షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్‌లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది.
ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్‌లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది.
ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్‌మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్‌ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్‌మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం.
ప్రణయ్ ఓడినా...
పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ 4–1తో హాంకాంగ్‌పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది.
ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్‌లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది.
3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్‌పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది
Comments
Please login to add a commentAdd a comment