Bhadrachalam Nursing Student: ‘కారుణ్య’ మిస్టరీ..? | Sakshi
Sakshi News home page

Bhadrachalam Nursing Student: ‘కారుణ్య’ మిస్టరీ..?

Published Sat, May 25 2024 2:00 AM

-

  ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత 

 మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన 

పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం

భద్రాచలంఅర్బన్‌: నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య మృతికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టగా, పరిస్థితి ఉద్రిక్తగా మారింది. పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వివరాలు ఇలా.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న పడిగిపల్లి కారుణ్య (18) గురువారం అనుమానాస్పదస్థితిలో కళాశాల భవనంపై నుంచి కింది పడింది. తీవ్ర గాయాలుకాగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. ఆందోళనకు పలు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.

కళాశాల బాధ్యులపై దాడి
ఆందోళన సమయంలోనే కళాశాల కార్యదర్శి ఎస్‌ఎల్‌ కాంతారావు అక్కడికి రాగా, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి దాడి చేశారు. దీంతో పోలీసులు కాంతారావును కళాశాలలోని ప్రిన్సిపాల్‌ గదికి తరలించారు. ఈ క్రమంలో ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. యాజమాన్యం అకారణంగా విద్యార్థిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు కళాశాల వద్దకు రావాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తన కూతురు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని మృతురాలి తల్లి సునీత డిమాండ్‌ చేశారు. తన కూతురి చావుని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె స్నేహితురాలిని తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం
ఆందోళన జరుగుతుండగానే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెబుతుండగా, దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కళాశాల యాజమాన్యంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా మధ్యవర్తుల సమక్షంలో కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షలు ఇచ్చేలా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.

మృతిపై పలు అనుమానాలు
విద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఫిట్స్‌తో చనిపోయిందని, హాస్టల్‌ మొదటి అంతస్తు పైనుంచి పడి తీవ్ర గాయాలతో మృతిచెందిందని, గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడనే వాదనలు వినిపించాయి. ఏడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం మరో వాదన వెలుగుచూసింది. నర్సింగ్‌ కళాశాల నిర్వాహకుడి కుమారుడు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తనమాట వినకపోవడంతో దాడికి పాల్పడ్డాడని, దీంతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, కారుణ్య మృతికి అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

‘కారుణ్య’ మిస్టరీ..?
1/1

‘కారుణ్య’ మిస్టరీ..?

Advertisement
 
Advertisement
 
Advertisement