అది మహాభారత యుద్ధ సమయం. భీష్మాచార్యుడు మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా పాండవుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దిక్కుతోచని ద్రౌపది విశ్వానికి ఏకైక దిక్కయిన శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించింది. తన భర్తలని ఏ విధంగానైనా రక్షించి తన మాంగల్యాన్ని కాపాడమని వేడుకుంది. రక్షిస్తానని మాటిచ్చాడు కృష్ణుడు. ఆరోజు రాత్రి భీష్మాచార్యుడు తాను తొందరపాటుతో చేసిన ప్రతిజ్ఞ వల్ల మనస్సు వ్యాకులం చెందగా, తనలో తానే మథన పడుతూ, ఈ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు ఎదురవుతున్నాయో అని నిద్దుర లేమితో గుడారంలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కృష్ణుడు ద్రౌపదిని తోడ్కోని భీష్మాచార్యుని గుడారం వద్దకు వెళ్లాడు. కృష్ణుని ఆజ్ఞ ప్రకారం ద్రౌపది ఒక్కసారిగా వెళ్లి భీష్ముని పాదాలపై వాలింది. ‘దీర్ఘ సుమంగళీ భవ’ అని ఆశీర్వదించి ‘నీవు ఎవరవమ్మా?’’ అని అడిగాడు భీష్ముడు. ఎదురుగా నిలుచున్న ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయాడు.
దీర్ఘసుమంగళీ భవ’అని ఆశీర్వదించాక ఆమె భర్తలని తాను ఎలా చంపగలడు?! ఉద్వేగానికి లోనయ్యాడు భీష్మాచార్యుడు. ఇంతలో కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించాడు. తెర వెనుక ఉన్న సూత్రధారి ఎవరో అప్పుడు భీష్మునికి అర్థమైంది. కృష్ణ దర్శనంతో కొంత ఉపశమనం పొందాడు. ఆకలనిపించింది. కృష్ణుని అంగవస్త్రంలో ఉన్న మూటను చూసి, అదేదో తినుబండారమై ఉంటుందని భావించి, తనకు పెట్టమని అడిగాడు. కృష్ణుడు తాను మోసుకొచ్చిన మూటను విప్పి చూపించగా అందులో పాదరక్షలు అగుపించాడు. భీష్ముడు నిర్ఘాంతపోయి, ‘‘ఇదేమిటి కృష్ణా!’’అన్నాడు. ‘‘చెప్పుల శబ్దం విని ద్రౌపది రాకను నీవు గమనించకూడదనే ఉద్దేశ్యంతో నేను ఆమె పాదరక్షలను మోసుకొచ్చాను’’ అని చెప్పాడు కృష్ణుడు. ఎలాగైతేనేం, భీష్మునితో దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు వరాన్నైతే ఇప్పించాడు ద్రౌపదికి.
Comments
Please login to add a commentAdd a comment