ప్రతి భయానికీ విశ్వాసమే విరుగుడు!
సువార్త
గలలియ సముద్రం మధ్యధరా సముద్రానికి 700 అడుగుల దిగువన ఉంటుంది. అకారణంగా యేసుక్రీస్తు భీకరమైన గాలులు చెలరేగిసముద్రం పొంగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను దోనెలో అద్దరికి పంపి తాను ఏకాంత ప్రార్థన కోసం కొండల్లో ఉండిపోయాడు. మార్గమధ్యంలో శిష్యుల దోనె పెనుగాలులలో చిక్కి పొంగుతున్న సముద్రంలో మునిగే ప్రమాదం ఏర్పడింది. పైగా అది అర్ధరాత్రి. శిష్యులు ప్రాణభయంతో గడగడలాడుతుండగా, యేసు అలల మీద నడుస్తూ వారి వద్దకు వస్తుండగా, ఆయన్ను చూసి భూతమనుకొని మరింత భయపడ్డారు. యేసు ‘నేను, భయపడకండి’ అని చెప్పడంతో వారు ఊరట చెందారు. దోనెలోని పేతురు అనే శిష్యుడు ‘‘అయితే నీ వద్దకు నేను రానా?’’ అనడిగితే ప్రభువు రమ్మన్నాడు. మరుక్షణం పేతురు అలలమీదున్నాడు. కాని, గాలికి భయపడి మునిగిపోతుంటే యేసు ఆయన్ని కాపాడి అతని అవిశ్వాసాన్ని గద్దించాడు. యేసు దోనెలోకి రాగానే గాలి నెమ్మదించింది. నీవు నిజంగా దేవుని కుమారుడంటూ శిష్యులాయనకు మొక్కి ఆరాధించారు (మత్త 14:22).
ఆపదకన్నా, దొంగలకన్నా, అనుకోని అవరోధం కన్నా అత్యంత దుర్మార్గమైన, ప్రమాదకరమైన శత్రువు భయం. ఆ రాత్రి తుఫాను గాలులకు శిష్యులు భయపడ్డారు. ప్రభువున్నాడన్న విశ్వాసంతో నీళ్లమీద నడిచి సముద్రాన్నే జయిద్దామనుకున్న పేతురు, గాలికి భయపడి డీలా పడ్డాడు. అలల మీదే నడిచే నాకు ఈ గాలి ఎంత అనుకోవలసింది పోయి, అయ్యో, ఇంత గాలిని తట్టుకోగలనా? అని అవిశ్వాసపడ్డాడతను. అప్పుడు శిష్యులు, ఇప్పుడు మనుషులంతా ఏదో ఒక భయం, బాధితులే! ఈ శిష్యులంతా ఒకప్పుడు జాలరులు. వారికి సముద్రపుగాలులు, పడవ ప్రమాదాలు, వాటి భయాలు కొత్తకాదు. కానీ ఇప్పుడు తాము గాలిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన, శాసించగలిగిన దేవుని శిష్యులుగా, దేవుణ్ణి తాకలేని ఏ భయమూ, ప్రమాదమూ తమను కూడా తాకలేదన్న అత్యున్నత స్థితిలో తామున్నామని శిష్యులు గ్రహించలేకపోయారు. ప్రతి భయానికీ, విశ్వాసమే విరుగుడు. అర్ధరాత్రిపూట పెనుగాలులు చెలరేగినప్పుడు యేసు తమతో లేడన్న భావనే వారిని భయానికి గురి చేసింది. ‘మేము దోనెలో, సముద్ర మధ్యలో, యేసు అక్కడెక్కడో కొండల్లో ఉన్నాడు. ఇప్పుడెలా అన్నదే వారి భయానికి మూలమైంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో సుదూరంగా ఆకాశంలో ఉన్న, వుండే దేవుడు కాడని, ఆయన విశ్వాసితోనే, విశ్వాసిలోనే సదాకాలం ఉంటాడన్న విశ్వాసంలోకి, వారింకా ఎదగలేదు (మత్తయి 28:20).
విశ్వాసంలో ఒక్కొక్క మెట్టూ మనం ఎక్కేకొద్దీ భయాలు ఒక్కొక్కటే దూరమైపోతాయి. దేవునికి తెలియని ఏ పరిస్థితీ, ప్రమాదమూ విశ్వాసి దరిదాపుల్లోకి కూడా రాదు. విశ్వాసిని ఏ పరిస్థితుల్లోనైనా, ఏ గడ్డుకాలంలో అయినా గట్టెక్కించే బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. మన చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ, పరలోకపు తండ్రియైన దేవుని చేతిలోనే ఉంటుందన్న విశ్వాస స్థాయికి ఎదగడమే అన్ని భయాలనూ జయించే ఏకైక మార్గం!!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్