మావోయిస్టు అగ్రనేత ఆచూకీపై ఉత్కంఠ
పోలీసుల అదుపులో ఉన్నారంటూ జోరుగా ప్రచారం
ఇప్పటికీ ఖండించని పోలీసులు, మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గట్టు: మావోయిస్టు అగ్రనేత సుజాత అలియాస్ పద్మ అలియాస్ మైనా అలియాస్ కల్పన ఎక్కడున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆమెను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం మొదలైంది. విప్లవ పోరాటంలో 40 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న సుజాత ఇటీవల అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం తెలంగాణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఆమె లొంగుబాటుకు ప్రయత్నించారా లేక మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఒడు పుగా అదుపులోకి తీసుకుని రహ స్యంగా విచారిస్తున్నారా అన్న అంశంపై భిన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే సుజాత పోలీసుల అదుపులో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇటు పోలీసుల నుంచి గానీ, అటు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
దీంతో మావోయిస్టు పార్టీలో సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యురాలైన సుజాత ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భద్రాద్రి జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జిల్లాలో సుజాతను పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అందరి చూపూ ఆ ఊరి వైపే..
నక్సల్స్ ఉద్యమంలో సాధారణ స్థాయి నుంచి కీలక నేతగా ఎదిగిన సుజాత పోలీసులకు పట్టుబడ్డారనే వార్తల నేపథ్యంలో అందరి దృష్టి ఆమె స్వగ్రామం పెంచికలపాడు వైపు మళ్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, యంకమ్మ దంపతుల రెండో సంతానం సుజాత. సుమారు 40 ఏళ్ల క్రితం గద్వాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అన్న శ్రీనివాసరెడ్డితో కలిసి నక్సల్స్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు.
కొన్నేళ్ల తర్వాత తండ్రి తిమ్మారెడ్డి మరణంతో అన్న శ్రీనివాసరెడ్డి స్వగ్రామానికి వచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డికి కుటుంబ సభ్యులు వివాహం జరిపించడంతో ఆయన మళ్లీ ఉద్యమం వైపు వెళ్లకుండా గ్రామంలోనే ఉండిపోయారు. అయితే సుజాత మాత్రం తండ్రి మరణం తర్వాత కూడా స్వగ్రామం వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు తెలిపారు.
మావోయిస్టు పార్టీలో ఒకప్పుడు అగ్రనేతగా పేరున్న కిషన్‌జీని సుజాత పెళ్లి చేసుకున్నారు. సుజాతకు కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆమె ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లో రూ.కోటికి పైగా రివార్డు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment