యాత్మిక సలహాకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకి చేరేవారు వారంతా. రామకృష్ణుల సాన్నిహిత్యంతో తనకు కలిగిన యోగానుభవాలను వారికి చెబుతూ ఓపికగా వారి సందేహాలను తీర్చేది శారదాదేవి అమ్మ నోట మాటలు–ఆణిముత్యాలు ధ్యానం ఆవశ్యకతను వివరిస్తూ ‘‘క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానంతో పనిలేని స్థితికి వస్తారు. తీవ్రమైన గాలులు మేఘాలను చిన్నాభిన్నం చేసినట్టు, భగవంతుడి నామం మనోమాలిన్యాలను తొలగిస్తుంది. అందుకే నామజపం ఒక సాధనగా అభ్యసించాలి’’ అని చెప్పేవారు. అలాగే మీకు మనశ్శాంతి కావాంటే ఎదుటివారి తప్పులు వెతకడం మానండి. మీలోని తప్పులను సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే’’. అంటూ సందేశాన్ని అందించారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు, (నేడు శారదా దేవి జయంతి) -
శాంతి సమాధానం సాఫల్యం దేవుడు ఇచ్చే సంపదలు!
‘పస్కా’ అనే పులియని రొట్టెల పండుగను యెరూషలేములో ఎంతో ఘనంగా ప్రతి ఏడాదీ జరుపుతారు. ప్రపంచంలోని యూదులంతా ఇప్పటికీ ఈ పండుగ చేసుకోవడానికి యెరూషలేముకొచ్చి అక్కడి మహా దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు. యేసు ఆయన శిష్యులు కూడా పస్కా పండుగ కోసమే ఒకసారి యెరూషలేము కొచ్చారు. ఐగుప్తు దాస్య విముక్తికి సూచనగా కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇశ్రాయేలీయులు ఆ పండుగను దేవుని ఆదేశాల మేరకు వాగ్దానదేశానికి వెళ్తున్న అరణ్యంలో తొలిసారిగా ఆచరించారు. అప్పటి నుండీ దేవుని ప్రజలు కొన్ని వందల ఏళ్లుగా పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. ఈసారి పస్కా పండుగ లో యేసే సిలువలో తనను తాను పస్కా పశువుగా బలియాగం చెయ్యబోతున్నాడు. యేసు ఆ విషయాన్ని తన శిష్యులకు ఎంతగా బోధించినా వారికర్థం కావడం లేదు. ప్రభువు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతైతే, ఏకంగా యేసును అమ్మి డబ్బు సంపాదించుకునేందుకు అదొక మంచి అవకాశమని నమ్మాడు. యెరూషలేములో ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను కలుసుకొని, యేసు చుట్టూ ఎప్పుడు చూసినా వేలాది మంది ప్రజలుంటారు. కాబట్టి ఎవరూ లేని చోట ఆయన్ని అప్పగిస్తానని ఒప్పందపడి అందుకు ప్రతిఫలంగా ముప్పై వెండి నాణేలు యూదా తీసుకున్నాడు.యూదా లోకి దేవుని శత్రువైన సాతాను ప్రవేశించాడని, తమతో చేతులు కలిపిన యూదాను చూసి యేసు శత్రువులైన యాజకులు, అధిపతులు ఎంతో సంతోషించారని బైబిల్ చెబుతోంది( లూకా 22:3–6).యేసుప్రభువును సంతోషపెట్టాల్సిన యూదా ఆయన శత్రువులను సంతోషపెట్టడం ఆశ్చర్యంగా ఉంది కదూ?? దేవుని రాజ్యం డబ్బుకు, ఈ లోకప్రలోభాలకు సంబంధించినది కాదని, అది పూర్తిగా పరలోక సంబంధమైన విలువలకు, అత్యున్నతమైన సాక్ష్యపు ప్రమాణాలకు సంబంధించిన అంశమని యేసు ప్రభువు పదే పదే తన శిష్యులకు, ప్రజలకు కూడా తన బోధల్లో స్పష్టం చేశాడు. డబ్బుకు విలువ లేదని, దాని విలువ ప్రభువుకు తెలియదనీ కాదు. యేసు, ఆయన శిష్యులు కూడా తమ ఆహారం తదితర అవసరాల కోసం తప్పకుండా డబ్బు వెచ్చించారు. ఎప్పటికప్పుడు యేసు అభిమానులే ఆ డబ్బు సమకూర్చారు, ప్రభువు ఆ డబ్బు సంచిని యూదా వద్దనే పెట్టాడు కూడా. అయితే డబ్బే సర్వం కాదని యేసు నమ్మాడు, అలాగే జీవించాడు, తన శిష్యులకు అదే బోధించాడు కూడా. లోకం డబ్బుతోనే నడుస్తుంది. కాని డబ్బు కోసమే లోకం నడవకూడ దని ప్రభువు బోధించాడు, తన జీవనశైలితో అదే అంశాన్ని యేసు చాటాడు కూడా. డబ్బుతో కొనలేని, వెలకట్టలేని కుటుంబ ప్రేమలు, స్నేహబంధాలు, శాంతి, సమాధానం, తృప్తి, జీవన సాఫల్యం, ప్రేమ, క్షమాపణ, ప్రజల ఆదరాభిమానాలు, ఇవన్నీ ప్రభువు మాత్రమే ఇవ్వగలిగిన దేవుని రాజ్యసంబంధమైన మూలధనాలు, అమూల్య సిరులు. ఇల్లు, తిండి, డబ్బు లేనోళ్ళు పేదోళ్ళని లోకం నిర్వచిస్తుంది. అన్నమున్నా అది తినేందుకు ఆకలి, అవకాశం లేని వాళ్ళు, మెత్తటి పాన్పు, గొప్ప బంగాళా ఉన్నా హాయిగా నిద్రపోయి, అందులో ఆనందించే వీలు లేని వాళ్ళు. దేవుని కోసం, దేవుని ప్రేమను పొరుగువాడికి చాటేందుకు కాక, ధనార్జనే ధ్యేయంగా జీవితమంతా స్వార్థం కోసం బతికే వాళ్ళే నిరుపేదలని, దారిద్య్రరేఖకు దిగువన జీవించేవాళ్ళని యేసుప్రభువు బోధలు, ఆయన జీవితమూ నిర్వచించాయి. ఈ ‘బాలశిక్ష’ స్థాయిలోనే యూదా ఇస్కరియోతు ఫెయిల్ అయ్యాడు. ‘కామాతురత’ కన్నా భయంకరమైనది ‘ధనప్రలోభం’!! దైవిక రాజ్య విస్తరణలో తనకు సాయం చేసేందుకు దేవుడు పిలిస్తే, మధ్యలో దారి తప్పి ధనప్రలోభానికి గురై, పరిచర్యల్లో నిర్వీర్యులై, భ్రష్టులైన మహామహులెంతో మంది ఉన్నారు. వాస్తవమేమిటంటే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే అతి ప్రాముఖ్యమైన పని కోసం దేవుడు లోకంలోని అత్యుత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులనెన్నుకొని వారిని తనకు పరిచారకులుగా నియమించుకున్నాడు. పోతే, ధనార్జన లాంటి చిన్నపనుల కోసం దేవుడు లోకంలోని కుబేరులనెన్నుకున్నాడు. ఈ తేడా తెలియకనే, యూదా ఇస్కరియోతు దేవుడు తనకిచ్చిన వెలలేని భాగ్యానికి ముప్పై వెండి నాణేల విలువ కట్టి, చరిత్రహీనుడయ్యాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసి హృదయ సింహాసనం దేవునిదే!!
‘నన్ను వెంబడించాలనుకునేవాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దాన్ని పోగొట్టుకొంటాడు, నా కోసం ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు’ అంటూ యేసుప్రభువు శిష్యులకు తన కొత్తనిబంధన విశ్వాస మార్గాన్ని ఒకరోజు ఉపదేశించాడు. స్వార్థం, స్వాభిమానం, స్వనీతి, స్వలాభం, ’నేను’, ‘నా’ అనే ‘స్వీయత’నంతా వదిలేసుకోవడం విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగమైతే, ఇవన్నీ పోగా మిగిలిన తన సిలువను విశ్వాసి తానే మోస్తూ ప్రభువును వెంబడించడం మరో ముఖ్యమైన భాగం!! విశ్వాసి ఇలా ప్రభువు కోసం పాటుపడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడని, అలా కాకుండా తనను తానే నమ్ముకొని, తన సిలువను తాను మోయనివాడు లోక ప్రలోభాల్లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకొంటాడని ప్రభువు అన్నాడు. క్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు న్నాయి, దేవుడిచ్చే శాంతిసమాధానాలున్నాయి. కాని లోకమిచ్చే ఆనందం, వినోదానికి అవి పూర్తిగా అతీతమైనవి. తనను యెరూషలేములో సిలువ వేయబోతున్నారంటూ మూడున్నరేళ్ల తర్వాత ప్రభువు ప్రకటించినపుడే తామెన్నుకు న్నది విలక్షణమార్గమని, పోగొట్టుకోవడమే ఈ మార్గ రహస్యమని శిష్యులకు బోధపడింది. ఇక ఇస్కరియోతు అనే శిష్యుడైతే, ఇదంతా విని యే సుతో విభేదించి, ముప్పై వెండినాణేల ప్రలోభానికి యూదులకు యేసును అమ్మేసి, తనది లాభసాటి బేరమనుకున్నాడు. కాని ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని యేసు మాటలు సత్యమైనవని రుజువు చేశాడు. ఆనాడు ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు కూడా పోగొట్టుకోవడం, పొందడం అనే అనుభవాల నేపథ్యం అర్థం కాలేదు. దేవుడు వారిద్దరినీ సృష్టించడానికి మునుపే మంచి విషయాలతో లోకాన్ని నింపి సృష్టించి వారికిచ్చాడు. అయితే వారి హృదయాంతర్యంలోని సింహాసనాన్ని మాత్రం తనకే ప్రత్యేకించాలని ప్రభువు కోరుకుంటే, ఆదాము, హవ్వ లోకాన్నంతా తమ హృదయంలోకి చేర్చుకొని, ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి పాల్పడి దేవుణ్ణి ఆ సింహాసనం నుండి దించి బయటికి పంపేశారు. అదీ అక్కడ జరిగిన నిజమైన విషాదం. అయితే ఆదాము, హవ్వ ఎక్కడ విఫలమయ్యారో అక్కడే, కొన్నేళ్ల తర్వాత వారి వారసుడు, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము దైవాజ్ఞ పాలనే శిరోధార్యమని భావించి గెలుపొందాడు. అబ్రాహాము జీవితమంతా దేవుని ఆజ్ఞల ప్రకారమే, అంటే అన్నీ పోగొట్టుకొంటూ సాగింది. నీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపే కొత్త ప్రాంతానికి వెళ్ళమంటే, తనకు ప్రాణప్రదమైనవన్నీ వదిలేసి ప్రభువే సర్వస్వమనుకొని ఆయన వెళ్ళాడు. చివరికి కడువృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తనకు బలివ్వమని దేవుడు ఆదేశిస్తే, అందుకు కూడా అతను ఆనందంగా సిద్ధమయ్యాడు. విశ్వాస పరీక్షలో అబ్రాహాము నెగ్గినట్టు ప్రకటించాడు దేవుడు. ఇదీ ప్రభువానాడు బోధించిన విశ్వాస మార్గం. –రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...
మేము నీ లాగా అద్భుతాలు చెయ్యలేక పోతున్నామెందుకు? నీవు ఉపమానాల ద్వారా ఎందుకు బోధిస్తున్నావు? అంత్యకాలపు సూచనలెలా ఉంటాయి? .. యేసుప్రభువుకు శిష్యులు కనీసం 17 సందర్భాల్లో ప్రశ్నలు వేసినట్టు నాలుగు సువార్తల్లోనూ గమనించొచ్చు. అయితే శిష్యుల ప్రశ్నలేవీ వాళ్ళ ఆత్మీయజీవితానికి ఉపయోగకరమైనవి కావని తెలిసి కూడా, చాలాసార్లు వారికి ఓపిగ్గా జవాబిచ్చాడు. నిజానికి అవతలి వ్యక్తితో మన సహవాసం అభివృద్ధి చెందే కొద్దీ మనకున్న ప్రశ్నలు తగ్గిపోవాలి. కానీ ప్రభువు సహవాసంలో వాళ్ళ ప్రశ్నలు అంతకంతకూ ఎక్కువవడాన్ని మనం సువార్తల్లో గమనించగలం. కాసేపట్లో ఆయన ఇక పరలోకానికి ఆరోహణం కానున్న సమయంలో కూడా శిష్యులు ‘ప్రభువా, ఈ కాలంలో ఇశ్రాయేలుకు మళ్ళీ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా?’ అంటూ ప్రశ్నించారు. అవన్నీ తెలుసుకోవడం మీ పని కాదంటూ ఆయన ఈసారి వారి నోరు మూశాడు (అపో.కా.1:7). శిష్యులే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ప్రభువును ప్రశ్నించేవారు. నీవు ఏ అధికారంతో బోధిస్తున్నావని పరిసయ్యులొకసారి ఆయన్ను ప్రశ్నించారు. ఇంతకీ, యోహాను బాప్తీస్మం పరలోక సంబంధమైనదా, ఈ లోక సంబంధమైనదా? అని ప్రభువు వారిని ఎదురు ప్రశ్నిస్తే, వాళ్ళు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎందుకంటే, పరలోక సంబంధమైన దంటే, మరి అతన్ని నమ్మకుండా మీరెందుకు చంపారని అడుగుతాడు, ఈ లోకసంబంధమైనదంటే, అక్కడున్న వాళ్ళే వాళ్ళను రాళ్లతో చావగొడతారు. అన్నీ తెలిసి కూడా ఇరుకున పెట్టాలని ప్రశ్నించే వారికి సమాధానమివ్వడం కన్నా, వాళ్ళ నోరు మూయించడమే మంచిదన్నది ప్రభువుకు తెలుసు. ఏ ప్రశ్నకైనా మూలం సందేహమే!! కాని వెలుగున్నచోట చీకటికి తావు లేనట్టే, విశ్వాసమే పునాదిగా నిర్మితమయ్యే దైవ మానవ సంబంధంలో సందేహాలకు, అందువల్ల ప్రశ్నలకు తావే లేదు. అయినా సరే, దేవుని పట్ల మనవి అంతులేని ప్రశ్నలే. వివాహమైన తొలిదినాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో ప్రశ్నలు తలెత్తుతాయేమో కాని, ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళిద్దరి మధ్యా ఇంకా ప్రశ్నలుంటే మాత్రం అది తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే కదా!! అయితే తనపట్ల మానవులకు ఎన్నో ప్రశ్నలుంటాయన్న విషయం దేవునికి అర్ధమైనంతగా మరెవరికీ అర్ధం కాదు. అందువల్ల మన ప్రతి ప్రశ్నకూ జవాబుగా దేవుడు ఎప్పటికప్పుడు తన మూలస్వభావాన్ని మాత్రం బైబిల్ ద్వారా, ఆయా సంఘటనల ద్వారా ఇంకా ఎన్నెన్నో విధాలుగా విశ్వాసికి అర్ధమయ్యేలా చేస్తుంటాడు. ‘దేవుడు ప్రేమాస్వరూపి’ అన్న ఆయన మూలస్వభావమే విశ్వాసికి, దేవునికి మధ్య గల అనుబంధానికి పునాది రాయి(1యోహాను 4:8,16). ప్రేమాస్వరూపియైన దేవుడు, నా పట్ల ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడని విశ్వాసి అర్థం చేసుకున్న రోజున జీవితంలో ప్రశ్నలకు, అశాంతికి అసలు తావు లేదు.దేవుని క్రమశిక్షణ, కొన్ని ప్రార్థనలకు ఆయన సానుకూలత చూపించకపోవడం, దేవుని నేతృత్వంలో సాగే జీవితంలో అన్నీ మనమనుకున్నట్టే జరగక పోవడం లాంటి అనుభవాల వెనుక దేవుని నిరుపమానమైన ప్రేమ ఉన్నదన్న పరిణతిలోకి విశ్వాసి ఎదిగితే, ప్రశ్నలు, సందేహాల కారు మేఘాలు తొలగి, శాంతి, సంతృప్తితో కూడిన ‘నవోదయం’ ప్రాప్తిస్తుంది. ఆ స్థాయికెదగడానికి విశ్వాసి ఎంతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం email:prabhukirant@gmail.com -
లోతైన ఆలోచన
ఓ గురువు తన శిష్యులకు చెప్పిన కథ ఇది.ఓ పడవలో ఓ దంపతులు ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి పడవ మునిగిపోయే ప్రమాదానికి లోనైంది. ఆ స్థితిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటానికి పక్కన ఓ చిన్న పడవ ఉంది.అయితే భార్యను వెనక్కు నెట్టి భర్త మాత్రం ఆ చిన్ని పడవెక్కి తప్పించుకుపోయాడు. అలా తప్పించుకుపోతున్న భర్తను చూసి భార్య పెద్దగా అరుస్తుంది.భార్య ఏమని చెప్పి ఉంటుందని గురువుగారు అడిగారు. శిష్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క జవాబు చెప్పారు. కొందరు చెప్పిన జవాబు దాదాపుగా ఒకేలా ఉన్నాయి.అయితే ఒక్కడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు.గురువుగారు అతని వంక చూసి ‘‘నువ్వేమీ చెప్పలేదేంటీ’’ అని అడిగారు.‘‘‘మన బిడ్డను జాగర్తగా చూసుకోండి’ అని చెప్పి ఉండొచ్చు గురువుగారూ...’’ అన్నాడా శిష్యుడు.‘‘అవును నువ్వెలా చెప్పగలిగావు, నీకీ కథ ముందే తెలుసా’’ అని అడిగారు గురువు.‘‘లేదు గురువుగారు, మా అమ్మ కూడా చనిపోవడానికి కొన్ని నిముషాల ముందు ఇలాగే చెప్పింది మా నాన్నతో...’’ అన్నాడు శిష్యుడు. ఆ మాటతో క్లాసంతా మౌనం ఆవరించింది.కాసేపటి తర్వాత గురువు మౌనాన్ని వీడి కథను కొనసాగించారు...ఆ భర్త తన కూతురుని కంటికి రెప్పలా చూసుకున్నాడు.కొంత కాలానికి తండ్రి మరణించాడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు కుమార్తె తన తండ్రి రాసిన డైరీని చూసింది. అప్పుడే తెలిసింది ఆమెకు. తన తల్లికి నయం చేయలేని జబ్బు ఉన్నట్టు. ఆమె ఎలాగూ ఎక్కువ కాలం బతకదని.పడవ మునిగిపోతున్న దుర్ఘటనను తన తండ్రి ఇలా రాసుకున్నారు. నీతోపాటు నేనూ సముద్ర గర్భంలోకి కలిసి పోవలసింది. మన ఇద్దరి మరణమూ ఒకేసారి జరగాల్సింది. కానీ నేనేం చెయ్యను... మన బిడ్డను చూసుకోవడానికి నేను మాత్రమే ఒడ్డుకు చేరుకోవలసి వచ్చింది.కథను ఇంతటితో ఆపేసి గురువుగారు చెప్పారు...జీవితంలో మంచీ చెడూ అన్నీ జరుగుతాయి. అన్నింటికీ కారణం ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో అది అర్థం కాకుండా పోవచ్చు. కనుక మనం లోతుగా ఆలోచించకుండా ఓ నిర్ణయానికి రాకూడదు. – యామిజాల జగదీశ్ -
కనిపించదు కదా గురువర్యా!
అదో ఆశ్రమం. గురువుగారు శిష్యులకు ఎనో విషయాలను సోదాహరణగా చెబుతున్నారు. తాను చెబుతున్న విషయాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మధ్యమధ్యలో వాళ్లకు ప్రశ్నలు సంధిస్తూ, వాళ్లు చెబుతున్న సమాధానాలలోని తప్పొప్పులు సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు శిష్యులను ఓ ప్రశ్న అడిగారు– అసలు గురువు ఎందుకు? అని. ఏమి చెప్పాలో తెలియక శిష్యులందరూ ముఖాముఖాలు చూసుకుంటుంటే, ఒక శిష్యుణ్ణి పిలిచి, ‘‘నీ ముఖం ఎలా ఉందో, నీ కళ్లు, ముఖం శుభ్రంగా ఉన్నాయో లేదో చెప్పగలవా?’’ అని అడిగారు. అందుకు ఆ శిష్యుడు ‘‘నా ముఖం నాకు కనపడదు కదా గురువర్యా’’ అన్నాడు. గురువుగారు మందహాసం చేస్తూ, ‘‘నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏం చేస్తావు?’’అనడిగారు. శిష్యుడు ఓ క్షణం ఆలోచించి, ‘‘అద్దంలో చూసుకుంటే నా ముఖం ఎలా ఉందో, నేనెలా ఉన్నానో ఖచ్చితంగా చెప్పొచ్చు గురువుగారూ’’అన్నాడు శిష్యుడు. ‘చక్కగా చెప్పావు. అదే సరైన సమాధానం కూడా. నువ్వు నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే నీ ముఖం గురించి నీకు అంతా అర్థమైపోతుంది. అవునా?’’ అవునన్నట్టు తలూపాడు శిష్యుడు. ‘‘ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏమిటంటే, నీ ముఖాన్ని నువ్వు ఉన్నట్టుగా చూపించే అద్దమే గురువు. గురువు నీకు తెలీని నీ రూపాన్ని నీకు చూపించి, నీలో జ్ఞానాగ్నిని రగిలిస్తాడు. నీలోని శక్తియుక్తులను, నీలోని లోపాలను, నీ ముఖానికి అంటుకుని ఉన్న మురికిని, మరకలను కూడా నీకు చూపిస్తాడు. నీలో ఆత్మవిశ్వాసాన్ని రగుల్కొల్పుతూనే, నీలో ఉన్న అతి విశ్వాసాన్ని తనకున్న జ్ఞానాగ్నితో దహించి వేస్తాడు’’ అంటూ ఒక మామూలు అద్దం ఉదాహరణతో అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురువుగారు. – రమాప్రసాద్ ఆదిభట్ల -
అదే ఆధ్యాత్మికత అంటే..!
అది ఓ ఆశ్రమం. గురువుగారు శిష్యులకు పాఠాలు చెబుతున్నారు. తాను చెబుతున్నది శిష్యులకు అర్థమవుతోందో లేదో తెలుసుకునేందుకు అప్పుడప్పుడు శిష్యుల్ని ప్రశ్నలు వేస్తూ, వారి సమాధానాలలో తప్పులేమైనా ఉంటే సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు ‘‘ఒకటికి మరొకటి కలిస్తే ఏమవుతుంది?’’ అని అడిగారు. శిష్యులందరూ ఏమాత్రం సందేహం లేకుండా ఠక్కున రెండు అని చెప్పేరు. తప్పు అన్నారు గురువుగారు. తెల్లమొహాలేశారు శిష్యులు. అప్పుడన్నారు గురువుగారు. ‘‘ఒకటికి మరోటి తోడైతే అది రెండు అయితే గణితం. కానీ ఆధ్యాత్మికంగా అలా కాదు’’ అంటూనే ఒక శిష్యుణ్ణి పిలిచేరు. శిష్యుడు వచ్చి నిలుచున్నాడు. సేవకులతో ఒక నిలువుటద్దాన్ని తెప్పించి ఆ శిష్యుడి ఎదురుగా పెట్టి, ‘‘ఇక్కడ నువ్వు ఉన్నారువ. అద్దం ఉంది. రెండయ్యేయి కదా! ఇంకా... నువ్వు అద్దంలో కూడా ఉన్నావు. అంటే ఏమయ్యింది? నీకు అద్దం తోడైతే మూడు అయ్యింది. చూసేశా?’’ అన్నారు. అవునన్నాడు శిష్యుడు. ఒకటికి మరోటి తోడైతే రెండు కాకుండా మూడు అయ్యింది. అదే ఆధ్యాత్మికమంటే!’’అని అసలు విషయాన్ని సూటిగా చెప్పేరు. శిష్యులు చప్పట్లు కొట్టేరు. అప్పుడు గురువుగారు మరో ప్రశ్న సంధించారు. ‘‘మూడింటిలోంచి ఒకటి తీసేస్తే ఎంత?’’శిష్యులు మళ్లీ ‘రెండు’ అన్నారు. తప్పులో కాలేశారన్నారు గురువు గారు. మళ్లీ సేవకుణ్ణి పిలిపించి ‘‘ఈ అద్దం తీసేయ్’’ అన్నారు. అద్దాన్ని తీసేశాడు సేవకుడు.‘‘ఏమయ్యింది చెప్పు?’’అనడిగేరు శిష్యుణ్ణి. ‘‘నేనొక్కడినే మిగిలేను’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువుగారన్నారు– మూడు ఉండగా ఒక్క అద్దాన్ని తీసేస్తే ఏమయ్యింది? ఒక్కటే అయ్యింది. ఇదే ఆధ్యాత్మికంలో ఉన్న రహస్యం. శిష్యులు ఆనందంతో తలలు ఊపేరు. – రమాప్రసాద్ ఆదిభట్ల -
ప్రతిభకు కొలువు!
రాకుమారులంతా ఊరవతల బంతి ఆట ఆడుతున్నారు. బంతిని గట్టిగా తన్నాడు భీముడు. దెబ్బకి అది వెళ్ళి, దూరంగా ఉన్న నూతిలో పడిపోయింది. పరుగున పోయి చూశారంతా. అడుగున నూతిలో తేలుతూ కనిపించింది బంతి. ఏ రకంగా ప్రయత్నించినా అందడం లేదది. పైకి తీయడం అసాధ్యం అనుకుని, ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రాకుమారులు. అంతలో అక్కడికి ఓ వ్యక్తి అతను సన్నగా, పీలగా రకరకాల బాణాలూ, అమ్ముల పొదులూ పట్టుకుని ఉన్నాడు. నూతిలోకి తొంగి చూస్తూ, ‘‘నూతిలో బంతి పడిపోయింది, అంతేనా? అడిగాడు. ‘‘అవును’’ అన్నారు రాకుమారులు. ‘‘చూడబోతే మీరంతా రాకుమారుల్లా ఉన్నారు. పైగా ధనుర్విద్యలో మేటివాడైన కృపాచార్యుని శిష్యులు. నూతిలోని బంతిని ఎలా తియ్యాలో తెలియడం లేదా?’’ అన్నాడు ఆశ్చర్యం నిండిన గొంతుతో. తెలియడం లేదన్నట్టుగా అందరూ తలలూపారు.‘‘పోనీ, నేను తీసి చూపించనా?’’ అనడిగాడతను. ‘‘చూపించండి’’ అన్నారంతా. ‘‘అయితే చూడండి’’ అంటూ విల్లు అందుకున్నాడు. దానికి ఓ బాణాన్ని సంధించాడు. ఆ బాణం వెళ్ళి, నూతిలోని బంతిని నాటుకున్నది. మరోబాణం వదిలాడు. అది వెళ్ళి, మొదటిబాణానికి నాటుకున్నది. మరొకటి వదిలాడు. అది వెళ్ళి రెండోదాన్ని నాటుకున్నది. అలా బాణం తర్వాత బాణం వదిలి, బాణాల గొలుసును తయారుచేశాడు. దాంతో బంతిని పైకి తీసి, రాకుమారులకి అందించాడు. ఇదంతా తెలిసింది భీష్ముడికి. హుటాహుటిన అక్కడికి వచ్చాడు. ‘‘అయ్యా తమరి పేరు?’’ అడిగాడు భీష్ముడు. నన్ను ‘ద్రోణుడు’ అంటారు అన్నాడు ఆ వ్యక్తి. అంతే! ఒక్కసారిగా లేచి, నమస్కరించాడతనికి భీష్ముడు. ఎందుకంటే, అప్పటికే ద్రోణుని ప్రతిభాపాటవాల గురించి విని వున్నాడు భీష్ముడు. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు ఓ క్షణం. తర్వాత కళ్లు తెరచి తలపంకిస్తూ...‘‘ధనుర్విద్యలో పరశురాముణ్ణి మించినవారు మీరు. మీలాంటి వారు మా చిరంజీవులకు తారసపడటం మా అదృష్టం. ఇదిగో! ఈ పిల్లలంతా నా మనుమలు. వీరంతా నేటి నుంచి మీ శిష్యులు. వీరికి మీ మహాస్త్రవిద్యలన్నీ నేర్పండి’’ అన్నాడు. ‘‘తప్పకుండా’’ అన్నాడు ద్రోణుడు. ఆచార్యుడు ఆ మాటనగానే అర్జునుడు పరుగున వచ్చి, అతని పాదాలకు నమస్కరించాడు. అది చూసి భీష్మ ద్రోణులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆనందించారు కూడా. ఆ విధంగా ద్రోణుడు భరత వంశంలో ధనుర్విద్యా పాఠశాలలో గురువు అయ్యాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, గురువనేవారిని వారి ప్రతిభా పాటవాలు, పాండిత్యం ఆధారంగానే నిర్ణయించాలి తప్ప, మనవాడా, ఇతరుడా అనే అభిప్రాయంతో కాదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
బౌద్ధం
బుద్ధుడి శిష్యులలో అగ్రగణ్యుడు, అత్యంత ముఖ్యుడు కాశ్యపుడు. ఆయనను ‘ధమ్మపదం మహాకాశ్యపుడు’ అని గుర్తించడం కద్దు. బుద్ధుడి ధర్మమార్గాన్ని నలు దిశలా విస్తరింప జేయడానికి బుద్ధుడు ఎంపిక చేసుకున్న శిష్యులలో కాశ్యపుడు ప్రథముడు. ఆయన ఎక్కడున్నా బుద్ధుడున్న దిశగా చూసి నేలమీద పడి నమస్కరించేవారు. ఆయన తీరు చూసి అందరూ విస్తుపోయేవారు. ‘‘మీరు జ్ఞానం పొందిన గురువులు. అయినా మీరింకా నమస్కరిస్తున్నారేంటీ’’అని అడిగేవారు. అప్పుడు ఆయన ‘‘మీకు అర్థం కాదు. ఓ పురుగును సీతాకోకచిలుకగా మార్చినది ఆయనే. నేనీ భూమ్మీద ఉన్నంతవరకూ ఆయనకు నమస్కరించకుండా ఉండలేను. పైగా గురువు, శిష్యుడు అనే బంధంలో రాజు – పేదలా తేడాలుండవు. కనుక ఆయనకు నమస్కరించకుండా నేను ఒక్కరోజూ గడపలేను’’ అన్నారు. బుద్ధుడు చివరిక్షణాల్లో మహాకాశ్యపుడు ఎక్కడున్నా తీసుకురమ్మన్నారు. శిష్యులు తీవ్రంగా గాలించారు.‘‘అనందా! కాశ్యపుడు నన్ను విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడలేదు. నేనే వాడిని పంపాను. అతనికి తెలియకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకూడదని, తానెక్కడ ఉన్నా కబురుపెట్టాలని హామీ వేయించుకుని వెళ్లాడు. నేను రేపు వెళ్ళిపోతాను. రేపు ఉదయం లోపల అతను గానీ రాకుంటే నేను మృత్యువును ప్రాధేయపడాల్సి ఉంటుంది మరణాన్ని వాయిదా వేయమని. నేను ఇప్పటివరకూ ఎవరినీ ఏదీ అడగలేదు. కనుక కాశ్యపుడు ఎక్కడున్నా సరే తీసుకురావాలి’’ అన్నాడు బుద్ధుడు. అలాగే కాశ్యపుడిని వెతికి బుద్ధుడి వద్దకు తీసుకువచ్చారు. కాశ్యపుడు రావడంతోనే బుద్ధుడు సంతోషపడ్డాడు. ‘‘కాశ్యపా నువ్వు వస్తావని తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వచ్చావు. మంచిది. మరణమా! ఇక నువ్వు నన్ను నీతో తీసుకుపోవచ్చు’’ అన్నాడు బుద్ధుడు. శిష్యులందరూ చుట్టూ నిల్చుని చూస్తుండగా కాశ్యపుడి ఒడిలో బుద్ధుడి తుది శ్వాస వీడిపోయింది.ఎవరికీ లభించని మహాభాగ్యం కాశ్యపుడికి దక్కింది. కాశ్యపుడు ఒక్కడే చివరివరకూ బుద్ధుడి శిష్యుడిగా కొనసాగాడు. అయితే మిగిలిన వారు బుద్ధుడిని వీడి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు గురువుగా మారిపోయారు. ఈ క్రమంలో వారు తమ గురువును మరచిపోయారు. కానీ కాశ్యపుడు బయటకు వెళ్ళిన తర్వాత కూడా మేటి శిష్యుడిగానే ఉండిపోయారు. బుద్ధుడి అస్తమయం తర్వాత ఆయన గురువయ్యారు. గురువు అనేది ఓ బాధ్యత. ఆ హోదా కోసం పరితపించక్కర్లేదు. అర్హత ఉన్నవారికి తానుగా ఆ పదవి దక్కుతుంది. – యామిజాల జగదీశ్ -
లోకం వద్దనుకున్నవాళ్ళే దేవునికి కావాలి!
పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని యేసు తన శిష్యుల ఎంపిక ద్వారా ఆవిష్కరించాడు. వారి ఎంపికకు ముందు ఒక కొండపైకి వెళ్లి ఒక రాత్రంతా ప్రార్థించాడు. తరువాత 12 మందిని తన శిష్యులుగా ఏర్పర్చి వారికి ‘అపొస్తలులు’ అంటే ‘పంపబడినవారు’ అనే పేరు పెట్టారు. ఆయన పరిచర్య చేసేది ఈ లోకంలో మూడున్నరేళ్ళు. తన మరణం, పునరుత్థానం, పరలోకారోహణం తరువాత తన రెండవ రాకడ సమయం దాకా క్షమాసువార్తను, దేవుని ప్రేమతత్త్వాన్ని లోకమంతా చాటించే మహాకార్యం కోసం దేవుడు ఈ పన్నెండుమందినీ ఏర్పర్చారు. మూడున్నరేళ్లపాటు తనతోనే వారిని పెట్టుకొని అద్భుతమైన తర్ఫీదునిచ్చాడు. కాని ఆ మూడేళ్లలో వారి పోకడలు చూసిన వారికి వాళ్ళసలు యేసు శిష్యులయ్యేందుకు అర్హులేనా? అన్న అనుమానం రాకమానదు. రాత్రంతా ప్రార్థనలో గడిపిన యేసు ఇలాంటి వారినా ఎన్నుకున్నది? అని అంతా ముక్కున వేలేసుకున్నారు (లూకా 6:12–19). వారిలో ఒకరైన యూదా ఇస్కరియోతు అయితే ఏకంగా యేసుకు ద్రోహమే చేశాడు. ఇదొక ఊహాత్మక సన్నివేశం! ఈనాటి ఒక గొప్ప కంపెనీకి ఆ 12 మంది బయోడేటా, ప్రొఫైల్ పంపారట! కంపెనీ ఉన్నతాధికారి ఇచ్చిన విశ్లేషణ ఇది ‘మీ 12 మంది శిష్యుల వివరాలు విశ్లేషించాము. వారిలో చాలామందికి తగిన విద్య లేదు, వృత్తిపరమైన అవగాహన లేదు, వారి కుటుంబాలు కూడా గొప్పవి కాదు. పేతురు దుడుకువాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అతని సోదరుడు ఆంద్రెయకు అసలు నాయకత్వపు లక్షణాలేలేవు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను పూర్తిగా స్వార్థపరులు. వారికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ప్రతీదీ అనుమానించే తోమా మీ బృందంలో కొనసాగితే అందర్నీ చెడగొడ్తాడు. ఎందుకంటే అనుమానానికి అక్కాచెల్లెళ్లు బంధువుల బోలెడుమంది ఉంటారు. పన్నులు వసూలు చేసే గొప్ప ఆదాయ వనరులున్న వృత్తి కన్నా మీరు అప్పగించి ఆత్మల సంపాదన వృత్తి గొప్పదని భావించి మీతో చేరిన మత్తయికి సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తాలేదు. యాకోబు కుమారుడైన యూదా, సీమోను తదితర శిష్యులంతా తీవ్రవాద స్వభావం కలిగినవారు. ఆ పన్నెండు మందిలో ఒక్క యూదా ఇస్కరియోతు అనే ఆ వ్యక్తికి మాత్రమే పట్టుదల, ముందుచూపు, వ్యూహారచనా సామర్థ్యం ఉంది. అతనొక్కడే మీరిచ్చే ఉద్యోగానికి అర్హుడు’ అన్నది విశ్లేషణ. కాని దేవుడు మనుషుల్లాగా ఆలోచించడు. పనికిరాని వారని లోకం ముద్రవేసినా వారే భూ దిగంతాలకు సువార్త తీసుకువెళ్ళి ఈనాటి క్రైస్తవానికి బీజం వేశారు. లోకం మిమ్మల్ని విసర్జించి ఆడిపోసుకొంటోందా? దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన దృష్టిలో అంతా అర్హులే! అంతా ఆశీర్వాదాలకు పాత్రులే, ఆశీర్వాదాల పంపకానికి పాత్రులే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆచార్య అనిపించుకోవాలంటే?
సనాతన ధర్మంలో ఏదయినా మూడుసార్లు చెబితే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునః సత్యం అంటారు. మంగళసూత్రం కడితే మూడుసార్లు, ఆచమనం, ప్రదక్షిణం అలా ఏదయినా మూడు సార్లు చేస్తారు. గౌరీపూజ దగ్గర ప్రవరచెప్పి ’నేను నా పిల్లను ఇస్తున్నాను’ అని మూడుసార్లు చెబుతారు మామగారు. అంతే తప్ప పిల్లవాడు ప్రేమించాడని కాదు, మామగారు ఒప్పుకుని ‘నేను ధర్మప్రజాపత్యం కోసం ఈ పిల్లను కోడలుగా స్వీకరిస్తున్నాను’ అని మూడుమార్లు అంటేనే ఆమె కోడలవుతుందని అంటుంది శాస్త్రం. కాబట్టి మూడు అంకె సత్యం. శివుడంతటివాడు చెప్పాడు–నగురోరధికం అని మూడుమార్లు. అందరికన్నా అధికుడుయిన గురువు అనేకపేర్లతో పిలవబడతాడని ఆయన పార్వతితో చెప్పాడు. సూచకగురువు, వాచక గురువు, బోధకగురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు.. ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. చిన్నతనంలో పాఠం చెప్పినవాడు సూచకగురువు. మనం ఏదయినా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడి నియమాలు ఎరుకపరిచేవాడు వాచక గురువు. మంత్రోపదేశం చేసినవాడు బోధక గురువు. ఈ ముగ్గురిలో మంత్రోపదేశం చేసినవాడు సర్వోన్నతుడు. శృంగేరీ పీఠాధిపతిలాంటివారు పరమగురువులు. అటువంటి వారు వచ్చినప్పుడు గురువులు తమ శిష్యులతో సహా లేచి నిలబడి నమస్కారం చేస్తారు. నిషిద్ధగురువులని మరోరకం వారుంటారు. ఆ గురువును ఆశ్రయించకూడదు. అంతమాత్రం చేత ఆయన గురువు కాకుండా పోడు. శాస్త్రం నిషేధించిన కొన్ని ఆరాధనా విధానాలుంటాయి. అటువంటి పూజలు చేయకూడదంటుంది శాస్త్రం. కానీ అటువంటివే నేర్పే గురువు నిషిద్ధ గురువు. తొందరపడి అటువంటి గురువులను ఆశ్రయించి ఆ మార్గాల్లో వెళ్ళకండని పెద్దలు చెప్తారు. గురువంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ‘‘ఆచార్యః గురూనాం శ్రేష్టః’’ – ఆచార్యుడిని గురువులందరిలోకి శ్రేష్టుడంటారు. అంటే ఎవడు ఆచారాన్ని కలిగున్నాడో ఆయన ఆచార్యుడు. నీవు ఏ విషయాన్నయినా చదువుకుని ఉండవచ్చు. అది విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. ఒకడు నత్యం నేర్చుకుంటాడు, శిష్యులకు చెపుతూ ఉంటాడు. ఒకడు వాద్యపరికరాన్ని మోగించడంలో నిష్ణాతుడు. సంగీతంలో, విలువిద్యలో, లెక్కలు చెప్పడంలో.. అలా వారివారి రంగాల్లో పాండిత్యం సంపాదించి దానిని శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. కేవలం ‘నీవు ఏం చెబుతున్నావు, ఏ స్థాయిలో చెపుతున్నావన్న దాన్నిబట్టి నీవు ఆచార్యుడివి కాలేవు’ అంటుంది శాస్త్రం. బోధించే విషయం ఏదయినా ధర్మశాస్త్రం, వేదం బాగా తెలిసున్నవాడై, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆచార్యుడు అని పిలవబడతాడు. నీకు ధర్మశాస్త్రం తెలిస్తే జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, పదిమందికి నీవు ఆదర్శవంతుడవయితే, ‘ఆయనలా బతకండి’ అన్న శిష్టాచారానికి నీవు ప్రమాణమైతే అప్పుడు మాత్రమే నీవు ఆచార్యుడివి. విలువిద్య నేర్పిన ద్రోణుడిని ద్రోణాచార్య అన్నారు. అయితే కేవలం ఆయన విలువిద్య నేర్పినందుకు అలా అనలేదు, విద్య నేర్పేటప్పుడు పాత్రత చూసాడు, ధర్మబద్ధంగా నడుచుకున్నాడు కనుక ద్రోణాచార్యుడయ్యాడు. -
ప్రతి భయానికీ విశ్వాసమే విరుగుడు!
సువార్త గలలియ సముద్రం మధ్యధరా సముద్రానికి 700 అడుగుల దిగువన ఉంటుంది. అకారణంగా యేసుక్రీస్తు భీకరమైన గాలులు చెలరేగిసముద్రం పొంగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను దోనెలో అద్దరికి పంపి తాను ఏకాంత ప్రార్థన కోసం కొండల్లో ఉండిపోయాడు. మార్గమధ్యంలో శిష్యుల దోనె పెనుగాలులలో చిక్కి పొంగుతున్న సముద్రంలో మునిగే ప్రమాదం ఏర్పడింది. పైగా అది అర్ధరాత్రి. శిష్యులు ప్రాణభయంతో గడగడలాడుతుండగా, యేసు అలల మీద నడుస్తూ వారి వద్దకు వస్తుండగా, ఆయన్ను చూసి భూతమనుకొని మరింత భయపడ్డారు. యేసు ‘నేను, భయపడకండి’ అని చెప్పడంతో వారు ఊరట చెందారు. దోనెలోని పేతురు అనే శిష్యుడు ‘‘అయితే నీ వద్దకు నేను రానా?’’ అనడిగితే ప్రభువు రమ్మన్నాడు. మరుక్షణం పేతురు అలలమీదున్నాడు. కాని, గాలికి భయపడి మునిగిపోతుంటే యేసు ఆయన్ని కాపాడి అతని అవిశ్వాసాన్ని గద్దించాడు. యేసు దోనెలోకి రాగానే గాలి నెమ్మదించింది. నీవు నిజంగా దేవుని కుమారుడంటూ శిష్యులాయనకు మొక్కి ఆరాధించారు (మత్త 14:22). ఆపదకన్నా, దొంగలకన్నా, అనుకోని అవరోధం కన్నా అత్యంత దుర్మార్గమైన, ప్రమాదకరమైన శత్రువు భయం. ఆ రాత్రి తుఫాను గాలులకు శిష్యులు భయపడ్డారు. ప్రభువున్నాడన్న విశ్వాసంతో నీళ్లమీద నడిచి సముద్రాన్నే జయిద్దామనుకున్న పేతురు, గాలికి భయపడి డీలా పడ్డాడు. అలల మీదే నడిచే నాకు ఈ గాలి ఎంత అనుకోవలసింది పోయి, అయ్యో, ఇంత గాలిని తట్టుకోగలనా? అని అవిశ్వాసపడ్డాడతను. అప్పుడు శిష్యులు, ఇప్పుడు మనుషులంతా ఏదో ఒక భయం, బాధితులే! ఈ శిష్యులంతా ఒకప్పుడు జాలరులు. వారికి సముద్రపుగాలులు, పడవ ప్రమాదాలు, వాటి భయాలు కొత్తకాదు. కానీ ఇప్పుడు తాము గాలిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన, శాసించగలిగిన దేవుని శిష్యులుగా, దేవుణ్ణి తాకలేని ఏ భయమూ, ప్రమాదమూ తమను కూడా తాకలేదన్న అత్యున్నత స్థితిలో తామున్నామని శిష్యులు గ్రహించలేకపోయారు. ప్రతి భయానికీ, విశ్వాసమే విరుగుడు. అర్ధరాత్రిపూట పెనుగాలులు చెలరేగినప్పుడు యేసు తమతో లేడన్న భావనే వారిని భయానికి గురి చేసింది. ‘మేము దోనెలో, సముద్ర మధ్యలో, యేసు అక్కడెక్కడో కొండల్లో ఉన్నాడు. ఇప్పుడెలా అన్నదే వారి భయానికి మూలమైంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో సుదూరంగా ఆకాశంలో ఉన్న, వుండే దేవుడు కాడని, ఆయన విశ్వాసితోనే, విశ్వాసిలోనే సదాకాలం ఉంటాడన్న విశ్వాసంలోకి, వారింకా ఎదగలేదు (మత్తయి 28:20). విశ్వాసంలో ఒక్కొక్క మెట్టూ మనం ఎక్కేకొద్దీ భయాలు ఒక్కొక్కటే దూరమైపోతాయి. దేవునికి తెలియని ఏ పరిస్థితీ, ప్రమాదమూ విశ్వాసి దరిదాపుల్లోకి కూడా రాదు. విశ్వాసిని ఏ పరిస్థితుల్లోనైనా, ఏ గడ్డుకాలంలో అయినా గట్టెక్కించే బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. మన చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ, పరలోకపు తండ్రియైన దేవుని చేతిలోనే ఉంటుందన్న విశ్వాస స్థాయికి ఎదగడమే అన్ని భయాలనూ జయించే ఏకైక మార్గం!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
కళ్ళు లేకపోతేనేం.. చెవులతో చూస్తాను!
ఆయన ఓ జెన్ గురువు. ఆయన వద్ద పదుల సంఖ్యలో శిష్యులున్నారు. వారిలో ఒకడు అంధుడు. ఓ రోజు కొందరు తోటి శిష్యులు అతనితో నువ్వు ఇప్పటి వరకు మన గురువు గారిని చూడలేదు కదా? అందుకు నువ్వు బాధ పడుతున్నావా? అని అడిగారు. అప్పుడు ఆ అంధుడు నాకెందుకు బాధ? నాకెలాంటి బాధా లేదు అన్నాడు. అక్కడితో ఆగకుండా కంటి చూపు లేకపోతేనేం. చెవులు ఉన్నాయిగా... అవి వింటాయి. వాటిద్వారా ఆయన గొంతు వింటాను. అలాగే చూస్తాను కూడా. కనుక నాకు ఆయనను చూడలేదేనన్న విచారం ఏ కోశానా లేదు అన్నాడు. నిజమా? ఏమిటీ మాట వల్ల ఒకరిని చూడటం సాధ్యమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ? నేను చెప్పేది అక్షరాలా నిజం... ఇంకా చెప్పాలంటే మీరు చూడటం కన్నా నేను ఎక్కువ వింటాను. అంతేకాదు, మిమ్మల్నీ, గురువుగారినీ అందరినీ వింటాను, చూస్తాను. అలాగే మీకన్నా ఎక్కువే అర్ధం చేసుకుంటాను... నాకు బోలెడు నిజాలు కూడా తెలుస్తాయి... అన్నాడు అతను. ఎలాగది? ఏముంది... కొందరు తీయగా మాట్లాడుతారు. కానీ వాళ్ళ గొంతులో ఈర్ష్య కలిసుంటుంది. ఈ ఈర్ష్య వెలుపలికి కనిపించదు. కానీ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. వినిపిస్తుంది. మరి కొందరు మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఏదో ఓదారుస్తున్నట్టు కొన్ని మాటలు చెప్తారు. కానీ ఆ మాటలు నిజం కావు. వారు లోలోపల మన ఓటమిని తలచి తలచి హేళనగా నవ్వుకుంటారు. అది నాకు తెలుసు.... మరి మన గురువుగారు...? నేను ఇప్పటి వరకు కలిసిన వారిలో ఆయన ఒక్కరే ఏది మాట్లాడితే ఆ మాటల్లోని భావాలతో మమేకం అవుతారు. ఆయన మాటలో కల్మషం ఉండదు. లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడని వారెవరైనా ఉన్నారు అంటే అది మన గురువుగారే... ఆయన మాటకు గానీ భావానికి గానీ తేడా ఉండదు. రెండూ ఒక్కలాగానే ఉంటా యి. ఆయన మాటల్లో ఏవగింపు గానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాట్లాడటం గానీ ఆయనలో నేనిప్పటి వరకూ చూడలేదు... అన్నాడు అంధ శిష్యుడు. - యామిజాల జగదీశ్ర0త -
ఆచార్యదేవోభవ...
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు, మరెన్నో విజయాలు... ఆటగాడిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఆ ఘనత చెప్పుకొని కాలం గడిపేయలేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన, పట్టుదల... తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరిక. అందుకు ఎంచుకున్న మార్గం కోచ్‌గా మారిపోవడం. 2004లో సొంతగడ్డపైనే తన ఆఖరి టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత పుల్లెల గోపీచంద్ మరో కొత్త అవతారంతో కోర్టులోకి వచ్చాడు. శిక్షకుడిగా గత పుష్కర కాలంలో ఎన్నో అద్వితీయ విజయాలను అందుకున్నాడు. సైనా, సింధు, శ్రీకాంత్‌లే కాదు... పెద్ద సంఖ్యలో అతని శిష్యులు ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. తండ్రి పాత్రలో ‘గోపీచంద్ చెప్పినట్లు చేయమ్మా, గోపీ వల్లే ఇది సాధ్యమైంది, ఎలా ఆడాలో, ఏం చేయాలో గోపీకే తెలుసు’... సింధు ఫైనల్‌కు చేరిన సందర్భంగా ఆమె తండ్రి పీవీ రమణ ఎన్నో సార్లు చెప్పిన మాట ఇది. ఒక వైపు కూతురి విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరో వైపు అందుకు కారకుడైన వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే రమణ, తన బిడ్డను గోపీ చేతుల్లో పెట్టేశారు. కోచ్‌ను ఆయన అంతగా నమ్మారు. సాధారణంగా తమ జీవితంలో ఎంతో ఆశపడి, శ్రమపడి కూడా అందుకోలేని లక్ష్యాలను అదే రంగంలో తమ పిల్లల ద్వారా సాధించి ఆ సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించడం ఎంతో మంది తల్లిదండ్రులు చేస్తుంటారు. ఇక్కడ ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పుకుంటే తండ్రి పాత్రలో కోచ్ కనిపిస్తారు. గోపీ ఆటగాడిగా తన కెరీర్లో ఒలింపిక్స్ పతకం గెలుచుకోలేదు. ఆ ఆనందాన్ని ఆయన అనుభవించలేదు. అందుకే తన శిష్యుల ద్వారా దానిని సాధించాలని ఆయన భావించారు. అనుకోవడమే కాదు... ఆటగాళ్లతో సమంగా శ్రమించారు. గత ఒలింపిక్స్‌లో సైనా, ఈ సారి సింధు తమ కోచ్ కలను నిజం చేశారు. శ్రామికుడిలా... రియో సన్నాహకాల్లో శ్రమిస్తున్న సింధు శిక్షణను చూసినప్పుడు గోపీచంద్ ఒక మిలిటరీ అధికారిని తలపించాడు. స్మాష్ కొట్టేటప్పుడు ఆమె మోకాలు సరిగ్గా వంచడం మొదలు మెషీన్ గన్‌నుంచి తూటాల్లా ప్రతీ కార్నర్‌నుంచి దూసుకొచ్చే షటిల్స్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వరకు... కోర్టులో ఆమె ప్రతీ కదలికపై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒలింపిక్స్ కోసం సింధు, శ్రీకాంత్‌లను తీర్చి దిద్దే క్రమంలో తాను కూడా ఒక యువ ఆటగాడిలా గోపీచంద్ సిద్ధమయ్యాడు. వారికి కోచింగ్ ఇచ్చేందుకు కావాల్సిన ఫిట్నెస్ కోసం తాను మూడు నెలలుగా సాధారణ ఆహారం పక్కన పెట్టేసి కేవలం కార్బొహైడ్రేట్లతోనే నడిపించాడు. డోపింగ్, ఇన్ఫెక్షన్ భయంతో బయటి ఆహారం, నీటికి వారిద్దరిని దూరంగా ఉంచడం మొదలు దేవుడి ప్రసాదాలు కూడా దగ్గరికి రానివ్వకుండా, తనతో కలిసి మాత్రమే డైనింగ్ హాల్లో భోజనం చేసే ఏర్పాట్లు చేశాడు. ‘కారణం ఏదైనా కావచ్చు... కానీ సైనా నెహ్వాల్ వెళ్లిపోయాక మరొకరిని ఆ స్థాయిలో తీర్చి దిద్దాలని, ఫలితాలు సాధించి చూపాలనే మొండి పట్టుదల అతనిలో వచ్చేసింది. అందుకే అతను ఈ కఠోర శ్రమకు సిద్ధమయ్యాడు’ అని గోపీచంద్ సన్నిహితుడొకరు చెప్పడం విశేషం. బ్యాడ్మింటన్ బంగారుమయం మన దేశంలో బ్యాడ్మింటన్‌కు ఏం భవిష్యత్తు ఉంటుందండీ... అకాడమీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోసం ఒక కార్పొరేట్‌ను కదిలిస్తే గోపీచంద్‌కు వచ్చిన జవాబిది. కానీ గోపీచంద్ తాను అనుకున్నది చేసి చూపించాడు. అందుకు తన శక్తియుక్తులు, సర్వం ధారబోశాడు. చాంపియన్లను తయారు చేయడం అంటే పార్ట్‌టైమ్ బిజినెస్ కాదని నమ్మిన మనిషి అతను. కొన్నేళ్ల క్రితం సైనా విజయాలతో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు సింధు గెలుపుతో మరింత ఎగసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు చోట్ల గోపీచంద్ అకాడమీలు వచ్చేశాయి. తాజాగా రాజధాని ఢిల్లీ శివార్లలో కూడా కొత్త అకాడమీ వస్తోంది. దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మాకెంత లాభం అంటూ అడిగేసింది. అంతే గోపీచంద్ వారిని వద్దనేశాడు. అయితే అప్పుడూ ఇప్పుడూ గోపిచంద్ చెప్పే మాట ఒక్కటే. ‘నేను అకాడమీల పేరుతో వ్యాపారం చేయడం లేదు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం, గొప్ప ఆటగాళ్లను తయారు చేయడం నా లక్ష్యం. అందుకోసమే శ్రమిస్తాను. లెక్కలు రాసుకొని కోర్టులో దిగితే ఎన్నడూ పతకాలు రావు’ అని తన విజయ రహస్యాన్ని ఆయన చెప్పేశాడు.