
అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే పట్టుకున్న ఖాకీలు
నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరు అదుపులోకి?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు.
ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం..
రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో మరో ఇద్దరు..?
కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.
పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి..
హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్‌సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment