పలాయనవాదం యేసుక్రీస్తు విధానం కానే కాదు. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్న చోటికి ఎవరైనా వెళ్లాలనుకుంటారా? చూస్తూ, చూస్తూ పులి బోనులో ఎవరైనా కాలు పెడతారా? యేసు ప్రభువయితే అదే చేశాడు. తన సొంతప్రాంతమైన గలిలయను వదిలేసి 200 కిలోమీటర్ల దూరంలోని యెరూషలేముకు వెళ్లాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు (లూకా 9:52). చాందస యూదుల నాయకత్వంలో యెరూషలేము యేసుప్రభువు పట్ల పగ, ద్వేషం, కోపంతో రగిలిపోతోంది. ఆయన్ను సిలువవేసి పగతీర్చుకోవడానికి రంగమంతా సిద్ధమైంది. గలిలయ ప్రాంతంలో ఆయన్ను సవాలు చేసేవారే లేరు. అందువల్ల యెరూషలేముకెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే, గలిలయలోనే కడుపులో చల్ల కదలకుండా ఉండి బోలెడు పరిచర్య చేస్తానని యేసుక్రీస్తు అనుకోవచ్చు. ‘రిస్క్’ తీసుకోవడమనేది లోకం దృష్టిలో చాలా తెలివి తక్కువ పని. వీలైతే మనకోసం ఇతరులను ‘రిస్క్’లో పడేయడం అనేది ఎంతో తెలివైన పని కూడా. దీనికి కొద్దిరోజుల క్రితమే, తనను వెంబడించాలనుకునే వారు తమ సిలువనెత్తుకొని తనను వెంబడించాలని, తమ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొనేవారు దాన్ని పోగొట్టుకుంటారని, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డవారు దాన్ని కాపాడుకోగలుగుతారని ప్రభువు బోధించాడు (లూకా 9:23,24). అవతలివాళ్ళ ప్రాణాలు తియ్యడం, వారిని బాధించడం హింస అని, అలా ఇతరుల జోలికి పోకపోవడం అహింస అని లోకం నిర్వచించింది.
ఆ నిర్వచనాన్నే యేసు మరో మెట్టుపైకి తీసుకెళ్లి, ఇతరులను బాధించకపోవడం, వారి జోలికి పోకపోవడం కాదు, ఇతరుల కోసం ప్రాణత్యాగం చెయ్యడమే నిజమైన ‘అహింస’ అని బోధించడమే కాదు, ఆచరణలో ఆ ‘అహింస’ ను తన జీవితంలో నిరూపించాడు. ‘మరణం’ పట్ల లోకానికున్న తప్పుడు అభిప్రాయాలన్నింటినీ యేసుప్రభువు తన బోధల్లో కొట్టిపారేస్తూ మరణానికి కూడా ఆయన సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు.‘గోధుమగింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటరిదే. కానీ అది భూమిలో చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది’ అని మరణాన్ని పునర్నిర్వచించి సిలువలో ఆయనే మరణించడం ద్వారా క్రైస్తవం రూపంలో ఆయన విస్తారంగా ఫలించాడు.
యేసు అనుచరులు ఆయన జీవించినట్టుగా జీవిస్తేనే యేసుక్రీస్తు చేసిన ఈ బోధలు లోకానికి చేరుతాయి, అర్థమవుతాయి. యేసుక్రీస్తు బోధల లోతు, ప్రత్యేకత, కొత్తదనం నోటిమాటలతో కాదు, జీవితంలో ఆచరణరూపంలో మాత్రమే లోకానికి అర్ధమవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి అక్కడి సౌఖ్యాలు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవన శైలిని త్యాగం చేసి ఇండియాకొచ్చి ఇక్కడి నిరుపేదలతో కలిసి బతికి అంటువ్యాధులు, అపరిశుభ్రత, పేదరికంలో భాగం జీవించిన క్రైస్తవ మిషనరీల జీవనవిధానంలో అందుకే యేసుక్రీస్తు బోధల్లోని అహింస, ప్రేమ పరిమళించింది. వాళ్ళ జీవితం, మరణం కూడా విస్తారంగా ఫలించడానికి కారణమైంది. ప్రేమతో, త్యాగంతో, సాహసంతో యేసులాగా జీవించలేకపోతే, యేసు లాగా మరణించలేరు. యేసుప్రభువులాగా మరణించకపోతే ఆయనలాగా ఫలించలేరు.
ఆధునిక చర్చి, క్రైస్తవం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకోవడంలో వెనకబడింది. ఫలితంగా పవిత్రత, త్యాగం, నిరుపేదల పట్ల ప్రేమ, పారదర్శకత లోపించి విలాసాలు, తీరని ధనకాంక్ష, డిజైనర్ వస్త్రాలు, ఖరీదైన కార్లు, ఆడంబరాలు అనే ‘చెరసాల’లో బందీ అయింది ఈనాటి క్రైస్తవం!! చరిత్రలో మతమే దేవునికి బద్ధ శత్రువుగా మారిన చీకటి రోజుల్లో ప్రతిసారీ ఇదే జరిగింది. దేవుని కన్నా పూజారి లేదా పాస్టర్, దేవుని పవిత్ర బోధలకన్నా, మధ్యవర్తులు కల్పించిన ఆచారవ్యవహారాలే మిన్నగా మారిన మతమే ప్రజలకు ప్రాముఖ్యమైనపుడు సమాజంలోని నిరుపేదలు, అభాగ్యులు తీవ్రంగా నష్టపోయారు. దేవుణ్ణి వెనక్కి నెట్టి మతం ముందుకు దూసుకెళ్తున్న అత్యంత విషాదకరమైన ఇలాంటి నేపథ్యంలోనే, యేసు తన జీవితం ద్వారా, దేవుని నిష్కళంకమైన ప్రేమను బయలుపర్చి బలహీనులు, నిరుపేదలు, సామాన్యులకు చేరువయ్యాడు, మతపెద్దలకు బద్ధశత్రువయ్యాడు. ఇదంతా తెలిసి కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. నేడు క్రైస్తవం ముందున్న కర్తవ్యం కూడా ముందుకు వెళ్లడమే, తనను సంస్కరించుకొని దేవునికోసం విస్తారంగా ఫలించడమే.
– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్
యేసు బోధలు ఆచరణలోనే అర్థమవుతాయి
Published Sun, Jul 29 2018 1:40 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment