కేంద్ర కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతలు
అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆమె భర్త
చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తుండగా అదుపులోకి!
అరెస్టును ధ్రువీకరించని పోలీసు ఉన్నతాధికారులు
ఆమెపై రూ.కోటి రివార్డు ప్రకటించిన కేంద్రం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది.
లొంగుబాటుకు ప్రయత్నాలు?
సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం.
కిషన్‌జీతో వివాహం?
మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment