అశ్వనీ కుమారుల వల్ల చ్యవన మహర్షికి నవయవ్వనం లభించింది. తనకు యవ్వనాన్ని ప్రసాదించిన అశ్వనీ దేవతలకు ప్రత్యుపకారం చేయాలని తలచాడు చ్యవనుడు. అప్పటికి అశ్వనీ కుమారులకు సోమపానం చేసే అర్హత లేదు. అందువల్ల వారి చేత సోమపానం చేయిస్తానని చ్యవనుడు ప్రతిజ్ఞ చేసి, వారిని సాదరంగా సాగనంపాడు. యవ్వనవంతుడైన చ్యవనుడిని చూడటానికి ఒకనాడు అతడి మామగారైన సంయాతి వచ్చాడు. నవయవ్వన తేజస్సుతో మెరిసిపోతున్న అల్లుడిని చూసి సంయాతి సంతోషించాడు.
తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి, రాజ్యప్రజల క్షేమం కోసం, తన అభివృద్ధి కోసం యజ్ఞం తలపెట్టానని సంయాతి చెప్పాడు. మామగారు యజ్ఞం తలపెట్టడం పట్ల చ్యవనుడు సంతోషం వ్యక్తం చేశాడు. తానే స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తానని చెప్పి, యజ్ఞానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. యజ్ఞ ముహూర్తానికి కొద్దిరోజులు గడువు ఉండగానే భార్య సుకన్యతో కలసి చ్యవనుడు మామగారైన సంయాతి ఇంటికి చేరుకున్నాడు. నిర్ణీత ముహూర్తానికి సంయాతి తన అల్లుడు చ్యవనుడి ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞానికి ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చారు.
యజ్ఞం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పురోహితులు మంత్ర సహితంగా హవిస్సులను సమర్పిస్తున్నారు. యజ్ఞంలో సోమాన్ని సమర్పించే ఘట్టం వచ్చింది. అశ్వనీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చ్యవనుడు వారికి కూడా సోమాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. చ్యవనుడు చేయబోతున్న పనిచూసి ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘అశ్వినులు దేవతలు కారు. వారికి సోమపానార్హత లేదు. వారికి సోమాన్ని సమర్పించడం అనాచారం’ అంటూ అభ్యంతరపెట్టాడు. మిగిలిన దిక్పాలకులు కూడా ఇంద్రుడికి వంత పలికారు.
చ్యవనుడు వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, అశ్వినులకు సోమాన్ని సమర్పించాడు. చ్యవనుడి చేతుల మీదుగా అశ్వినులు సంతృప్తిగా సోమపానం చేశారు. అశ్వినులు సోమపానం చేయడాన్ని కళ్లారా చూసిన ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. పట్టరాని ఆగ్రహంతో రగిలిపోతూ, చ్యవనుడిపై విసరడానికి తన వజ్రాయుధాన్ని పైకెత్తాడు. మహిమాన్వితుడైన చ్యవనుడు మంత్రోచ్ఛాటన చేస్తూ, ఇంద్రుడి వైపు తన చూపు సారించాడు. వజ్రాయుధంతో పైకెత్తిన ఇంద్రుడి చేయి అలాగే కదలకుండా నిలిచిపోయింది. ఇంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసి మిగిలిన దిక్పాలకులంతా హతాశులయ్యారు.
వెంటనే చ్యవనుడు యజ్ఞగుండంలో హవిస్సును వేయగా, అందులోంచి భీకరాకారుడైన ‘మధుడు’ అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడు. భూమ్యాకాశాలను తాకుతున్నట్లున్న శరీరం, పదునైన కోరలు, అగ్నిజ్వాలలాంటి నాలుకతో పెదవులు నాక్కుంటూ వచ్చి ఇంద్రుణ్ణి అమాంతం మింగేయబోయాడు. ఇది చూసి దిక్పాలకులు హాహాకారాలు చేశారు. ఇంద్రుడు భయకంపితుడయ్యాడు.
‘రక్షించు మహర్షీ! రక్షించు!’ అంటూ చ్యవనుడి పాదాల మీద పడ్డాడు. అశ్వనీకుమారుల సోమపానానికి తాను అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. ఇంద్రుడి పట్ల శాంతించిన చ్యవనుడు అతడికి అభయమిచ్చాడు. యజ్ఞగుండం నుంచి వెలువడిన మధుడిని సాగనంపడానికి ప్రయత్నించాడు. ‘ఇంద్రుడిని విడిచిపెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపో!‘ అని మధుడిని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు ఇంద్రుడిని విడిచిపెట్టాడు. తర్వాత చ్యవనుడి ఎదుట వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ‘మహర్షీ! నీ సంకల్పంతో నన్ను సృష్టించావు. నాకు ఆశ్రయాన్ని చూపిస్తే, ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని పలికాడు.
‘నువ్వు మద్యాన్ని, స్త్రీలోలురను, మృగయా వినోదంలో మునిగి తేలే వేటగాళ్లను, అక్షక్రీడలో కాలం వెళ్లబుచ్చే జూదరులను ఆశ్రయించుకుని ఉండు’ అని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు అక్కడి నుంచి వెంటనే అదృశ్యమైపోయాడు. పెను ప్రమాదాన్ని తప్పించుకున్న ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ స్వర్గానికి బయలుదేరాడు. మిగిలిన దిక్పాలకులు కూడా తమ తమ నెలవులకు బయలుదేరారు. చ్యవన మహర్షి తన తపోమహిమను వెల్లడి చేసిన యజ్ఞవాటిక గల పర్వతానికి ‘అర్చీక పర్వతం’ అనే పేరు వచ్చింది. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment