ఉపవాసంతో ఆత్మప్రజ్వలనం
విశ్వాసి వాక్యం
యేసుక్రీస్తు తన పరిచర్య ఆరంభంలో నలభై రోజుల ఉపవాస దీక్షకు పూనుకున్నాడు. రాళ్లు, ఇసుక తప్ప ఆహారమే కనబడని యూదా అరణ్యంలో రాళ్లనే రొట్టెలుగా మార్చుకొని తినమంటూ సాతాను ఆయన్ను శోధించాడు. ఆకలి, అలసటతో శారీరకంగా కృంగిన యేసుక్రీస్తు దీక్షను భగ్నం చేసేందుకు సాతాను విసిరిన వల అది. జనావళి ఆత్మీయాకలిని తీర్చేందుకు పరలోకపు ‘జీవాహారం’గా దిగివచ్చిన యేసుక్రీస్తు ఆ దీక్షలో ఆత్మీయంగా ఎంత బలపడిందీ అంచనా వేయడంలో సాతాను విఫలమయ్యాడు. శరీరం, ఆత్మ సమ్మేళనంగా ఉన్న విశ్వాసి ఆత్మీయంగా బలపడేందుకు శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా కృశింపజేసుకోవడమే ఉపవాస దీక్ష. శరీరం, ఆత్మ భిన్నధృవాలుగా పనిచేసే విశ్వాసిలో ఒకటి కృశిస్తుంటే మరొకటి బలపడుతూంటుంది. శరీరం ఆహారం కోసం అలమటిస్తూంటే, ఆత్మ ‘ప్రార్థన’ కోసం ‘ప్రభువు సహవాసం’ కోసం పరితపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ‘‘మనిషి రొట్టెలతో మాత్రమే కాదు దేవుని మాటలతో బతుకుతాడు’’ అన్న జవాబుతో అతని శోధనల్ని తిప్పికొట్టాడు (లూకా 4 : 4).
ఇంతసేపూ శరీర పోషణకే తాపత్రయపడే విశ్వాసి ‘ఆత్మపోషణ’కు ప్రజ్వలనకు గానే అప్పుడప్పుడూ ఉపవాసదీక్షకు పూనుకోవడం మంచిదే! శరీరం లోక ప్రతినిధిగా, ఆత్మ దేవుని ప్రతినిధిగా పనిచేసే విశ్వాసిలో, ప్రేమ, క్షమాపణ, నిస్వార్థత, సేవానిరతి వంటి దైవికాంశాలు వర్థిల్లడానికి, అంతిమంగా మట్టిలో కలిసిసోయే శరీరంకాదు, దేవుని సాన్నిధ్యానికి వెళ్లే ‘ఆత్మ’ నిత్యమైనది అన్నది గుర్తు చేయడానికి ఉపవాస దీక్ష సహాయం చేస్తుంది. శరీర పోషణే ప్రాముఖ్యమై ‘ఆత్మ పోషణ’ నిరాదరణకు గురైతే విశ్వాసి తన జీవన సాఫల్యాన్ని కోల్పోతాడు.
ప్రొటీన్లు, విటమిన్లు, శరీరానికి అవసరమైనట్టే ‘ప్రార్థన’, వేదపఠన ఆత్మకు అవసరమవుతాయి. నేటి పోటీ ప్రపంచంలో ఆంతర్యశక్తి, ఆత్మ ప్రజ్వలనం నానాటికీ తగ్గుతూండగా మనిషిలో అశాంతి, అసంతృప్తి, అభద్రతాభావన అధికమై అతన్ని కృశింపజేస్తున్నాయి. క్షయమైన శరీరాన్ని, లోకాశల్ని అదుపులో పెట్టుకుంటే తప్ప ఆత్మప్రజ్వలనం సాధ్యం కాదు. ఆత్మ ప్రజ్వలనం జరిగితే తప్ప అక్షయమైన పరలోకానందం అందుబాటులోకి రాదు. ఉపవాస దీక్షలో శరీరం ఎంత క్షీణిస్తుందో దానికి అనుగుణంగా ‘ఆత్మ’ అంతకన్నా వెయ్యిరెట్లు బలపడాలి. ఈ లెంట్’ కాలంలో చేసే ఉపవాస దీక్షల్లో అది సాధించాలి.
- రెవ టి.ఎ. ప్రభుకిరణ్