► పాండవులతో ధ్రుష్టద్యుమ్నుడు ఏమన్నాడు?
పాండవులను ద్రుపదుడు ఆహ్వానించాడని, వారి ఆహ్వానాన్ని అంగీకరించమని చెప్పి బయలుదేరాడు. వాని వెంట పాండవులు కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యారు.
► పాండవులు ఏ రథాన్ని ఎక్కారు?
రాజులకు తగిన రత్నఖచిత రథం ఎక్కి, రాజభవనం చేరారు.
► ద్రుపదుడు ఏమనుకున్నాడు?
ద్రుపదుడు వారిని క్షత్రియులుగా గుర్తించి, సంబరపడ్డాడు. ఆదరంతో ఆసనాలు ఇచ్చాడు.
► పాండవులతో ద్రుపదుడు ఏమన్నాడు?
మీరు దేవతలో, గంధర్వులో తెలియట్లేదు. మీ కులగోత్రాలు తెలిసిన తరవాతే ద్రౌపదినిచ్చి వివాహం చేస్తాను. అంతవరకు వివాహానికి సమ్మతించలేను అన్నాడు ద్రుపదుడు.
► ద్రుపదుడి మాటలకు ధర్మరాజు ఏమని సమాధానమిచ్చాడు?
రాజా! మేము అయిదుగురం క్షత్రియులం. పాండురాజు కుమారులం. నేను పెద్దవాడిని. ధర్మరాజుని. వీరు నలుగురు భీమ అర్జున నకుల సహదేవులు. ఈమె మా తల్లి కుంతీదేవి అన్నాడు.
► ధర్మరాజు మాటలకు ద్రుపదుడు ఎలా ఉన్నాడు?
ద్రుపదుడి కళ్లలో ఆనందబాష్పాలు జలజలరాలాయి. లక్క ఇంటి దహనం దగ్గర నుంచి మొత్తం వృత్తాంతం తెలుసుకుని, వారికి ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు. వారిని రాజభవనంలో ఉంచాడు.
► ద్రుపదుడి ప్రతిపాదనకి ధర్మరాజు ఏమి చెప్పాడు?
మహారాజా! మా తల్లి కుంతి, ఆమె మాట జవదాటం. ద్రౌపది మా అయిదుగురికి భార్య కావాలి అని ఆవిడ అంది. అట్లే కానివ్వండి. ద్రౌపదిని మేం అయిదుగురం వివాహమాడతాం... అన్నాడు ధర్మరాజు.
►ధర్మరాజు మాటలకు ఆశ్చర్యపడిన ద్రుపదుడు ఏమన్నాడు?
ధర్మరాజా! లోకంలో ఒక పురుషునికి అనేకమంది భార్యలు ఉండటం తెలుసు. కాని ఒక స్త్రీకి అనేకమంది భర్తలు ఉండటం వినలేదు. అది ఏ యుగంలోనూ, ఏ పురాణంలోనూ లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి. నీ మాటలు ధర్మవిరుద్ధం కాకపోవచ్చు. అయినా కుంతి, మీరు, ధృష్టద్యుమ్నుడు ఆలోచించండి, రేపు నిర్ణయిద్దాం అన్నాడు.
►ద్రుపద సభకు వచ్చిన వేదవ్యాసమహర్షిని ఏ విధంగా ఆదరించారు?
వేదవ్యాసునికి అందరూ పాదాభివందనం చేశారు. ఆసనం చూపి, అందరూ కూర్చున్నారు. అప్పుడు ద్రుపదుడు, ఒక భార్య పలువురు భర్తలు లోకవిరుద్ధం కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment