హరియాతండా వద్ద చెట్టును ఢీకొట్టిన కారు
తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి.. గాయాలతో బయటపడిన భర్త
అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు.
ఆధార్ కార్డులో మార్పుల కోసం..
ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కాదు.. అల్లుడే చంపేశాడు
రోడ్డు ప్రమాదంలో కుమారి, ఆమె కుమార్తెలు కన్నుమూశారనే సమాచారంతో కుమారి తల్లిదండ్రులు, బంధువులు ఏన్కూరు మండలం రంగాపురం తండా నుంచి పెద్దసంఖ్యలో పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె, మనవరాళ్ల మృతదేహాలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఇది రోడ్డు ప్రమాదం కాదని తమ అల్లుడే ముగ్గురిని హత్య చేశారని కుమారి తల్లిదండ్రులు హరిసింగ్ – పద్మ ఆరోపించారు. ముగ్గురి మృతదేహాలపై ఎక్కడా రక్తం వచ్చిన దాఖలు లేవని వారు పేర్కొన్నారు.
అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ మాత్రమే గాయాలతో బయటపడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఐదేళ్ల క్రితం రూ.24 లక్షల కట్నంగా ఇచ్చి వివాహం జరిపించామని, కానీ ఇద్దరు అమ్మాయిలే జన్మించడంతో మగపిల్లాడు లేడని తరచుగా తమ కుమార్తెను వేధించేవాడని ఆరోపించారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో నిత్యం వేధించేవాడని వాపోయారు. గత 20 రోజుల క్రితం కూడా ఓ యువతితో కేరళ వెళ్లొచ్చాడని, ఈనెల 25న వివాహ వార్షికోత్సవానికి కేక్ తీసుకురావాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈమేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. అలాగే, ప్రమాదంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment