సుజాత ఏకపాదులు | Daughter of Uddalaka Maharshi sujatha marriage | Sakshi
Sakshi News home page

సుజాత ఏకపాదులు

Published Sun, Feb 9 2025 2:26 AM | Last Updated on Sun, Feb 9 2025 2:26 AM

Daughter of Uddalaka Maharshi sujatha marriage

ఉద్దాలక మహర్షి కూతురు సుజాత. ఉద్దాలకుడు ఆశ్రమవాసం చేస్తూ, గురుకులం నడిపేవాడు. అతడి వద్ద ఎందరో శిష్యులు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు వేదపఠనం చేస్తున్నప్పుడు సుజాత తరచుగా అక్కడకు వచ్చి కూర్చునేది. వారి వేదపఠనాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఒకరోజు సుజాత ఎప్పటిలాగానే పండ్లు, పాలు తీసుకుని తండ్రి వద్దకు వచ్చింది. ఉద్దాలకుడు కూతురిని తల నిమిరి, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమె రాకతో వేదాధ్యయనానికి కొద్ది క్షణాలు అంతరాయం కలిగింది. 

శిష్యుల చూపులు గురువుగారి వైపు, ఆయన గారాల కూతురి వైపు మళ్లాయి. గురువుగారి వైపు చూసే చూపులు భక్తి గౌరవాలతో నిండి ఉంటే, సుజాత వైపు చూసే చూపులు భయం భయంగా, చూసీ చూడనట్లుగా ఉండే దొంగ చూపుల్లా ఉన్నాయి. అక్కడ ఉన్న శిష్యులందరిలోనూ ఏకపాదుడి చూపుల్లో ప్రత్యేకత ఉంది. గురువుగారి వైపు అతడు చూసే చూపుల్లో భక్తి శ్రద్ధలు, సుజాత వైపు చూసే చూపుల్లో నిర్లిప్తత, నిరాసక్తత కనిపిస్తున్నాయి.

శిష్యులు తిరిగి వేదాధ్యయనం ప్రారంభించారు. గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, ప్రతి స్వరాన్ని మననం చేసకుంటూ, ఒక్క పొరపాటైనా లేకుండా చెప్పగలిగేవాడు ఏకపాదుడు ఒక్కడే! గురువు ముఖతః వచ్చిన ప్రతి స్వరమూ అతడికి మరుక్షణమే కంఠస్థమయ్యేది. ఏకపాదుడు ఏకసంథాగ్రాహి.

ఉద్దాలకుడు సాధుస్వభావి. శిష్యులకు ఎలాంటి ఆంక్షలు పెట్టేవాడు కాదు. అవసరమైన నియమాలను సూచనప్రాయంగా మాత్రమే చెప్పేవాడు. గురువుగారు చెప్పకపోయినా, ఏకపాదుడు స్వయంగా తనకు తానే కొన్ని నియమాలను విధించుకుని, క్రమశిక్షణతో పాటించేవాడు. గురువుగారి బోధనలను శ్రద్ధగా ఆలకిస్తూ, అధ్యయనం చేసేవాడు. ఏకపాదుడి గుణగణాలు ఉద్దాలకుడిని ఆకట్టుకున్నాయి. 

పసితనం నుంచే తండ్రి దగ్గర కూర్చుంటూ వేదాధ్యయనం వినడాన్ని అలవాటుగా చేసుకున్న సుజాతకు క్రమంగా ఏకపాదుడిపై ఆసక్తి పెరగసాగింది. అధ్యయనం కొనసాగుతున్నంత సేపు ఆమె ఏకపాదుడినే తదేకంగా చూడసాగేది. అతడి నిత్యకృత్యాలను గమనించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. రోజులు, నెలలు, ఏడాదులు గడిచిపోతున్నాయి. సుజాత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఏకపాదుడు యువకుడవుతున్నాడు. ఏకపాదుడిని చూడటం కోసమే సుజాత త్వరగా తన పనులు ముగించుకుని, అధ్యయనం సాగేటప్పుడు తండ్రి వద్దకు చేరేది. సుజాత రాక ఆలస్యమైతే, ఏకపాదుడి చూపులు ఆమె కోసం వెదుకులాడేవి.

అధ్యయన వేళల తర్వాత మిగిలిన శిష్యులతో పాటు ఏకపాదుడు దర్భలు, అరణి, కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లేవాడు. ఏకపాదుడిని సుజాత అనుసరించేది. దర్భలు, పుల్లలు ఏరుకునేటప్పుడు కూడా అతడు వేదపాఠాలను మననం చేసుకుంటూ ఉండేవాడు. తన రాకను అతడు పట్టించుకోకుంటే, సుజాతకు కోపం వచ్చేది. అయితే, అతడి ఏకాగ్రచిత్తానికి లోలోపల మెచ్చుకునేది. 
ఒకనాడు గురువుగారి వద్ద కూర్చున్న సుజాత వైపు నుంచి ఏకపాదుడు ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోయాడు. అతి ప్రయాసతో చూపులను గురువుగారి మీదకు మరల్చాడు. చిత్తాన్ని అధ్యయనంపై కేంద్రీకరించాడు. ఉద్దాలకుడు అంతా గమనిస్తూనే, ఏకపాదుడి ఏకాగ్రతకు ఎంతో ఆనందించాడు. 

ఉద్దాలకుడి శిష్యులలో ఏకపాదుడు మిగిలిన శిష్యులందరి కంటే మిన్నగా అధ్యయనం పూర్తి చేశాడు. అతడికి ఇక బ్రహ్మచర్యం కొనసాగించవలసిన అవసరం లేదని ఉద్దాలకుడు నిర్ణయించాడు. ఒకనాడు ఉదయాన్నే ఏకపాదుడిని పిలిచాడు. ‘నాయనా! నీ అధ్యయనం పూర్తయింది. గురుకులం విడిచి స్వతంత్రంగా నువ్వే ఇతరులకు గురుత్వం వహించే స్థాయి పొందావు. నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు’ అని చెప్పాడు. ఏకపాదుడు వినయంగా గురువుకు పాదాభివందనం చేశాడు. అదే సమయంలో ఉద్దాలకుడు తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. 

‘నీకు సమ్మతమయితే, మా సుజాతకు నువ్వే తగిన వరుడివని నా నమ్మకం’ అన్నాడు.గురువుగారి మాటకు ఏకపాదుడు మహదానందం చెందాడు. ఈ సంభాషణను గుమ్మం చాటు నుంచి వింటున్న సుజాత కూడా ఆనందంలో తేలిపోయింది. గురువుగారి మాటకు ఏకపాదుడు వెంటనే బదులివ్వక నేలచూపులు చూడసాగాడు.

‘ఏకపాదా! నీ అభిప్రాయం..’ అడిగాడు ఉద్దాలకుడు.‘గురువర్యా! తమరి మాట నాకు శిరోధార్యం’ అంటూ ఏకపాదుడు మరోసారి పాదాభివందనం చేశాడు.ఉద్దాలకుడు సుముహూర్తాన్ని నిర్ణయించి, తన కూతురు సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం జరిపించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement