Pandavalu
-
బకాసుర వధ
హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్ర ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. ‘కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరుపాటు తగదు. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి, తర్వాత ఏకచక్రపురం వెళ్లండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పాడు. శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది, భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు నలుగురు సోదరులూ భిక్షాటనకు వెళ్లగా, భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటిన వెళ్లింది. భార్యాబిడ్డలను పట్టుకుని అదేపనిగా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. ‘నిస్సారమైనది ఈ జీవితం. ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికూన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వెయ్యడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు– ఒక్కగానొక్క వంశాంకురం. తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు. ‘వద్దు, వద్దు. మీరు వెళ్లకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను. అసలు బతకలేను. పునిస్త్రీ చావు కన్న పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను’ ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ‘ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్నే. నన్ను పంపండి’ అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ.ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ‘ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను. ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా’ అంటూ దగ్గరే ఉన్న ఒక కర్రనందుకున్నాడు. ‘అసలేమైందమ్మా! మీరంతా ఎందుకో బాధపడుతున్నారు. రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరు? మీకొచ్చిన ఆపద ఏమిటి? మీకు ఆపద వస్తే, మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి’ అంది కుంతి. ‘ఏం చెప్పేది తల్లీ! ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్లో వాళ్లందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆలోచించి, బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒక మనిషి, రెండు పోతులు, వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని, వాడు ఊరి మీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజూ వంతుల వారీగా ఒక్కో ఇంటి నుంచి ఒక మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం’ అని చెప్పాడా బ్రాహ్మణుడు. ‘విచారించకండి. దీనికి తగిన ఉపాయం చెబుతాను’ అంది కుంతి. ‘మీకు ఒక్కడే కొడుకు. పైగా పసివాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్లలో ఒకణ్ణి పంపుతాను.’ అంది. ‘శివ శివా’ అంటూ చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు. ‘అతిథిని చావుకు ఎరగా వేయడం మహా పాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లీ!’ అన్నాడు. ‘అయ్యా! మీరు అనవసరంగా బాధపడకండి. మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహా బలసంపన్నుడు. వందమంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్నకొడుకు చేదుకాదు కదా, నేను నా కొడుకును ఎలా బలి పెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి’ అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకువెళ్లమని చెప్పింది. ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వర త్వరగా పంచభక్ష్యాలతో భోజనం తయారు చేయించి, పోతులు పూన్చిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండి పైకెక్కి భీముడు బయలుదేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా, యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని, వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని, బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండి మీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నసాళానికెక్కింది. ‘నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తున్నావేమిటి? ఒళ్లు కొవ్వెక్కిందా?’ అంటూ భీముడి వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా, భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్లాడు. వాడు చెట్టు పెరుక్కుని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి, మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్లాడు. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టు పక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్లయుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి, కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని భీముడు వాడి మీదకు మెరుపులా దూకాడు. ఒక చేత్తో నడుము దొరకబుచ్చుకుని, ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకుని, వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి, ధైర్యంగా అతడిని పంపిన కుంతిని వేనోళ్ల పొగిడారు. -
పాండవులతో ద్రుపదుడు ఏమన్నాడో తెలుసా?
► పాండవులతో ధ్రుష్టద్యుమ్నుడు ఏమన్నాడు? పాండవులను ద్రుపదుడు ఆహ్వానించాడని, వారి ఆహ్వానాన్ని అంగీకరించమని చెప్పి బయలుదేరాడు. వాని వెంట పాండవులు కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ► పాండవులు ఏ రథాన్ని ఎక్కారు? రాజులకు తగిన రత్నఖచిత రథం ఎక్కి, రాజభవనం చేరారు. ► ద్రుపదుడు ఏమనుకున్నాడు? ద్రుపదుడు వారిని క్షత్రియులుగా గుర్తించి, సంబరపడ్డాడు. ఆదరంతో ఆసనాలు ఇచ్చాడు. ► పాండవులతో ద్రుపదుడు ఏమన్నాడు? మీరు దేవతలో, గంధర్వులో తెలియట్లేదు. మీ కులగోత్రాలు తెలిసిన తరవాతే ద్రౌపదినిచ్చి వివాహం చేస్తాను. అంతవరకు వివాహానికి సమ్మతించలేను అన్నాడు ద్రుపదుడు. ► ద్రుపదుడి మాటలకు ధర్మరాజు ఏమని సమాధానమిచ్చాడు? రాజా! మేము అయిదుగురం క్షత్రియులం. పాండురాజు కుమారులం. నేను పెద్దవాడిని. ధర్మరాజుని. వీరు నలుగురు భీమ అర్జున నకుల సహదేవులు. ఈమె మా తల్లి కుంతీదేవి అన్నాడు. ► ధర్మరాజు మాటలకు ద్రుపదుడు ఎలా ఉన్నాడు? ద్రుపదుడి కళ్లలో ఆనందబాష్పాలు జలజలరాలాయి. లక్క ఇంటి దహనం దగ్గర నుంచి మొత్తం వృత్తాంతం తెలుసుకుని, వారికి ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు. వారిని రాజభవనంలో ఉంచాడు. ► ద్రుపదుడి ప్రతిపాదనకి ధర్మరాజు ఏమి చెప్పాడు? మహారాజా! మా తల్లి కుంతి, ఆమె మాట జవదాటం. ద్రౌపది మా అయిదుగురికి భార్య కావాలి అని ఆవిడ అంది. అట్లే కానివ్వండి. ద్రౌపదిని మేం అయిదుగురం వివాహమాడతాం... అన్నాడు ధర్మరాజు. ►ధర్మరాజు మాటలకు ఆశ్చర్యపడిన ద్రుపదుడు ఏమన్నాడు? ధర్మరాజా! లోకంలో ఒక పురుషునికి అనేకమంది భార్యలు ఉండటం తెలుసు. కాని ఒక స్త్రీకి అనేకమంది భర్తలు ఉండటం వినలేదు. అది ఏ యుగంలోనూ, ఏ పురాణంలోనూ లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి. నీ మాటలు ధర్మవిరుద్ధం కాకపోవచ్చు. అయినా కుంతి, మీరు, ధృష్టద్యుమ్నుడు ఆలోచించండి, రేపు నిర్ణయిద్దాం అన్నాడు. ►ద్రుపద సభకు వచ్చిన వేదవ్యాసమహర్షిని ఏ విధంగా ఆదరించారు? వేదవ్యాసునికి అందరూ పాదాభివందనం చేశారు. ఆసనం చూపి, అందరూ కూర్చున్నారు. అప్పుడు ద్రుపదుడు, ఒక భార్య పలువురు భర్తలు లోకవిరుద్ధం కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
కృష్ణుడు మోశాడు
అది మహాభారత యుద్ధ సమయం. భీష్మాచార్యుడు మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా పాండవుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దిక్కుతోచని ద్రౌపది విశ్వానికి ఏకైక దిక్కయిన శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించింది. తన భర్తలని ఏ విధంగానైనా రక్షించి తన మాంగల్యాన్ని కాపాడమని వేడుకుంది. రక్షిస్తానని మాటిచ్చాడు కృష్ణుడు. ఆరోజు రాత్రి భీష్మాచార్యుడు తాను తొందరపాటుతో చేసిన ప్రతిజ్ఞ వల్ల మనస్సు వ్యాకులం చెందగా, తనలో తానే మథన పడుతూ, ఈ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు ఎదురవుతున్నాయో అని నిద్దుర లేమితో గుడారంలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కృష్ణుడు ద్రౌపదిని తోడ్కోని భీష్మాచార్యుని గుడారం వద్దకు వెళ్లాడు. కృష్ణుని ఆజ్ఞ ప్రకారం ద్రౌపది ఒక్కసారిగా వెళ్లి భీష్ముని పాదాలపై వాలింది. ‘దీర్ఘ సుమంగళీ భవ’ అని ఆశీర్వదించి ‘నీవు ఎవరవమ్మా?’’ అని అడిగాడు భీష్ముడు. ఎదురుగా నిలుచున్న ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయాడు. దీర్ఘసుమంగళీ భవ’అని ఆశీర్వదించాక ఆమె భర్తలని తాను ఎలా చంపగలడు?! ఉద్వేగానికి లోనయ్యాడు భీష్మాచార్యుడు. ఇంతలో కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించాడు. తెర వెనుక ఉన్న సూత్రధారి ఎవరో అప్పుడు భీష్మునికి అర్థమైంది. కృష్ణ దర్శనంతో కొంత ఉపశమనం పొందాడు. ఆకలనిపించింది. కృష్ణుని అంగవస్త్రంలో ఉన్న మూటను చూసి, అదేదో తినుబండారమై ఉంటుందని భావించి, తనకు పెట్టమని అడిగాడు. కృష్ణుడు తాను మోసుకొచ్చిన మూటను విప్పి చూపించగా అందులో పాదరక్షలు అగుపించాడు. భీష్ముడు నిర్ఘాంతపోయి, ‘‘ఇదేమిటి కృష్ణా!’’అన్నాడు. ‘‘చెప్పుల శబ్దం విని ద్రౌపది రాకను నీవు గమనించకూడదనే ఉద్దేశ్యంతో నేను ఆమె పాదరక్షలను మోసుకొచ్చాను’’ అని చెప్పాడు కృష్ణుడు. ఎలాగైతేనేం, భీష్మునితో దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు వరాన్నైతే ఇప్పించాడు ద్రౌపదికి. -
ధర్మం, సత్యం శాశ్వతం
‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతాలు. అయితే, ఒక్కోకప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం ముగిసింది. మాట ప్రకారం తమకు రావలసిన అర్ధరాజ్యం తమకు ఎలానూ వస్తుందనే ధైర్యంతో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అది సంపాదించుకోవటానికిముందుగా తమకిష్టమైన కృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారం పంపుతారు. ఆ పని నెరవేర్చటం కోసం కృష్ణుడు, ధృతరాష్ట్రుడు కొలువు తీరి ఉన్న సభకు వచ్చి, పాండవులు తనతో ఏమి చెప్పి పంపించారో, దాన్ని మంచి మాటల్తో చెబుతాడు. అలా చెబుతూ మధ్యలో అంటాడు. ‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతా లు. అయితే, ఒక్కొక్కప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. సమర్థులైనవాళ్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లు తమకేమీ పట్టనట్టు ఉంటే, ఆ కీడు వాళ్లకుగాని, ధర్మానికి, సత్యానికి ముప్పు వాటిల్లదు. అవి ఎప్పుడూ దృఢంగా నిలిచే ఉంటాయి. వాటిని ఎవ్వరూ కదల్చలేరు. ఎందుకంటే ఈ రెంటినీ రక్షిస్తూ భగవంతుడున్నాడు. ఎవరు అడ్డుపడినా, ఆ భగవంతుడే ధర్మాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. సత్యానికి శుభం కలుగజేస్తాడు! అట్లా శ్రీకృష్ణుడు చెబుతుండగా, కౌరవ పెద్దలందరూ సభలో ఉన్నారు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని కాపాడటంలో సమర్థులు. ఆ కాపాడటమనే బాధ్యతను వాళ్లు తీసుకోవాలి. లేకపోయినట్లయితే, వాళ్లకు చేటు మూడుతుంది గాని, ధర్మానికి, సత్యానికి కాదు. ఇంతటి భావాన్ని ఇముడ్చుకున్న పద్యం, తిక్కన భారతం ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసం లో ఉన్నది. ‘‘సారపు ధర్మమున్ విమల సత్యము...’’తో మొదలవుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. ధర్మం, సత్యం గొప్పదనం గురించి భారతం లో చాలా చోట్ల వినవస్తుంది. ధర్మము, సత్యము అనే ఈ రెండే భారతమనే బండినడవటానికి రెం డుచక్రాలుగా ఉపయోగపడ్డాయని పెద్దలంటారు. - దీవి సుబ్బారావు