భీష్ముడు
భీష్ముడనే పేరు దేవవ్రతుడికి రెండో పేరే అయినా, అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడంటే భయంకరుడని అర్థం. ఏవిధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట, భీష్ముడనే పేరు స్థిరపడిందని చెబుతారు. ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడమూ కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటమూ రెండూ చాలా దొడ్డ ప్రతిజ్ఞలే. అయితే, అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి? అబ్బో, ఎంత కష్టమైన ప్రతిజ్ఞ చేశాడని అబ్బురపడతాం తప్ప, మనకు దానివల్ల భయం ఎందుకు కలుగుతుంది?
తండ్రి చెప్పకుండానే ఆయనకు కావలసినది చేసిన వైనంలో రాముడితో భీష్ముణ్ని సరిపోల్చవచ్చు. కానీ రాముణ్ని భీష్మవ్రతం చేపట్టాడని ఎవరూ అనలేదు. రాముడూ రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు; పద్నాలుగేళ్లు అడవుల్లో ఉన్నాడు. భీష్ముడు ఏళ్లతో ప్రమేయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి దూరమయ్యాడు. పైగా రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగానే ఉంటూనే, దూరంగా ఉన్నాడు. అలాగే రాముడిది నాతిగల పద్నాలుగేళ్ల బ్రహ్మచర్యం; భీష్ముడిది పెళ్లిలేని జీవితాంత బ్రహ్మచర్యం. అందుకే రాముడిది భీష్మవ్రతమనకుండా దేవవ్రతుణ్నే భీష్ముడని అంటారు.
భీష్ముడు, ఇరవైయొక్క సార్లు నేలమీద క్షత్రియుల్లేకుండా చేసిన పరశురాముణ్నే ఓడించిన ధనుర్విద్యాపారంగతుడు. తమ్ముడు విచిత్రవీర్యుడికి పెళ్లిచేద్దామని కాశిరాచకన్నెల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్లాడు. స్వయంవరానికి వచ్చిన రాజులనందర్నీ గడ్డిపరకల మాదిరిగా తీసేసి, రాచకన్నెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ, అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టికరిపించాడు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో అంబ అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొందామని ఉబలాటపడి వచ్చిన సాల్వుణ్ని కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు.
తీరా ఇంటికి వచ్చిన తరవాత, అంబ తన ప్రేమకథని చెప్పి సాల్వుడి దగ్గరికి పంపించమని అడిగింది. సరే, అంబికా అంబాలికల్ని ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి పెళ్లి చేశారు. అతనేమో ఆ పెళ్లాల రంధిలో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకొని ఏడేళ్లలోనే చచ్చిపోయాడు. అతిసంభోగంతో రాజయక్ష్మం వస్తుందన్నది ఇక్కడి పాఠం. అతను పోయిన తరువాత, సత్యవతి భీష్ముణ్ని అంబికా అంబాలికలతో కాపరం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడినవాడు గనక ఆ పనికి అతను ఒప్పుకోలేదు.
ఇక అంబ విషయానికి వస్తే... ఆమెను పెళ్లిచేసుకోవడానికి ససేమిరా అన్నాడు సాల్వుడు. భీష్ముడి మీద కక్షకట్టిన అంబ... పరుశురాముడి సాయాన్ని కోరింది. అయితే క్షత్రియులందర్నీ పనిగట్టుకొని మరీ నాశనం చేసిన పరుశురాముణ్నే ఓడించిన జగజ్జెట్టి భీష్ముడు. ఇక అంబ, దెబ్బతిన్న పాముకి మల్లే కసితో తపస్సు చేసింది. శివుడి వరాన్ని పొంది, చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని, ద్రుపద మహారాజుకు కూతురుగా పుట్టింది. ఆ రాజు కూతురికి మగదుస్తులు వేసి మగవాడిగా పెంచడమేగాక, హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. మామగారు అగ్గి గుగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి, శిఖండి ఒక వనంలోకి పారిపోయింది. ఆ వనాన్ని స్థూణాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనితో గోడు చెప్పుకొంది. ‘గండం గడిచేంతదాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను. నీ మామగారు తృప్తిపడి వెళ్లిపోగానే తిరిగి నా పుంస్త్వాన్ని నాకు ఇచ్చేద్దుగానిలే’ అని ఒడంబడిక చేసుకొని శిఖండిని మగవాడిగా చేశాడు.
సత్యవతితో పెళ్లికాగానే సంతోషించిన శాంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణమనే వరాన్నిచ్చాడు. కానీ భగవంతుడు అఘటనఘటనా సమర్థుడు. ఎన్నెన్ని వరాలనైనా పొందనీ చావు ఏదోవిధంగా వచ్చితీరుతుంది. దానికి మార్గాన్ని భీష్ముడే ఏర్పరుచుకొన్నాడు. భీష్ముడికి ఒక వ్రతం ఉంది: ఆడదాన్ని గానీ ముందు ఆడదిగా ఉండి, తరవాత మగవాడిగా మారినవాణ్ని గానీ ఆడదాని పేరుపెట్టుకొన్నవాణ్ని గానీ ఆడదాని రూపమున్నవాణ్ని గానీ చూస్తే బాణాన్ని వేయడు. నిజానికి చైతన్యానికి మగా ఆడా తేడా ఉండదు. అలాగ వేరుతనాన్ని చూడటమే అహంకారమంటే.
కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకారోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తూన్న భీష్ముని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజే వెళ్లి ‘నువ్వెలాగ చచ్చిపోతావో నువ్వే చెప్పాలి’ అని వింతైన కోరిక కోరాడు. అప్పటికే చాలా విసుగెత్తి ఉన్నాడు భీష్ముడు. ‘శిఖండిని అడ్డుపెట్టుకొని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాల్ని వేయను గనక నేను పతనమైపోతాను’ అని తన చావును తానే చెప్పుకొన్నాడు. అలాగ బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్లు బతికే ఉన్నాడు. చివరికి యుద్ధమైపోయిన తరవాత, అందర్నీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని, ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తరవాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ బొందిని వదిలిపెట్టాడు భీష్ముడు.
అసలైన భీష్మత్వం!
పాండవులకు జయం విషయంలో భీష్ముడంటేనే భయం. మనం ఇంతకుముందే భీష్ముడు ఆభాసచైతన్యమని, అంటే, అహంకార చైతన్యమని చెప్పుకొన్నాం. జూదంలో ద్రౌపదిని గెలుచుకొని దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత జులుం చేయడానికి సిద్ధపడ్డప్పుడు, ఇంతటి భయంకరుడన్న పేరున్న ఈయనగారు కిక్కురుమనలేదు. సింహాసనాన్ని కాపాడటానికి వ్రతంబూనితే మాత్రం అధర్మం జరుగుతూంటే చూస్తూ ఊరుకోవడం గానీ నామమాత్రంగా మంచి చెప్పి ఊరుకోవడం గానీ ఎంతటి యోద్ధనయినా భయపెట్టే ఇతనికి తగనే తగదు. ఇతను ధర్మాలన్నీ ఎరిగినవాడే; ధర్మాలను చెప్పగలిగినవాడే; వినకపోతే చెవి మెలిపి మరీ వినేలాగ నిర్బంధపెట్టగలిగిన కురువృద్ధుడూ మహాశూరుడూను.
రాజ్యాన్ని కాపాడటమంటే, సింహాసనం మీద ఉన్నవాణ్ని కాపాడటం మాత్రం కాదు. రాజ్యం ధర్మపరంగా ఉండాలంటే, సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధర్మంగా ఉండాలి. సింహాసనం మీద అధర్మపరుడుంటే, అతన్ని కాపాడటం చాలా అపరాధం. కానీ దుర్యోధనుడూ శకునీ దుశ్శాసనుడూ కర్ణుడూ మరీ పేట్రేగి ప్రవర్తిస్తూంటే, ఇంతటి మహాధనుర్ధారీ వాళ్లను కట్టడి చేయలేదు. ద్రోణుడంటారా ఒక రాజోద్యోగి, అతని భయాలు అతనికుంటాయి. కానీ భీష్ముడు వాళ్లందరికీ తాతేకాదు, అతని మాటంటేనే అందరికీ హడలు. కయ్యానికి పదేపదే కాలుదువ్వుతూన్న దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ కురువృద్ధుడు అంతకన్నా మించి మరేమీ చేయలేదు. అప్పుడైనా, ధర్మం ఎటువైపు ఉందో తెలిసిన ధర్మవేత్త పాండవులవైపుకు వెళ్లకుండా దుర్యోధనుడికొమ్మే కాశాడు. అంచేతనే భీష్ముడు అహంకార రూపమయ్యాడు.
ఈ యుద్ధం వెనక ఉన్న మానసికమూ ఆధ్యాత్మికమూ అయిన స్వరూపాన్ని చూస్తే, భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మప్రవర్తనకు గండికొట్టడానికి ఎదురై నిలుచుందని అర్థమవుతుంది. అదే, అంతస్సులో ఆత్మచైతన్య సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నం చేసే అంతశ్శక్తుల గుండెల్లో అతి గుబులు పుట్టిస్తూ ఉండేది. పతంజలి చెప్పిన ‘అస్మిత’ అనే క్లేశం ఇదే. ‘అస్మి’ అంటే ‘నేనున్నాను’ అని అర్థం. దాని భావమే ‘అస్మిత’. లోపలున్న భగవంతుడి ప్రతిబింబమైన ఆత్మను మరిచిపోయి, తనను శరీరమూ మనస్సులకు సంబంధించిన పరికరాలతో ఒకటిగా అనుకోవడమే అహంకారం. ఇదే కురువృద్ధుడు. దీనికి మామూలు అర్థం కౌరవుల్లో పెద్దవాడని. కానీ అసలైన అర్థం ‘సృష్టి మొదలైన దగ్గర్నుంచీ అనాదిగా ఉంటూనే ఉన్న ప్రాపంచికుడు’ అని. మొత్తం సృష్టి అంతా ఇతని వ్యక్తిగతమైన బలం మీదనే ఆధారపడి ఉంటుంది.
ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలూ ఇంద్రియాల అనుభవాలూ అనేవాటి వెనక మారకుండా ఉండే చైతన్యం తాలూకు ఏకత్వమే అహంకారం. ‘నేను ఆలోచిస్తున్నాను, నేను రాస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను సుఖిస్తున్నాను’ అనే రకరకాల మార్పుల వెనక వాటికన్నిటికీ కర్త అయినదే అహంకారం. ఈ అనుభవాలకు ప్రభువైన ‘నేను’ నిజానికి ఈ ఆలోచనల కన్నా వేరైనవాడే. కళ్లు చూడలేనప్పుడు, కళ్లను మాత్రమే గుడ్డి అనవలసింది పోయి, ‘నేను గుడ్డివాణ్ని’ అని తనకే గుడ్డితనాన్ని ఆపాదించుకోవడం తప్పేగదా... కళ్లు పోయినంతమాత్రాన మనం నాశనమైపోవటం లేదు. కానీ ప్రతివాడూ అనుభవాన్నీ అనుభవించేవాణ్నీ కలిపేస్తూ ఉంటాడు. ఈ అహంకారం చనిపోవాలంటే, కళ్లు మూసుకొని, లోపలికి చూపును తిప్పి, అక్కడున్న మహాచైతన్యాన్ని తదేకంగా ధ్యానం చేయాలి; ఆ చైతన్యంతో ఒకటైపోవాలి. భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురుగా చూస్తూ ఆ మూర్తిని ధ్యానపథంలో ఉంచుకొనే ప్రాణాలను వదిలిపెట్టేడంటే ఇదే అర్థం. అహంకారాన్ని జయించాలంటే ధ్యానమొక్కటే మార్గం. లేకపోతే అహంకారం చావనే చావదు.