మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...
మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్‌లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.
లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్‌హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్‌కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.
జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్‌లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.
హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం.
హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.
బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్‌లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.
ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు.
ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట.
Comments
Please login to add a commentAdd a comment