ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..! | Teachers Day 2024: Inspirational Guru Shishya Pairs Of All Time | Sakshi
Sakshi News home page

ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు

Published Thu, Sep 5 2024 9:36 AM | Last Updated on Thu, Sep 5 2024 1:11 PM

Teachers Day 2024: Inspirational Guru Shishya Pairs Of All Time

ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్‍కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి  సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.

మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!

గురువులకే గురువు..
యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్‌. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్‌ అధినేత స్టాలిన్‌. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.

తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.

గురువు గొప్పదనం..
మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.

మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.

(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?)
 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement