సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు.
బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు.
దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్‌నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్‌లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్‌ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు'
KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు..
Comments
Please login to add a commentAdd a comment