ఆచార్యదేవోభవ...
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు, మరెన్నో విజయాలు... ఆటగాడిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఆ ఘనత చెప్పుకొని కాలం గడిపేయలేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన, పట్టుదల... తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరిక. అందుకు ఎంచుకున్న మార్గం కోచ్‌గా మారిపోవడం. 2004లో సొంతగడ్డపైనే తన ఆఖరి టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత పుల్లెల గోపీచంద్ మరో కొత్త అవతారంతో కోర్టులోకి వచ్చాడు. శిక్షకుడిగా గత పుష్కర కాలంలో ఎన్నో అద్వితీయ విజయాలను అందుకున్నాడు. సైనా, సింధు, శ్రీకాంత్‌లే కాదు... పెద్ద సంఖ్యలో అతని శిష్యులు ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.
తండ్రి పాత్రలో
‘గోపీచంద్ చెప్పినట్లు చేయమ్మా, గోపీ వల్లే ఇది సాధ్యమైంది, ఎలా ఆడాలో, ఏం చేయాలో గోపీకే తెలుసు’... సింధు ఫైనల్‌కు చేరిన సందర్భంగా ఆమె తండ్రి పీవీ రమణ ఎన్నో సార్లు చెప్పిన మాట ఇది. ఒక వైపు కూతురి విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరో వైపు అందుకు కారకుడైన వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే రమణ, తన బిడ్డను గోపీ చేతుల్లో పెట్టేశారు. కోచ్‌ను ఆయన అంతగా నమ్మారు. సాధారణంగా తమ జీవితంలో ఎంతో ఆశపడి, శ్రమపడి కూడా అందుకోలేని లక్ష్యాలను అదే రంగంలో తమ పిల్లల ద్వారా సాధించి ఆ సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించడం ఎంతో మంది తల్లిదండ్రులు చేస్తుంటారు. ఇక్కడ ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పుకుంటే తండ్రి పాత్రలో కోచ్ కనిపిస్తారు. గోపీ ఆటగాడిగా తన కెరీర్‌లో ఒలింపిక్స్ పతకం గెలుచుకోలేదు. ఆ ఆనందాన్ని ఆయన అనుభవించలేదు. అందుకే తన శిష్యుల ద్వారా దానిని సాధించాలని ఆయన భావించారు. అనుకోవడమే కాదు... ఆటగాళ్లతో సమంగా శ్రమించారు. గత ఒలింపిక్స్‌లో సైనా, ఈ సారి సింధు తమ కోచ్ కలను నిజం చేశారు.
శ్రామికుడిలా...
రియో సన్నాహకాల్లో శ్రమిస్తున్న సింధు శిక్షణను చూసినప్పుడు గోపీచంద్ ఒక మిలిటరీ అధికారిని తలపించాడు. స్మాష్ కొట్టేటప్పుడు ఆమె మోకాలు సరిగ్గా వంచడం మొదలు మెషీన్ గన్‌నుంచి తూటాల్లా ప్రతీ కార్నర్‌నుంచి దూసుకొచ్చే షటిల్స్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వరకు... కోర్టులో ఆమె ప్రతీ కదలికపై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒలింపిక్స్ కోసం సింధు, శ్రీకాంత్‌లను తీర్చి దిద్దే క్రమంలో తాను కూడా ఒక యువ ఆటగాడిలా గోపీచంద్ సిద్ధమయ్యాడు. వారికి కోచింగ్ ఇచ్చేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ కోసం తాను మూడు నెలలుగా సాధారణ ఆహారం పక్కన పెట్టేసి కేవలం కార్బొహైడ్రేట్‌లతోనే నడిపించాడు. డోపింగ్, ఇన్‌ఫెక్షన్ భయంతో బయటి ఆహారం, నీటికి వారిద్దరిని దూరంగా ఉంచడం మొదలు దేవుడి ప్రసాదాలు కూడా దగ్గరికి రానివ్వకుండా, తనతో కలిసి మాత్రమే డైనింగ్ హాల్‌లో భోజనం చేసే ఏర్పాట్లు చేశాడు. ‘కారణం ఏదైనా కావచ్చు... కానీ సైనా నెహ్వాల్ వెళ్లిపోయాక మరొకరిని ఆ స్థాయిలో తీర్చి దిద్దాలని, ఫలితాలు సాధించి చూపాలనే మొండి పట్టుదల అతనిలో వచ్చేసింది. అందుకే అతను ఈ కఠోర శ్రమకు సిద్ధమయ్యాడు’ అని గోపీచంద్ సన్నిహితుడొకరు చెప్పడం విశేషం.
బ్యాడ్మింటన్ బంగారుమయం
మన దేశంలో బ్యాడ్మింటన్‌కు ఏం భవిష్యత్తు ఉంటుందండీ... అకాడమీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోసం ఒక కార్పొరేట్‌ను కదిలిస్తే గోపీచంద్‌కు వచ్చిన జవాబిది. కానీ గోపీచంద్ తాను అనుకున్నది చేసి చూపించాడు. అందుకు తన శక్తియుక్తులు, సర్వం ధారబోశాడు. చాంపియన్లను తయారు చేయడం అంటే పార్ట్‌టైమ్ బిజినెస్ కాదని నమ్మిన మనిషి అతను. కొన్నేళ్ల క్రితం సైనా విజయాలతో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు సింధు గెలుపుతో మరింత ఎగసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు చోట్ల గోపీచంద్ అకాడమీలు వచ్చేశాయి. తాజాగా రాజధాని ఢిల్లీ శివార్లలో కూడా కొత్త అకాడమీ వస్తోంది. దీనికి స్పాన్సర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మాకెంత లాభం అంటూ అడిగేసింది. అంతే గోపీచంద్ వారిని వద్దనేశాడు. అయితే అప్పుడూ ఇప్పుడూ గోపిచంద్ చెప్పే మాట ఒక్కటే. ‘నేను అకాడమీల పేరుతో వ్యాపారం చేయడం లేదు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం, గొప్ప ఆటగాళ్లను తయారు చేయడం నా లక్ష్యం. అందుకోసమే శ్రమిస్తాను. లెక్కలు రాసుకొని కోర్టులో దిగితే ఎన్నడూ పతకాలు రావు’ అని తన విజయ రహస్యాన్ని ఆయన చెప్పేశాడు.