
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్‌కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది.
ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్‌తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది.
పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.