రాకుమారులంతా ఊరవతల బంతి ఆట ఆడుతున్నారు. బంతిని గట్టిగా తన్నాడు భీముడు. దెబ్బకి అది వెళ్ళి, దూరంగా ఉన్న నూతిలో పడిపోయింది. పరుగున పోయి చూశారంతా. అడుగున నూతిలో తేలుతూ కనిపించింది బంతి. ఏ రకంగా ప్రయత్నించినా అందడం లేదది. పైకి తీయడం అసాధ్యం అనుకుని, ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రాకుమారులు. అంతలో అక్కడికి ఓ వ్యక్తి అతను సన్నగా, పీలగా రకరకాల బాణాలూ, అమ్ముల పొదులూ పట్టుకుని ఉన్నాడు. నూతిలోకి తొంగి చూస్తూ, ‘‘నూతిలో బంతి పడిపోయింది, అంతేనా? అడిగాడు. ‘‘అవును’’ అన్నారు రాకుమారులు. ‘‘చూడబోతే మీరంతా రాకుమారుల్లా ఉన్నారు. పైగా ధనుర్విద్యలో మేటివాడైన కృపాచార్యుని శిష్యులు. నూతిలోని బంతిని ఎలా తియ్యాలో తెలియడం లేదా?’’ అన్నాడు ఆశ్చర్యం నిండిన గొంతుతో.
తెలియడం లేదన్నట్టుగా అందరూ తలలూపారు.‘‘పోనీ, నేను తీసి చూపించనా?’’ అనడిగాడతను. ‘‘చూపించండి’’ అన్నారంతా. ‘‘అయితే చూడండి’’ అంటూ విల్లు అందుకున్నాడు. దానికి ఓ బాణాన్ని సంధించాడు. ఆ బాణం వెళ్ళి, నూతిలోని బంతిని నాటుకున్నది. మరోబాణం వదిలాడు. అది వెళ్ళి, మొదటిబాణానికి నాటుకున్నది. మరొకటి వదిలాడు. అది వెళ్ళి రెండోదాన్ని నాటుకున్నది. అలా బాణం తర్వాత బాణం వదిలి, బాణాల గొలుసును తయారుచేశాడు. దాంతో బంతిని పైకి తీసి, రాకుమారులకి అందించాడు. ఇదంతా తెలిసింది భీష్ముడికి. హుటాహుటిన అక్కడికి వచ్చాడు. ‘‘అయ్యా తమరి పేరు?’’ అడిగాడు భీష్ముడు. నన్ను ‘ద్రోణుడు’ అంటారు అన్నాడు ఆ వ్యక్తి. అంతే! ఒక్కసారిగా లేచి, నమస్కరించాడతనికి భీష్ముడు. ఎందుకంటే, అప్పటికే ద్రోణుని ప్రతిభాపాటవాల గురించి విని వున్నాడు భీష్ముడు. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు ఓ క్షణం. తర్వాత కళ్లు తెరచి తలపంకిస్తూ...‘‘ధనుర్విద్యలో పరశురాముణ్ణి మించినవారు మీరు. మీలాంటి వారు మా చిరంజీవులకు తారసపడటం మా అదృష్టం. ఇదిగో! ఈ పిల్లలంతా నా మనుమలు. వీరంతా నేటి నుంచి మీ శిష్యులు. వీరికి మీ మహాస్త్రవిద్యలన్నీ నేర్పండి’’ అన్నాడు. ‘‘తప్పకుండా’’ అన్నాడు ద్రోణుడు. ఆచార్యుడు ఆ మాటనగానే అర్జునుడు పరుగున వచ్చి, అతని పాదాలకు నమస్కరించాడు. అది చూసి భీష్మ ద్రోణులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆనందించారు కూడా. ఆ విధంగా ద్రోణుడు భరత వంశంలో ధనుర్విద్యా పాఠశాలలో గురువు అయ్యాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, గురువనేవారిని వారి ప్రతిభా పాటవాలు, పాండిత్యం ఆధారంగానే నిర్ణయించాలి తప్ప, మనవాడా, ఇతరుడా అనే అభిప్రాయంతో కాదు.
– డి.వి.ఆర్. భాస్కర్
ప్రతిభకు కొలువు!
Published Sun, Jul 22 2018 12:30 AM | Last Updated on Sun, Jul 22 2018 12:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment